close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పూజారులు ఆడే... క్రికెట్‌ లీగ్‌!

రాష్ట్రస్థాయిలో నిర్వహించే క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనాలంటే... ఆటలో కాస్తోకూస్తో శిక్షణ తీసుకుని ఉండాలి. కానీ ఏటా నిర్వహించే ఆ ‘పీసీఎల్‌’లో ఆడాలంటే ఆటలో శిక్షణ అవసరంలేదు. కేవలం క్రికెట్‌లో మెలకువలు తెలిసి ఉండి... పౌరోహిత్యం లేదా వేదపఠనం చేస్తుంటే చాలు. పురోహితులేంటీ, క్రికెట్‌ ఆడటం ఏంటీ అనుకుంటున్నారా.. అవును... ఈ మ్యాచ్‌లను వాళ్లకోసమే నిర్వహిస్తున్నారు మరి. అందుకే దీన్ని ‘పురోహిత్‌ క్రికెట్‌ లీగ్‌ అని పిలుస్తున్నారు.

వేదాలు నేర్చుకునే కొందరు పిల్లలు క్రికెట్‌ ఆడే సీన్లు సినిమాల్లో నవ్వు తెప్పించినా... ఇప్పుడు అలాంటి మ్యాచ్‌లే ఈ పురోహిత్‌ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేవారు ఆరితేరిన క్రికెట్‌ క్రీడాకారులు అయ్యుండక్కర్లేదు. ఆటలో కాస్త ప్రవేశం ఉండి ఆడాలనే కోరిక ఉన్నవారైతే చాలు. అయితే... ఇందులో పాల్గొనేవారు తప్పకుండా అర్చకులూ, వేదపండితులూ మాత్రం అయ్యుండాలి. అందుకే దీన్ని ‘పురోహిత్‌ క్రికెట్‌ లీగ్‌’ అంటారు. ఇది రాష్ట్రస్థాయిలో కొన్నిరోజుల పాటు టోర్నమెంట్‌ తరహాలో టీముల వారీగా జరుగుతుంది. ఇందులో గెలిచినవారికి అరవైవేల రూపాయలు నగదు బహుమతి కూడా ఉంటుంది. నిత్యం పూజలూ, వేదపఠనంతో గడిపేవారికి ఏదో ఒక వ్యాపకం ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని తొమ్మిదేళ్ల క్రితం రాజమండ్రిలో స్థానికంగా ఉండే ఓ జర్నలిస్టు ప్రారంభించాడని అంటారు ఈ టోర్నమెంట్‌ నిర్వాహకుల్లో ఒకరైన చందూరి కామేష్‌. ‘పౌరోహిత్యం చేసేవాళ్లు ఎప్పుడూ పూజలూ, ఆలయాల్లో అర్చనలతో బిజీగా ఉంటారు. ఇక వేదపండితుల సంగతి చెప్పక్కర్లేదు. వాళ్లకు అదే ప్రపంచం అయిపోతుంది తప్ప మరో వ్యాపకం ఉండదు. కానీ మాకు కూడా ఇలాంటి సరదాలు ఉంటాయని ఓసారి మాటల సందర్భంలో గుర్తించిన ఆ జర్నలిస్టు దీన్ని ప్రారంభించాడని చెబుతాడు కామేష్‌.

గల్లీ క్రికెట్‌లా కాదు...
పురోహితులు ఆడే క్రికెట్‌ అంటే... ఏదో సరదాగా అందరూ కలిసి కాసేపు ఆడుకుని వచ్చేస్తారనుకుంటే పొరపాటు. ఇది కూడా రాష్ట్రస్థాయిలో టోర్నమెంట్‌ తరహాలో జరుగుతుంది. ముందుగా జట్టులో సభ్యుల్ని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా పరీక్షలుంటాయి. నిర్వాహకులు అడిగే శ్లోకాలూ, పద్యాలను చెప్పాలి. వాళ్లు నిజంగానే పురోహితులూ లేదా వేదపండితులూ అని నిర్థారించుకున్నాకే జట్టులోకి తీసుకుంటారు. ఇలా జట్టుల వారీగా ఏర్పడ్డాక ఎవరికి వారు ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ పోటీలు ముహూర్తాలు ఎక్కువగా లేని నెలల్లో, మూఢాల సమయంలో జరుగుతాయి. దానివల్ల వీళ్లకు ఎలాంటి సమస్య ఉండదనేది నిర్వాహకుల అభిప్రాయం. కిందటిసారి కరోనా కారణంగా పోటీలు జరగలేదు. అయితే... ఈసారి కూడా కరోనా కారణంగా ఒకేచోట కాకుండా భీమవరం, కాకినాడ, రాజమండ్రి... వంటి ప్రాంతాల్లో జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకూ నిర్వహించారు. ఈ ఏడాది పదహారు టీములు ఇందులో పాల్గొన్నాయి. సభ్యులు సరే... ఇది గల్లీక్రికెట్‌ తరహాలో పేరుకే టోర్నమెంట్‌లా ఉంటుందనుకుంటే పొరపాటు. పెద్దగ్రౌండ్‌లో జరిగే ఈ పోటీలను చూసేందుకు ఎంతోమంది క్రికెట్‌ అభిమానులు వస్తారు. ప్రత్యేకంగా స్పాన్సర్లూ ఉంటారు. కొందరు దాతలు తలా కొంచెం వేసుకుని గెలిచిన జట్టుకు ప్రైజ్‌మనీ అందిస్తారు. అంతేకాదు వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీకి వచ్చేవారు ఉండేందుకు వసతి కూడా కల్పిస్తారు. ఈ పోటీలను ప్రారంభించినప్పుడు పది టీమ్‌లు మాత్రమే ఉండేవట. క్రమంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య పెరిగిందని అంటారు నిర్వాహకులు. ప్రస్తుతం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలూ, విజయవాడ, తిరుపతి, వైజాగ్‌, హైదరాబాద్‌... ఇలా పలు ప్రాంతాల నుంచి ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. ఈసారి జరిగిన లీగ్‌లో ధర్మగిరి వేదపాఠశాలకు చెందిన విద్యార్థులు గెలుపొందారు. ఇవి సరదాగా నిర్వహించే పోటీలు అయినా... తమలాంటి వారికి ఆటవిడుపు అని చెబుతారు ఇందులో పాల్గొనే పూజారులూ, వేదపండితులూ.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు