close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒత్తిడిగా అనిపిస్తే అంట్లు తోముతా...!

 

దాదాపు రూ.15 లక్షల కోట్ల నికర సంపదతో ప్రపంచ కుబేరుల్లో వరుసగా తొలిస్థానంలో నిలుస్తున్నాడు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెెఫ్‌ బెజోస్‌. ఒక్కోమెట్టూ ఎక్కుతూ అపరకుబేరుడిగా అవతరించిన బెజోస్‌ జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలివి.

అది చిన్ననాటి కల

మా తాతయ్య స్పేస్‌ టెక్నాలజీకి చెందిన అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. ఆయన్ని చూస్తూ పెరగడంతో నాకూ అంతరిక్షం, రాకెట్ల వంటివాటిపై ఆసక్తి కలిగింది. అందుకే స్పేస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవ్వాలని చిన్నప్పుడే అనుకున్నా. స్కూల్లో టీచర్‌ ‘నువ్వేమవుతావ్‌...’ అని అడిగినప్పుడూ అదే సమాధానం చెప్పేవాడిని. కానీ తోటిపిల్లలంతా నవ్వేవారు. అందుకే ఇప్పుడు ప్రయివేట్‌ రాకెట్లను అంతరిక్షంలోకి పంపడానికి బ్లూఆరిజన్‌ సంస్థను స్థాపించా. అందుకోసం ఏటా వంద కోట్ల డాలర్లను ఆ సంస్థకు కేటాయిస్తున్నా. 


ఆ బాధ తెలుసు

ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిలానే తండ్రి పాత్ర కూడా చాలా కీలకం. అయితే తండ్రిలేని వారి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా అమ్మ రెండో భర్త మైక్‌ బెజోస్‌ నన్ను దత్తత తీసుకుని ఆ లోటును తీర్చారు. తనకోణంలో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. అందుకే నేను కూడా తండ్రి లేని ఓ ఆడపిల్లని దత్తత తీసుకున్నా. మా సంస్థలో తండ్రి లేని ఉద్యోగుల్ని ప్రత్యేకంగా చూస్తా. అలానే అమెరికాలో అనాథలూ, కన్నవారు వదిలేసిన స్వలింగసంపర్కులకోసం ఏటా రూ.20కోట్లు కేటాయిస్తున్నా.


ఆరోగ్య రహస్యం

రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోతా. ఎన్ని పనులున్నా రాత్రి పది గంటలకి పడుకుని ఉదయం ఆరింటికి నిద్రలేస్తా. ఆ నిద్రే నా ప్రాథమిక ఆరోగ్య రహస్యమని నమ్ముతా. ఇక, లేచాక గంట వ్యాయామం చేస్తా. ఎక్కువగా ఏరోబిక్స్‌, బరువులు ఎత్తడం వంటివి చేస్తుంటా. అలానే నిపుణుల సూచనలతో టెస్టోస్టెరాన్‌ సప్లిమెంట్లు కూడా తీసుకుంటా. అందుకే రోజుకు 14 గంటలు ఉత్సాహంగా పని చేయగలుగుతున్నా. 


ఇష్టంగా తినేది

నేను భోజన ప్రియుణ్ని. ముఖ్యంగా ఆక్టోపస్‌తో చేసిన వంటకాలంటే ప్రాణం. ప్రతిరోజూ ఉదయం ఆక్టోపస్‌ ఐటమ్‌ ఏదో ఒకటి ఉండి తీరాల్సిందే. దాంతోపాటు బేకన్లు, గ్రీన్‌ గార్లిక్‌, పెరుగు, ఉడికించిన గుడ్లు, బంగాళాదుంపలు తీసుకుంటా. ఆఫీసులో మీటింగులు కూడా ఉదయం పది గంటలకే పెట్టుకుంటా. ఆ సమయంలో ఉద్యోగులకు రకరకాల ఆహార పదార్థాలు ఏర్పాటు చేయిస్తుంటా. ఎందుకంటే మంచి ఆహారం తీసుకున్నప్పుడే బుర్ర చురుగ్గా పని చేసి గొప్ప ఆలోచనలు వస్తాయని నా అభిప్రాయం. అలానే సాయంత్రం ఐదు తరవాత ఉదయం ఉన్నంత హుషారుగా ఉండలేం. అందుకే నేను ఐదింటి తరవాత ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోను.


ఒత్తిడిగా అనిపిస్తే...

తెల్లని కాగితంపైన నల్లని గీతలు గీస్తూ... క్రమంగా ఆ పేపరు రంగంతా మార్చేస్తుంటా. నాకెంతో ఇష్టమైన కవి రాల్ఫ్‌ వాల్డో ఎమర్సన్‌ రాసిన కవితలు చదువుకుంటా. అవెప్పుడూ నా కళ్లముందే ఉండాలని ఆఫీసులో నా గది గోడలకీ, వంటింట్లో ఫ్రిజ్‌కీ అంటించేశా. ఎందుకో తెలియదుగానీ ఆ కవితలు చదువుకున్నప్పుడు ఏదో తెలియని శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. అలానే ఇంట్లో ఉన్నప్పుడు ఒత్తిడిగా అనిపిస్తే సింకులో గిన్నెలు తోమేస్తుంటా. లేదంటే పిల్లలకు ఇష్టమైన బ్లూబెర్రీ విత్‌ చాక్లెట్‌ పాన్‌కేక్‌ తయారీ, ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు వంటివి చేస్తుంటా. 


చావు అంచులకు వెళ్లొచ్చా...

ఓసారి మా బ్లూ ఆరిజిన్‌ రాకెట్ల ప్రయోగానికి టెక్సాస్‌లో తగిన ప్రదేశం కోసం వెతుకుతుండగా నేను ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ క్రాష్‌ అయి కుప్పకూలింది. ఆ సమయంలో చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడ్డాగానీ చావు అంచుల వరకూ వెళ్లి వచ్చినట్టు అనిపించింది. అప్పట్నుంచీ హెలికాప్టర్‌ ఫోబియా పట్టుకుంది. ఇప్పటికీ దాన్ని చూస్తే భయమేస్తుంది.


ఆఫ్రికా నుంచి అమెరికా దాకా.... ఓ పాదయాత్ర

ఇంటి నుంచి ఒకట్రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా బండి తాళాల కోసం వెతుకుతాం మనం! అలాంటిది ఆఫ్రికా నుంచి దక్షిణ అమెరికా దాకా-సుమారు 31 వేల కిలోమీటర్ల దూరాన్ని నడిచే వెళతానంటున్నాడు పాల్‌ సలోపెక్‌. ఆ యాత్రలో భాగంగా ఈ మధ్యే మనదేశం మీదుగా బర్మాకు కాలినడకన వెళ్లాడు. పాల్‌ ప్రముఖ జర్నలిస్టు... తలచుకుంటే ఒక్కరోజులో ప్రపంచాన్ని చుట్టిరాగలడు. అయినాసరే... పదిహేనేళ్లపాటు సాగే ఈ పాదయాత్రని ఎందుకు చేపట్టాడో తెలుసుకుందామా!
ముప్పై అయిదేళ్లకిందటి మాట... పాల్‌ అప్పట్లో జాలరి పనిచేసేవాడు. ఓసారి అమెరికాలోని న్యూ మెక్సికో నగరానికి స్కూటర్‌లో వెళ్లి వస్తుంటే మార్గమధ్యంలో అది రిపేరైంది. పాల్‌ దగ్గర రిపేరు చేయించేంత డబ్బులేదు. ఏం చేయాలో తోచలేదు. అక్కడే ఉన్న పోలీసుకి విషయం చెబితే ఆయన ‘మా కోసం ఓ గంటపాటు విలేకరిలాగా పక్కనున్న గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడి స్మగ్లర్ల ఆచూకీ తెలుసుకునిరా!’ అన్నాడట. పాల్‌ ఆ పనిచేసిపెడితే వాళ్లు డబ్బులివ్వడమే కాదు అతని ధైర్యం, రాసే తీరుని చూసి విలేకరిగా నియమించుకున్నారట. పాల్‌ పాత్రికేయుడు కావడం అంత నాటకీయంగా జరిగింది! ఆ తర్వాత అమెరికాలోని షికాగో ట్రిబ్యూన్‌, అట్లాంటిక్‌, నేషనల్‌ జియోగ్రఫిక్‌ వంటి పత్రికల కోసం ఆఫ్రికాలో పనిచేశాడు. ముఖ్యంగా కాంగో, సుడాన్‌ దేశాల్లోని అంతర్గత యుద్ధాలూ ప్రజల అవస్థల గురించి రాశాడు. అతని రాతలు అక్కడి ప్రభుత్వాలకి కోపం తెప్పించడంతో కొన్నినెలలపాటు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. అయినా పాల్‌ వెనుకంజ వేయలేదు. ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయ వృత్తిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్‌ అవార్డుని రెండుసార్లు అందుకున్నాడు! అంత ప్రసిద్ధ పాత్రికేయుడు తన జీవితంలో పదిహేనేళ్ల కాలాన్ని ఈ యాత్ర కోసం కేటాయిస్తున్నాడు!

లక్షల ఏళ్లకిందట...
మానవ పరిణామక్రమం ఆఫ్రికాలోనే జరిగిందని మనం చదువుకుని ఉంటాం! ‘హోమో సెపియన్స్‌’ అన్న మన పూర్వీకులు అక్కడి నుంచే ప్రపంచ మొత్తం విస్తరించారని సైన్స్‌ చెబుతోంది. ఆ ఆదిమ యాత్ర ఆఫ్రికాలోని ఇథియోపియా నుంచి ఆసియా మీదుగా అలాస్కా చేరి దక్షిణ అమెరికా దాకా సాగిందన్నది ఓ నమ్మకం. ఆఫ్రికా నుంచి బయల్దేరిన కొన్నివేల మందితో మొదలైన ఈ ఆదిమజాతి ప్రయాణాన్ని తర్వాతి తరాలవాళ్లూ అందిపుచ్చుకుంటూ సుమారు యాభైవేల ఏళ్లపాటు కొనసాగించారని శాస్త్రవేత్తల విశ్వాసం. మనమంతా ఆ తరాలకి వారసులమే! మన పూర్వీకుల ఆ తొట్టతొలి యాత్ర మార్గాన్నే తానూ ఎంచుకున్నానని చెబుతాడు పాల్‌. అందుకే తన యాత్రకి ‘అవుటాఫ్‌ ఈడెన్‌ వాక్‌’ అని పేరుపెట్టాడు (బైబిల్‌లో చెప్పిన ఈడెన్‌... ఇథియోపియానే అన్నది ఓ నమ్మకం!). ‘ఇంతకీ ఎందుకీ యాత్ర?’ అని అడిగితే ‘విలేకరిగా నడుస్తున్న చరిత్రలోని ప్రముఖుల గురించి రాశానేకానీ దాని వెనకున్న సామాన్య ప్రజల గురించి పెద్దగా రాయలేదు. అది రాయాలంటే హడావుడిగా ఏదో రాశాం ప్రచురించాం అని కాకుండా కొంతకాలమన్నా వాళ్లతో జీవించాలి. అప్పుడే మన రాజకీయాలూ, అభివృద్ధీ, టెక్నాలజీ ఇవన్నీ వాళ్ల జీవితాల్లో తెచ్చిన మార్పుల్ని అర్థం చేసుకోగలం. అలా అర్థం చేసుకున్నవాటిని తర్వాతి తరాల కోసం నిజాయతీగా నమోదుచేయాలన్నదే నా లక్ష్యం. మన పూర్వీకులూ నడిచే ఈ మార్గాన వచ్చారు కాబట్టి నేనూ అదే చేస్తున్నాను!’ అంటాడు పాల్‌. 2013లో ఇథియోపియా ఎడారిలోని ‘హెర్తో బోరీ’లో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడే ఉన్నాడతను. తన యాత్రకి 98 శాతం ఏ వాహనాన్నీ వాడటం లేదు. నదులూ, సముద్రాల్నీ దాటడానికి మాత్రం చిన్నపాటి పడవల్ని ఎంచుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు, గిరిజనులు, పశువుల కాపర్లతో మాట్లాడుతూ ఒకట్రెండు రోజులు వాళ్ల ఇంట్లోనే ఉంటూ వారి జీవనవిధానాన్ని అక్షరబద్ధం చేస్తున్న పాల్‌ ఇదే అసలైన చరిత్ర అంటున్నాడు. ప్రతి వందకిలోమీటర్లకి ఓసారి ఆగి ఆ చరిత్రని రాస్తున్నాడు. దాన్ని నేషనల్‌ జియోగ్రఫిక్‌ ప్రచురిస్తోంది!
ప్రమాదాల అంచున...
ఆఫ్రికాలోని 50 డిగ్రీల వేడీ, టర్కీ అంచుల్లోని మైనస్‌ 30 డిగ్రీల చలీ, పాలస్తీనా-ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో అతి ప్రమాదకరమైన నిఘా కళ్లూ... వీటన్నింటినీ దాటుకుంటూనే యాత్ర చేస్తున్నాడు పాల్‌. కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యానికి గురై వారాల తరబడి ఒకేచోట ఉండిపోతున్నాడు. వీసాల కోసం నెలలపాటు కాచుక్కూర్చుంటున్నాడు. దాంతో ఏడేళ్లు అనుకున్న యాత్ర కాలపరిమితిని పదిహేనేళ్లకి పెంచుకున్నాడు! గత ఆగస్టులో పాకిస్థాన్‌ నుంచి వాఘా బోర్డు ద్వారా భారత్‌లోకి ప్రవేశించాడు. గంగానది ఒడ్డున వెళుతూ వివిధ రాష్ట్రాలకి చెందిన పల్లెల్లో గడిపాడు. బిహార్‌లోని ఓ కుగ్రామంలో పిల్లలకి కంప్యూటర్‌ పాఠాలు చెప్పి... అక్కడి నుంచి మియన్మార్‌కు వెళ్లిపోయాడు!


కారం పనీర్‌... వచ్చేసింది!

పనీర్‌... పిల్లల నుంచి పెద్దల దాకా ఇష్టపడే పదార్థాల్లో ఇది కూడా ఒకటి. దీన్ని దోరగా కాల్చుకుని తినడమే కాదు... రకరకాల వంటకాలూ చేయడం తెలిసిందే. అయితే.. ఆ పనీరే ఇప్పుడు ఇంకాస్త కొత్తగా మారిపోయి... ‘ఫ్లేవర్డ్‌ పనీర్‌’ రూపంలో వస్తూ నోరూరిస్తోంది.

మల్లెపువ్వులా తెల్లగా ముట్టుకుంటే మెత్తగా ఉండే పనీర్‌లో మాంసకృత్తులూ, మంచి కొవ్వులూ, ఫొలేట్‌... వంటి పోషకాలు ఎన్నో. అందుకే శాకాహారులు దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఎంచుకుని రకరకాల వంటకాల తయారీలో వాడుతుంటారు. ఎలా వండుకున్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుందే తప్ప అస్సలు బోర్‌ కొట్టని పనీర్‌కి ఇప్పుడు గృహిణులూ, తయారీదారులూ కొత్త రుచులే కాదు రంగులూ అద్దుతున్నారు. అలా వస్తున్నదే ఈ ‘ఫ్లేవర్డ్‌ పనీర్‌’. అంటే... ఫ్లేవర్డ్‌ మిల్క్‌ తరహాలో దీని తయారీలోనూ నచ్చిన పదార్థాలూ, మసాలాలూ కలిపేస్తూ పనీర్‌ని చప్పగానే కాదు...  రకరకాల రుచుల్లో చేసుకోవచ్చని చెబుతున్నారు. అలా నచ్చిన రుచిలో వచ్చేందుకు వెల్లుల్లి, ఎండుమిర్చి గింజలు, మెంతికూర, పాలకూర, గరంమసాలా, మిరియాలు, అల్లం... తదితర పదార్థాలను పనీర్‌ తయారీలో వాడుతున్నారు. దాంతో చప్పగా ఉండే పనీర్‌ కాస్తా చవులూరిస్తూ స్పైసీగా మారిపోతోంది.

ఎలా తయారుచేస్తారు...
సాధారణంగా పనీర్‌ తయారుచేయాలంటే పాలను మరిగించి, నిమ్మరసం లేదా వెనిగర్‌ వేస్తాం కదా... వాటికన్నా ముందు మనం కావాలనుకున్న రుచికి సంబంధించిన పదార్థాలు వేసి ఓసారి కలపాలి. ఆ తరువాత పాలను విరగ్గొట్టుకుని పనీర్‌లా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే పాల విరుగుడును ఓ గిన్నెలో వేసి కావాలనుకున్న పదార్థాలను కలిపి... ముద్దలా చేసుకుని దీనిపైన ఏదయినా బరువును ఉంచితే పనీర్‌ తయారై పోతుంది. ఉదాహరణకు... పనీర్‌ కాస్త కారంగా కావాలనుకుంటే ఎండుమిర్చి గింజలు, ఉప్పు, కొద్దిగా పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీరను వేయొచ్చు. అదేవిధంగా పసుపు, మిరియాలపొడి, అల్లంరసం లాంటివీ వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇలా కావాలనుకున్న పదార్థాలను వేసుకోవడం వల్ల పనీర్‌ రుచితోపాటు రంగు కూడా పూర్తిగా మారిపోతుంది. ఒకవేళ ఇంకా ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటే తందూరీ మసాలా, పాలకూర ముద్ద, పాలక్‌పనీర్‌ మసాలా వంటివీ వేయొచ్చు. ఇవేవీ కాకుండా... పిల్లలకు నచ్చేలా తియ్యగా చేసుకోవాలనుకుంటే తేనె, దాల్చినచెక్కపొడి వాడితే చాలు. ఇలా చేసుకునే పనీర్‌ ముక్కల్ని దోరగా వేయించుకుని లేదా కాల్చుకుని తినేయడమే కాదు... చపాతీలు, బ్రెడ్‌స్లైసుల మధ్యా తురిమి పెట్టుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫ్లేవర్డ్‌ పనీర్‌ వంటకాలకు కొత్త రుచి తెస్తుందనేది నిజం. ప్రయత్నించండి మరి.


విదేశాలలో గణపతి!

ఓచోట కరెన్సీ మీద వినాయకుడు... స్టాంప్‌ల పైనా గణేశుడే. ఇంకోచోట... ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. మరోచోట... గణపతికి ప్రత్యేకంగా పార్కునూ నిర్మించారు. ఇదంతా మనదేశంలో అనుకుంటే పొరబడినట్లే. మరెక్కడో చూద్దామా..?
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా హిందువులున్న దేశం భారత్‌. అత్యధికంగా ముస్లింలు ఉన్న దేశం ఇండోనేషియా. కానీ చాలామందికి తెలియందీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే... ఇండోనేషియా కరెన్సీ మీద గణేశుడి బొమ్మ ఉంటుంది. ఆ దేశ 20వేల రూపాయల నోటు మీద ఎడమచేతి పక్కన గణేశుడూ, మధ్యలో స్థానిక స్వాతంత్య్ర సమరయోధుడు ‘కి హజర్‌ దేవాంతర’ చిత్రాలుంటాయి. వినాయకుడిని ఇండోనేషియాలోనూ జ్ఞాన ప్రదాతగానూ విద్యాధిపతిగానూ కొలుస్తారు. ఇండోనేషియా మొత్తం జనాభాలో 87శాతానికి పైగా ముస్లింలు ఉంటే హిందువులు కేవలం 1.7 శాతం మాత్రమే. అయితే భారతదేశానికి ఆనుకుని ఉండడం వల్ల హిందూ మత ప్రభావం ఆ దేశంలో మొదటి శతాబ్దం నుంచే ఉంది. ఇండోనేషియా ప్రభుత్వం 1994లో గణపతి బొమ్మతో స్టాంప్‌ని కూడా విడుదల చేసింది. దీనిమీద కూడా పైన విఘ్నేశ్వరుడూ కింద చదువుకుంటున్న పిల్లలూ కనిపిస్తారు.
థాయ్‌లాండ్‌ కూడా కొన్నేళ్ల కిందట 10 బట్‌(ఆ దేశ కరెన్సీ) నాణెం మీద నాలుగు చేతుల్లో ఆయుధాలు ధరించి ఉన్న వినాయకుడి బొమ్మను ముద్రించింది. దీన్ని స్థానిక స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేశారు. ఆ స్కూల్‌ లోగోలో కూడా గణేశుడి రూపం ఉంటుంది. ఇక, విఘ్నేశ్వరుడి బొమ్మతో స్టాంపులు తీసుకొచ్చిన దేశాల్లో థాయ్‌లాండ్‌, నేపాల్‌, లావోస్‌, శ్రీలంక, చెక్‌ రిపబ్లిక్‌ కూడా ఉన్నాయి.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.