close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాప్‌ కాదు కుక్క!

అది పరిగెట్టుకుంటూ వస్తుంటే ఒక్కసారిగా చూసినవారెవరైనా ‘ఇల్లు తుడిచే మాప్‌ దానంతటదే ఎలా వస్తోందబ్బా’ అని షాక్‌ అవ్వాల్సిందే. తర్వాత గానీ తెలీదు అది కుక్క అని. అచ్చం ఇల్లు తుడిచే మాప్‌లానే ఉంది కాబట్టే, కొమండర్‌ అనే ఈ హంగేరియన్‌ కుక్కను మాప్‌ డాగ్‌ అని కూడా అంటారు. ఒంటి నిండా గుడ్డపీలికల్లాంటి ఊలుతో ఉండే ఈ కుక్కల్ని మేతకు తోలుకెళ్లే గొర్రెలూ, పశువులకు కాపలాగా ఉంచేందుకు పెంచుతుంటారట. చాలా తెలివీ ధైర్యం కల మాప్‌ కుక్కలు ఎలుగుబంటి, తోడేళ్లలాంటి జంతువులక్కూడా ఎదురు తిరిగి పోరాడగలవు. ఆయా జంతువులు వీటి మీద దాడి చేసినా ఒంటి మీద ఉండే మందపాటి ఊలు కారణంగా వీటికి త్వరగా గాయాలు కావు. హంగేరీతో పాటు ఇతర దేశాల్లోనూ ఎన్నో తరాల నుంచీ ఈ మాప్‌ కుక్కల్ని పెంచుతున్నారు.


ఈ బెంచీ మహారాష్ట్ర గుజరాత్‌లకు సగం సగం!

ఆ రైల్వేస్టేషన్‌లోని ఓ బెంచీ మీద ఒక పక్కన కూర్చుంటే మద్యం తాగడం నేరం. మరోపక్కన కూర్చుంటే మద్యం తాగొచ్చు కానీ పాన్‌ మసాలా, గుట్కాలు నమలడం నేరం. ఎందుకంటే నవపూర్‌ రైల్వేస్టేషన్‌లోని ఆ బెంచీ మధ్యలోంచి మహారాష్ట్ర, గుజరాత్‌ సరిహద్దు రేఖ వెళ్లింది. బెంచీ మీద కూడా రెండు వైపులా రెండు రాష్ట్రాల పేర్లుంటాయి. దాంతో ఓ వైపు కూర్చుంటే మహారాష్ట్రలోనూ మరోవైపు కూర్చుంటే గుజరాత్‌లోనూ ఉన్నట్లన్నమాట. అలాగే గుజరాత్‌లోని మద్యపాన నిషేదం, మహారాష్ట్రలోని పాన్‌మసాలా, గుట్కాల నిషేధాలు కూడా వర్తిస్తాయి. ఇక, ఈ రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌ మహారాష్ట్ర కిందికి వస్తే వెయిటింగ్‌ రూమ్‌, స్టేషన్‌ మాస్టర్‌ ఆఫీసులు గుజరాత్‌ పరిధిలోకి వస్తాయి. విచిత్రంగా ఉంది కదూ... అందుకే, ఇక్కడికొచ్చే ప్రయాణికులు ఈ బెంచీకి అటువైపూ ఇటువైపూ నిలబడి సరదాగా సెల్ఫీలు తీసుకుంటుంటారు. రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా ఈ బెంచీ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసి ‘రాష్ట్రాలు విడగొట్టాయి... రైల్వే కలిపింది’ అనే క్యాప్షన్‌ జతచేశారు.


ఇంటర్‌లో చేరిన విద్యా మంత్రి!

నడివయస్సులోనూ కాలేజీలకి వెళ్లడం ఈరోజుల్లో పెద్ద విశేషమేమీ కాదు కానీ... అలా వెళుతున్న వ్యక్తి ఝార్ఖండ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావడమే ప్రత్యేకం. అక్కడి విద్యామంత్రి జగర్నాథ్‌ మహతో ఈమధ్యే ఓ కాలేజీలో చేరి, పాఠాలన్నీ చకచకా చదివేస్తున్నారు. ఈయనది స్థానిక బొకారో జిల్లాలో అలార్గో అనే కుగ్రామం. నిరుపేద కుటుంబం కావడంతో... కూలీనాలీకెళుతూ పదోతరగతి వరకే చదువుకోగలిగారు. ఆ సమయంలోనే బిహార్‌లో భాగంగా ఉన్న ఝార్ఖండ్‌ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ శిబూ సొరేన్‌ నేతృత్వంలో ఉద్యమం మొదలైతే జగర్నాథ్‌ కూడా అందులో పాల్గొన్నారు. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది విద్యాశాఖ మంత్రి అయ్యారు. కానీ, ఆయన పదవీప్రమాణం చేసేటప్పుడే ‘పదోతరగతి చదివిన ఈయన విద్యని ఏం అభివృద్ధి చేస్తార’ని కొందరు తీవ్రంగా విమర్శించారు. దాంతో ఎలాగైనా ఉన్నత విద్య చదవాలనే పట్టుదలతో ఏడాది తిరక్కుండానే కాలేజీలో చేరారాయన. ఓ మామూలు విద్యార్థిలా క్యూలో నిల్చుని అడ్మిషన్‌ తీసుకున్నారు. ‘మరి మంత్రిగా ఉంటూ చదువుకునే అవకాశం మీకు ఉంటుందా..?’ అంటే... ‘రెండింటినీ బ్యాలన్స్‌ చేయడం కష్టమే కానీ... నా శాయశక్తులా ప్రయత్నిస్తా!’ అని చెబుతున్నారు 54 ఏళ్ల ఈ ఇంటర్‌ విద్యార్థి!


వనమాల ధరించి...

భవానీ దీక్ష, అయ్యప్ప దీక్షల్లా నల్గొండవాసులు కొందరు ఈమధ్య వనదేవత దీక్ష తీసుకున్నారు తెలుసా! ప్రకృతి సంరక్షణ కోసం మొక్కలు నాటడం, దానిపట్ల అందరికీ అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు వీళ్లు ఆధ్యాత్మిక పద్ధతుల్ని జతచేశారు.  దీక్ష చేసిన ఏకాదశ(11) రోజులపాటు ‘వనమాల’ అన్న అక్షరాలు ఎంబ్రాయిడరీ చేసిన తెల్లటి దుస్తులే వాడారు. ప్రతిరోజూ ఉదయాస్తమయాల్లో పూజలకి బదులు రోజంతా నల్గొండలోని పాతబస్తీ, హౌసింగ్‌ బోర్డు కాలనీ, బ్రహ్మంగారి గుట్ట ప్రాంతాల్లో విస్తారంగా మొక్కలు నాటారు. అంతేకాదు... అక్కడి స్థానికులందరికీ ‘ప్రసాదం’గా తులసి మొక్కల్ని అందించారు. దీక్ష పూర్తయ్యాక కొన్ని విత్తనాలనీ, ఓ మొక్కనీ ఇరుముడిగా వస్త్రంలో తీసుకుని యాభై కిలోమీటర్ల దూరంలోని సూర్యాపేట దాకా యాత్ర చేశారు. అక్కడ దుశ్శర్ల సత్యనారాయణ అనే పర్యావరణ ఉద్యమకారుడు డెబ్భై ఎకరాల్లో రూపొందించిన చిట్టడవిని ‘దర్శించుకున్నారు.’ ఆ తర్వాత ఇరుముడి విప్పి
అందులోని విత్తనాలనూ, మొక్కల్నీ అక్కడ సభక్తికంగా నాటారు!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.