close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Guravajipeta: అప్పుడు బోడికొండ... ఇప్పుడు నిండుకుండ

నీళ్లు పుష్కలంగా ఉంటేనే ఊళ్లు పచ్చదనంతో కళకళలాడతాయి. నీరులేని చోట... ఏ ఊరైనా వెలవెలబోతుంది. ప్రకాశం జిల్లా గురవాజీపేట పరిస్థితి కూడా ఒకప్పుడు అంతే. ఎటు చూసినా బీడుభూములు, ఇంకిపోయిన చెరువులూ, గొంతు తడవాలన్నా అవస్థలు. ఊరికి ఆనుకుని కనిపించే బోడిగుట్టను చూస్తే చాలు ఆ గ్రామం పరిస్థితి అర్థమైపోయేది ఎవరికైనా. ఊళ్లో మార్పు రావాలంటే బోడిగుట్ట చుట్టూ పచ్చదనం తేవాలనుకున్నారు అధికారులు. ఆ ప్రయత్నం సఫలమై ఊరికి నీరు, పచ్చదనం వచ్చాయి. ఇది ఎలా సుసాధ్యమైందంటే...
ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లా కూడా ఉంటుంది. ఈ జిల్లాలోని కనిగిరి మండలం, గురవాజీపేటలో అయితే ఏడాదికి వర్షం పడేది ఒకట్రెండు సార్లే. అందుకే అక్కడ నీటికి కొరత. వేసవి వచ్చిందంటే నీళ్లకోసం 5-10 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2014లో ఈ గ్రామంపైన ప్రత్యేక దృష్టిపెట్టారు అధికారులు. ఉపాధి హామీ పథకం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు ఒక్క తాటిమీదకు వచ్చి గ్రామంలో నీటి కరవుని తీర్చాలనుకున్నారు. వర్షాకాలంలో పడే నాలుగు చినుకుల్నీ గ్రామం సమీపంలోని బోడిగుట్ట కొండ వాలులో ఇంకేలా చేస్తే పరిస్థితిలో మార్పు వస్తుందనుకున్నారు.
ఇదే విషయాన్ని గ్రామస్థులకీ చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అక్కడ పనిచేయాలన్నారు. రాళ్లూరప్పలతో ఉండే ఆ కొండవాలులో మండుటెండల్లో పనిచేయడం అంత సులభం కాదు. అయినా దూరదృష్టితో ఆలోచించి అందుకు అంగీకరించారు వాళ్లు.

రూ.కోటి వ్యయంతో...
బోడిగుట్ట మాటవరసకి ఒక గుట్టేకానీ అది మూడుకొండల సమూహం. కొండవాలు నుంచి దిగువ పొలాల వరకూ కందకాలు, ఊటగుంటలు తవ్వడంతోపాటు అక్కడక్కడా రాతిచప్పిళ్లు, చెక్‌వాల్‌, గ్యాబియన్లు (ఇనుపచువ్వలతో బంధించి కట్టే రాతి గోడలు) లాంటి 15 రకాల పనుల్ని చేయాలనుకున్నారు. ఆపైన కందకాలూ, ఊటగుంటల ఒడ్డున మొక్కలు నాటాలను కున్నారు. కొండవాలులో ఎక్కడ ఏది నిర్మించాలన్న విషయంలో నీటి యాజమాన్య సంస్థ పక్కా ప్రణాళికను సిద్ధంచేసింది. 250 ఎకరాల విస్తీర్ణంలో మూడేళ్లపాటు సాగిన ఈ పనుల్లో భాగంగా 27 రాళ్లకట్టలూ, 15 రాతి చెక్‌డ్యామ్‌లూ, ఆరు గ్యాబియన్లు, ఒక సిమెంటు చెక్‌డ్యామ్‌, ఏడు చిన్న ఊటకుంటలు, తొమ్మిది పెద్ద ఊటకుంటలు, 26 కందకాలు, 20 ఫామ్‌ పాండ్స్‌, 20 డగౌట్‌ పాండ్స్‌ నిర్మించారు. ఆ తర్వాత రెండున్నర లక్షల కలబంద మొక్కలతోపాటు నేరేడు, ఉసిరి, సీతాఫలం, కానుగ, వేప, చింత, కుంకుడు, గోరింటాకు, మద్ది, టేకు మొదలైన ఎన్నో రకాల మొక్కల్ని 45వేల వరకూ నాటారు. మొక్కల్ని నాటడం కోసం ట్యాంకర్లతో నీటిని తెప్పించారు. మొత్తం బోడిగుట్ట కనుమలపైన జల సంరక్షణ, భూసార పరిరక్షణ, పచ్చదనం పెంపు, ఇతర పనులకు రూ.కోటి వరకూ వ్యయం చేశారు.

మళ్లీ పంట పండుతోంది!
అధికారుల నిబద్ధత, గ్రామస్థుల కష్టం వృథా పోలేదు. బోడిగుట్టమీద వర్షం నీరు ఇంకడంతోపాటు కొండవాలులో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. నాలుగేళ్లలో బోడికొండ నీటికుండగా మారింది. పచ్చదనాన్ని అలుముకుంది. ‘బోడిగుట్ట మెగా వాటర్‌షెడ్‌ పథకం’తో భూగర్భ జలాలు పెరిగి గ్రామంలోని బోర్లూ చేతిపంపుల్లో నీరు చేరింది. వేసవిలోనూ నీటికి కొరత లేదిపుడు. గతంలో ఎంత లోతుగా బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి. ఇప్పుడు 100 మీటర్ల లోతులోనే నీరు పడుతోంది. కొండవాలులో ఓ చేతిపంపు ఏర్పాటుచేశారు కూడా. పచ్చదనం రాకముందు వర్షాలు లేక దాదాపు అయిదారేళ్లపాటు వరి సాగుచేయని రైతులు రెండేళ్లనుంచి 200 ఎకరాల్లో వరి, మరో 500 ఎకరాల్లో కంది, పత్తి, మిరప తదితర పంటల్ని సాగుచేస్తున్నారు. మునుపటితో పోలిస్తే వలసలూ తగ్గాయి. గురవాజీపేటలో ఏర్పాటుచేసిన నీటికుంటలూ చెరువులూ మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నాయి. వాటర్‌షెడ్‌ పథకంలో భాగంగా గురవాజీపేటకు రెండు ఆర్వోప్లాంట్లు వచ్చాయి. రైతులకు వ్యవసాయ పనిముట్లు అందాయి. ఈ మార్పులతో గ్రామం అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. మరిన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

- టి.ప్రభాకర్‌ ఈనాడు డిజిటల్‌, ఒంగోలు
ఫాటోలు: బి.ప్రసాదరావు
Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు