
‘రేపు ఈ పనులు చెయ్యాలి... మార్కెట్‌కి వెళ్లినప్పుడు ఆ వస్తువులు తీసుకురావాలి...’ అంటూ చిన్న చిన్న మెమో నోట్ల మీద రాసి వాటిని ఫ్రిజ్ మీదో, ఎదురుగా కనిపించే గోడకో అంటిస్తారు. ఆఫీసుల్లోనూ వీటిని ఎక్కువగానే వాడతారు. కానీ కాగితం ముక్కల్లా ఉండే ఆ నోట్లను అలా అంటిస్తే చూడ్డానికి అంతగా బాగుండదు. అందుకే, ఇప్పుడు ప్రత్యేక అలంకరణగా కనిపించే మెమో నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ‘స్టిక్కీ లీఫ్’ పేరుతో వచ్చే ఇవి చూడ్డానికి అచ్చం వేరు వేరు రంగుల ఆకులూ పువ్వుల్లానే ఉంటాయి. కాబట్టి ఈ నోట్ల మీద ఏదైనా రాసి అంటిస్తే ఆ చోటు ఆకులూ పువ్వులతో అలంకరించినట్లు చూడ్డానిక్కూడా అందంగా ఉంటుంది. అంతేకాదు, గిఫ్ట్ ప్యాక్‌ల మీద శుభాకాంక్షలూ పేర్లూ రాసేందుకూ ఆత్మీయులకోసం తయారుచేసే గ్రీటింగ్ కార్డుల మీద అంటించేందు క్కూడా ఇవి బాగుంటాయి. మీకూ నచ్చితే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు.
వెలుగుతో శుభాకాంక్షలు!
పుట్టిన రోజు, పెళ్లిరోజులకు రకరకాల కానుకలూ గ్రీటింగ్ కార్డులూ ఇచ్చి ప్రియమైనవారికి శుభాకాంక్షలు చెబుతుంటాం. మరి, ఈసారి ఇంకాస్త భిన్నంగా చీకట్లో వెలిగే లైటుతో ఆత్మీయులకు శుభాకాంక్షలు చెబుతారా... అలాంటిదే ఈ ‘పర్సనలైజ్డ్ మ్యాజిక్ షాడో లైట్ బాక్స్’.
చతురస్రాకారంలో ఉండే ఈ చెక్క డబ్బాను నాలుగు వైపులా మనం కోరిన పేర్లూ డిజైన్లలో చెక్కుతారు. దాంతో, ఈ డబ్బాను చీకటి గదిలో ఉంచి, అందులోని ఎల్ఈడీ లైట్‌ని ఆన్‌చేస్తే- చెక్కిన ఆకారాల్లోంచి వెలుగు బయటకు వచ్చి, గోడమీద ఆయా పేర్ల రూపంలోనే కాంతిని ప్రసరింపజేస్తుంది. హ్యాపీబర్త్‌డే, హ్యాపీ వేలంటైన్స్‌డే, ఐలవ్యూ... లాంటి మెసేజ్‌లతో పాటు ప్రేమజంట, పక్షులు, హృదయాకారం... ఇలా మనం కోరిన విధంగా షాడో బాక్సుల్ని చెక్కుతారు. ఆ వెలుగు చిత్రాలు ఇదిగో ఇక్కడ ఫొటోల్లో చూపినట్లూ కాంతిని ప్రసరిస్తాయి.
ఫేషియల్ 90సెకన్లలో..!
అనుకోకుండా ఏదో ఫంక్షన్‌కి వెళ్లాల్సి వస్తుంది. మనకేమో ఎప్పుడూ ఏవో పనులతో తీరికే ఉండదు. పనిగట్టుకుని బ్యూటీ పార్లర్‌కి వెళ్లడం, అక్కడ ఫేషియల్ కోసం ఓ గంట సమయం కేటాయించడం కుదరకపోవచ్చు. ఆ బాధంతా లేకుండా ఇంట్లోనే కేవలం 90సెకన్లలో మనమే ఫేషియల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఈ ‘ఫొరియొ యూఎఫ్ఓ స్మార్ట్ మాస్క్ డివైస్’. రీఛార్జ్ చేసుకునే వీలుండే ఈ బుల్లి మెషీన్లో పట్టే రకరకాల ఫేస్ మాస్కులను కూడా ఆ కంపెనీ తయారుచేస్తుంది. ఇక, ఈ గ్యాడ్జెట్లో థెర్మో(వేడి), క్రయో(చల్లటి), ఎల్ఈడీ లైట్ థెరపీ, సోనిక్ పల్సేషన్... ఇలా వేరు వేరు రకాల ఫేషియల్ మాస్క్ చికిత్సల్ని చేసుకునే వీలుంటుంది. మనక్కావల్సిన మాస్కుని డివైస్‌లో ఉంచి నచ్చిన థెరపీని ఎంచుకుంటే 90 సెకన్లలో ఎంచక్కా ఫేషియల్ అయిపోతుందన్నమాట.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్