close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్యాలీఫ్లవర్‌ రంగుల్లో పండుతోంది!

క్యాలీఫ్లవర్‌ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది తెలుపుకి దగ్గరగా ఉండే రంగే. కానీ మహారాష్ట్రలోని నాసిక్‌కి చెందిన మహీంద్రా నికమ్‌ అనే రైతు ఊదా, పసుపు రంగుల్లో ఉండే క్యాలీఫ్లవర్‌లని కూడా పండిస్తున్నాడు. పుణెకు చెందిన సింజెంటా ఇండియా లిమిటెడ్‌ ఉత్పత్తి చేసిన ఈ వేలెంటినో(ఊదా), కరిటినా(పసుపు) రకం విత్తనాలను మహీంద్రా రెండున్నర నెలల కిందట రూ.40వేలకు కొన్నాడు. వాటిని తన అయిదెకరాల పొలంలో వెయ్యగా ఇప్పుడు పంట చేతికొచ్చింది. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండడంతో పాటు వీటిలో పోషకాల శాతం, విటమిన్‌-ఏ కూడా మామూలు క్యాలీఫ్లవర్లకన్నా ఎక్కువేనట. అందుకే, వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కూలీలూ ఎరువులూ ఇతర అవసరాలకు అతడికి అయిన ఖర్చు సుమారు రూ.రెండు లక్షలు కాగా, తన పొలంలో పండిన 20వేల కిలోల క్యాలీఫ్లవర్‌ పంటను రూ.16లక్షలకు అమ్మాడట మహీంద్రా.


150 కిలోల బరువుని కాళ్లకు కట్టుకుని...

చేతులతో బరువుల్ని ఎత్తగలం కానీ కాళ్లతో బరువుల్ని లాగాలంటే చాలా కష్టం. ఇక, అరికాళ్ల కింద బరువుల్ని పెట్టుకుని నడవడం అంటే మామూలు విషయం కాదు. కానీ చైనాకు చెందిన 42ఏళ్ల ‘ఝంగ్‌ ఎన్‌షున్‌’ ఏకంగా 150కిలోల బరువున్న ఇనుప దిమ్మలను పాదాలకు కట్టుకుని నడిచేస్తున్నాడు. కాళ్లకు బరువులు వేలాడదీసుకుని నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయని అయిదు నెలల కిందట ఓ వార్తను చూశాడట ఎన్‌షున్‌. తను కూడా అలా ప్రయత్నిద్దామని మొదట 18కిలోల బరువుని కట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. ఆ బరువుని క్రమంగా పెంచుతూ ఇప్పుడు 150కిలోలకు చేర్చాడట. ఈ ‘ఐరన్‌ షూస్‌’తో అతడు ప్రతిరోజూ 20 నిమిషాల పాటు ఆగకుండా నడుస్తూ సోషల్‌ మీడియాలో మినీ సెలెబ్రిటీ అయిపోయాడు.


ఇవి కంటెయినర్‌ అపార్ట్‌మెంట్లు!

క్షిణాఫ్రికాలోనే అతిపెద్ద నగరం జొహెన్నెస్‌బర్గ్‌. అలాంటి చోట అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ కొనుక్కోవాలన్నా, ఆఖరికి అద్దెకు ఉండాలన్నా ఖర్చుతో కూడుకున్న పనే. ఆ సమస్యను తీర్చేందుకే ‘లాట్‌-ఎక్‌ ఆర్కిటెక్ట్స్‌’ అనే సంస్థ ఇలా 140 షిప్పింగ్‌ కంటెయినర్‌లతో రెండు అపార్ట్‌మెంట్‌లని నిర్మించింది.  ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మన్నికైన కంటెయినర్లతో చేసే ఈ ఇళ్లు కూడా జీవితకాలం ఉంటాయట. వీటిలోనూ మామూలు అపార్ట్‌మెంట్లకు దీటుగా అన్ని వసతుల్నీ ఏర్పాటు చేశారు. ఇక, నిర్మాణానికయ్యే ఖర్చేమో చాలా తక్కువ. అందుకే, స్థానికంగా మామూలు అపార్ట్‌మెంట్లలో ఆరువందల చదరపు అడుగుల ఫ్లాట్‌ల ధర రూ.50 లక్షలు ఉంటే మబొనెంగ్‌ జిల్లాలో ఉన్న ఈ కంటెయినర్‌ అపార్ట్‌మెంట్‌లో వాటి ధర రూ. ఆరు నుంచి పది లక్షల్లోనే ఉందట.


వంటగదిని తాకితే మంటే!

ల్లె అయినా పట్టణమైనా అందరికీ వంట చేసుకునే చోటు ఒకటుంటుంది. పల్లెల్లో అయితే కొందరు ఇంటి బయట విడిగా చిన్న వంటింటిని నిర్మించుకుంటారు. ఒడిశాలోని సునాబెడ ప్రాంతంలో ఉండే భుంజియా గిరిజనులు కూడా తమ ఇళ్లకు ముందు భాగంలో ఎర్రటి మట్టితో విడిగా వంట ఇంటిని కట్టుకుని, పైకప్పుకి ఆకుల్ని వేస్తారు. అయితే, లాల్‌బంగ్లాగా పిలిచే ఈ వంట గదుల్ని వాళ్లు చాలా పవిత్రంగా భావిస్తారు. అక్కడ తమ కులదేవతలు కొలువుంటారన్నది వాళ్ల నమ్మకం. ఆ కారణంగానే బయటివారెవ్వరినీ ఆ వంటగదిని తాకనివ్వరు. ఆఖరికి పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్లిన సొంత కూతురుని కూడా. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ ఇళ్లను తాకితే వెంటనే వాటిని తగలబెట్టేసి, మళ్లీ కొత్తగా కట్టుకుంటారు. కొన్నేళ్ల కిందట ఆ ఊళ్లో మావోయిస్టులు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు ఈ లాల్‌బంగ్లాల్లోకీ వెళ్లి సోదాలు చెయ్యగా ఊళ్లోని వంటిళ్లు అన్నిటినీ తగలబెట్టేశారట. ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు