close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Experiments: ఆ చెట్టు వేరులో క్యాన్సర్‌ మందు!

క్యాన్సర్‌ భయంకరమైన వ్యాధి అన్నది తెలిసిందే. దాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఎన్నో పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే పర్‌డ్యూ యూనివర్సిటీ, స్క్రిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బృందం బయో డీజిల్‌ కోసం పెంచే జట్రోఫా క్యుర్‌కాస్‌ అనే మొక్క వేరులో క్యాన్సర్‌ను ఎదుర్కొనే క్యుర్‌క్యుసన్‌ని గుర్తించారు. మెదడు, రొమ్ము, పేగు, ప్రొస్టేట్‌, ఊపిరితిత్తులు, కాలేయం... ఇలా ఏ క్యాన్సర్‌ను తీసుకున్నా ఇవన్నీ కూడా ఆయా భాగాలకే పరిమితం కాకుండా శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపిస్తాయి. అలా వ్యాపించడానికీ మందుల కారణంగా దెబ్బతిన్న క్యాన్సర్‌ కణాలు తిరిగి శక్తిని పుంజుకోవడానికీ బ్రటి అనే ఒక ప్రొటీనే కీలకం. మందులతో ఇంతకాలం దాన్ని పూర్తిగా అడ్డుకోలేకపోతున్నారు. మొదటిసారిగా జట్రోఫాలోని క్యుర్‌క్యుసన్‌తో అడ్డుకోవచ్చని వీళ్లు చేసిన పరిశోధనలో స్పష్టమైంది. దాంతో ఆ క్యుర్‌క్యుసన్‌ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేసైనా సరే క్యాన్సర్‌ మందుల్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు క్యాన్సర్‌ పూర్తిగా నివారించడం సాధ్యమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.


కరోనాకి ట్యాబ్లెట్‌!

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు పరిశోధకులు వైరస్‌ను తగ్గించే కొత్త మందులకోసం నిరంతరం శోధిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఇంగ్లండ్‌లోని ప్లిమత్‌ యూనివర్సిటీ అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ను తగ్గించేందుకు రూపొందించిన మోల్‌నుపిరావిర్‌(ఎమ్‌కె-4482) కొవిడ్‌ వైరస్‌నీ తగ్గిస్తుందట. కొవిడ్‌ నివారణకి ఓరల్‌ పిల్‌ను తీసుకొచ్చేందుకు వీళ్లు చేపట్టిన ఈ పరిశోధనలో- ఆ మందు వైరస్‌ని సమర్థంగా ఎదుర్కొన్నట్లు గుర్తించారు. అదెలా అంటే- హ్యామ్‌స్టర్ల(ఒక రకం ఎలుకల్లో)ను తీసుకుని వాటిని మూడు విభాగాలుగా చేసి ఒక విభాగానికి ఇన్ఫెక్షన్‌ సోకడానికి పన్నెండు గంటల ముందు నుంచీ, రెండో విభాగానికి సోకిన పన్నెండు గంటల నుంచీ ట్యాబ్లెట్‌ను ప్రతి పన్నెండు గంటలకొకటి చొప్పున మూడు రోజులపాటు ఇచ్చారట. మూడో విభాగంలోని వాటికి మందు ఇవ్వకుండా పరిశీలించారు. అయితే మొదటి రెండు విభాగాల్లోని హ్యామ్‌స్టర్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. పైగా ఈ ట్యాబ్లెట్‌ మెర్స్‌, సార్స్‌ వంటి ఇతర వైరస్‌ల తీవ్రతనీ తగ్గించింది. కాబట్టి తుది పరీక్షలు పూర్తిచేసుకుని త్వరలోనే దీన్ని కొవిడ్‌ మందుగా మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.


మధ్య వయసులో... నిద్ర తక్కువైతే!

ధ్యవయసులో చాలామందికి సరిగ్గా నిద్రపట్టదు. పట్టినా మాటిమాటికీ లేస్తుంటారు. అలాంటివాళ్లకు వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని దాదాపు 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిశీలించి మరీ చెబుతున్నారు బ్రిస్టల్‌ యూనివర్సిటీ నిపుణులు. మతిమరుపుకీ నిద్రపట్టకపోవడానికి దగ్గరి సంబంధం ఉందట. ఈ నిద్రలేమి అనేది ఆలోచనాశక్తి తగ్గడానికీ ఆల్జీమర్స్‌కీ కూడా దారితీస్తుంది అంటున్నారు. అందుకే ఈ సమస్య తీవ్రతని గుర్తించి సుదీర్ఘకాలం పరిశోధన చేశారట. ఇందుకోసం  35-55 ఏళ్ల వయసున్న వాళ్లను పదివేల మందిని ఎంపికచేసి, వాళ్లలో 50-60 ఏళ్ల మధ్య వయసుకి వచ్చేసరికి 30 శాతం మంది ఆరు గంటలకన్నా తక్కువగా నిద్రపోయారనీ ఆ తరవాతి కాలంలో వాళ్లలో 90 శాతం మంది మతిమరుపుతో బాధపడ్డారనీ గుర్తించారు. దీన్నిబట్టి తక్కువ నిద్ర అనేది నాడీకణాల శక్తి తగ్గిపోతుంది అనడానికి ప్రాథమిక సూచన అనీ, ఆ వయసులోనే దీన్ని పరిష్కరించుకుంటే తరవాత వచ్చేవాటిని అడ్డుకోవచ్చట.


పబ్లిక్‌ రెస్ట్‌రూమ్స్‌తోనూ...

కొవిడ్‌-19 వైరస్‌ మలమూత్రాల్లోనూ ఉంటుందని ఇప్పటికే తెలిసింది. దాంతో అది టాయ్‌లెట్ల ద్వారానూ వ్యాపించే ప్రమాదం ఉందని అంటున్నారు ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీ నిపుణులు. టాయ్‌లెట్లను ఫ్లష్‌ చేసినప్పుడు విసర్జన ద్వారా బయటకు వచ్చిన వైరస్‌ కణాలు అత్యంత సన్నని ఏరోసల్స్‌ రూపంలో గాల్లోకి లేచి, అక్కడ కొంతసేపు ఉండటం వల్ల ఆ తరవాత వాడేవాళ్లకు అవి సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఫ్లష్‌ చేసినప్పుడే కొన్ని వేల బిందువులు గాల్లోకి లేస్తాయట. ముఖ్యంగా వెంటిలేషన్‌ తక్కువగా ఉన్న టాయ్‌లెట్ల వల్ల ఈ ప్రమాదం ఎక్కువట. అంతేకాదు, మూత లేని యూరినల్సూ, కమోడ్సూ ఉన్న వాష్‌రూముల్లో ఈ ఏరోసల్స్‌ శాతం ఎక్కువగా ఉన్నట్లు లెక్కించారు. అందువల్ల కేవలం కొవిడ్‌ అనే కాదు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అనేక వైరస్‌లు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్‌ టాయ్‌లెట్లలో వెంటిలేషన్‌తో పాటు క్లోజ్‌డ్‌ యూరినల్స్‌ ఉండేలా చూడాలనీ, ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండేచోట వాటిని వాడకపోవడమే మంచిదనీ సూచిస్తున్నారు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు