close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సెక్యూరిటీ గార్డ్‌ నుంచి ఆఫీసర్‌ వరకు!

కొన్నిసార్లు ఒకరు చేసే చిన్న సాయం మరొకరికి జీవితాన్నే ఇవ్వొచ్చు. అసోం రాష్ట్రానికి చెందిన అబ్దుల్‌ అలిమ్‌ విషయంలో అదే జరిగింది. 2013లో కేవలం వెయ్యి రూపాయలతో అతడు ఇంటి నుంచి పారిపోయి చెన్నైకి చేరుకున్నాడు. రెండు నెలల పాటు వీధుల్లో తినీ తినకా తిరిగాక స్థానిక జోహో కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం దొరికింది. అక్కడ ఓరోజు షిబు అలెక్సిస్‌ అనే ఉన్నతోద్యోగి అలిమ్‌ని పలకరిస్తూ అతడి చదువు, కంప్యూటర్‌పైన ఉన్న అవగాహన గురించి ఆరా తీశాడు. దానికి అలిమ్‌ ‘పదోతరగతి చదివాను, హెచ్‌టీఎమ్‌ఎల్‌ పైన కొంచెం అవగాహన ఉంది’ అని చెప్పడంతో ‘రోజూ డ్యూటీ అయ్యాక నా దగ్గరకు వస్తావా... కంప్యూటర్‌ నేర్పిస్తా’ అన్నాడట షిబు. ఎగిరి గంతేసిన అలిమ్‌ అప్పట్నుంచీ పన్నెండు గంటలపాటు సెక్యూరిటీగార్డుగా పనిచేశాక ఆయన దగ్గరికెళ్లి కోడింగ్‌ నేర్చుకునేవాడు. అంతేకాదు, ఎనిమిది నెలల్లోనే ఓ ఆప్‌ని కూడా రూపొందించాడు. అది షిబుకి నచ్చడంతో సంస్థ మేనేజర్‌కి చూపించాడు. ఆయనకూ ఆ ఆప్‌ బాగా నచ్చి ‘ప్రతిభ ఉందిగా చదువుతో పనిలేద’ంటూ అలిమ్‌ని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా ఎంపికచేశారు. ‘తన జీవితంలో జరిగిన ఈ అద్భుతానికి ఎనిమిదేళ్లు నిండాయం’టూ ఈమధ్యే అలిమ్‌ లింక్డిన్‌లో పోస్ట్‌ పెట్టడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఆశ్చర్యంగా ఉంది కదూ..!


ఇసుకలో... ఆలూ చాట్‌

సాధారణంగా పిల్లల నుంచీ పెద్దలవరకూ ఇష్టపడే కూరగాయల్లో ఆలూ మొదటిస్థానంలో ఉంటుంది. దాన్ని వేయించి ఫ్రెంచ్‌ఫ్రైస్‌లా తిన్నా, ఉడికించుకుని చాట్‌లా చేసుకున్నా ఆ రుచే వేరు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురీలో ఓ చిరువ్యాపారి ఆలూను ఇసుకలో వేయించి అమ్ముతూ తెగ వైరల్‌ అయ్యాడు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఆ చిరువ్యాపారి పేరు తెలియదు కానీ... అతను స్థానికంగా చిన్న బట్టీలా పెట్టుకుని ఇసుకలో వేయించిన ఆలూను అమ్ముతున్నాడట. తందూరీ పొయ్యిమీద ఇసుక బాణలిని పెట్టి అందులో బంగాళాదుంపల్ని వేసి ఇరవై నిమిషాలు వేయిస్తాడట. ఆ తరువాత ఇసుకను తొలగించి, ఆలూ చెక్కు తీసి వెన్న, మసాలా, కొత్తిమీర చట్నీతో కలిపి వడ్డిస్తాడట. ప్లేటు ఇరవైరూపాయలే అయినా... తయారీ కొత్తగా ఉండటంతోపాటూ రుచీ అద్భుతంగా అనిపించడంలో ఇప్పుడు చాలామంది దీన్ని తినేందుకు ఇష్టపడుతున్నారట. ఆ చిరువ్యాపారి ఆలూను వేయించే పద్ధతిని ఓ ఫుడ్‌బ్లాగర్‌ సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అతని గురించి అందరికీ తెలిసిందట.


పిల్లలకోసం మిషెల్‌ వంటల షో!

మెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్యగా, రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న మిషెల్‌ ఒబామా గురించి తెలియనివారు ఉండరు. అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ తన సామాజిక బాధ్యతను చాటుకునే మిషెల్‌... ఇప్పుడు- జంక్‌ఫుడ్‌ని విపరీతంగా తినేస్తూ, అధికబరువు బారిన పడుతున్న చిన్నారుల్లో పోషకాహారం పట్ల అవగాహన, ఇష్టం పెంచాలని ఓ వంటలషోను ప్రారంభించిందట. తన భర్తతో కలిసి మొదలుపెట్టిన ప్రొడక్షన్‌ సంస్థలో తీసిన ఈ కార్యక్రమం పేరు వాఫెల్స్‌+మోచీ. రెండు బొమ్మలతో ఎంతో సరదాగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉండేది పది ఎపిసోడ్లే అయినా... వివిధ ప్రాంతాల్లో దొరికే పోషక పదార్థాలను ఎంపికచేసి మరీ వంటలను తయారుచేస్తున్నట్లుగా చెబుతుంది మిషెల్‌. జంక్‌ఫుడ్‌కి ప్రత్యామ్నాయంగా ఎలాంటి పోషకాహారం అందుబాటులో ఉంటుందో తెలియజేసేందుకే దీన్ని డిజైన్‌చేసినట్లు చెబుతుంది మిషెల్‌.


అమ్మ ఇచ్చిన సర్‌ప్రైజ్‌!

పిల్లలకు నచ్చేలా ఆహారాన్ని తయారుచేసి దానికి కాస్త సృజన జోడించడంలో తల్లులు ఎప్పుడూ ముందుంటారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ తల్లి కూడా అదే చేసి... అందరిచేత శెభాష్‌ అనిపించుకుంటోంది. తన ఇద్దరు పిల్లలకు స్కూలు ఆఖరి రోజు కావడంతో వాళ్లకు ఇచ్చే లంచ్‌ను కాస్త ప్రత్యేకంగా చేయాలనుకుందట. ఎలాగూ ఈస్టర్‌ సందర్భం కూడా ఉండటంతో బజారు నుంచి రకరకాల రంగుల్లో ఉండే ప్లాస్టిక్‌ ఈస్టర్‌ ఎగ్‌ బాక్స్‌లను కొని పిల్లల లంచ్‌బ్యాగ్‌లో పెట్టి ఇచ్చిందట. లంచ్‌బ్రేక్‌లో పిల్లలు వాటిని చూసి అమ్మేంటి ఇలా చేసిందని మొదట బాధపడినా... ఒక్కోదాన్ని తెరవడం మొదలుపెట్టేసరికి... పండ్లూ, బిస్కెట్లూ, కూరగాయ ముక్కలూ, స్వీట్లూ... వంటివెన్నో బయటపడ్డాయట. దాంతో పిల్లలే కాదు, వాళ్ల స్నేహితులూ ఆశ్చర్యపోయారట. ఆమె ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో దానికి బోలెడన్ని లైక్‌లే కాదు... పిల్లల చేత రకరకాల పదార్థాలు తినిపించేందుకు ఎంత మంచి ఐడియా... గ్రేట్‌ అంటూ కామెంట్లూ వచ్చాయట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు