close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కప్పులకి బొకే సోకులు!

ఉదయాన్నే బాల్కనీలో కూర్చుని విరబూసిన చామంతులనో అరవిరిసిన గులాబీలనో చూస్తూ వేడివేడి కాఫీ తాగుతుంటే కలిగే అనుభూతే వేరు. కానీ అదే అనుభూతి రోజంతా కలగాలంటే ఎదురుగా ఓ పూలవాజో లేదా నిండా పూలున్న ఏ కుండీనో పెట్టుకోవాలి. ఇంట్లో అది సాధ్యమే కానీ ఆఫీసులో ఎలా... అనుకునే ప్రకృతి ప్రేమికులకోసమే ఇప్పుడు బొకే కప్పులు వచ్చేస్తున్నాయి. కప్పులపైన రకరకాల పుష్ప గుచ్ఛాలు అందంగా అమరిపోయి ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన కలిగించడమే వీటి ప్రత్యేకత.

గులాబీ, మల్లె, చామంతి, లిల్లీ, ఆర్కిడ్స్‌, కార్నేషన్‌, ఆస్టర్స్‌... లాంటి పూలు రకరకాల రంగుల్లో ఎదురుగా కనిపిస్తుంటే తెలియని ఆనందం కలుగుతుంది. కానీ అన్నిసార్లూ వాటిని నట్టింట్లో పెట్టుకోవడం కుదరదు. పోనీ వాటిని పెంచుకుందామంటే... అదో పెద్ద పని. ఇవన్నీ గుర్తించారో ఏమో అలాంటి పూలను క్లేతో తయారు చేసి, బొకేగా మార్చి... రకరకాల సైజుల్లో ఉండే కప్పులపైన అందంగా అతికించేస్తున్నారు. అవే ఈ పూల బొకే కప్పులు.

ఒకప్పుడు పింగాణి టీ కప్పులూ సాసర్లూ కేవలం షోకేసుల్లోనే ఎక్కువగా కనిపించేవి. ఇంటికెవరైనా అతిథులు వచ్చినప్పుడు మాత్రమే వాటిని బయటకు తీసేవారు. ఆ కప్పుల్ని ఎప్పుడో వాడేవారు కాబట్టి కాస్త ఖరీదు ఎక్కువైనా రకరకాల డిజైన్లూ, రంగుల్లో కొనిపెట్టుకునేవారు. దాంతో అవి అలంకరణ సామగ్రిగానూ ఉపయోగపడేవి. కానీ రోజులు మారేకొద్దీ... వాటి వాడకం దినచర్యలో ఓ భాగం అయిపోయింది. కాఫీ, టీ, గ్రీన్‌ టీ ఏదైనా సరే.. ఓ మగ్గు లేదా టీ కప్పు ఉండాల్సిందే. తాగేవారి అభిరుచికి తగినట్లుగా ఆ కప్పులు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త అలంకారాలతో మార్కెట్లోకి వస్తున్నాయి. పూల ప్రింట్లూ, కొటేషన్లూ, ఫొటోలూ, బొమ్మలూ వంటివెన్నో కప్పులమీద అందంగా కనువిందు చేస్తున్నాయి. అంతేనా... రంగు మారేవీ, వేడి వేడి కాఫీ లేదా టీ పోసినప్పుడు మాత్రమే ఫొటో కనిపించే కప్పులూ వచ్చాయి. ఏవైనా కొంతకాలానికి అవీ పాతవే కదా... అందుకే ఇప్పుడు ఈ పూల బొకే కప్పుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చేశారు తయారీదారులు.

ఎలా చేస్తారు?
కప్పులమీద బొకేల్ని డిజైను చేయడం అంత సులభం కాదు. దీనికి ఎంతో ఓపికా నేర్పూ కావాలి. ముందుగా రంగురంగుల పాలీ క్లే తీసుకుని, దాంతో పూలను చేసుకుంటారు. ఆపై అవన్నీ గుదిగుచ్చి బొకేలా చేసి కప్పులపైన అతికిస్తారు. కొన్ని బొకేలు బుట్టల్లో ఉన్నట్లూ చేస్తున్నారు. మొత్తమ్మీద గులాబీ, మల్లె, చామంతి, లిల్లీ... వంటి దేశీయ పూల రకాలతోపాటు విదేశీ పూల డిజైన్లతోనూ తయారవుతూ నిజమైన వాటినే కప్పులపైన అతికించారా అన్నంత సహజంగా ఉంటున్నాయివి. కేవలం వాడుకోవడానికే కాదు... గృహాలంకరణ వస్తువులుగానూ, కప్పుల సేకరణ ఓ హాబీగా పెట్టుకునేవారికి బహుమతిగా ఇచ్చేందుకూ కూడా ఇవి బాగుంటాయి.
ఏమంటారు?!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు