close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఉచితంగా భోజనం... పది రూపాయలకే వైద్యం..!

సిక్కుల గురుద్వారాలు ఏ చిన్న గల్లీలో ఉన్నా సరే అటు ఆధ్యాత్మికతకీ ఇటు సేవకీ ఆటపట్టుగా నిలుస్తుంటాయి. గల్లీలోనే అంత చక్కగా పనిచేస్తుంటే ఇక దేశరాజధాని దిల్లీలో ఏ స్థాయిలో ఉండాలి! అందుకే అక్కడి బంగళా సాహిబ్‌ గురుద్వారా సేవ జాతీయస్థాయి గుర్తింపుని అందుకుంటోంది. కరోనాతో అన్నపానాలు కరవైన మూడులక్షలమంది అభాగ్యులకి రోజూ అన్నం పెడుతోందా సంస్థ. ఆహారంతోబాటూ ప్రజల ఆరోగ్యాన్నీ పరిరక్షించాలనే ఆశయంతో పదిరూపాయలకే విలువైన వైద్యసేవలందిస్తోంది.

నాలుగునెలల కిందట ఓ మధ్యాహ్నం... దిల్లీలో కరోనా లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమల్లో ఉందా రోజు. ఎప్పుడూ వ్యాపారాలతో హడావుడిగా ఉండే కనాట్‌ ప్లేస్‌ ఆ వేళ నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మొదలయ్యాయి పోలీసు వాహనాల సైరన్‌ మోత! ఏమైందో ఏమోనని బయటకొచ్చిన జనం ఆ సైరన్‌ మోత ఎందుకో తెలిసి దానికి తమ చప్పట్లని జతకలిపారు.  దిల్లీ పోలీసులు ఆ రోజు బంగళా సాహిబ్‌ గురుద్వారాకి తమదైన రీతిలో గౌరవమర్యాదలని చాటుకోవాలనుకున్నారు. అందులో భాగంగా ఓ డీసీపీ ఆధ్వర్యంలో 35 పోలీసు వ్యానులూ, 60 మోటారు సైకిళ్లతో ఆ గురుద్వారా చుట్టూ పదినిమిషాలపాటు ప్రదక్షిణ చేశారు! దిల్లీ పోలీసులు ఇప్పటిదాకా మరే ఆధ్యాత్మిక సంస్థకీ చూపని మర్యాద అది. అందుకే వాళ్ల సైరన్‌ మోతల కవాతుతో సామాన్యుల చప్పట్లూ జతకలిశాయి. ఇంతగా పోలీసులూ, ప్రజల జోహార్లూ అందుకునేంతగా ఈ గురుద్వారా ఏం చేస్తోందనుకుంటున్నారా... రోజుకి మూడులక్షలమందికి భోజనం పెడుతోంది! అదొక్కటే కాదు... ఇంకెన్నో చేస్తోంది. ఒక్కొక్కటీ చూద్దాం... రండి.

అన్నపూర్ణగా...
సాధారణంగా ప్రతి గురుద్వారాలోనూ ‘లంగర్‌’ పేరుతో ఆహారశాల ఉంటుంది. దిల్లీలోని బంగళా సాహిబ్‌ గురుద్వారాలోని లంగర్‌ దేశంలోనే అతివిశాలమైనవాటిల్లో ఒకటి. దాని వైశాల్యానికి తగ్గట్టే ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. కరోనా ముందు వరకూ ఇక్కడ 75 వేలమందికి ఆకలి తీరుస్తుండేవారు. ఆ తర్వాత భక్తుల రాక తగ్గినా... వీళ్ల సేవా విస్తృతి మాత్రం కుదించుకుపోలేదు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు కోల్పోయిన వలస కార్మికులూ, మురికివాడ ప్రజలూ ఈ గురుద్వారాని ఆశ్రయించడం మొదలుపెట్టారు. దాంతోపాటూ, దిల్లీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు నగరం నలుమూలల్లోని అనాథాశ్రమాలూ, ఆసుపత్రులకీ ఆహారాన్ని సరఫరా చేయడం ప్రారంభించారు. అలా ప్రస్తుతం ఈ సంస్థ రోజూ మూడులక్షలమందికి అన్నం పెడుతూ... ‘అన్నపూర్ణ’ అన్నమాటకి నిర్వచనంగా నిలుస్తోంది.

ఆరోగ్యదాయినిగా...
నిరుపేదలకి ఆహారం వండిపెట్టడమే కాదు... వాళ్లకి నిండైన ఆరోగ్యాన్నీ ఇవ్వాలనే లక్ష్యంతో కొన్ని దశాబ్దాల కిందట ఈ ప్రాంగణంలో ‘గురు హర్‌క్రిషన్‌ పాలీ క్లినిక్‌’ని మొదలుపెట్టింది గురుద్వారా. పదిరూపాయల  ఫీజుతో ఇక్కడ దాదాపు అన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలకీ చికిత్స అందిస్తారు. దిల్లీ నగరంలో పేరున్న హృద్రోగ వైద్యులు, క్యాన్సర్‌ నిపుణులు కూడా ఇక్కడ ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ క్లినిక్‌కి ప్రతిరోజూ మూడువందల మంది రోగులు వస్తుంటారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలోనే ఇక్కడ ‘బాలా ప్రీతమ్‌’ మందుల దుకాణాన్ని ప్రారంభించారు. బయటి షాపులకంటే అరవై నుంచి ఎనభైశాతం రాయితీలతో మందులు అందిస్తున్నారు ఇక్కడ. తాజాగా ఇక్కడ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ కూడా ప్రారంభించారు. ఇందులో ఎక్స్‌రేకి 20 రూపాయలూ, అత్యాధునిక ఎమ్మారై స్కాన్‌కి యాభైరూపాయలూ తీసుకుంటున్నారు. కేవలం రూ.20లకే ‘సీబీపీ’లాంటి రక్తపరీక్షలూ చేస్తున్నారు. అంతేకాదు, కిడ్నీ సమస్యలూ, కాలేయ సమస్యలూ ఉన్నవారి కోసం రూ.600కే డయాలసిస్‌ సేవలూ మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు ఈ గురుద్వారా... తమ సువిశాల బంగళా ప్రాంగణాన్ని కరోనా రోగుల చికిత్సా కేంద్రంగానూ మార్చింది. ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులకి ఉచితంగా ఆహారంతోపాటూ మందుల్నీ అందించింది!

ఆధ్యాత్మిక కేంద్రంగా...
1664వ ప్రాంతం అది. నాటి దిల్లీలో మశూచీ, కలరా విలయతాండవం చేస్తున్నాయి. ఆ సంక్షోభ సమయంలోనే అక్కడికొచ్చాడు సిక్కుల ఎనిమిదో గురువైన హర్‌ క్రిషన్‌ సాహిబ్‌. ఆ గురుపరంపరలో అతిపిన్నయస్కుడాయన... దిల్లీ వచ్చేనాటికి ఏడేళ్లే! ఆయనకి రాజా జైసింగ్‌ తన బంగళాలో ఆశ్రయమిచ్చాడు. హర్‌క్రిషన్‌ అక్కడి ఓ చిన్న కొలను దగ్గర ఉంటూ మశూచీ, కలరా బాధితులని నయం చేస్తుండేవాడు. కానీ, రెండునెలల్లో ఆయనా మశూచి బారినపడ్డాడు. ఆ అనారోగ్యంతోనే కన్నుమూశాడు. ఆయన సంస్మరణగానే రాజుగారి బంగళాని గురు ద్వారాగా మార్చారు. అందుకే దీనికి బంగళా సాహిబ్‌ అని పేరు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే, జీవితంలో ఒక్కసారైనా బంగ్లాసాహిబ్‌కి వచ్చి ఇక్కడి సరోవరంలోని నీటిని తీసుకెళ్లాలనుకుంటారు సిక్కులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటువంటి భక్తుల విరాళాలే ఈ గురుద్వారానే నడిపిస్తున్నాయి. అయితేనేం... ఇక్కడి సేవలన్నీ కులమతాలకి అతీతంగానే ఉంటాయి. అందుకే ఒక్క పంజాబీలే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ గురుద్వారాని చూసి ‘సలామీ’(దణ్ణం) పెడుతుంటారు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.