close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంతకం

- ముడియం కిషోర్‌కుమార్‌

‘‘ఆనంద నిలయం’’ యజమాని పేరు జానకిరాముడు. ఇల్లాలి పేరు జగదీశ్వరి. ఇద్దరమ్మాయిలు మనస్విని, వినోదిని. కాలేజీ చదువులు చదువుతున్నారు. జానకిరాముడు ప్రభుత్వోద్యోగి. జగదీశ్వరి గృహిణి. జానకిరాముడికి ఓ అన్నయ్య. పేరు కృష్ణప్రసాద్‌. వృత్తి వ్యవసాయం. పొలాలు పుష్కలం. పొలాలను కౌలుకిచ్చి అజమాయిషీ చేయడం అన్నపని. కృష్ణప్రసాద్‌కు ఇద్దరబ్బాయిలు. ఉన్న ఊరిలోనే ఉద్యోగాలు. కౌలు పనులు చూసుకుంటున్న అన్నకు పొలంమీద వచ్చే ఆదాయంలో ఓ శాతం అధికంగా ఇవ్వాలన్నది, ఇద్దరిమధ్యా పెద్దల అంగీకారం.
జానకిరాముడు ఉద్యోగరీత్యా ఊర్లు తిరగడం వల్లా, తల్లిదండ్రులను చూసుకునే వీలూ వసతీ తక్కువగా ఉండటం వల్లా తల్లిదండ్రులిద్దరూ అన్న కృష్ణప్రసాద్‌ ఇంట్లోనే జీవనం గడిపేవారు. అడపాదడపా తాను పనిచేస్తున్న ప్రాంతానికి తల్లిదండ్రులను తీసుకెళ్ళేవాడు. కానీ, పొలం పనులలో చేదోడు వాదోడుగా ఉండాలని, తల్లిదండ్రులిద్దరూ ఎక్కువగా పెద్దబ్బాయి కృష్ణప్రసాద్‌ దగ్గరే ఉండేవారు.
జానకిరాముడుకు రిటైర్మెంటు దగ్గరవ్వడంతో సొంత ఊరికి దగ్గరగానే పోస్టింగునిచ్చింది ప్రభుత్వం. అది అన్నివిధాలా తనకూ మంచిదన్న అభిప్రాయంతో అంగీకరించాడు జానకిరాముడు. ఎలాగూ రిటైర్మెంటు తరువాత తమ ప్రాంతంలోనే శేషజీవితం గడపక తప్పదన్నది కూడా జానకిరాముడు బదిలీ అంగీకారానికి మరో కారణం.
అసలు కథ ఇక్కడే మొదలైందని చెప్పాలి. బదిలీకి తోడు బాధ్యతల వలయంలో చిక్కుకున్నాడు జానకిరాముడు. కారణాలను తెలుసుకునే ముందు ఓ మారు అన్న కృష్ణప్రసాద్‌ ఇంట్లో జరుగుతున్న తతంగాన్ని కూడా పరిశీలిద్దాం.
‘‘ఇన్నాళ్లంటే ఉద్యోగరీత్యా దూరముంటూ వచ్చాడు. ఇప్పుడేం... దగ్గరకే వచ్చాడుగా.
ఓ గంట ప్రయాణం. ఇన్నేళ్లు చూశాంగా. ఇంకా మనమే చూడాలా? మీ తమ్ముడికి బాధ్యత లేదా?’’ ఈసడింపుగా అంది కృష్ణప్రసాద్‌ భార్య. భార్య మాటలకు ఆశ్చర్యచకితుడయ్యాడు  కృష్ణప్రసాద్‌.
‘‘ఇన్నేళ్లనుంచీ మనతోనే ఉన్నారుగా. వాళ్లకూ అలవాటైంది. ఇప్పుడెందుకు అనవసరంగా వాళ్లను ఇబ్బంది పెట్టడం’’ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
‘‘చేసేవాళ్లకు తెలుస్తుంది. చూసేవాళ్లకేం తెలుస్తుంది. ఓ ఇద్దరు మనుషులు ఇంట్లో ఎక్కువైతే ఆడమనిషికెంత కష్టమో అర్థంచేసుకోండి.’’ మనసులోని మాటను వెళ్లగక్కింది భార్య.
‘‘వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటున్నారుగా మనమీద ఆధారపడ్డంలేదుగా. వండి వార్చటం కూడా అంత కష్టమా?’’ కాస్తంత కఠినమైంది కృష్ణప్రసాద్‌ గొంతు.
‘‘ఆర్థికంగా కూడా ఆలోచించాలి. ఎప్పుడూ మనదే బాధ్యతంటే ఎలా? పిల్లల చదువుకయ్యే ఖర్చు గురించి ఆలోచించండి’’ డబ్బుతో ముడిపెడుతూ మాట్లాడింది భార్య.
‘‘పెద్దాడిగా జ్యేష్ఠభాగం కింద నేనే ఎక్కువ తీసుకుంటున్నాను కదా’’ వాస్తవాన్ని గుర్తుచేశాడు కృష్ణప్రసాద్‌.
‘‘ఏం మీ తమ్ముడు ఊరకే ఇస్తున్నాడా? మీరు ఊరకే తీసుకుంటున్నారా? చాకిరీ చేస్తున్నారు. తీసుకుంటున్నారు. అప్పనంగా ఏం తీసుకోవడం లేదు మనం’’ గొంతు పెద్దది చేసి మాట్లాడింది భార్య.
‘‘ఉద్యోగం చేస్తూ ఊరూరూ తిరుగుతున్నాడు కాబట్టి ఇక్కడి బాధ్యతల్లో పాలుపంచుకోలేకపోతున్నాడు. అర్థంచేసుకో’’ యథార్థాన్ని చెప్పాడు కృష్ణప్రసాద్‌.
‘‘కానీ ఖర్చులేకుండా, కాసింత శ్రమలేకుండా పొలం కౌలు అందుకుంటున్న తమ్ముడిని బాగానే వెనకేసుకొస్తున్నారు. రక్తసంబంధం, అన్నదమ్ముల మధ్యే కాదు, తండ్రీ కొడుకుల మధ్య కూడా ఉంటుందని మీరూ అర్థం చేసుకోండి’’ తర్కబద్ధంగా మాట్లాడే ప్రయత్నం చేసింది కృష్ణప్రసాద్‌ భార్య.
‘‘వాడికి ఇద్దరూ అమ్మాయిలే, కట్నాలూ, కానుకలూ, పెళ్ళిళ్ళూ... ఇంకా బోలెడు ఖర్చులు, అయినా అవన్నీ ఇప్పుడెందుకూ? మనమధ్య సమస్య మా అమ్మానాన్నలదేగా!’’ విషయానికొచ్చాడు కృష్ణప్రసాద్‌.
‘‘అమ్మాయిలూ, అమ్మాయిలూ అని చీటికీమాటికీ వెనకేసుకొస్తున్నారు. ఏం అబ్బాయిలకైతే ఖర్చులుండవా? కట్నాలిచ్చి, పెళ్లి చేసిపంపిస్తే, అమ్మాయి బాధ్యత తీరిపోతుంది. కానీ అబ్బాయిలకలా కాదుగా. పంచి ఇవ్వాలిగా’’ భవిష్యత్తు గురించి హెచ్చరించింది భార్య.
‘‘మంచి చదువులు చెప్పించాం. ఉద్యోగాలు వచ్చాయి. అయినా పంచి ఇవ్వలేకపోవడానికి, అంత లేనివాళ్లం కాదుగా’’ తన వాదనలో బలముందంటూ వాదించాడు కృష్ణప్రసాద్‌.
‘‘అదంతా నాకనవసరం. మీ అమ్మా, నాన్నలకు చేసిపెట్టే ఓపిక నాకికలేదు. మీ తమ్ముడింటికి పంపించేయండి’’ తన నిర్ణయాన్ని కరాఖండిగా చెప్పింది భార్య. ఏం జవాబు చెప్పాలో తెలీని అయోమయ స్థితిలో ‘‘సరే, చూద్దాం’’ అంటూ బలవంతంగా తలూపాడు కృష్ణప్రసాద్‌.
నాణేనికి ఒకవైపు ఈ తతంగమైతే, తల్లిదండ్రుల చెవిన వీరి సంభాషణ పడడం మరోవైపు. సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లోకి తొంగి చూసిన ఈ హఠాత్‌ సంఘటన ఇరువురినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది.
‘‘చూశారుగా, మీ కోడలి పెడద్రం’’ ఆమోదించలేనట్లుగా అంది తాయారమ్మ.
‘‘అయినా ఆ అమ్మాయి అన్నదాంట్లో తప్పేముంది?’’ సమర్థించాడు వాసుదేవయ్య.
‘‘తప్పులేదంటారా? మరి తప్పెవరిదంటారు?’’ అర్థంకానట్లు అడిగింది తాయారమ్మ.
‘‘ఆస్తులను పంచుకున్నట్లే, అమ్మనాన్నలను కూడా పంచుకోవాల్సిన బాధ్యత, ఇద్దరబ్బాయిలకూ ఉంటుంది తాయారూ! లౌక్యంగా జవాబిచ్చాడు వాసుదేవయ్య.
‘‘అమ్మానాన్నలను పంచుకోవడమేంటండీ!’’ ఆయోమయంగా అడిగింది తాయారమ్మ. ‘‘అదంతే తాయారూ! కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు. ఇది కలికాలం’’ భారంగా నిట్టూరుస్తూ చెప్పాడు వాసుదేవయ్య.
‘‘అయితే ఇప్పుడు మనం చిన్నాడింటికి వెళ్లాలా?’’ ప్రశ్నార్థకంగా అడిగింది తాయారు.
‘‘చూద్దాం. భవిష్యత్తు ఎలా ఉంటుందో! ఇప్పటికిక కాస్తంత విశ్రాంతి తీసుకో’’ భయం లేదన్నట్లుగా సర్దిచెప్పాడు వాసుదేవయ్య.
తల్లిదండ్రుల విషయం, తమ్ముడికెలా చెప్పాలా... తమ్ముడింటికి వెళ్లమని తల్లిదండ్రులకెలా చెప్పాలా...’’ అని ఆలోచనలతో సతమతమవుతున్నాడు కృష్ణప్రసాద్‌. ఇంతలో... ‘‘ మీ అమ్మా, నాన్నల విషయం ఏం చేయదలచుకున్నారు? ఆలోచించారా?’’ అంటూ ఉరుములా ఊడిపడింది కృష్ణప్రసాద్‌ భార్య.
‘‘అదే ఆలోచిస్తున్నాను. తమ్ముడితో మాట్లాడదామనుకుంటున్నాను. రేపెలాగూ ఆదివారం కదా! తమ్ముడు ఇంట్లోనే ఉంటాడు. వెళ్లొద్దామనుకుంటున్నాను’’ నింపాదిగా బదులిచ్చాడు కృష్ణప్రసాద్‌.
‘‘మీరొక్కరే వెళ్లిరావడమేంటీ? మీ అమ్మానాన్నలను తీసుకెళ్లి, వదిలిపెట్టి రండి’’ ఆర్డరేసింది భార్య.
‘‘అదంత బాగుండదులే. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఎవరికి, ఎప్పుడు ఎవరితో ఏం అవసరమొస్తుందో చెప్పలేని రోజులివి. కాస్త ఓపిక పట్టడం మంచిది.’’ అనునయంగా జవాబిచ్చాడు కృష్ణప్రసాద్‌.
‘‘హుఁ నాన్చుడు విషయంలో నా పెనిమిటికి మించిన పెద్దాయన మరొకరుండరు కదా!’’ విసురుగా లోనికెళ్లింది కృష్ణప్రసాద్‌ భార్య.
తమ చెవిన పడేలా కోడలు మాట్లాడు తోందన్న విషయం, వాసుదేవయ్యకు ఇట్టే అర్థమైపోయింది. తనూ ఏదైనా పరిష్కారం కోసం ఆలోచించడం మంచిదనిపించింది. ఇంతలో ఆదివారం రానే వచ్చింది. తమ్ముడింటికి బయల్దేరాలనుకుంటున్న తరుణంలో తమ్ముడే తనింటికి రావడం, కృష్ణప్రసాదుని ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు, పని సులభతరం అవుతుందేమో నన్న ఆశకూడా మదిలో మెదిలింది.
‘‘ఏంట్రా! చెప్పాపెట్టకుండా వచ్చేశావ్‌?’’ అంటూ తమ్ముణ్ని ఆప్యాయంగా పలకరించాడు.
‘‘ఏం లేదన్నయ్యా! అమ్మానాన్నలను పలకరించి చాలారోజులైంది. ట్రాన్స్‌ఫర్‌ గొడవల్లో, షిఫ్టింగ్‌ పనుల్లో, వీలుకాలేదు’’ ఆత్మీయంగా బదులిచ్చాడు తమ్ముడు జానకిరాముడు.
‘‘పర్లేదులేరా! అయినా ఒక్కడివే రాకపోతే, పిల్లలనూ మరదల్నీ కూడా వెంటపెట్టుకు రావొచ్చుగా.’’ ప్రేమగా అడిగాడు అన్న కృష్ణప్రసాద్‌.
‘‘పిల్లలిద్దరికీ ఇంకా పరీక్షలు కాలేదు. తను కూడా ఇంకా సర్దుకోవడంలో బిజీగానే ఉంటోంది. ఇంకోమారు తీరిగ్గా వస్తాం’’ సమాధానమిచ్చాడు జానకిరాముడు. మరిది గొంతువిని బయటకొచ్చిన కృష్ణప్రసాద్‌ భార్య, జానకిరాముడ్ని పలకరిస్తూ- ‘‘జగదీశ్వరీ, పిల్లలూ బాగున్నారా’’ అంటూ కుశల ప్రశ్నలేసింది. అందరూ బాగున్నారంటూ తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళాడు. ఎప్పుడూ హుషారుగా బిజీగా ఉండే తండ్రి కాస్తంత దిగులుగా ఉండటం గమనించాడు.
‘‘అమ్మా! బాగున్నావా’’ అంటూ అమ్మని పలకరించి, ‘‘ఏంటి నాన్నా. ఏదో దిగులుగా ఉన్నట్లున్నావ్‌?’’ అని నాన్నను పలకరించాడు.
‘‘అదేంలేదురా, బాగానే ఉన్నాం’’ అని చెబుతున్న నాన్న గొంతులో ఏదో తెలీని అసంతృప్తిని గమనించాడు జానకిరాముడు.
‘‘ఒరేయ్‌ చిన్నాడా!’’ అంటూ పిలిచిన అమ్మకు సమాధానంగా- ‘‘చెప్పమ్మా! ఏంటి’’ అనడిగాడు.
‘‘ఏం లేదురా, ఇన్నేళ్ళుగా ఒకే ఊళ్ళో ఒకే ఇంట్లో ఉండి నాకూ మీ నాన్నకూ బోరుగా ఉంది. ఇన్నాళ్లంటే నువ్వు దూరంగా ఉన్నావ్‌. ఇప్పుడు దగ్గరికే వచ్చావుగా. కొన్నిరోజులు మీ ఇంటికి కూడా రావాలనీ, మీ సంసారాన్ని చూడాలనీ, నేనూ, మీ నాన్నా అనుకుంటున్నాంరా! నువ్వేమంటావ్‌’’ అని సూటిగా అడిగేసింది తల్లి తయారమ్మ. ఎలా అడగాలా అని సంకోచిస్తూ, ఆలోచిస్తున్న వాసుదేవయ్యకు, అమాయకమైందే అయినా అర్థవంతంగా అద్భుతంగా అడిగిన భార్య ప్రశ్న ఊరట కలిగించింది.

‘‘అదేమంత పనమ్మా’’ ఆ మాత్రానికే, నాన్న దిగులుపడిపోవడమెందుకు? ఓ వారం పదిరోజుల్లో ఇల్లు సర్దడం పూర్తవుతుంది. నేనే వచ్చి తీసుకెళ్తా’’ అంటూ జానకిరాముడు ఇచ్చిన సమాధానానికి, సంతృప్తి చెందుతూ గట్టిగా ఊపిరిపీల్చుకున్నారు తాయారమ్మ, వాసుదేవయ్యలు. సాయంసమయాన, ఊరికి బయల్దేరేముందు అమ్మానాన్నలను పదిరోజుల్లో తమ ఇంటికి తీసుకెళ్తానన్న విషయం, అన్నావదినల చెవినవేసి బయల్దేరాడు జానకిరాముడు.
ఇల్లు చేరిన జానకిరాముడు, అమ్మానాన్నల విషయం భార్య జగదీశ్వరికి చెప్పాడు. బదులు చెప్పకపోయినా విసుగ్గా నిట్టూర్చింది జగదీశ్వరి. అర్థంకాని అయోమయ పరిస్థితి జానకిరాముడి వంతయ్యింది. క్యాలెండర్లో పది పేజీలు చిరిగాయి.
ఓ ఆదివారం ఉదయాన్నే అమ్మానాన్నలను తీసుకుని తమ ఇల్లు చేరాడు జానకిరాముడు. అమ్మానాన్నలను వారి గదివైపు తీసుకెళ్లగా పిల్లలిద్దరూ అవ్వా, తాతల సామగ్రిని గదికి చేర్చారు. కాసేపట్లో మంచినీళ్లూ, కాఫీతో వచ్చి పలకరించి వెళ్లింది జగదీశ్వరి. వంటగదిలో బిజీగా ఉన్నట్లు చెప్పి, చరచరా అక్కడినుంచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనం తరువాత అందరూ కాసేపు కునుకుతీయగా తమ గదిలోకి వెళ్ళాడు  జానకిరాముడు. అప్పటికే వంటపని పూర్తిచేసుకుని గదికి చేరుకుని ఉంది జగదీశ్వరి. ఇద్దరిమధ్యా కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది.
‘‘ఊరికే మీ అమ్మానాన్నల్ని తీసుకొస్తే ఎలా? ఖర్చులకు డబ్బులు కూడా పట్టుకురావాలిగా’’ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తొలిబాణాన్ని విసిరింది జగదీశ్వరి.
జగదీశ్వరి ప్రశ్నకు దిమ్మతిరిగిన జానకిరాముడు ‘‘తల్లిదండ్రులకు అన్నంపెట్టేందుకు డబ్బులడగాలా?’’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘‘ఏం మీ అమ్మా నాన్నలకు మీ అన్న ఊరికే పెట్టాడనుకుంటున్నారా తిండీ, తీర్థం. ఖర్చుపెట్టింది వారి సొమ్మేనని అందరికీ తెలుసు. పైగా, మీ అన్నపిల్లల చదువుకయ్యే ఖర్చులు కూడా మీ నాన్నగారే భరించారు. ఇంటి ఖర్చుల బాధ్యత కూడా ఆయనే చూసుకున్నారు. వయసులో ఉండగా గొడ్డుచాకిరీ చేయించుకుని పురుళ్ళు పోయించుకుని పిల్లల మూతులూ ముడ్లూ కడిగించుకుని ఈ రోజు వయసైంతరువాత నా ఇంటిమీదకు తోస్తే, నేనెందుకు చేస్తాను! రిటైరయింతరువాత ఏ బాదరబందీ లేకుండా హాయిగా గడపవచ్చనుకుంటే మీ అన్నావదినల పుణ్యమా అని బాధ్యతల సుడిగుండంలో ఇరుక్కుంటున్నామన్నమాట’’ అంటూ విరుచుకుపడింది జగదీశ్వరి.
ఆ విశ్వరూపానికి నిశ్చేష్టుడయ్యాడు జానకిరాముడు. భార్యకు ఇంత నోరుందా అని ఆశ్చర్యపోయాడు. భార్య మనసులోని బడబాగ్నిని చల్లార్చడమెలా అని భయకంపితుడయ్యాడు. బదులివ్వని భర్తవంక విసుగ్గా చూస్తూ, నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది జగదీశ్వరి. జానకిరాముడి వంతు కూడా అదే అయ్యింది.
కాలచక్రంలో మరిన్ని నెలలు గడిచాయి.
సర్దుకుపోవడం అలవాటైన తాయారమ్మ, వాసుదేవయ్యలు చిన్నకొడుకు జానకిరాముడింట్లోనే జీవితచక్రాన్ని దొర్లిస్తున్నారు. సమయానికి తిండి తప్ప సంతోషం సరదాలనేవి వాళ్ల జీవితాల నుంచి దూరమయ్యాననే చెప్పొచ్చు. అప్పుడప్పుడూ మనవరాళ్లిద్దరూ కాసేపు పలకరించడం తప్ప కోడలుతో మాటామంతీ, ఉలుకూపలుకూ లేదన్నది వాస్తవం. తప్పుకోలేక తప్పనిసరై జీవనయానాన్ని సాగిస్తున్న వృద్ధ దంపతులను చూస్తే, ఎవరికైనా జాలి కలగకమానదు. అప్పుడప్పుడూ పెద్దకొడుకు వచ్చి, చుట్టపుచూపుగా పలకరించి వ్యవసాయ పనుల గురించి చర్చించి వెళ్లడం ఆనవాయితీగా జరుగుతోందే తప్ప తమ ఇంటికి రమ్మని పిలిచిన దాఖలాలేవీ లేవు.
అన్ని రోజుల్లాగే, ఆ రోజు కూడా సూర్యుని లేలేత కిరణాలు, ప్రపంచానికి వెలుగు నిస్తున్నాయి. అందరిలానే, జానకిరాముడింట్లో కూడా మెలమెల్లగా నిద్రలేస్తున్నారు. అందరూ లేచినా అమ్మానాన్నల అలికిడి లేకపోవడంతో కంగారుగా అటువైపు అడుగులేశాడు జానకిరాముడు. ఉదయాన్నే నిద్రలేచి, వాకింగ్‌ కి వెళ్లొచ్చి వసారాలో కూర్చునే అమ్మానాన్నలు, ఆ రోజున అటు వసారాలోనూ లేరు, ఇటు గదిలోనూ లేరు. ఎక్కడికెళ్లారా అని అందరూ హడావుడిగా ఇల్లంతా కలియదిరిగి వెదికినా ప్రయోజనం లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఎక్కడ వెదకాలా అన్న ఆందోళన.
వెంటనే అన్న కృష్ణ ప్రసాద్‌కు ఫోన్‌చేసి, అమ్మానాన్నలేమైనా వచ్చారా అని అడిగాడు. లేదని జవాబు చెప్పిన అన్నకు పూర్తి వివరాలందించాడు జానకిరాముడు. అన్నకొడుకులిద్దరూ వాళ్ల ఊళ్లో అటు బస్టాండుకూ, ఇటు రైల్వేస్టేషనుకూ, తాత స్నేహితుల ఇళ్లకూ క్షణం తీరికలేకుండా తిరుగుతున్నారు. ఇటు జానకిరాముడి కూతుళ్ళూ తాత సెల్‌ఫోన్‌ను ట్రేస్‌చేసే పనిలో, టవర్‌ని లాక్‌చేసే ప్రయత్నంలో ఉన్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందడంలేదు.
ఇన్నేళ్లూ అన్నగారింట్లో సంతోషంగా ఉన్న తల్లిదండ్రులు కొన్నినెలలైనా తమ ఇంట్లో ఆనందంగా ఉండలేకపోయినందుకు జానకిరాముడు లోలోపల కుమిలిపోతూ మధనపడుతున్నాడు. బండేసుకుని తిరగని వీధిలేదు. ఊరుఊరంతా జల్లెడపట్టి గాలిస్తున్నాడు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. మనసు పరిపరివిధాలుగా ఆలోచిస్తోంది. తన జీవితంలో ఎన్నడూ ఇంతటి మానసికవ్యథను అనుభవించలేదు.
అన్న కృష్ణప్రసాద్‌, వదిన, పిల్లలు కూడా కారు తీసుకుని క్షణాల్లో వచ్చేశారు. అందరూ కూర్చుని ఏం చేయాలా అని తర్జనభర్జన పడుతున్నారు. నలుగురు పిల్లలూ నాలుగు దిక్కులు వెతకడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కోడళ్ళిద్దరూ మౌనవ్రతం పాటిస్తున్నట్లుగా నటిస్తున్నారు. సూరీడు పశ్చిమాన సేదతీరేందుకు సంసిద్ధమవు తున్నాడు. రాత్రయ్యేకొద్దీ అందరిలో భయం ఎక్కువవుతోంది. ఆలోచనల సుడిగుండంలో అల్లాడుతున్నారు. సమాజానికి ఏం సమాధానం చెప్పాలా అన్న భయం అన్నదమ్ములిద్దరినీ వణికిస్తోంది. ఎవరేమనుకుంటారోనని కుంగిపోతున్నారు. కాస్తంత భార్యలకు సర్దిచెప్పి ఉన్నా, భార్యలు సర్దుకుని ఉన్నా ఇంత తతంగం జరిగి ఉండేది కాదనిపించి కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలాయి అన్నదమ్ములకు.
ఆలోచనా తరంగాల్లో ఉన్న అందరి దృష్టినీ మరలుస్తూ సెల్‌ఫోన్‌ ధ్వని. అది జానకిరాముడి సెల్‌ఫోన్‌. ‘‘హలో! జానకిరాముడుగారా మాట్లాడుతున్నది...’’ అవతలివ్యక్తి ప్రశాంతంగా పలకరిస్తున్నాడు.
‘‘ఔనండీ! మీరెవరూ? ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు?’’ కంగారుగా ప్రశ్నించాడు జానకిరాముడు. స్పీకర్‌ ఆన్‌చేయమన్న కుటుంబసభ్యుల కోరికమేరకు ఆన్‌చేశాడు జానకిరాముడు.
‘‘నా పేరు బాలయ్యండీ. నేను శ్రీనివాస వృద్ధాశ్రమం నుంచి మాట్లాడుతున్నాను.’’ నింపాదిగా మాట్లాడుతున్నాడు అటువైపు వ్యక్తి. గొంతు చూస్తే పెద్దాయనలాగే ఉన్నాడు.
‘‘ఏంటీ? వృద్ధాశ్రమం నుంచా? వణుకుతున్న స్వరంతో ప్రశ్నించాడు జానకిరాముడు. వణుకుతున్న జానకిరాముడి చేతుల్లోంచి తన చేతుల్లోకి సెల్‌ఫోన్‌ తీసుకుని ‘‘చెప్పండి సార్‌. విషయమేంటో త్వరగా చెప్పండి ప్లీజ్‌’’ అంటూ ప్రాధేయపడ్డాడు కృష్ణప్రసాద్‌. ‘‘ఏమీలేదండీ.. మీ తల్లిదండ్రులట... మా ఆశ్రమంలో చేరాలని వచ్చారు’’ బాలయ్య సమాధానం.

‘‘ఏంటీ, వృధ్ధాశ్రమంలో చేరాలని వచ్చారా? ఎక్కడండీ మీ ఆశ్రమం? మేమిప్పుడే వస్తున్నాం’’ అంటూ గాభరాగా అడిగాడు కృష్ణప్రసాద్‌. ‘‘కంగారుపడకండి. మీ అమ్మానాన్నలిద్దరూ బాగున్నారు. మా ఆశ్రమం రామాలయం వీధిలో ఆలయం పక్కనే. నిమ్మళంగా రండి.’’ అంటూ బదులిచ్చిన బాలయ్య మాటలకు కుటుంబసభ్యులంతా ఊరట చెందారు.
క్షణాల్లో అందరూ శ్రీనివాస వృద్ధాశ్రమం ఆఫీసురూంలో ప్రత్యక్షమయ్యారు. ముందుగా ఎదురుగా కూర్చొని ఉన్న అమ్మానాన్నలను చూసి గట్టిగా ఊపిరిపీల్చుకున్నారు.
కూర్చోమని సంజ్ఞచేసిన బాలయ్యకు అందరూ నమస్కరిస్తూ ఆసీనులయ్యారు. ‘‘చూడండీ, మీ అమ్మానాన్నలిద్దరూ ఈ ఉదయం మా ఆశ్రమంలో చేరాలని వచ్చారు. వివరాలడిగితే, ఎంతసేపటికీ చెప్పడానికి ఇష్టపడలేదు. కాసింత సేద తీరిన తరువాత మళ్ళీ కదిలించవచ్చని తాత్కాలికంగా ఆశ్రయమిచ్చాం. మా ఆశ్రమం నియమనిబంధనల ప్రకారం ఎవరైనా వాళ్లకు వాళ్లు వచ్చి ఆశ్రమంలో చేరతామంటే చేర్చుకోవడం కుదరదు. ఎవరైనా వచ్చి చేర్పిస్తేనే చేర్చుకుంటాం. రాత్రవుతున్నా చెప్పకపోయేటప్పటికి చేర్చుకోవడం కుదరదని చెప్పి, గేటు తాళం వేసే సమయంలో మీ గురించి చెప్పారు’’ అంటూ క్లుప్తంగా చెప్పాడు బాలయ్య.
‘‘మా అమ్మానాన్నలను ఇంటికి తీసుకెళ్తామండీ, మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అంటూ ఇద్దరబ్బాయిలూ అభ్యర్థిస్తూ అడిగారు.
‘‘వాళ్లు తీసుకెళ్తామన్నా వెళ్లడం మాకు ఇష్టంలేదు. ఎలాగూ వాళ్ల వివరాలు మీకు తెలిశాయిగా. మీ నియమం ప్రకారం మీకు కట్టాల్సిన డబ్బులు మేము కట్టగలం. మా ఇద్దరినీ చేర్చుకోండి’’ కాస్త కఠినంగా ముక్కుసూటిగా మాట్లాడుతూ బాలయ్య వంక చూశాడు వాసుదేవయ్య.
‘‘అదేంటి నాన్నా, అలా మాట్లాడుతున్నారు. మా వల్ల తప్పు జరిగి ఉంటే క్షమించండి’’ జానకిరాముడు ఆవేదనగా అన్నాడు.
‘‘ఔను నాన్నా.. మీరిలా చేసి, మా మనసుకు కష్టం కలిగించొద్దు. భవిష్యత్తులో ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకునే బాధ్యత మాది’’ చెప్పాడు కృష్ణప్రసాద్‌.
‘‘మీరు చూసుకుంటారు సరేరా! మీ పెళ్లాలు చూసుకోవాలిగా. ఇంట్లో పనిమనుషుల కున్నంత విలువ కూడా మాకు లేనప్పుడు దేహీ అని మీ ఇళ్లలో ఉండాల్సిన అవసరం మాకేంటి? మీ వాటాలు మీకు పంచి, మా వాటాతో మేం బతుకుతాం. దయచేసి మీరే మమ్మల్ని ఇబ్బందిపెట్టకండి. మమ్మల్నిలా వదిలేయండి’’ మనసులోని బాధని బాహాటంగా వెళ్లగక్కింది తాయారమ్మ.
‘‘ఔన్రా! ఇవిగో అగ్రిమెంట్లు, ఎప్పుడో తయారుచేసి ఉంచాను. ఆస్తిని మూడు భాగాలు చేసి, మీకు చెరోభాగం రాసి, నా భాగం నేను తీసుకుంటున్నాను. మా తరువాత మా భాగం, ఈ ఆశ్రమానికే చెందుతుంది. కాగితాలు తీసుకుని ఇక మీరు బయల్దేరవచ్చు..’’ కఠినంగా చెప్పాడు వాసుదేవయ్య.
‘‘అదికాదు నాన్నా’’ అంటూ ఏదో చెప్ప బోయిన పిల్లలిద్దరినీ వాసుదేవయ్య వారించి- ‘‘ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు పతనమైపోయాయి. బిడ్డలు తల్లిదండ్రులను వద్దనుకోవడం ఓ ఫ్యాషనైపోయింది. ఏదయినా తమదాకా వస్తేగానీ తెలీదన్నట్లు రేపు మీకు కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైతే, జీవితపు విలువలు అర్థమవుతాయి. కానీ మీకలాంటి స్థితి రాకూడదని, భగవంతుణ్ని కోరుకుంటూ నేను కూడా మనసారా ఆశీర్వదిస్తున్నాను. మీరు మమ్మల్ని వద్దనుకోవడం కాదు, మీ సుఖంకోసం మేమే మీకు దూరంగా ఉండదల్చుకున్నాం. బిడ్డలు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలనే ప్రతి తల్లీ తండ్రీ కోరుకుంటారు. అలాగే మేము కూడా మీరంతా నిండునూరేళ్లూ సుఖసంతోషాలతో, పిల్లాపాపలతో సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని స్కూళ్లలో చేర్పించి నప్పుడు తండ్రిగా ‘‘సంతకం’’ చేసే హక్కును ఆస్వాదించాను. అలాగే మమ్మల్ని ఈ రోజు ఈ వృద్ధాశ్రమంలో చేర్చేందుకు కన్నకొడుకులుగా మీరు కూడా ‘‘సంతకం’’ చేసే హక్కును ఆస్వాదించండి. పిల్లలు జాగ్రత్త’’ అంటూ బాలయ్య అంగీకారంతో ఆశ్రమంలోకి అడుగు పెట్టారు తాయారమ్మ, వాసుదేవయ్యలు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు