close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Aplic Design: గౌను మీద ‘ఆప్లిక్‌ బొమ్మ’..!

కుచ్చులు కుచ్చులతో ఉండే పిల్లల గౌన్లు ఎంత బాగుంటాయో. ఒక్క చిన్నారులనేముందీ, బుట్టలా కనిపించే ఆ గౌన్లను వేస్తే ఎవరైనా బుట్టబొమ్మల్లా కనిపించాల్సిందే. అందుకే, ఇపుడు ఆ గౌన్లను టీషర్టుల మీదా స్కర్టుల పైనా త్రీడీ ఆప్లిక్‌ వర్క్‌ రూపంలో కుట్టేసి వాటికి కొత్త లుక్‌ని తెచ్చేస్తున్నారు.
టీషర్టులూ టాప్‌లూ స్కర్టుల్లాంటివి అటు ఆధునికంగానూ కనిపిస్తాయి. ఇటు రోజువారీ వేసుకోవడానికి సౌకర్యంగానూ ఉంటాయి. కాకపోతే, బ్లౌజులూ చీరలూ లెహంగాలకు వేసినట్లు వాటిమీద పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీలుండవు. కొటేషన్లూ, ప్రింట్లూ, లేసులూ... ఎప్పుడూ ఇలాంటి డిజైన్లే కనిపిస్తాయి. దాంతో ఏది వేసినా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. నిజానికి ఇలాంటి ఫీలింగ్‌ టీ షర్టుల్ని వేసుకునే చాలామందికే వచ్చి ఉంటుంది. ఇన్నాళ్లూ బిజీ బిజీ జీవితాలతో ఎవరూ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కరోనా కారణంగా లాక్‌డౌన్‌లతో జనానికి బోలెడంత ఖాళీ దొరికేసింది. దాంతో కొందరు త్రీడీ ఫ్రాక్‌ ఆప్లిక్‌ వర్క్‌తో టీ షర్టులకు కొత్త రూపం ఇవ్వడం మొదలుపెట్టారు. అవి కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవ్వడం, కొత్త ఎంబ్రాయిడరీ ట్రెండ్‌లా మారిపోవడం జరిగిపోయాయి. అంతేనా, ఇలా కుట్టిన టీషర్టులు మార్కెట్లోకి కూడా అమ్మకానికి వస్తున్నాయి.

బుట్ట బొమ్మలా...
త్రీడీ ఫ్రాక్‌ ఆప్లిక్‌ వర్కు కోసం... టీషర్టులూ టాప్‌ల మీద కొంతమేర చిన్నారులూ, అమ్మాయిల పెయింటింగులు వేసి, భుజాలూ లేదా నడుము దగ్గర్నుంచి క్లాత్‌తో బొమ్మకు కుట్టినట్లు డ్రెస్‌ని కుడతారు. కొన్నిటిలో మొత్తం బొమ్మ- క్లాత్‌తో కుట్టిందే ఉంటుంది. వీటిలో షర్టు మీది బొమ్మల జుట్టు కూడా నిజంగా కనిపించేలా ఊలు దారాలతో ఎంబ్రాయిడరీ చేసేవీ దొరుకుతాయి. మెడ కిందిభాగంలో మాత్రం క్లాత్‌తో డ్రెస్‌ని బుట్టబొమ్మలా కుడతారు. ఈ తరహా వాటిని ఎక్కువగా ఎంబ్రాయిడరీ హూప్‌ మీద కుట్టి, ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. కావాలంటే తెప్పించుకుని మన దగ్గరున్న సాదా టాప్‌లూ బ్లౌజులమీద కుట్టించుకోవచ్చు. అన్నట్లూ ఈమధ్య బ్లౌజులకీ ఈ తరహా ఎంబ్రాయిడరీ చెయ్యడం మొదలుపెట్టారండోయ్‌. అదండీ సంగతి...
ఈ త్రీడీ ఫ్రాక్‌ ఆప్లిక్‌ వర్కు ఉన్న దుస్తుల్ని చూస్తే, నిజంగానే ఏదో బుల్లి బుట్టబొమ్మ డ్రెస్సుకి వేలాడుతుందా అనిపించేలా ఎంతో అందంగానూ ప్రత్యేకంగానూ ఉన్నాయి కదూ..!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు