close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆకలి తీర్చే వైకోం ఆలయం!

మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మడంతోపాటు దాన్ని ఆచరణలో పెట్టి చూపుతోంది వైకోం మహాదేవ ఆలయం. నిత్యం శివనామ స్మరణలతో మారుమోగే ఈ ప్రాంగణంలో కులమత భేదాలకు తావులేదు. ఆకలితో ఉన్నవారిని వెతికి మరీ తీసుకొచ్చి అన్నం పెడతారు. అలా నిత్యం రెండువేల మంది కడుపు నింపుతుందీ ఆలయం.
హరహర మహాదేవుణ్ని భక్తి శ్రద్ధలతో కొలిచే ప్రఖ్యాత ఆలయాల్లో వైకోం మహాదేవ దేవాలయం ఒకటి. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కేరళలోని కొట్టాయంకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకోం పట్టణంలో కొలువై ఉంది. ఇక్కడ పూజలు అందుకుంటున్న శివుడికి ‘అన్నదాన ప్రభు’ అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆలయంలో వందల ఏళ్లుగా అన్నదాన ప్రక్రియ కొనసాగుతోంది.

స్థలం పురాణం
త్రేతాయుగంలో ఖరాసురుడు అనే రాక్షసుడు మోక్షం కోసం తపస్సు చేస్తాడు. అందుకు మెచ్చుకున్న శివుడు ఆ రాక్షసుడికి మూడు శివలింగాలను ఇచ్చి మోక్షం పొందమని చెబుతాడు. దాంతో ఖరుడు లింగాలను తీసుకుని దక్షిణదిశగా పయనమవుతాడు. మార్గం మధ్యలో అలసిపోయి లింగాలను కింద పెట్టి విశ్రమిస్తాడు. కాసేపటికి లేచి ప్రయాణమై లింగాలను తీసుకోబోతుంటే అవి అక్కడి నుంచి కదలవు. ఆ సమయంలో ‘నేను ఇక్కడే ఆశ్రయం పొందుతాను’ అని అశరీరవాణి వినిపిస్తుంది. అది శివుడి మహత్యమేనని అర్థం చేసుకున్న ఖరుడు ఓ ఋషికి ఆ లింగాలను అప్పగించి వెళతాడు. కొంత కాలానికి ఆకాశమార్గాన వెళుతున్న పరశురాముడికి ఖరుడు ఉంచిన చోటనే ఉన్న లింగాలు అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ దర్శనమిస్తాయి. వెంటనే అక్కడికి చేరుకుని ఆ లింగాలను వైకోం, ఎట్టుమన్నూర్‌, కాడుతత్తూర్‌లో ప్రతిష్ఠించి మూడు ఆలయాలు నిర్మించి కొంత కాలం పూజలు చేస్తాడు పరశురాముడు. అలా ఖరుడు తెచ్చిన వాటిలో ఓ లింగమే వైకోంలో కొలువై ఉంది. ఇక్కడ శివుడు ఉదయం దక్షిణామూర్తిగా, మధ్యాహ్నం కిరాతమూర్తిగా, సాయంత్రం సచ్చిదానంద మూర్తిగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో అన్నమే నైవేద్యం. అంతేకాదు, అక్కడ భోజనం చేస్తే జీర్ణసమస్యలు నయమవుతాయని చెబుతారు. వంట వండేటపుడూ, అన్నదానం లోనూ శివుడే పాలుపంచుకుంటాడని ప్రతీతి. అందుకే అందరికీ ఆరోగ్యాన్ని పంచి... ఆకలి తీర్చాలనే అన్నదాన ప్రక్రియ ప్రారంభించారట.
అన్నం లేదనరు...
ఆలయానికి వచ్చిన వారికీ, ఆ చుట్టుపక్కల చిన్న చిన్న దుకాణాల్లో పనిచేసేవారికీ, పేదలకీ, యాచకులకీ... ఇలా దాదాపు రెండువేల మందికి రెండుపూటలా అన్నం పెడతారు. అంతేకాదు, కమిటీ నిర్వాహకులు వైకోం పట్టణంలో రోడ్డువారల ఉన్నవారిని పిలిచి తీసుకొచ్చి మరీ వారి కడుపు నింపుతారు. ఇక, రాత్రిపూట ఆలయానికి నలుదిక్కులా ఉన్న గేట్ల దగ్గర నిర్వాహకులు మైకు పట్టుకుని నిల్చుని... ఆకలితో ఉన్నవారు అన్నదానానికి రావల్సిందిగా చెబుతుంటారు. ఆ చుట్టుపక్కల అందరి కడుపూ నిండింది అనుకున్నాకే గుడి తలుపులు మూసి వేస్తారు. ఒకవేళ గుడి మూసేయక ముందే అన్నం అయిపోయినా వచ్చిన వారిని వెనక్కి పంపకుండా... అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం, ఓ కూరా వండి పెడతారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఈ అన్నదానాన్ని కొనసాగించారు.

మూడువేల కిలోల బియ్యం...
ఆలయంలో అన్నదానానికి రోజుకు మూడు వేల కిలోల బియ్యం వండుతారు. అన్నంలో పాయసం, పులిహోర, రెండు కూరలు, వేపుడు, పచ్చడి, సాంబారు లేదా రసం, అప్పడాలు, అరటిపండు, మజ్జిగ వడ్డిస్తారు. అలానే ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం సమయం వరకూ అంటరానితనం, కులమత భేదాలు ఉండేవి. ఆ సమయంలోనే గాంధీజీ అందుకు వ్యతిరేకంగా ఆలయ ప్రాంగణంలోనే ‘వైకోం సత్యాగ్రహం’ పేరిట  దీక్ష చేశారు. అప్పట్లో ఆలయం తిరువాన్కూరు రాజుల ఆధీనంలో ఉండేది. గాంధీ సత్యాగ్రహంతో వారు దిగొచ్చి... వైకోం ఆలయంలో అంటరానితనం, కులమత భేదాలకు తావు ఉండదని గాంధీజీకి రాతపూర్వకంగా రాసి ఇచ్చి అలాంటివి లేకుండా చేశారు. అలా మనదేశంలో తొలిసారి దళితులకు ఆలయప్రవేశం కల్పించిన గొప్పతనం వైకోం దేవాలయానికే దక్కింది. ఇక్కడి విజయం తర్వాతే గాంధీజీ దేశవ్యాప్తంగా ‘అందరికీ ఆలయ ప్రవేశం’ ఉద్యమాన్ని చేపట్టి విజయం సాధించారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.