close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

World Laughter Day: నవ్వేద్దాం... అన్నీ మరచి..! 

నేడు నవ్వుల దినోత్సవం

కరోనా రెండో దశ ఉధృతరూపం దాల్చింది. ఛానల్‌ తిప్పినా పత్రిక తిరగేసినా కేసులూ చావుల కబుర్లే.
ఎవరినైనా పలకరించినా అవే కబుర్లు... ఇలాంటి తరుణంలో నవ్వులేమిటీ దినోత్సవాలేమిటీ అనిపించడం సహజం. కానీ భయాన్ని వీడి హాయిగా జీవించాలంటే నవ్వు అవసరం. ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా మెదడులో రక్తప్రసరణను పెంచుతుంది. కొవిడ్‌నే కాదు, ఏ విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యాన్నీ స్థైర్యాన్నీ ఇస్తుంది. అందుకే నవ్వు పరమౌషధం. మరి నవ్వేద్దామా..!


ప్రముఖుల హాస్యం

అద్వితీయమైన భాషా పాండిత్యానికి మానవస్వభావాలను నిశితంగా పరిశీలించగలిగే లక్షణం తోడైనప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోయే ఛలోక్తులు పుడతాయి. అలాంటి హాస్యరసాన్ని కొందరు ప్రముఖులు తమ జీవితాల్లో ఎలా పండించారో చూడండి...

కట్టమంచి రామలింగారెడ్డి ఒకసారి నెల్లూరు వెళ్లారు. ఆయనకు వరసకు అల్లుడయ్యే రేబాల పట్టాభిరామరెడ్డి అక్కడే ఉంటారు. అల్లుడి ఇంటి ముందు కారు దిగగానే గేటుకు ‘కుక్కలున్నవి జాగ్రత్త’ అని పెద్ద బోర్డు కనిపించింది. వెంటనే ఆయన ‘ఇంతకు ముందు ఇక్కడ మనుషులు ఉండాలే... వాళ్లేమయ్యారు?’ అన్నారు. ఆ దెబ్బతో అల్లుడు జీవితంలో మరెప్పుడూ కుక్కలను పెంచే ఆలోచన చేయలేదట.


ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సందర్భానుసారంగా వ్యాఖ్యానించడంలో దిట్ట. ఓసారి ఆయన జట్కాలో వెళుతున్నారు. ముందువైపు బరువు చాలక జట్కావాడికి ఇబ్బందిగా ఉంది. అందుకని వాడు ‘కొంచెం పైకి రండి సార్‌’ అన్నాడు. దుగ్గిరాల ఎంతో ముచ్చటగా ‘ఇంతకాలానికి నువ్వొక్కడివి దొరికావురా ఆంధ్రదేశంలో తోటి ఆంధ్రుడిని పైకిరమ్మన్నవాడివి’ అంటూ జట్కావాడిని మెచ్చుకున్నారు.


చర్చిల్‌ ఓసారి ఓ విందులో పాల్గొన్నారు. భోంచేశాక కర్చీఫ్‌ను టేబుల్‌పైనే వదిలి అవతలికి వెళ్లి వచ్చారు. ఈలోగా ఆయనంటే పడనివారెవరో గప్‌చుప్‌గా ఆ రుమాలుపై గాడిద బొమ్మవేసి యథాస్థానంలో ఉంచేశారు. తిరిగివచ్చి రూమాలును చూసుకున్న చర్చిల్‌ కోపం తెచ్చుకోలేదు. నవ్వుతూ ‘నా రుమాలుతో మొహం తుడుచుకున్న దెవరు?’ అని ప్రశ్నించారు.


మహాకవి శ్రీశ్రీకి- కొత్తగా విప్లవ కవిత్వం రాస్తున్న ఓ యువకవి తన కవితలను పంపి, ‘నా కవితల్లో మరిన్ని నిప్పులు కక్కమంటారా?’ అనడిగితే, ‘అబ్బే నిప్పుల్లో నీ పద్యాలను కక్కేయ్‌ చాలు’ అన్నారట.


డాక్టర్‌ వెటకారం

లావు తగ్గాలని డైటీషియన్‌ను కలిశాడు సుబ్బారావు. ఆ డాక్టర్‌ అదోటైపు. వాళ్ల మధ్య సంభాషణ ఇలా సాగింది...
సుబ్బారావు: సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకుకూరలూ, ధాన్యాలూ బాగా తినాలంటారు... నిజమేనా?
డాక్టర్‌: ఏమక్కర్లేదు. మేకలూ, గొర్రెలూ తినేదేమిటి? ఆకులూ, గడ్డే కదా. కోళ్లకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలూ, ధాన్యాలూ తింటున్నట్టే.
సు: వేపుళ్లు మంచివి కావంటుంటారు...
డా: ఎందుక్కావు? నూనె ఎక్కడినుంచి వచ్చింది?
సు: వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు...
డా: అంటే ధాన్యాల నుంచే కదా. మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు?
సు: పోనీ మద్యం మానేయాలంటారా?
డా: ఎవరయ్యా నీ బుర్ర పాడుచేసింది? వైన్‌ వచ్చేది పళ్ల నుంచి కాదా? బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు. పళ్లు తిన్నంత ఆరోగ్యం.
సు: వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బతుకుతారంటారు. నిజమేనా?
డా: ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుష్షు ఎలా పెరుగుతుందయ్యా? ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువకాలం ఉంటుందన్నట్టుంది.
సు: అది కాదు, సిట్‌ అప్స్‌ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు...
డా: చూడు... చేతులతో వ్యాయామం చేస్తే, చేతి కండరాలు పెరుగుతాయి కదా, అలాంటప్పుడు సిట్‌ అప్స్‌ చేస్తే, పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా!
సు: పోనీ మంచి ఫిగర్‌ కోసం ఈత కొట్టొచ్చా?
డా: ఈతకొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?
సు: మరి బాడీకి ఓ షేప్‌ ఎలా వస్తుందో చెప్పండి?
డా: రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?
సు: ?!?!?!?!


పొడుపు కథ

వాచిపోయిన స్నేహితుడి మొహం చూసి ఏమైందని అడిగాడు ఫ్రెండు.
‘మా ఆవిడ పొడుపు కథ అడిగింది.
సమాధానం తప్పు చెప్పానని...’
‘అదేమంత నేరమని... ఇంతకీ ఏమడిగిందేమిటి?’
‘అందంగా ఉంటుంది. రోజూ కనపడుతుంది కానీ చేతికి అందదు, ఏమిటదీ అని అడిగింది.’
‘మరి నువ్వేం చెప్పావ్‌’
‘ఎదురింటి పద్మ అని చెప్పా..’


ఎవరి భార్య ఏమంటుందంటే...

పైలట్‌ భార్య: నా దగ్గర మరీ అంతలా ఎగరకండి...
డాక్టర్‌ పెళ్లాం: ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకూ తెలుసు...
టీచర్‌ భార్య: నాకే క్లాసులు పీకాలనుకోవద్దు...
జడ్జి భార్య: ఇది చెప్పడానికి వాయిదాలెందుకు, నేను చెప్పేదే ఫైనల్‌...
న్యాయవాది భార్య: ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటుంది...
నటుడి భార్య: ఈ మాత్రం యాక్షన్‌ మాకూ వచ్చు.
ఇంజినీర్‌ భార్య: ప్లాన్లు వేయడం మాకూ తెలుసు.


ఆ స్పెల్లింగ్‌ రాదుగా

ఇంటర్వ్యూకి వెళ్లాడు సుబ్బారావు
ఆఫీసరు: మీరు ఎక్కడ పుట్టారు?
సుబ్బారావు: తిరువనంతపురం
ఆఫీసరు: స్పెల్లింగ్‌ చెప్పండి.
సుబ్బారావు: అయితే గోవా


బోడి రబ్బరుబ్యాండ్‌

భర్త: (కంగారుగా) ఇక్కడో నోట్ల కట్ట పెట్టాను కనపడడం లేదేంటీ... నువ్వేమైనా చూశావా? దానికో ఎర్ర రబ్బర్‌బ్యాండ్‌ కూడా వేశాను.
భార్య: (తాపీగా) ఎందుకంత కంగారు... ఇదిగో తీసుకోండి... ఎవడిక్కావాలి మీ బోడి రబ్బర్‌ బ్యాండ్‌...


అసలు బాధ

రమేశ్‌: వ్యాక్సిన్‌ వేయించుకున్నావుగా నొప్పి పెట్టిందా?
సురేశ్‌: వ్యాక్సిన్‌ వేసినప్పుడు నొప్పి వేయలేదు కానీ... ‘మళ్లీ 28 రోజుల తర్వాత రండి అంకుల్‌’ అని ఆ అందమైన నర్స్‌ అన్నప్పుడే బాధేసింది.


కొంటె జవాబులు

టీచర్‌: ఆన్‌లైన్‌ క్లాస్‌ అయిపోయింది. మీకేమన్నా సందేహాలుంటే అడగండి.
స్టూడెంట్‌: మధ్యలో ఇల్లు ఊడుస్తున్న ఆయన మీ భర్తగారా అండీ?
టీచర్‌: పరీక్షల్లో అన్నీ సున్నాలే తెచ్చుకున్నావుగా, ఏమన్నాడు మీ నాన్న?
స్టూడెంట్‌: ఇంత గొప్పగా చదువు చెప్పిన సన్నాసి ఎవర్రా అని అడిగాడు.
టీచర్‌: నీకు తెలిసిన కళల పేర్లు చెప్పు?
స్టూడెంట్‌: ఎదురింటి శశికళ, పక్కింటి చంద్రకళ, వెనకింటి సూర్యకళ.
టీచర్‌: బజార్లో వెళ్తున్నప్పుడు మాస్టారు ఎదురైతే ఏం చేయాలి?
స్టూడెంట్‌: ఆయన చూడకముందే పక్క సందులోకి జారుకోవాలి.
టీచర్‌: న్యూటన్‌ చెట్టు కింద కూర్చుని గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్నిబట్టి నీకేమి అర్థమైంది.
స్టూడెంట్‌: ఇలా క్లాసులో కూర్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేమని తెలిసింది... టీచర్‌.


వార్నీ... ఇదెక్కడి తద్దినం!

ఈమధ్య ప్రతిదీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చెయ్యడం, కామెంట్ల కోసం ఎదురు చూడటం చాలామందికి ఓ అలవాటుగా మారిపోయింది. అలాగే ఓ పెద్దమనిషి ఓ పోస్ట్‌ పెట్టాడట. చాలామంది శుభాకాంక్షలు కూడా చెప్పారు. కానీ ఆయన అవాక్కై ఆ పోస్టుని డిలీట్‌ చేశాడు. అసలేం జరిగిందంటే...
ఆయన గతనెలలో వాళ్లింట్లో జరిగిన తద్దినం తాలూకూ ఫొటోలను పోస్ట్‌ చేశాడు.
కొంతసేపటి తర్వాత చూస్తే...
హ్యాపీ తద్దినం, తద్దినం శుభాకాంక్షలు, నిత్యం మీ ఇల్లు తద్దినాలతో కళకళలాడాలని ఆకాంక్షిస్తున్నా, మీ ఇంట్లో తద్దినం మాకెంతో ఆనందం... ఇలా కామెంట్లు వస్తూనే ఉన్నాయట.


నూడుల్స్‌ చిక్కులు

వెంగళప్ప ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. కొద్దిసేపటికి అతను వెయిటర్‌తో గొడవపడుతుండడం చూసి ఆ రెస్టారెంట్‌ యజమాని వచ్చి ఏమైందని అడిగాడు.
వెయిటర్‌: ఏం కావాలీ అంటే నూడుల్స్‌ తెమ్మన్నాడు సార్‌, తీసుకొచ్చి ఇచ్చాను.
యజమాని: మరి ప్రాబ్లం ఏంటి... నూడుల్స్‌ వేడిగా లేవా?
వెయిటర్‌: అది కాదు సార్‌, నూడుల్స్‌ మొత్తం చిక్కులు పడి ఉన్నాయట. ‘నేనేం ఊరకే తింటున్నానా, డబ్బులు కడుతున్నాకదా, చిక్కులు తీసి ఇవ్వు’ అంటున్నాడు.


అందుకే కదా..!

భార్య: ఏమండీ నేను అందమైనదాన్ని అని పెళ్లి చేసుకున్నారా... లేక తెలివైనదాన్ని అని చేసుకున్నారా...
భర్త: రెండూ కాదని తెలిశాకనే చేసుకున్నా...
భార్య: అదేంటండీ...
భర్త: నువ్వు అందంగా ఉంటే అందరి కళ్లూ నీమీదే ఉంటాయి... అదే నువ్వు తెలివైనదానివి అయితే నీ కళ్లు నామీదే ఉంటాయి.
భార్య: అర్థం కాలేదండీ...
భర్త: అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా...


సర్దుకుపోవాలి!

అత్త: అదేంటీ, అట్టు మాడిందన్నందుకే అలా ముఖం మాడ్చుకున్నావు... సర్దుకుపోవాలి.
కొత్త కోడలు: అందుకే బ్యాగు సర్దుకుంటున్నా. మా ఇంటికెళ్లడానికి.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు