close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీలిమందు పండుతోంది!

పిల్లలూ పెద్దవాళ్లూ అన్న తేడా లేదు. కార్పొరేట్‌ ఉద్యోగి, రాక్‌స్టార్‌ అన్న భేదం లేదు. బయటకు వెళ్లాలంటే ఓ నీలి రంగు జీన్స్‌ ప్యాంట్‌ తగిలించాల్సిందే. జీన్స్‌లో ఎన్ని రంగులొచ్చినా అవన్నీ నీలం తరవాతే మరి. ఆ రంగుకి కారణమైన నీలిమందు మొక్కల్ని మళ్లీ మనదేశంలో సాగుచేస్తున్నారు. తలకి వేసుకునే హెన్నాలోనూ ఈ రంగు వాడటమే ఇందుకు కారణం..!

కొన్ని మొక్కల గురించి తెలుసు అనుకుంటాం. కానీ నిజానికి ఏమీ తెలీదు. అలాంటిదే నీలిమందు మొక్క. ఈ పేరు వినగానే కొందరికి చంపారన్‌ ప్రాంతంలో నీలిమందును పండించాలన్న బ్రిటిష్‌ ప్రభుత్వ ఆదేశాల్ని ధిక్కరిస్తూ రైతులు చేసిన సత్యాగ్రహ ఉద్యమం స్ఫురిస్తుంది. కానీ అప్పట్లో వాళ్లు దాన్ని పండించమనడానికి కారణం అందరికీ తెలీదు. మొదటి ప్రపంచయుద్ధం వల్ల ఆ రంగుకి కొరత ఏర్పడటంతో అక్కడి రైతుల్ని బలవంతంగా ఈ ఒక్క పంటనే పండించమనేవారు. కానీ నీలిమందుని పండిస్తే నేల సారం తగ్గిపోతుందనీ, ఇతర ఆహారపంటలకి పనికిరాదనే అపోహ రైతుల్లో ఉండేది. పైగా కృత్రిమ రంగుల రాకతో సరైన ధర ఉండేది కాదు. దాంతో రైతులు అది వేయడానికి ఇష్టపడేవారు కాదు. కానీ నిజానికి దీన్ని పండించడం వల్ల నేలలోనత్రజని పెరిగి, ఇతర పంటలు బాగా పండుతాయి.

అంతెందుకు... సింధునాగరికత కాలంలోనే రంగుకోసం నీలిమందుని పశ్చిమ భారతంలో పండించేవారట. అప్పట్లో అది ఖరీదైన వర్ణద్రవ్యం. అలాగని ఆ మొక్కకి నీలం రంగు పూలేమీ పూయవు. ఆకుపచ్చని ఆకుల నుంచే ఆ రంగుని తీసేవారు. ఇప్పుడంటే రంగు రాళ్లూ, రసాయనాలతో కూడిన రంగులూ వచ్చాయి కానీ అవేవీ లేని ఆ కాలంలో నీలి వర్ణంకోసం ఇండిగొపెరా జాతి మొక్కలమీదే ఆధారపడేవారు. అన్నింటికన్నా భారత్‌లో పండించే ఇండిగొఫెరాటింక్టోరియా రకం నీలిమందు నాణ్యమైనదిగా ప్రాచుర్యం పొందింది. అందుకే దేశ విదేశాలనుంచి వచ్చి కొనుగోలు చేసేవారట. అప్పట్లో దీని ధర టీ, కాఫీ, మల్బరీ, బంగారం ధరలతో సమానంగా ఉండేది. అందుకే దీన్ని నీలి బంగారంగా పిలిచేవారట.

ఎలా చేస్తారు?
ఈ మొక్కల ఆకుల్ని నీళ్లలో వేసి వాటిమీద రాళ్లు వేసి నానబెడతారు. ఆ నీళ్లు లేత పసుపు రంగులోకి మారాక రాళ్లూ ఆకులూ తీసేస్తారు. తరవాత ఆ నీళ్లలో సున్నపునీళ్లు పోసి బాగా కలిపితే చిక్కని రంగు అడుగు భాగానికి చేరుకుంటుంది. పైనున్న నీటిని వంపేసి
అడుగున ఉన్న చిక్కని పేస్టును ఎండబెట్టి నీలిమందుని తయారుచేస్తారు. అయితే ఇదంతా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. దానికితోడు 19వ శతాబ్దంలో లెవీస్ట్రాస్‌ కంపెనీ ఈ రంగు అద్దిన జీన్స్‌ను తీసుకురావడంతో ఒక్కసారిగా నీలిమందుకి డిమాండ్‌ పెరిగింది. సరిపడా ఇండిగో దొరకకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం వెతకడం ప్రారంభించారు. అడాల్ఫ్‌ బేయర్‌ కృత్రిమ నీలిమందుని కనుగొనడంతో క్రమంగా ఇది తెరమరుగైంది. అయితే సేంద్రియ ఉత్పత్తుల వాడకం పెరగడంతో మళ్లీ నీలిమందు వాడుకలోకి వచ్చింది.

అంతేకాదు, ఈ ఆకుల పొడిని నూనెలో కలిపి కుదుళ్లకి పట్టిస్తే అది జుట్టు పెరుగుదలకీ మెరుపుకీ తోడ్పడుతుందట. చుండ్రుని తొలగించి మంచి కండిషనర్‌గానూ ఉపయోగపడుతుందని తెలియడంతో జుట్టు రంగుల్లోనూ నీలిఆకు పొడి వాడకం పెరిగింది.
గోరింటాకు పెడితే జుట్టు ఎర్రగా ఉంటుంది. అందులో నీలి ఆకుల పొడిని కూడా కలిపితే జుట్టు రంగు ముదురుగోధుమ లేదా నల్లగా అవడంతో హెన్నాలానే ఈ పొడినీ ప్యాకుల్లో అమ్ముతున్నారు.నీలిఆకుని తరచూ జుట్టుకి పెడుతుంటే తెల్లజుట్టు త్వరగా రాదట. అడవి నీలిమందు మొక్క వేరుని బోదకాలు, ఫ్లూ, ఆస్థమా, శ్వాసకోశ వ్యాధులు, మలేరియా, టైఫాయిడ్‌...ఇలా రకరకాల వ్యాధులని వారణలో వాడుతుంటారు. అందుకే అనేక రాష్ట్రాల్లో దీన్ని మళ్లీ పండిస్తున్నారు. కారణమేదయితేనేం... నీలిమందుకి డిమాండ్‌ ఏర్పడటం మంచి విషయమే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు