close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రుచి చూడండి... పక్కా దేశీ!

పిజ్జా బర్గర్‌లకంటే కూడా చాలామందికి భారతీయ సంప్రదాయ వంటకాలంటేనే ఇష్టం. మురుకులూ, సమోసా, బిరియానీ లాంటివి చూడగానే నోరూరుతుంది. కానీ అవి అన్నిచోట్లా, అన్ని వేళలా దొరకవు. ఈ లోటుని తీర్చడానికి వచ్చినవే ఈ సంస్థలు.


సమోసా కావాలా నాయనా..!

రమ్‌ గరమ్‌ సమోసా లేకుండా భారతీయులకు పార్టీ పూర్తి కాదనడం అతిశయోక్తి కాదు. అది ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా. అందుకే సమోసాల్ని కోరినచోటకే పంపిస్తామంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘సమోసా పార్టీ’. ‘చాలామందికి సమోసాల తయారీలో పరిశుభ్రత పాటించారా లేదా అన్నదే సమస్య. ఎందుకంటే వీటిని చేతులతో అద్దాలి, నూనెలో వేయించాలి. ఈ సమస్యలకు ప్రధానంగా పరిష్కారం చూపాలనుకున్నాం’ అని చెబుతారు సంస్థ వ్యవస్థాపకులు అమిత్‌ నన్వానీ, దీక్షా పాండే. వీరు 2017లో ఈ సంస్థని ప్రారంభించారు. ఒక ప్రధాన కిచెన్‌లో సమోసా తయారీకి సంబంధించి 75 శాతం పని పూర్తవుతుంది. వాటిని బెంగళూరులో 20 వరకూ ఉన్న ప్రాంతీయ కిచెన్‌లకు పంపిస్తారు. అక్కడ ఆర్డర్‌ రాగానే అప్పటికప్పుడు వేయించి పంపిస్తారు. ఇటీవలే గురుగ్రామ్‌కీ సేవల్ని విస్తరించారు.  ‘సమోసా తయారీ ఒక కళ, ముఖ్యంగా వాటి ఆకారంలోనే ఆకర్షణ ఉంటుంది. అందుకే ఇప్పటికీ వాటిని మడతపెట్టే పని మనుషులే చేస్తున్నారు’ అని చెబుతారు దీక్ష. త్వరలో బేక్డ్‌ సమోసానీ తీసుకురావాలను కుంటున్నట్లు చెబుతుందామె. ఆలూ సమోసాతోపాటే మటన్‌ కీమా, దహీ సమోసా చాట్‌, కార్న్‌ చీజ్‌ సమోసా కూడా అందిస్తున్నారు. సమోసా తిన్నాక టీ లేకుంటే ఏం బావుంటుంది. అందుకే కోరుకున్నవాళ్లకి వాటితోపాటే ఫ్లాస్క్‌లలో టీ కూడా సరఫరా చేస్తారు. సమోసా పార్టీ ఆలోచనే కాదు, రుచికూడా అదుర్స్‌. అందుకే ఇక్కడ రోజూ కొన్ని వేల సమోసాలు అమ్ముడవుతాయి.


పక్కా దేశీ...

ఐటీలో చదువుకున్న అమిత్‌ రాజ్‌, అన్షుల్‌ గుప్తా... 2012లోనే ఆహార రంగంలో అడుగుపెట్టారు. మొదట ముంబయిలోని కార్పొరేట్‌ ఆఫీసుల క్యాంటీన్లలో మెక్సికన్‌ వంటకాల్ని అందించే కౌంటర్లను ప్రారంభించారు. అయితే అక్కడ ఉద్యోగుల్లో చాలామంది భారతీయ సంప్రదాయ భోజనం కావాలంటూ అడగడాన్ని గమనించారు. దాంతో మెక్సికన్‌ వంటలకు బదులుగా భారతీయ రుచుల్ని అందించడం మొదలుపెట్టారు. రాజ్మా చావల్‌, పనీర్‌ వంటకాలూ, దాబా తరహా చికెన్‌, మటన్‌ భోజనం అందించేవారు. స్వల్ప వ్యవధిలోనే ఈ సంస్థకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత క్లౌడ్‌ కిచెన్‌లను ఏర్పాటుచేసి వాటిద్వారా బయటకూడా భారతీయ వంటకాలతో లంచ్‌, డిన్నర్‌లను ప్యాక్‌చేసి అందించడం మొదలుపెట్టారు. అన్నం, రోటీ, కర్రీ లాంటి వాటితో భోజనం పార్శిల్‌ అందిస్తారు. వేరే పళ్లెం ఏమీ అవసరంలేకుండా వారు పంపే బాక్సులోనే తినగలిగేలా పార్సిల్‌ చేయడం వీరి ప్రత్యేకత. ఫ్యామిలీ ప్యాక్‌, మినీ మీల్స్‌తోపాటు దమ్‌ బిర్యానీ, పరాఠా, చికెన్‌ టిక్కా లాంటివి అందిస్తారు. ప్రస్తుతం ముంబయితోపాటు బెంగళూరు, పుణె, గురుగ్రామ్‌లలో సేవలు అందిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటిగంటవరకూ భోజనం బాక్సుల్ని అందించడం వీరి ప్రత్యేకత.


అమ్మచేతి వంట...

ర్ణాటక నిప్పట్లు, చెట్టినాడ్‌ చెగోడీలూ, మన మురుకులు... ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రఖ్యాతమైన సంప్రదాయ వంటకాలన్నింటినీ ఆన్‌లైన్లో ఒకే చోట చేర్చి అందిస్తోంది స్టేట్‌ ప్లేట్‌. వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటకాల్ని దేశంలో ఏ ప్రాంతం వారికైనా అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటుచేశారు ముస్కాన్‌ సంచేతి, రాఘవ ఝావర్‌. వీళ్లది బెంగళూరు. ఇద్దరూ దిల్లీలోని శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి గతేడాది డిగ్రీ పూర్తిచేశారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలూ సంపాదించారు. కొవిడ్‌ కారణంగా ఉద్యోగాల్లో చేరడం ఆలస్యమవడంతో ఇటువైపు అడుగులు వేశారు. మార్వాడీ కుటుంబానికి చెందిన ముస్కాన్‌కు ఎంతో ఇష్టమైన అప్పడాలు లాక్‌డౌన్‌ సమయంలో దొరకలేదట. అవి లేనిదే ఆ ఇంట్లో భోజనం పూర్తికానట్టే. అప్పుడే సంప్రదాయ వంటకాలు దొరికే ప్రత్యేక పోర్టల్‌ పెట్టాలనుకున్నారు. ఆగస్టులో ప్రారంభించిన ఈ పోర్టల్‌లో ఇప్పటికే అలాంటి వంటకాల్ని తయారుచేస్తోన్న సంస్థలతో పాటు మహిళలూ, స్వయం సహాయక బృందాలు తయారుచేసే వంటకాల్నీ అమ్మకానికి పెట్టొచ్చు. కచోరీ, చక్కీ, ఆమ్లా మురబ్బా, కారప్పూస, ఆగ్రా పేఠ, నువ్వుల లడ్డు... ఇలా ఎన్నో రకాల వంటకాలు దొరుకుతాయిక్కడ. ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉండి ఇప్పుడు అందుబాటులో లేని మన వంటకాలూ, చిరుతిళ్లనీ వెలుగులోకి తెస్తామని చెబుతున్నారు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు