close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మన్యంలో ‘స్ఫూర్తి’ నింపుతున్నారు!

‘స్వతంత్రం వచ్చాక మన పోలీసులు ప్రజలతో అధికారుల్లా కాదు సేవకులుగా మెలగాలి. వీలున్నంత తక్కువగా ఆయుధాలు వాడాలి. నిజానికి, వాళ్లే సంఘ సంస్కర్తలు కావాలి’ - మహాత్మాగాంధీ కన్న కల అది. మనకున్న పరిస్థితుల కారణంగా పోలీసులకి ఆయుధాలు తప్పనిసరి అవుతున్నా... అక్కడక్కడా సంస్కర్తలుగా మారుతున్నవాళ్లూ ఉన్నారు. విశాఖ మన్యం పోలీసులూ అదే చేస్తున్నారు. గిరిజన యువకులు చెడుదారి పట్టకుండా వాళ్లని పారామిలటరీ పోటీ పరీక్షలకి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటిదాకా 112 మందిని కేంద్రబలగాల సిబ్బందిగా తీర్చిదిద్దారు...!

అంచనా ప్రకారం... దేశంలో అత్యధికంగా గంజాయిని పండిస్తున్న ప్రాంతం విశాఖ మన్యమే. 1980లలో ఆంధ్రప్రదేశ్‌లో రాజుకున్న మావోయిజం ఇంకా ఆరని చిచ్చులా తన ఉనికిని చాటుకుంటూ ఉన్నది కూడా అక్కడే. గిరిజన యువత చాలా సులభంగా వీటివైపు ఆకర్షితులు అవుతుండటమే ఇందుకు కారణం. తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం, వాటిని ఆసరాగా చేసుకుని సాగుతున్న దోపిడీ, దాంతో యువతలో పెరుగుతున్న నిరాశావాదం... ఇవే వాళ్లని అటువైపు నడిపిస్తున్నాయి. చదువుకున్న యువకుల్లో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉండటాన్ని గమనించారు పోలీసులు. కేవలం అధికారంతోనూ, ఆయుధాలతోనూ వాళ్ల అసంతృప్తిని అదుపులోకి తీసుకురాలేమని గ్రహించారు. వాళ్లకి ఉపాధి చూపించడానికని సంస్కర్తలుగా మారారు. మన్యం యువత ఎంత చదువుకున్నా, వాళ్లకి ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో మైదాన ప్రాంతంవాళ్లతో పోటీపడలేకపోతున్నారని తెలుసుకున్నారు. వాళ్లని చేరదీసి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందుకోసం ‘స్ఫూర్తి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అవే ఎందుకు...
సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌... వంటి కేంద్ర బలగాల్లో సిబ్బంది ఎంపిక జరిగిన ప్రతిసారీ దక్షిణాదిలో వేల సంఖ్యలో ఖాళీలు మిగిలిపోతుంటాయి. అదీ ‘ఎస్టీ’ కేటగిరీలోనైతే వందలాది పోస్టులు బ్యాక్‌ లాగ్‌లుగా ఉండిపోతాయి. గిరిజన యువకులకి వీటిపైన ఆసక్తి లేదా అంటే ఉంది కానీ... వాటికి సంబంధించిన పోటీపరీక్షలకి ఎలా సిద్ధం కావాలో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితిని మార్చడమే లక్ష్యంగా ‘స్ఫూర్తి’ అనే శిక్షణా కార్యక్రమానికి రూపకల్పన చేశారు పోలీసులు. ఈ కార్యక్రమాన్ని 2015లో పాడేరు ఏఎస్పీ అట్టాడ బాబూజీ ప్రారంభించారు. ఈ శిక్షణతో మొదటిసారే మారుమూల గూడేలకి చెందిన 80 మంది వివిధ పారామిలటరీ బలగాల్లో ఉద్యోగం సాధించగలిగారు! వీరిలో పదిమంది యువతులూ ఉండటం విశేషం. మూడేళ్ల తర్వాత 2018లో పారామిలటరీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వెలువడింది. కానీ ఈసారి, ఇంగ్లిష్‌ మీడియంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన పెట్టారు. ఎక్కువగా తెలుగు మీడియంలో చదివే గిరిజన యువతకి అది పెద్ద సవాలని తెలిసినా... పోలీసులు స్థిరంగా ముందడుగు వేశారు. గూడేలన్నీ వెతికి 485 మంది యువతీ యువకుల్ని ఎంపికచేశారు. ఇంగ్లిషులో ప్రత్యేక శిక్షణచ్చి రాతపరీక్షకి సిద్ధంచేశారు. వాళ్లలో 118 మంది స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ రాతపరీక్షలో నెగ్గారు. గత ఏడాది శరీర దారుఢ్య పరీక్షల అంకాన్నీ దాటుకుని వచ్చేశారు. ఈలోపు కరోనా కారణంగా నియామక ప్రక్రియ నిలిచిపోయి ఇటీవలే ఫలితాలు ప్రకటించారు. అందులో 32 మంది మన దేశంలోని నాలుగు పారామిలటరీ దళాలకు ఎంపికయ్యారు. వీరిలో నలుగురు అమ్మాయిలూ ఉన్నారు!

ఆషామాషీగా కాదు...
ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏదో నామ్‌కే వాస్తే అన్నట్టు కాకుండా చక్కటి ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు విశాఖ పోలీసులు. కేవలం రాత పరీక్ష కోసమే ఒక్కొక్కరిపైనా రూ.10 వేల వరకూ ఖర్చుపెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ శిక్షణా సంస్థల నుంచి నిపుణుల్ని రప్పించి గణితం, ఆంగ్ల వ్యాకరణాలలో 45 రోజులపాటు తర్ఫీదు ఇస్తున్నారు. శిక్షణ ఇచ్చినన్ని రోజులూ పోషకాహారాన్ని సమకూరుస్తున్నారు. అభ్యర్థులు పరీక్షల కోసం దూరప్రాంతాలకి వెళ్లాల్సి వచ్చినా ఆ ఖర్చుల్నీ తామే భరిస్తున్నారు. రాతపరీక్ష నెగ్గుకు వచ్చినవాళ్లకి శారీరక దారుఢ్యం, ఇంటర్వ్యూలకి సంబంధించి నెలరోజులపాటు కఠినమైన శిక్షణా ఉంటోంది. ఇందుకోసమే ప్రత్యేకంగా మన్యంలోని వేపగుంట ప్రాంతంలో ‘యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’ ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు రాయడం కోసం కంప్యూటర్‌ పరిజ్ఞానాన్నీ నేర్పిస్తున్నారు.

అక్కడితో ఆగలేదు...
‘స్ఫూర్తి’ అందించిన విజయాలతో-ఇక్కడి గిరిజన యువతకి ఆంధ్రప్రదేశ్‌ పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చేందుకు ‘సాధన’ అనే కార్యక్రమాన్నీ గత ఏడాది ప్రారంభించారు. అంతేకాదు, ‘ముందడుగు’ పేరుతో ఆరో తరగతిదాటిన ప్రతి విద్యార్థినీ విశాఖ నగరంలోని వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి తీసుకెళ్లి అవి ఎలా పనిచేస్తున్నాయో... ఏ అధికారి బాధ్యత ఏమిటో వివరిస్తున్నారు. అంటే, విద్యార్థుల్లో ఆ సంస్థల్లో చేరాలనే ప్రేరణకి ఇప్పుడే అంకురార్పణ చేస్తున్నారన్నమాట!

- బొద్దల పైడిరాజు, ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం.
ఫొటోలు: ఎం.గురునాథ్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు