close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మట్టి వాసన

గన్నవరపు నరసింహ మూర్తి

‘‘పాసింజర్‌ వచ్చి స్టేషన్లో ఆగింది. నేను గబగబా కారుని పార్క్‌ చేసి పరుగున ప్లాట్‌ఫారం మీదకు వెళ్లాను. అప్పటికే మా చెల్లెలు మాధురీ, బావా, పిల్లలూ అందరూ ట్రైన్‌ దిగి నాకోసం ఎదురుచూస్తున్నారు.
నన్ను దూరం నుంచి చూస్తూనే చెల్లెలి కొడుకు యశస్వి ‘అడుగో మావయ్య’ అంటూ పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చాడు.
నేను వాడిని పట్టుకుని ‘‘ఏరా! బాగున్నావా’’ అంటూ మా చెల్లెలి దగ్గరకు వెళ్లాను.
మా బావ శేఖర్‌ హైదరాబాద్‌లో బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. చెల్లెలు అక్కడ టీచరు. ఇద్దరు పిల్లలు. కొడుకు యశస్వి... ఇంటర్‌ పూర్తైంది. కూతురు హరిణి... ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తైంది.
ప్రతీ సంవత్సరం వేసవికి మా ఊరు వస్తుంటారు. కానీ ఈసారి మూడేళ్ల తరువాత వస్తున్నారు. ‘‘ఏమ్మా బాగున్నావా?’’ అని అడిగాను సూట్‌కేస్‌ అందుకుంటూ, ఆ తరువాత బావగారి దగ్గరకు వెళ్లి ‘‘ఏం బావగారూ... చాలా రోజులైంది. మీరు ఇక్కడికొచ్చి’’ అన్నాను.
అంతలో హరిణి ‘‘మావయ్యా! రిషి రాలేదా’’ అని అడిగింది. రిషి నా కొడుకు. మొన్ననే ఇంటర్‌ పరీక్షలు రాశాడు.
‘‘వాడు పొలానికి వెళ్లాడు. మనం ఇంటికి వెళ్లేసరికి వచ్చేస్తాడు. పదండి, బయట కారుంది’’ అంటూ లగేజి పట్టుకుని ప్లాట్‌ఫారం బయటకొచ్చాను.
‘‘అన్నయ్యా! మనూరు వచ్చి నాలుగేళ్లై పోయింది. అంతకు మునుపు ప్రతి సంవత్సరం వచ్చే వాళ్లం కదా. ఇన్నాళ్ల తరవాత ఈ స్టేషన్‌, ఈ ప్రాంతం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది’’ అంది మా చెల్లెలు మాధురి.
ఆ తరువాత అందరం కారులో బయల్దేరాం. ప్రభాత సమయం కావడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.
‘‘ఏం బావగారూ! ఎలా ఉంది హైదరాబాద్‌ జీవితం?’’ అని అడిగాను.
‘‘మా బ్యాంకు ఉద్యోగాలు ఎప్పుడూ ఒకేలా గుంటాయి. పదిగంటలకి వెళ్లడం, రాత్రి ఎనిమిదికి రావడం... నోఛేంజ్‌’’ అన్నాడు నవ్వుతూ.
‘‘అన్నయ్యా! నువ్వు కూడా ఈ మధ్యన హైదరాబాద్‌ రావడం మానేశావు. వదినైతే ఫోన్లో మాట్లాడటం కూడా తగ్గించేసింది’’ అంది మాధురి కోపంగా.
‘‘లేదమ్మా! నా స్కూలూ, పొలం పనులూ... క్షణం తీరిక లేదనుకో. అందుకే రావటం కుదరటం లేదు. నువ్వుకూడా పుట్టింటికి రావడం మానేశావు కదమ్మా?’’
‘‘అదే బాధగా ఉందన్నయ్యా! నాకైతే ప్రతీ సంవత్సరం రావాలని ఉంటుంది కుదరడంలేదు.’’
‘‘మావయ్యా! మన ఊరు ఇంకా ఎంత దూరం’’ అడిగాడు యశస్వి.
‘‘మన ఊరికి స్టేషన్‌ 10 కిలోమీటర్లురా... ఇంకో పదినిమిషాల్లో వెళ్లిపోతాం. అది సరే... నువ్వు ఐఐటీ ఎంట్రెన్స్‌ రాశావుకదా, ఎలా రాశావు?’’ అన్నాను.
‘‘బాగానే రాశాను మావయ్యా. ర్యాంకు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను. రిషి ఎలా రాశాడు? వాడు నాతో ఒక్కసారి కూడా ఫోనులో మాట్లాడలేదు... నాకు కోపంగా ఉంది.’’
‘‘వాడు మొన్నటిదాకా రోజూ బస్సులో పట్నం వెళ్లి కాలేజీకి వెళ్లాల్సిరావడంతో అస్సలు తీరికుండేది కాదు. ఇంటరైపోయింది కదా, ప్రస్తుతానికి వాడు ఖాళీయే. మీ ఇష్టం... ఎంత సేపైనా మాట్లాడుకోండి’’ అన్నాను నవ్వుతూ.
మేమిలా మాట్లాడు కుంటుండగానే మా ఊరు వచ్చేసింది.
కాసేపటికి కారు మా ఇంటి ముందర ఆగింది.
కారు ఆగగానే నా శ్రీమతి రాధ పరుగున వచ్చి నా చెల్లెల్ని కావలించుకుంది.
‘‘వదినా! చాలా రోజులకు మళ్లీ మన ఊరు వచ్చాను’’ అంది మాధురి చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ.
ఆ రాత్రి అంతా కబుర్లే కబుర్లు. భోజనాలప్పుడు పిల్లలతో సినిమాల గురించీ, కాలేజీల గురించీ, ఐఐటీ పరీక్షల గురించీ, టీవీ సిరియల్స్‌ గురించీ మాట్లాడాను. మాధురీ, రాధా మాకు భోజనాలు వడ్డిస్తూ కబుర్లు చెప్పుకున్నారు. ఆ తరువాత వాళ్ల భోజనాలు కూడా మొదలయ్యాయి.
‘‘ఏరా యశస్వీ... ఐఐటీ ఎంట్రెన్స్‌లో ర్యాంకు వస్తే ఏం చదువుతావు?’’ అని అడిగాను.
వాడు మాట్లాడలేదు. మా బావ శేఖరం కల్పించుకుని ‘‘వీడికైతే కంప్యూటర్స్‌ చదివి స్టేట్స్‌కి వెళ్లాలని ఉంది. అందుకే రామయ్య కోచింగ్‌ సెంటర్‌లో చదివిద్దామనుకుంటే వీడికందులో సీటు రాలేదు. చూడాలి, ఈ వారంలోనే కదా రిజల్ట్స్‌ వస్తాయి’’ అన్నాడు.
‘‘ఏరా అమెరికా వెళ్తావా?’’ అని వాడినడిగాను.
‘‘వెళ్తాను మావయ్యా...’’ అన్నాడు వాడు.
‘‘నువ్వు చదివింది ప్రైవేట్‌ కాలేజీకదా... బాగా టెన్షన్‌ పెట్టి ఉంటారు. లెక్కలు, సైన్స్‌ బాగా అర్థం అయ్యేటట్లు చెప్పారా లేక ఈజీ మెధడ్స్‌ చెప్పారా?’’
‘‘బాగానే చెప్పారు...’’
‘‘నేనడిగింది మూలాలు చెప్పారా... లేకపోతే సిలబస్‌ ప్రకారం అవసరమైన మట్టుకే చెప్పారా... అని.’’
‘‘పరవాలేదు... బాగానే చెప్పారు’’ అన్నాడు. నేను ప్రశ్నలు అడుగుతుంటే వాడి ముఖంలో ఎందుకో ఇబ్బంది కనిపిస్తోంది. మనస్ఫూర్తిగా సమాధానాలు చెప్పడంలేదు. ఇంతలో మా చెల్లెలు మాధురి మాకు పెరుగు వడ్డిస్తూ ‘‘ఏరా రిషీ... నువ్వెలా రాశావు? అదే ఏ చైతన్యానో నారాయణానో అయితే బాగా చెప్పి ఉండేవారు కదా?’’ అంది.
‘‘గవర్నమెంట్‌ కాలేజీ మాకు దగ్గరత్తా... చైతన్యా నారాయణా అయితే విశాఖ వెళ్లి చదువుకోవాలి. అక్కడ నేను ఒక్కడినే ఉండాలి. ఇక్కడైతే ఇంటి నుంచి వెళ్లి చదువుకోవచ్చు. మా అమ్మకి హెల్ప్‌ చెయ్యొచ్చు. అమ్మకి రెండేళ్ల నుంచీ కాళ్లనొప్పులు. ఒక్కతే అన్ని పనులూ చేస్తే నొప్పులు ఎక్కువౌతాయి. నేనిక్కడుంటే అమ్మకి సహాయంగా ఉంటుందని గవర్నమెంట్‌ కాలేజీలో చేరాను’’ అన్నాడు.
‘‘ఏంట్రోయ్‌ అమ్మకూచిలా మాట్లాడుతున్నావు. అమ్మకి పనుల్లో సాయమా? ఆశ్చర్యంగా ఉందే. ఈ కాలం పిల్లలెవరైనా పనులు చేస్తారట్రా. ఎంతసేపూ టీవీ, మొబైల్‌ ఫోను తప్పా ఇంటి విషయాలు పట్టించుకునే వాళ్లు కూడా ఉన్నారా? ఏం వదినా వీడి మాటలు నిజమేనా?’’ అంది నవ్వుతూ.
‘‘నిజమే మాధురీ... నాలుగేళ్ల నుంచీ నా కాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. ఆపరేషన్‌ చేయించుకుంటే కానీ తగ్గేటట్లులేవు. రిషి లేకపోతే ఇంటి పనులు నేను చెయ్యలేను. సగం పనులు వాడే చేస్తాడు. పాపం నాకోసం తన చదువును కూడా వదులుకున్నాడు. వాడి తోటి వాళ్లంతా హాయిగా పట్నంలో పెద్ద పెద్ద కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుతుంటే వీడు మాత్రం గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో చేరాడు. అక్కడ సరిగ్గా చెప్పరు. అయినా వాడి లోపం లేకుండా కష్టపడి చదువుకున్నాడు. ఇక ఆ దేవుడి దయ’’ అంది రాధ.
ఆమె చెప్పింది ముమ్మాటికీ నిజం. మా రిషి వాళ్లమ్మకి పనుల్లో ఎంతో సహాయం చేస్తాడు.
ఆ రాత్రి మేమంతా వెన్నెల్లో డాబామీద పడుకున్నాం. మా చెల్లెలు మాధురి రాత్రి పన్నెండు దాకా కబుర్లు చెబుతూనే ఉంది. అలా వింటూ వింటూ ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాను.

*      *      *

మర్నాడు పిల్లలందర్నీ తీసుకుని నేనూ, మాధురీ, బావగారూ పొలానికి వెళ్లాం. అప్పటికే అక్కడ పొలానికి నీరు పెడుతూ కనిపించాడు మావాడు రిషి.
వాడిని చూసి మాధురి ఆశ్చర్యపోయింది. ‘‘ఏంట్రా! ఇంత చదువు చదువుకుని రైతు పనులు చేస్తున్నావ్‌?’’ అంది.
‘‘వాడికి చిన్నప్పటినుంచీ పొలం పనులంటే ఇష్టం’’ అని చెప్పాను.
సాయం సమయం... పడమటి సంధ్య సిందూరవర్ణంలోకి మారిపోతోంది. నీలి ఆకాశంలో తెల్లటి మబ్బులు... హరిత వర్ణపు పొలాలమీద ఎగురుతున్న తెల్లటి కొంగలు పూలదండల్లా కనిపిస్తున్నాయి.
ప్రకృతి శోభాయమానంగా ఉంది.
కానీ యశస్విగానీ, హర్షిణిగానీ ఆ ప్రకృతిని ఆస్వాదించే స్థితిలో లేరు.
వాళ్లిద్దరూ దూరంగా నడుస్తూ సెల్‌ఫోన్లో ఎవ్వరితోనో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ల ప్రవర్తన నాకు ఆశ్చర్యం కలిగించింది.
‘‘మధూ, వాళ్లని పిలువు... ఇంత చక్కటి పొలాలూ, ప్రకృతీ మళ్లీ చూసే అవకాశం రాదు...’’ అన్నాను.
చెల్లెలు వాళ్లని పిలవకుండా సంశయిస్తుండడంతో నేనే వాళ్లని పిలిచి ‘‘ఇక్కడికి రండి... కాసేపు ప్రకృతిని ఆస్వాదించండి’’ అన్నాను.
వాళ్లు నావైపు కోపంగా చూసి, మొహాలు  ముడుచుకుని వచ్చారు.

‘‘యశస్వీ... ఆ ఎగిరే పక్షులు ఏమిటో తెలుసా?’’ అని అడిగాను. వాడు నావైపు చూసి తెలీదన్నట్లు తలూపాడు.
‘‘కొంగలు... క్రేన్స్‌ అంటారు. ఎంతకని ఆ సెల్‌ఫోన్లు... ఇక్కడ ఉన్నన్నాళ్లైనా ఆ సెల్‌ఫోన్లని ముట్టుకోకండి. ఎంజాయ్‌ విలేజ్‌ లైఫ్‌... ప్రకృతిని గమనించండి’’ అన్నాను.
కాసేపటికి రిషి మా దగ్గరికి వచ్చిన తరువాత బోరింగ్‌ షెడ్‌ దగ్గరికి వెళ్లాం.
అక్కడ కొబ్బరి చెట్టుకి కాసిన కాయలు దించి మాకు కొట్టి ఇచ్చాడు మా రైతు వెంకన్న.
‘చాలా బాగున్నాయి అన్నయ్యా’ అంది మాధురి.
‘‘రిషి వాళ్లకి జంతికలు ఇచ్చాడు. దేనికి రోయ్‌ ఇవన్నీ... అడ్వాన్స్‌ పార్టీయా?’’ అంది హరిణి.
‘‘అమ్మ మొన్న చేసింది. నేను ఇక్కడ కొన్ని ఉంచుతాను, పొలానికి వచ్చినప్పుడు తినొచ్చని’’ అన్నాడు రిషి.
‘‘నాన్నగారూ! ఎల్లుండే ఐఐటీ రిజల్ట్స్‌’’ అన్నాడు రిషి.
‘‘అప్పుడే వచ్చేస్తున్నాయా! మా యశస్వికి ఎంత ర్యాంకొస్తుందో... వాళ్ల కాలేజీవాళ్లు వీడి మీద బాగా ఆశలు పెట్టుకున్నారు’’ అంది మాధురి.
‘‘ఏరా ర్యాంకు వస్తే ఏ బ్రాంచ్‌ తీసుకుంటావ్‌?’’ రిషి అడిగాడు యశస్విని.
‘‘నేను కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనీ డిసైడ్‌ అయిపోయాను. అదీ బొంబాయి ఐఐటీలో’’ అన్నాడు యశస్వి.
‘‘నువ్వు ఎలా రాశావు రిషీ... ఎక్కడైనా కోచింగ్‌ తీసుకున్నావా?’’ అడిగింది మాధురి.
‘‘లేదత్తా... కుదరలేదు. మామూలుగా ఇంట్లోనే ఉండి చదివాను. ర్యాంకు వస్తే చదువుతాను. లేకపోతే ఎమ్‌సెట్‌ రాశాను కాబట్టి ఏదైనా యూనివర్శిటీలో వస్తే అక్కడ చదువుతాను.’’
‘‘అదేంట్రా అలాగంటావ్‌. ఐఐటీలో చదివి అమెరికా వెళ్లాలని లేదూ! అమెరికా లైఫ్‌ వేరు... బోలెడు డబ్బు... హ్యాపీ లైఫ్‌... నీ వయసువాళ్లు ఎంత త్వరగా అమెరికా వెళ్దామా అని చూస్తుంటే నువ్వేంటి పాతకాలం మాటలాడుతున్నావు’’ అంది ఆశ్చర్యపోతూ.
‘‘నాకు ర్యాంకు వచ్చి, ఐఐటీలో సీటు వచ్చినా అమెరికా వెళ్లను అత్తా. ఇక్కడే చదువుతాను. మనదేశంలోనే ఉద్యోగం చేస్తాను’’ అన్నాడు రిషి.
ఆ రాత్రి భోజనానికి రాలేదు యశస్వి. తలుపేసుకుని గదిలో పడుకున్నాడు.
నేను మాధురితో ‘‘వాడెక్కడ’’ అని అడిగాను భోజనాల దగ్గర.
‘‘వాడు అలిగినట్లున్నాడు. వాడిని ఏమన్నా అంటే ఆ రోజంతా వాడు గదిలోంచి బయటకురాడు. ఇందాక నువ్వు ఫోన్‌ పక్కన పెట్టమని కోప్పడ్డావు కదా... అది మనసులో పెట్టుకున్నట్లున్నాడు. వాడు చిన్నప్పట్నుంచీ చాలా సెన్సిటివ్‌. అందుకే మేమిద్దరం కూడా వాడిని ఏమీ అనం. ఒకప్పటి మనలా కాదు అన్నయ్యా ఈ కాలపు పిల్లలు. వీళ్లనేమీ అనకూడదు...’’ అన్న మాధురి మాటలు నాకు విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగించాయి.
‘‘అయితే నేను వెళ్లి వాడిని రమ్మనమని పిలిచేదా?’’ అని అడిగాను.
‘‘వద్దులే అన్నయ్యా... ఇంక వాడు వినడు. రేపు ఉదయానికి మామూలు అవుతాడులే’’ అంది.

*      *      *

ఆ మర్నాడు ఐఐటీ రిజల్ట్స్‌ వచ్చాయి. రుషికి 1200 ర్యాంకు వచ్చింది. ఏదో ఒక ఐఐటీలో సీటు గ్యారంటీగా వస్తుంది. కానీ ఆ సీటు వస్తుందని ఆశించిన యశస్వికి 20,000 దాటి ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుకి సీటురాదు. వాడు ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయాడు.
మాధురీ, మా బావగారూ ఆవేళ అంతా మూడీగా ఉన్నారు. దాంతో రిషికి ర్యాంకు వచ్చినా మాకు ఆనందం కలగలేదు. కనీసం యశస్వి రిషికి కంగ్రాట్స్‌ కూడా చెప్పలేదు.
ఆ మర్నాడు మా చెల్లెలు వెళ్లిపోతానని చెప్పింది.
‘‘అదేంటే... నెల రోజులుంటానని అన్నావు కదా, ఇప్పుడేంటి అర్థాంతరంగా వెళ్లిపోతానంటున్నావ్‌?’’ అని అడిగాను.
‘‘యశస్వికి ర్యాంకు రాకపోవడంతో మా మనసులు బాగులేవన్నయ్యా. వాడైతే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. ఇంటికెళ్తే వాడికేదో సర్దిచెబుతాను’’ అంది కళ్లను తుడుచుకుంటూ.
‘‘మధూ, నేనొక విషయం చెబుతాను ఏమీ అనుకోవద్దు. పిల్లల్ని మీరు మరీ ముద్దు చేస్తున్నారనిపిస్తోంది. వాళ్లు ఎవరితోనూ కలవటం లేదు. అన్నీ వాళ్లు అనుకున్నవే జరగాలి, లేకపోతే అలుగుతున్నారు.
మనం చిన్నప్పుడు ఇంట్లో ఎన్ని పనులు చేసేవాళ్లమో నీకు గుర్తుండే ఉంటుంది. అటువంటిది ఈ కాలంలో పిల్లలు ఏ పనీ చెయ్యటంలేదు సరికదా తల్లిదండ్రుల్ని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. వీళ్లు సరిగ్గా చదవడమూ లేదు. ఏదో మార్కుల కోసం చదువుతున్నారు తప్ప జ్ఞానం కోసం కాదు. దీనికి మనమే కారణం. వాళ్లకు అడగకుండానే సెల్‌ఫోన్ల దగ్గర్నుంచీ అన్నీ ఇస్తున్నాం. వాళ్లు టైమంతా వీటి వాడకం మీదే గడిపేస్తూ బంధాలకు దూరంగా ఉంటున్నారు. చదువు అన్నది కేవలం డబ్బు సంపాదన కోసమేననీ, అమెరికా వెళ్లడానికేననీ మనమే వాళ్లకి చెబుతున్నాం. దానివలన వాళ్లు మొండి తీరి పోతున్నారు’’ అన్నాను.
‘‘నువ్వు చెప్పింది నిజమే అన్నయ్యా. వాళ్లని మీలా సక్రమంగా పెంచక తప్పు చేశాం. ఇప్పుడు మొక్కల స్థాయి నుంచి మానులైపోయారు. వీళ్లని జీవితాంతం మనం నిచ్చెనలు ఎక్కిస్తూ ఉండాలి. వాళ్లు సొంతంగా ఆ ప్రయత్నం చెయ్యకుండా మనమే అడ్డుకుంటున్నాం. రేపు పెద్దయ్యాక ఏదైనా సమస్య వస్తే వీళ్లు పరిష్కరించుకోలేరు. అప్పుడు కూడా మనవైపే చూస్తారు. రిషిని చూస్తే ఆనందం వేస్తోంది. వాడు భూమ్మీద నడుస్తున్నాడు. తల్లిదండ్రులంటే అభిమానమూ, ప్రేమా చూపిస్తున్నాడు. నేను అమెరికా వెళ్లిపోతే అమ్మానాన్నలను ఎవరు చూస్తారని ఆలోచిస్తున్నాడు. చదువుని అనుభవిస్తూ చదివాడు. అందుకే వాడికి ర్యాంకు వచ్చింది.
ఏమైనా- ఇంటికి వెళ్లిన తరువాత ఈ విషయమై మేము కూడా ఆలోచిస్తాం అన్నయ్యా’’ అంది కారెక్కుతూ. దానికి బాధతో వీడ్కోలు పలికాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు