close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెట్టుకి పూయని పువ్వులివి!

రేక రేకనూ ఏరి కోరి గుదిగుచ్చినట్లూ... ప్రకృతిలోని సౌందర్యమంతా పోగు పడి వికసించినట్లూ... ఇంత అందం, ఇంత సౌకుమార్యం మరెక్కడా లేనట్లూ... కనువిందు చేస్తున్న ఈ పువ్వులు ఎప్పటికీ వాడిపోవు. కానీ చెయ్యి జారాయంటే పగిలిపోతాయి... ఎందుకంటే ఇవి పింగాణీ పువ్వులు.

గులాబీలను చూస్తే చటుక్కున తీసుకుని తల్లో తురుముకోవాలనిపిస్తుంది. ముట్టుకుంటే నలిగిపోతాయేమో అనిపించినా ఆ లిల్లీలూ రంగు రంగుల చామంతుల్నీ పట్టుకుని ముద్దాడాలనిపిస్తుంది. అలా అని చేతిలోకి తీసుకున్నామా... షాకవ్వాల్సిందే. ఇవి రాయిలా గట్టిగా ఉంటాయి మరి. పువ్వులెక్కడైనా రాళ్లలా ఉంటాయా... అనొచ్చుగాక. కానీ సుతిమెత్తగా ఉండడానికి ఇవి చెట్టుకు పూసిన పువ్వులు కాదు. ఉక్రెయిన్‌కి చెందిన ‘ఒలెస్యా గలుషెంకొ’ అనే కళాకారిణి ‘కోల్డ్‌ పోర్సిలిన్‌’తో వీటిని తయారు చేసింది. ఆన్‌లైన్‌లో పాలిమర్‌ క్లే ఆర్ట్‌ గురించి శిక్షణ పొందిన ఒలెస్యాకు ఆ క్లేతో చేసిన పువ్వులు సహజంగా అనిపించలేదట. దాంతో ఎన్నో ప్రయోగాలు చేసి కోల్డ్‌ పోర్సిలిన్‌ పిండితో పూల బొకేలు చెయ్యడం మొదలుపెట్టింది. ఈ తరహా పోర్సిలిన్‌తో చేసిన పువ్వులు నిజమైన వాటిలానే మృదువుగా కనిపిస్తాయి. పైగా పూరేకలూ వాటి మధ్య ఉండే కేశాలను కూడా విరిగిపోకుండా ఎంతో సన్నగా చేసే వీలుంటుంది. ఆరిన తర్వాత ఇవి మామూలు పింగాణీలానే గట్టిగా మారిపోతాయి. కానీ వీటిని చెయ్యడం చాలా కష్టం. ఒక్క లిల్లీ తయారీకి ఒలెస్యాకు అయిదారు గంటలు పట్టేస్తుందట. కానీ ఆ కష్టం ఊరికే పోదు. ఆమె తయారు చేసిన పువ్వులు నిజమైనవి కాదని చెప్పినా పట్టుకుని చూసేవరకూ ఎవరూ నమ్మలేరు.

ఎప్పుడూ తాజాగానే...
అందంగా వికసించిన పూలను ఫ్లవర్‌ వేజ్‌లో పెట్టి హాల్లో పెడితే... చూసిన ప్రతిసారీ మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. అయితే, ఆ పువ్వులు ఒకటీ రెండు రోజులకే వాడిపోతాయి. పెరట్లో మొక్కలుంటే రోజూ కొన్ని పూలను తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ ఫ్లవర్‌ వేజ్‌లో పూలను అందంగా అలంకరించడం కూడా కాస్త సమయం పట్టే పనే. అందరికీ అంత ఖాళీ దొరక్కపోవచ్చు. కొందరికి అసలు మొక్కలు పెంచుకునేంత చోటే ఉండదు. ఇక పువ్వులెక్కణ్నుంచి వస్తాయి..? రోజూ పువ్వుల్ని కొని ఫ్లవర్‌ వేజ్‌లో పెట్టాలన్నా కష్టమే. అదే... ఇలా ఎంతో సహజంగా కనిపించే పోర్సిలిన్‌ పువ్వుల్ని ఫ్లవర్‌ వేజ్‌లో పెట్టామంటే నిజమైన పువ్వులకు పోటీనిచ్చే అంత అందంతో కనువిందు చేస్తాయి. రోజూ పువ్వులు మార్చే పనీ ఉండదు. అందుకే, ఆన్‌లైన్‌లో ఒలెస్యా పువ్వుల్ని కొనేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారట.


రంగుల గుడ్డు అదిరింది!

క్యారెట్‌ నారింజ రంగులో ఉంటుంది. గుడ్డు తెల్లగా ఉంటుంది. రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. రోజూ తినాల్సినవే. ఒకసారి కాకపోతే ఒకసారయినా  క్యారెట్టు తినడానికి ఇష్టపడతారు, కానీ గుడ్డును చూడగానే పిల్లలు ఆముదం తాగిన ముఖమే పెడతారు. రుచి సంగతెలా ఉన్నా తెలుపురంగు అంతగా ఆకర్షించదు మరి. అందుకే ఆహారపదార్థాలన్నింటినీ ఎడిబుల్‌ కలర్స్‌తో ఆకట్టుకునేలా చేయడం ట్రెండ్‌గా మారింది. గుడ్లూ అలానే రంగులద్దుకుంటున్నాయి.

కోడి గుడ్డు, కౌజు పిట్ట గుడ్డు... ఏదయినాగానీ పెంకు రంగు ఎలాగున్నా లోపల తెల్లగానే ఉండటంతో చూడగానే అందరికీ తినాలనిపించదు. ఉడికించిన రూపంలో తినడంకూడా చాలామందికి ఇష్టం ఉండదు. కానీ అందులో శక్తిమంతమైన ప్రొటీనూ, రిబోఫ్లేవినూ, ఎ, డి, ఇ, కె విటమిన్లూ; ఖనిజాలూ, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలూ, కెరోటినాయిడ్లూ... ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. కోలీన్‌ మెదడు పనితీరుకి తోడ్పడితే, ల్యూటెన్‌, జియాజాంథిన్‌ వంటివి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ క్యాటరాక్ట్‌ రాకుండా చూడటంతోబాటు కంటి ఆరోగ్యానికి దోహదపడతాయి. అందుకే ఆరోగ్యాన్ని పెంపొందించే గుడ్డుని బాయిల్డ్‌ ఎగ్‌ రూపంలోనే ఇష్టంగా తినాలంటే సహజ రంగులద్దాల్సిందే అంటున్నారు ఈతరం షెఫ్‌లు. పైగా ఈ రంగులన్నీ కూరగాయలూ ఆకుకూరల నుంచి వచ్చినవే కాబట్టి డబుల్‌ ధమాకాలా ఒక్క గుడ్డుతో లాభాలనేకం.

ఎలా అద్దుతారు?
ఐరోపా, అమెరికా దేశాల్లో ఈస్టర్‌ పండగ సమయంలో సంతాన సాఫల్యత, పుట్టుకకి సంకేతమైన గుడ్డును రంగులతో అలంకరించి కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఇప్పుడు పండగతో సంబంధం లేకుండా రోజూ తినేందుకూ గుడ్డుకి రంగులద్దుతున్నారు. అదీ ఈస్టర్‌ గుడ్లలోలా కేవలం పైభాగానికి కాకుండా గుడ్డు తెల్లసొనకే నేరుగా ఇంకేలా చేస్తున్నారు.

రంగులకోసం పసుపు, బీట్‌రూట్‌, క్యారెట్‌, ఎరుపు, వంకాయ రంగు క్యాబేజీ, పాలకూర, బెర్రీలూ, నల్లద్రాక్ష, ఉల్లిపొట్టు... వంటి వాటిని వాడతారు. ముందుగా నీళ్లలో ఒకటీరెండు టీస్పూన్ల వైట్‌ వినెగర్‌ వేసి మరిగించి ఆపై కోరిన రంగు కూరగాయల ముక్కలు వేసి సుమారు పదీ పదిహేను నిమిషాలు ఉడికించి చల్లార్చాలి. ఆపై అందులో ఉడికించి పెంకు తీసిన గుడ్లు వేసి కోరిన రంగు వచ్చేవరకూ ఉంచాలి. ఉదాహరణకు గులాబీరంగు గుడ్డుకోసం బీట్‌రూట్‌ ముక్కల్ని తీసుకుని మరిగించిన నీళ్లలో వేసి పది నిమిషాలు ఉడికించి, చల్లారిన నీటిలో గుడ్లు వేయాలి. చిక్కని బీట్‌రూట్‌ రసంలోనే ఎక్కువసేపు నానబెడితే ఎరుపు రంగువి వస్తాయి. వంకాయ రంగు క్యాబేజీ తురుము వేసి ఉడికించిన నీటిలో కాస్త బేకింగ్‌ సోడా వేస్తే లేత ఊదారంగు గుడ్లు వస్తాయి.ముదురు వంకాయ వర్ణం కావాలంటే రెండు టీస్పూన్లు బేకింగ్‌సోడా వేయాలి. నీలం రంగుకోసం మరికాస్త వేయాల్సి ఉంటుంది. పసుపు రంగు గుడ్ల కోసం పసుపు వేసి రెండుమూడు నిమిషాలు మరిగించి గుడ్లు వేస్తే సరి. ఇలాగే నచ్చిన రంగులకోసం ఆయా రంగు కూరగాయలూ లేదా ఆకుకూరల్ని తగినంత వేసి ఉడికించాక గుడ్లు వేయాలి. అవి ఆ మిశ్రమంలో నానే సమయం, కూరగాయల రంగుల్ని బట్టి గుడ్డు రంగు ఉంటుంది. బీట్‌రూట్‌ రంగు గుడ్లకు త్వరగానే పడుతుంది. కానీ నీలం, వంకాయ వర్ణాలు త్వరగా ఇంకవు కాబట్టి ఎక్కువ సమయం ఉంచాలి. ఈ గుడ్లు నిల్వ ఉండాలంటే ఒక వంతు నీళ్లకి ఒక వంతు వినెగర్‌, కాస్త పంచదార, ఉప్పు కూడా వేసి మరిగించాక కూరగాయ ముక్కలు వేసి ఉడికించాలి. తరవాత ఆ నీళ్లలో గుడ్లను వేసి కోరిన రంగు వచ్చేవరకూ ఫ్రిజ్‌లో పెడితే ఊరగాయల్లా రెండుమూడు నెలలవరకూ నిల్వ ఉంటాయట. సో... నచ్చిన పద్ధతుల్లో రంగుల గుడ్లను ఉడికించి, అందంగా అలంకరించి పిల్లలతోపాటు అతిథుల్నీ అలరించండి!


టీపాయ్‌ వర్క్‌ టేబుల్‌ కూడా!

ర్క్‌ఫ్రమ్‌ హోమ్‌... అన్నది ఈమధ్య సర్వసాధారణంగా మారిపోయింది. అంతా ఆన్‌లైన్‌ అయిపోయింది కాబట్టి రోజువారీ పనులు కూడా ల్యాప్‌టాప్‌లో చెయ్యాల్సినవి బోలెడు ఉంటున్నాయి. అలా అని అందరి ఇళ్లలోనూ వర్క్‌ టేబుల్‌ ఉండదు. కొని పెట్టుకుందామన్నా చోటు ఉండకపోవచ్చు. ఇక, ల్యాప్‌టాప్‌ ఐప్యాడ్‌లను ఒళ్లో పెట్టుకుని వాడితే మెడనొప్పి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే ఈ ‘యాహీటెక్‌ లిఫ్ట్‌ టాప్‌ కాఫీ టేబుల్‌’. కావల్సినపుడు ఈ టీపాయ్‌ పై భాగాన్ని పైకి లాగి ల్యాప్‌టాప్‌ పెట్టుకునేందుకు వీలుగా టేబుల్‌లా మార్చుకోవచ్చు. దీనిలోపల స్టోరేజీకి చోటు కూడా ఉంటుంది కాబట్టి పనైపోయాక ల్యాప్‌టాప్‌నీ ఇతర వస్తువుల్నీ దుమ్ము పడకుండా అందులోనే పెట్టేసి పైకి లాగిన చెక్కను మూసేస్తే మళ్లీ టీపాయ్‌లా మారిపోతుంది.


పాకెట్‌లో ఫొటో ప్రింటర్‌..!

ఫోన్లో ఎన్ని ఫొటోలు తీసుకుంటామో... ఎన్నెన్ని జ్ఞాపకాలని దాచుకుంటామో... వాటిలో మనకు బాగా నచ్చిన కొన్నిటినైనా ఎప్పటికపుడు ప్రింట్‌ తీయించుకుని మన గదిలో పెట్టుకుంటే రోజంతా కళ్లెదురుగా ఉండి మనసుకి హాయిగా అనిపిస్తుంది కదా... అందుకోసం వచ్చిందే ఈ ‘ప్రింట్‌ పాకెట్‌’ ఐఫోన్‌ ఇన్‌స్టంట్‌ ఫొటో ప్రింటర్‌. దీన్ని ఫోనుకి అమర్చి ఫోను గ్యాలరీలోని ఫొటోలని చిటికెలో ప్రింట్లు తీసేయొచ్చు. గోడకు అంటించే ప్రింట్లు కావాలంటే ప్రింటర్‌లో పెట్టేందుకు ఆ రకం పేపర్లు కూడా ప్రింట్‌ పాకెట్‌ వెబ్‌సైట్‌లో దొరుకుతాయి. రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసే ఇది జేబులో పట్టేసే అంత చిన్నగా ఉంటుంది. కాబట్టి, స్నేహితులతో టూర్లకు వెళ్లినపుడు వెంట తీసుకెళ్తే అక్కడి జ్ఞాపకాలను వెంటనే ప్రింట్‌ తీసి వారికీ గుర్తుగా ఇవ్వొచ్చు.


ఈ టేపు ఉంటే మేకులక్కర్లేదు!

వంటగదిలో గరిటెలూ చిన్న చిన్న సామగ్రీ గట్టుమీద అడ్డంగా ఉన్నాయా... చిటికెలో వాటిని గోడకు అంటించేయొచ్చు. బాత్‌రూమ్‌లో ఉన్న చిన్న అరలో షాంపూ బాటిళ్లు పట్టట్లేదా... పర్లేదు ఎంచక్కా వాటినీ గోడకు అతికించేయొచ్చు. ఫోనునీ చేత్తో పట్టుకునే పనిలేకుండా గోడకు అంటించి నచ్చిన ప్రోగ్రామ్‌ చూసేయొచ్చు. ఈ ‘డబుల్‌ సైడెడ్‌ సూపర్‌స్ట్రాంగ్‌ నానో అడ్‌హెసివ్‌ టేప్‌’ ఉంటే ఇలా దేన్నైనా టైల్సు, లోహం, గాజు, చెక్కల మీద అతికించేసుకోవచ్చు, మళ్లీ తీసేయొచ్చు. తీసినపుడు మామూలు టేపుల్లా వస్తువులకేమీ జిగురు అంటుకోదు. నానో టెక్నాలజీతో రూపొందిన ఈ యాక్రిలిక్‌ టేపుని కత్తిరించి ఎక్కడైనా అంటిస్తే మనం తీసే వరకూ ఊడకుండా గట్టిగా అంటిపెట్టుకుని ఉంటుందట. అంతేకాదు, కిలో వరకూ బరువున్న ఏ వస్తువుల్నైనా ఇది పడకుండా పట్టి ఉంచుతుందట. అయితే, దుమ్ము పట్టేయడం వల్ల ఎప్పుడైనా సరిగా అంటుకోవడం లేదనిపిస్తే శుభ్రంగా కడిగి ఆరబెడితే మళ్లీ కొత్తదానిలా పనిచేయడం ఈ టేపుకున్న మరో ప్రత్యేకత. ఇంత ఉపయోగకరంగా ఉంటే కొనకుండా ఆగలేం అంటారా... అయితే, ఇంకెందుకాలస్యం..?


సోఫా మీద ఒలికినా పర్లేదు!

తెల్లారిలేస్తే ఎక్కువగా హాల్లోనే ఉంటాం. కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా, టీవీ చూడాలన్నా సోఫాలోనే కూర్చుంటాం. చాలామందికి కాఫీలూ టిఫిన్లు కూడా అక్కడే అయిపోతాయి. పిల్లల సంగతైతే చెప్పనక్కర్లేదు. దాంతో ఒక్కోసారి తినే పదార్థాలు సోఫో మీద ఒలికిపోతుంటాయి. కానీ సోఫాని ఉతకలేం. పైగా బోలెడంత ధర పెట్టి కొన్నవి కొద్దిరోజులకే పాడైపోతాయి. ఈ ఇబ్బంది లేకుండానే ఇపుడు మార్కెట్లోకి ‘సోఫా స్పాంక్స్‌’ వస్తున్నాయి. పాలిస్టర్‌, స్పాండెక్స్‌ జాక్వర్డ్‌ బట్టతో తయారయ్యే ఈ సోఫా కవర్లు నీటినీ నూనెల్నీ పీల్చవు. కాబట్టి, వీటిమీద ఏది పడినా తుడిచేయొచ్చు. సాగే గుణం ఉన్న ఈ కవర్లను ఫొటోల్లో చూపినట్లూ సోఫాల మీద అతికినట్లు అమరేలా వేసి, అటూ ఇటూ జరగకుండా వెనకవైపు ఉన్న తాళ్లతో గట్టిగా లాగి కట్టేయొచ్చు. రకరకాల రంగులూ ప్రింట్లతో వచ్చే వీటిని వేస్తే సోఫాకి కొత్త లుక్‌ కూడా వస్తుంది. ఏమంటారు..?


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.