close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇవి... ఐస్‌క్రీమ్‌ చందమామలు!

మరిపించో మురిపించో పసిపిల్లలకు అన్నం పెట్టడానికి ‘చందమామ రావే... జాబిల్లి రావే...’ అంటూ అమ్మలు ఆ చంద్రుణ్ణే రారమ్మని పిలుస్తూ పాడుతుంటారు. కానీ ఈ చందమామల్ని తినడానికి ఏ పాటలూ పాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంకా కావాలని పిల్లలే అడుగుతారు. ఎందుకంటే ఇవి ఆ జాబిల్లినే నోరూరించే ఐస్‌క్రీమ్‌ మూన్స్‌!

ఐస్‌క్రీముని ఎవరైనా ఎలా తింటారు... చప్పరిస్తూనే కదా. కానీ ఇప్పుడు వాటిని కొరికి తినేలానూ తయారుచేస్తున్నారు. అంతేకాదు, కోన్‌లూ కప్పులతో పనిలేకుండా ఎంచక్కగా బాక్సులో నుంచి స్వీటుని తీసుకుని తిన్నట్లే ఐస్‌క్రీమునీ చేత్తో తీసుకుని మరీ తినొచ్చు. పైగా ఇవి త్వరగా కరిగిపోవు, కారిపోవు. ‘మోచి’, ‘లిటిల్‌ మూన్స్‌’ పేరుతో వస్తోన్న ఈ గుండ్రని ఐస్‌క్రీముల్నీ వాటిని తింటోన్న ఫొటోల్నీ తిన్నప్పుడు కలిగే ఫీల్‌నీ వర్ణిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం తాజా ట్రెండ్‌గా మారిపోయింది. ఎందుకంటే అరిచేతిలో పెట్టుకుని తినగలిగే ఒకే ఒక్క ఐస్‌క్రీమ్‌ ఇది. ఈ లిటిల్‌ మూన్స్‌ లేదా మోచి మధ్యలో మెత్తని ఐస్‌క్రీమ్‌ని చప్పరించేశాక, కాస్త సాగినట్లుగా ఉండే పై భాగాన్ని నములుతూ తినొచ్చు. ఎందుకంటే ఈ పై పూతని ఆగ్నేయాసియా దేశాల్లో పండే జిగురుబియ్యంతో తయారుచేస్తారు. ఇంకా చెప్పాలంటే బూరెలకోసం పూర్ణాల్ని బియ్యప్పిండిలో ముంచి నూనెలో వేయించినట్లు ఈ ఐస్‌క్రీము చుట్టూ బియ్యప్పిండితో చేసిన తియ్యని పూత ఉంటుందన్నమాట. కాకపోతే వీటిని నూనెలో వేయించరంతే.

అసలేమిటీ మోచి?
జిగురుబియ్యంతో రకరకాల డెజర్ట్‌లు తయారుచేసుకోవడం జపనీయులకి అలవాటు. అందులోభాగంగా కొత్త ఏడాదినాడు మోచి అనే రైస్‌ కేక్‌నీ చేసుకుంటుంటారు. బియ్యప్పిండి, పాలు, పంచదార కలిపిన తీపి మిశ్రమంలో స్ట్రాబెర్రీ, ద్రాక్ష, ప్లమ్‌, చెర్రీ... వంటి పండ్లముక్కల్నీ చొప్పించి మరీ చేస్తుంటారు. అందులోనుంచి వచ్చిన ఆలోచనే ఈ మోచి ఐస్‌క్రీమ్‌. జిగురుగా ఉండే బియ్యప్పిండి, పంచదార, నీరు చేర్చి తయారుచేసిన డెజర్ట్‌లోపల పండ్లకు బదులు ఐస్‌క్రీమ్‌ని చొప్పించి తొలిసారిగా మోచి ఐస్‌క్రీమ్‌ తయారుచేశారు. అది అందరికీ నచ్చడంతో ఆ డెజర్ట్‌ని సైతం రకరకాల ఫ్లేవర్లలో చేయడం ప్రారంభించారు. ఆ తరవాత వాటిలోపల కూడా భిన్న రుచుల్లో ఉండే చాకొలెట్‌, కొబ్బరి, స్ట్రాబెర్రీ, మామిడి, గ్రీన్‌ టీ, వెనీలా, ద్రాక్ష, పుచ్చ, బ్లాక్‌బెర్రీ, పిస్తా... ఇలా రకరకాల ఫ్లేవర్ల ఐస్‌క్రీమ్‌ని నింపి చుట్టేశాక, అది చేతికి అతుక్కోకుండా దానిమీద ఆలూ లేదా కార్న్‌ పొడిని చల్లడంతో ఇవి ప్రపంచవ్యాప్తంగా అందరికీ నచ్చేశాయి. పైగా రంగురంగుల్లో అచ్చం వెల్వెట్‌ బంతుల్లా ఆకర్షణీయంగా ఉండే వీటిని చూడగానే తినాలనిపిస్తుంది. క్యాలరీలూ తక్కువే. ఒక్కో మోచిలో 70 నుంచి 100 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పైగా ఒకేసారి రెండుమూడు రుచుల్ని చప్పరించే వీలుండటంతోపాటు రకరకాల రంగుల్లో రావడంతో చిన్నాపెద్దా అంతా మోచి ఐస్‌క్రీమ్‌ రుచికి ఫిదా అయిపోయారట. మొదట్లో దీన్ని మరీ గుండ్రంగా చేసేవారు కాదు. ఆ తరవాత వీటిని పున్నమి చంద్రుణ్ణి తలపిస్తూ గుండ్రంగా చేసి ‘లిటిల్‌ మూన్స్‌’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిందో కంపెనీ. వీటిని ఫ్లేవర్ల వారీగా విడి విడి ప్యాక్‌లతోపాటు అన్ని ఫ్లేవర్లూ కలిపి ప్యాక్‌ చేసిన బాక్సుల్నీ విక్రయిస్తున్నారు ఉత్పత్తిదారులు. దాంతో ఐస్‌క్రీమ్‌ చందమామల్ని తినడం ఇన్‌స్టాగ్రామ్‌ ట్రెండయిపోయింది మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు