close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భోజనం భారత్‌లో... పడక మయన్మార్‌లో..!

నాగాలాండ్‌ రాష్ట్రం, మన్‌ జిల్లాలోని లొంగ్వా గ్రామ పెద్ద ఒకేసారి రెండు దేశాల్లో ఉండగలడట. ఆయన రోజూ భోజనం భారత్‌లో చేస్తాడు. నిమిషంలోనే మయన్మార్‌ దేశానికి వెళ్లి నిద్రపోతాడు. ‘ఆయనకు ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమయ్యే శక్తి ఏమైనా ఉందా...’ అనుకుంటున్నారా... అదేం లేదు. అసలు విషయం ఏంటంటే లోక్‌నంగ్‌ అనే ఈయన ఇంటి మధ్యలోంచి భారత్‌, మయన్మార్‌ సరిహద్దు గీత వెళ్లిందట. అందుకే, ఆయన ఇంట్లోని వంటగది భారత్‌లో ఉంటే పడకగది మయన్మార్‌కి చెందుతుంది. ఆ ఊరు కూడా రెండు దేశాల కిందికి వస్తుంది. అందుకే, ఇక్కడి కొణ్యక్‌ గిరిజనులకు రెండు దేశాల పౌరసత్వమూ ఉంటుందట. స్థానికులు వ్యాపార నిమిత్తం రోజూ మయన్మార్‌లోని పంగిమెయ్‌ పట్టణానికి వెళ్లొస్తుంటారు. ఈ ఊళ్లోని యువకులు ఆ దేశపు సైన్యంలో కూడా పనిచేస్తున్నారు. తమకు భారత్‌కూ, మయన్మార్‌కీ తేడాలేదు అంటారు వారు. ఇక, ఈ చుట్టుపక్కల భారత్‌, మయన్మార్‌ దేశాల్లోని గ్రామాల్లో కలిపి దాదాపు 20లక్షల మంది కొణ్యక్‌ గిరిజనులు ఉంటారు. వీరిని ‘హెడ్‌ హంటర్స్‌’ ఆదివాసీలుగా కూడా పేర్కొంటారు. కొన్నేళ్ల కిందటి వరకూ శత్రువులుగా భావించే ఇతర గిరిజన తెగ ప్రజల తలలు నరికి తేవడం వీరి సంప్రదాయంలో భాగంగా ఉండేదట మరి. అలా ఎవరు చేసినా ఏదో ఘనకార్యం అన్నట్లు గుర్తుగా ఆ వ్యక్తి ఒంటిమీద పచ్చబొట్టు వేయించి, సంబరాలు జరుపుకునేవారట. ఈతరం అలా లేదు కానీ అక్కడి వృద్ధుల ఒంటిమీద కనిపించే పచ్చబొట్లు వాళ్లు ‘హెడ్‌ హంటర్స్‌’ అని ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయి. అదండీ సంగతి... రెండు రాష్ట్రాల సరిహద్దులు ఒక ఊళ్లో ఉంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటిది ఒక ఇల్లు రెండు దేశాల కిందికి రావడం ఎంత చిత్రమో!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు