close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాత వంటకాలు... మళ్లీ తెస్తున్నారు!

పాతకూ, యువతకూ ఎప్పుడూ పొత్తు కుదరదని అనుకుంటాం కానీ... అలా కాదని నిరూపిస్తున్నారు వీళ్ళు. కొత్త నాగరికత, యాంత్రికతల నడుమ మనకు దూరమైపోయిన అలనాటి పౌష్టికాహారాన్ని ఎంతో శ్రమకోర్చి కాపాడుతున్నారు. సాంకేతికతను చక్కగా వాడుకుంటూ ఆ తినుబండారాలని నేటి తరానికి ట్రెండీగా చేరువచేస్తున్నారు. అదెలాగో మీరే చూడండి...

తాటిబెల్లంతో చిరుతిళ్లు

బెల్లం తింటే షుగర్‌ వస్తుందని భయపడేవాళ్ళకి... ప్రత్యామ్నాయంగా తాటి బెల్లం వాడటం మంచిదని చెబుతుంటారు. కానీ మామూలు బెల్లంతో చేసినట్టు ఇందులో ప్రతిదానికీ పాకం కుదరదు. ఉదాహరణకు పల్లీ లడ్డు చేయాలనుకోండి... వేడి చేసిన తాటి బెల్లాన్ని వేరుశెనగ పప్పుతో కలిపితే ఆ పప్పు పొడిపొడిగా మారిపోతుంది. తాటి బెల్లం ఉష్ణోగ్రత స్థాయి ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. అలా కాకుండా తాటిబెల్లంతో పిల్లలు ఇష్టపడే చిక్కీలూ, పల్లీ లడ్డూలూ, నువ్వుల ఉండలూ తయారు చేయాలనుకున్నాడు మదురైకి చెందిన బి.స్టాలిన్‌. అలా చేయడం ద్వారా వారిలో పోషకాహార లోపం రాకుండా చూడొచ్చన్న ఆశ తనది. అందుకోసం ప్రయత్నించిన స్టాలిన్‌కి కూడా తాటిబెల్లం వేడి సమస్య ఎదురైంది. దాన్ని అధిగమించడానికి దాదాపు ఏడాదిపాటు ఎన్నో ప్రయోగాలు చేసి ఓ పద్దతి కనిపెట్టి తాటి బెల్లంతోనే తినుబండారాలు తయారుచేస్తున్నాడు. వాటి తయారీకోసమే ‘మదర్స్‌ వే’ అనే కంపెనీ స్థాపించి ఆన్‌లైన్‌లోనూ అమ్ముతున్నాడు. ఏ రసాయనాలూ, రంగులూ కలపకుండా అతను చేస్తున్న చిక్కీలూ, పల్లీ లడ్డూల్లాంటివి దక్షిణాదిలోని అన్నిసేంద్రియ ఆహార దుకాణాల్లోనూ దొరుకుతున్నాయి. ఇంతకీ స్టాలిన్‌ బిటెక్‌ చదివి ఓ బహుళ జాతి కంపెనీలోని ఆర్‌ అండ్‌ డీ విభాగంలో పనిచేస్తుండేవాడు. ప్రముఖ గాంధేయవాది, గ్రామీణ ఆర్ధికవేత్త జె.సి.కుమరప్ప రచనలకి ప్రభావితమై... తాను పుట్టి పెరిగిన గ్రామంలోనే నలుగురికీ ఉపయోగపడేలా కుటీర పరిశ్రమ పెట్టాలనుకున్నాడు. ఆ ఆలోచన ఫలితమే ఈ తాటిబెల్లం వంటకాలని చెబుతున్నాడు! 


ఇంటి వంటకాలన్నీ...

మనదేశంలో ప్రతి వందకిలోమీటరుకీ భాషా, యాసా, సంప్రదాయాలు మారుతూనే ఉంటాయని చెబుతారు. ఆ మారేవాటిల్లో వంటల్నీ తప్పకుండా చేర్చుకోవాలి. ఇక్కడ ప్రతి సామాజిక వర్గానికంటూ కొన్ని ప్రత్యేక వంటలుండేవి ఒకప్పుడు. నగరీకరణ పెరిగేకొద్దీ అవి అంతరిస్తున్నాయి. అలాంటి వంటకాలని మళ్లీ రుచిచూసే అవకాశాన్నిస్తోంది ‘ఆథంటికుక్‌’ అనే స్టార్టప్‌. హైదరాబాద్‌లోని బొహ్రీ తాలి, చెన్నై చెట్టినాడు వంటకాలు, తిరుపతి రాయలసీమ గారెలు... ఇలా రెస్టరంట్‌లలో కనిపించని వంటకాలన్నింటినీ మనం రుచి చూసేలా చేస్తోందీ స్టార్టప్‌. మనం ఏ నగరానికి వెళ్లినా అక్కడ ప్రత్యేక వంటల్ని చేసేవాళ్ల ఇంటికే వెళ్లి... వాళ్ల ఆతిథ్యాన్ని స్వీకరించి మరీ వాటిని రుచి చూడొచ్చు. అమేయ దేశ్‌పాండే, ప్రియాంక దేశ్‌పాండే, అనీశ్‌ ధైర్యవాన్‌ ఈ స్టార్టప్‌ వ్యవస్థాపకులు. ఈ బాల్యస్నేహితులు ముగ్గురూ ఎంబీఏ చేసి ఎవరికివారు వేర్వేరు సంస్థల్లో పనిచేస్తుండేవారు. ఓసారి ముగ్గురూ కలిసి లెహ్‌ వెళ్లారు. అక్కడి సంప్రదాయ వంటల్ని స్థానికుల ఇళ్లకే వెళ్లి తినాలనుకున్నారుకానీ... కుదర్లేదు. అప్పుడే వాళ్లకి స్థానికులచేతే అతిథులకి సంప్రదాయ భోజనాలు పెట్టించాలనే ఆలోచన వచ్చింది. దాని ఫలితమే ‘ఆథంటికుక్‌’. ఇందులో ప్రధానంగా గృహిణుల్నే భాగస్వాములుగా చేసుకున్నారు. అలా దేశంలో పదినగరాలకి చెందిన 103 కుటుంబాలు అలా ఆథంటికుక్‌లో నమోదై ఉన్నాయి. 


పుట్టూ కుడుములూ...

తూత్తుకుడి... తమిళనాడులోని కరవు జిల్లా. అక్కడ కాయల్‌పట్టినం అనే గ్రామం దాదాపు ఎడారిని తలపిస్తుంటుంది. ఆ కరవు ప్రాంతంలోని పేద ప్రజలకి తాటి చెట్లే ఆదరవు. వాటి నీరాతో ఎన్నో తినుబండారాలు తయారుచేసి అమ్ముతుండేవారు స్త్రీలు. వాటిల్లో ‘పుట్టు’ ఒకటి. అంటే ఏమీ లేదు... తాటి బెల్లమే. కాకపోతే తయారు చేసేటప్పుడే జీడిపప్పు, మామిడి రసం, మినప్పిండి, నువ్వులు చేర్చి ఓ తినుబండారంలా తయారు చేస్తారు. ఈ పుట్టుతోపాటూ ‘పిడి శక్కరం’ పేరుతో కుడుములాంటి స్వీట్‌నూ తయారు చేస్తారు. అలా తయారైన వాటిని  అక్కడి స్త్రీలు అమ్మడం వీధుల్లో అమ్ముకుంటూ రావడం తన చిన్నప్పటి జ్ఞాపకమని చెబుతుంటుంది జరియా. ఇప్పుడు ఆ వంటకాలేవీ లేవు. ఆ స్త్రీలూ కూలీనాలీ చేసుకుంటున్నారు. పీజీ చదువుతున్న జరియాకి ఈ విషయం కోవిడ్‌ లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ స్ఫురణకి రాలేదు. రాగానే తన స్నేహితులతో కలిసి కనుమరుగవుతున్న ఆ వంటకాలపైనా డాక్యుమెంటరీ తీసింది. అంతేకాదు, ఆర్థిక దన్నులేనిదే ఏ పాత వంటకాన్నీ పునరుద్ధరించలేమనీ తెలుసుకుంది. దానితో కాయల్‌పట్టి స్త్రీలతో పుట్టూ, కుడుములూ చేయించి తానే స్వయంగా మార్కెట్‌ చేయడం మొదలు పెట్టింది. ఇందుకోసం అబాతి అనే సంస్థని ఏర్పాటు చేసింది. ‘46 తైకా స్ట్రీట్‌’ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ కూడా పెట్టి వాటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.