close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాపట్ల బాంధవ్యాలు

ప్రతి ఊరికీ ఓ కథ ఉంటుంది. అక్కడ పుట్టిపెరిగినవారికి ఊరితోనూ ఊరివాళ్లతోనూ ఉన్న అనుబంధాలు మరెన్నో కథలవుతాయి. వాటిల్లో తొణికిసలాడే జీవితం ఆ కథల్ని ఆసక్తిగా చదివిస్తుంది. ‘మా బాపట్ల కథలు’ అలాంటి పుస్తకమే. బాపట్ల వచ్చినవారు భావనారాయణ స్వామిని చూడకుండా, బావయ్య బజ్జీలు తినకుండా, బాదంపాలు తాగకుండా వెళ్లరనే ఒకనాటి పేరుని ఎప్పటికీ తలచుకునేలా అక్షరబద్ధం చేసిన జ్ఞాపకాలివి. ‘మాణిక్యమ్మగారి మనవరాలి’ ముచ్చట్లు చిరునవ్వులు పూయిస్తే, ‘తీరం దాటిన బతుకులు’ లాంటి కథలు కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఒకప్పుడు ఊరికి నిండుదనాన్నిచ్చిన దేవాలయమూ, గడియారపు స్తంభం వంటి ఆనవాళ్లు కాలక్రమేణా రూపురేఖల్ని కోల్పోవడమూ మనుషుల తీరుతెన్నులు మారిపోవడమూ ఆవేదన కలిగించినా మార్పు సహజమనీ చెప్పులు కుట్టే సాంబయ్యలకీ, చెక్క రిక్షా మునెయ్యలకీ ఇవి రోజులు కావనీ చెప్పకనే చెబుతాయి.

- పద్మ
మా బాపట్ల కథలు
రచన: భావరాజు పద్మినీ ప్రియదర్శిని
పేజీలు: 148; వెల: 200/-
ప్రతులకు: ఫోన్‌- 8558899478


అంతఃసౌందర్యం

బ్యాంకు ఉద్యోగి వినీత్‌కి పుస్తకాలషాపులో లాస్య పరిచయమవుతుంది. ఆ అమ్మాయి అందమైన నవ్వు వెనక ఉన్న అనంతమైన మౌనవేదనని అర్థం చేసుకున్న వినీత్‌ తల్లిదండ్రుల్ని ఒప్పించి ఆమెను జీవితభాగస్వామిని చేసుకున్నాడు. పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని పట్టుదలతో అధిగమించి ఉన్నతోద్యోగం పొందడానికి ఆమెకు అండగా నిలబడ్డాడు. అంత కష్టపడి సాధించుకున్న ఉద్యోగాన్ని లాస్య ఎందుకు వదులుకుందీ, శబ్దం అంటే ఏమిటో తెలియని ఆమె సంగీతాన్ని నేర్చుకుని ఆ రాగాలకు అందమైన రూపాన్ని ఎలా ఇచ్చిందీ అన్నది కథ. అంగవైకల్యాన్ని కూడా ఒక బలంగా మార్చుకుని జీవితాన్ని గెలవొచ్చనే స్ఫూర్తినిస్తుంది కథనం.

- శ్రీ
మౌనరాగాలు(నవల)
రచన: సలీం
పేజీలు: 148; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 8096310140


అనుభవాల పలవరింత

జానపద సాహిత్య మౌలిక పరిశోధకుడు జయధీర్‌ తిరుమలరావు అనుభవాల, జ్ఞాపకాల, విశ్లేషణల కలబోత ఈ పుస్తకం. అడవి నుంచి ఆదివాసీలను తొలగించే ప్రయత్నాలనూ, ప్రజావ్యతిరేక అభివృద్ధి లోగుట్టునూ తేటతెల్లం చేశారు. నల్లమల కొండకోనల్లో, హిమాలయ సానువుల్లో పర్యటించిన అనుభవాలైనా, వలసపోయిన తెలుగువారి మూలాల అన్వేషణ అయినా సరళంగా, సాధికారికంగా చెప్పుకొచ్చారు. ఆదివాసీ ప్రదర్శనశాల ఎలా ఉండాలో చారిత్రక పత్రం లాంటి విశ్లేషణను అందించారు. సమాజంలోని వివిధ రంగాల్లో పెరుగుతున్న అవసవ్య ధోరణుల పట్ల ధర్మాగ్రహమూ ఆవేదనా వీటిలో కనిపిస్తాయి. ఆసక్తికరంగా ఉంటూనే ఆలోచనలు రేపుతాయి ఈ వ్యాసాలు. రచయిత దార్శనికతకు అద్దం పడతాయి.

- సీహెచ్‌. వేణు
తొవ్వ ముచ్చట్లు (ఐదోభాగం)
రచన: జయధీర్‌ తిరుమలరావు
పేజీలు: 230; వెల: రూ. 200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఉత్కంఠభరితం

హాకిన్స్‌ అనే లాయరు ఒక పనిమీద తన బదులుగా సహాయకుడు జోనాథన్‌ని డ్రాకులా చక్రవర్తి దగ్గరకు పంపుతాడు. చక్రవర్తి జోనాథన్‌కి చక్కటి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటుచేసి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటాడు. గదిలో గడ్డం చేసుకుంటూ ఉన్న జోనాథన్‌ భుజంమీద చేయివేసి ‘గుడ్మార్నింగ్‌’ చెబుతాడు చక్రవర్తి. చేయి బరువు తెలుస్తుంది, మాట విన్పిస్తుంది కానీ అక్కడ చక్రవర్తి కనిపించడు. అలా సరదాగా మొదలైన వింతలు రాను రాను భయంకరమైన అనుభవాలుగా మారతాయి. డ్రాకులా ఎవరు, అతడిని ఎలా అంతం చేశారన్నది కథ. జోనాథన్‌, మరికొన్ని పాత్రలు రాసిన డైరీ రూపంలో ఈ నవల- హారర్‌ కథల్ని ఇష్టపడేవారిని ఆపకుండా చదివిస్తుంది.

- సుశీల
డ్రాకులా(హారర్‌ నవల), రచన: బ్రామ్‌ స్టోకర్‌
అనువాదం: కొలను వేంకట దుర్గాప్రసాద్‌
పేజీలు: 318; వెల: రూ. 300/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు