close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బటన్‌ నొక్కితే... బీన్‌ బ్యాగులా..!

‘ఇన్‌ఫ్లాటబుల్‌ ఎయిర్‌ చెయిర్‌’లు తేలిగ్గానూ కూర్చోవడానికి సౌకర్యంగా కూడా ఉంటాయని తెలిసిందే. ఇక, వాటిలోని గాలిని తీసేస్తే ప్లాస్టిక్‌ కవర్‌లా మారిపోతాయి. అప్పుడు చిన్న సంచిలో పెట్టుకుని పర్యటనలకెళ్లేటప్పుడు ఎంచక్కా వెంట తీసుకెళ్లొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అవసరం లేనప్పుడు మడతపెట్టి లోపల దాచేయొచ్చు. అయితే, సమస్యల్లా ఇవి మళ్లీ చెయిర్‌లా మారాలంటే గాలి కొట్టాలి. లేదంటే అందులోకి గాలి వెళ్లేలా గట్టిగా ఊపాలి. అది కాస్త ఇబ్బందే. ఈ బాధంతా లేకుండా వస్తున్నవే ‘సీట్‌ జాక్‌ సెల్ఫ్‌ ఇన్‌ఫ్లాటబుల్‌ చెయిర్‌’లు. రీఛార్జబుల్‌ పవర్‌ బ్యాంకుతో పనిచేసే వీటికున్న మూత తెరిచి, బటన్‌ నొక్కగానే బయటనుంచి గాలిని తీసుకుని ఇవి నిమిషంలో వాలు కుర్చీల్లా మారిపోతాయి మరి. గట్టి ప్లాస్టిక్‌తో తయారైన వీటిని బీన్‌ బ్యాగుల్లా ఇంట్లోనూ వాడుకోవచ్చు.


న్యాప్‌కిన్స్‌ నచ్చాయా?

భోజనం చేశాక కడిగిన చేతుల్ని తుడుచుకునేందుకు డైనింగ్‌ టేబుల్‌ పక్కగా ఉండే సింకు దగ్గర న్యాప్‌కిన్స్‌ లేదా చిన్న హ్యాండ్‌ టవళ్లను వేలాడదీస్తాం. అలాగే బాత్‌రూమ్‌ దగ్గరున్న సింకు దగ్గరా, వంటగదిలోనూ కూడా వాటి అవసరం ఉంటుంది. అయితే, అవి మామూలు టవళ్లలా కాకుండా ఇక్కడ కనిపించే పిల్లి బొమ్మల్లా ఉంటే అక్కడ ప్రత్యేకమైన అలంకరణలానూ ఉంటుంది. చూడ్డానిక్కూడా సరదాగా అనిపిస్తుంది. ‘క్యాట్‌ హ్యాండ్‌ టవల్స్‌’ పేరుతో మార్కెట్లోకి వస్తున్న వీటిని మెత్తగా ఉండే టవల్‌ క్లాత్‌తోనే పిల్లి ఆకారంలో కుడతారట.


నులకమంచం కాదు ట్రే!

నులకమంచం... ఆ పాత మధురాల్లో ఒకటి. ఇప్పటి తరానికి ఓ క్రేజీ ఫ్యాషన్‌. అందుకే, సరదాగా పెరట్లో ఓ నులకమంచాన్ని వేసుకోవడం మొదలుపెట్టారు. వారి ముచ్చటను చూసి, కొందరు తయారీదారులు అచ్చం నులక మంచంలా ఉండే ట్రే(కటియా ప్లాటర్‌)లను కూడా తయారుచేస్తున్నారు. వీటిలో స్నాక్స్‌, జ్యూస్‌, టీ, కాఫీలాంటివి పెట్టి అతిథుల ముందు ఉంచితే వంటకాలను వదిలేసి ఆ ట్రేనే చూస్తుంటారనడంలో అతిశయోక్తి ఏముందీ...


హెడ్‌ఫోన్స్‌ను తిప్పితే స్పీకర్‌!

వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌తో బయటి శబ్దాలు ఏమీ వినపడకుండా ఎంచక్కా నచ్చిన సంగీతాన్ని వినొచ్చు. మరి, పక్కనే స్నేహితులు కూడా ఉంటే మనం మాత్రమే పాటలు వింటే ఏం బాగుంటుంది... అలాంటప్పుడు ‘హెలిక్స్‌’ హెడ్‌ఫోన్స్‌ ఉంటే వాటినే స్పీకర్‌లా మార్చేయొచ్చు. మామూలుగా హెడ్‌ఫోన్స్‌లా ఉపయోగపడే దీన్ని కావాలనుకున్నప్పుడు మెలి తిప్పితే చాలు, స్పీకర్‌లా మారిపోతుంది మరి. దీని బటన్‌ల సాయంతో సౌండ్‌ని పెంచడం, తగ్గించడమే కాదు, పాటల్ని కూడా మార్చుకోవచ్చు.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు