close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్కో ఉద్యోగికీ.. రూ.34 కోట్లు ఇచ్చాడు!

ఉద్యోగుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటేనే ఉన్నతి అని నమ్మాడు ట్రావెర్‌ మిల్టన్‌. అందుకే ఉద్యోగంలో చేర్చుకునే రోజే సంస్థ వృద్ధిలో పాలుపంచుకుంటే తన షేర్లలో భాగమిస్తానని వారికి మాటిచ్చాడు. అలా ఆరేళ్ల క్రితం మిల్టన్‌ ఇచ్చిన మాటని అందరూ మర్చిపోయినా అతను మాత్రం మనసులోనే పెట్టుకున్నాడు. అందుకే వ్యాపారంలో జీరోగా ప్రయాణం మొదలుపెట్టి ఫార్చ్యూన్‌ యువ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోవడంతోపాటు తొలినాళ్ల నుంచీ తన సంస్థలో పనిచేస్తున్న 50 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.34కోట్ల చొప్పున చెల్లించి మాట నిలబెట్టుకున్నాడు. ఈ దానకర్ణుడి గురించి మరిన్ని విశేషాలు...

నికోలా కార్పొరేషన్‌... అమెరికాలో హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులూ, కార్లూ, స్పోర్ట్స్‌ వాహనాలూ, ఇంజిన్లనూ తయారు చేసే సంస్థ. 2014లో ట్రావెర్‌ మిల్టన్‌ ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు అతనికి అప్పులూ... పైకి ఎదగాలనే తపన తప్ప ఆస్తులు గానీ... బ్యాంకు బ్యాలెన్సులుగానీ ఏమీ లేవు. పైగా తన వాళ్ల దగ్గర ఓ ఫెయిల్యూర్‌గా ముద్ర వేయించుకున్నాడు. ఎందుకంటే చిన్న వయసులోనే పలు స్టార్టప్‌లు పెట్టి ప్రారంభించినంత వేగంగా మూసేశాడు. నికోలా మోటార్స్‌ సంస్థను ప్రారంభించే సమయంలో కూడా ‘నువ్వు మళ్లీ ఫెయిల్‌ అవుతావ్‌ చూడు’ అన్న మాటలే అతనికి వినిపించేవి. ఎలాగైనా కొత్త వ్యాపారంలో విజయం సాధించి తీరాలనే సంకల్పమేమో బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో తననీ, తన కష్టాన్నే నమ్ముకున్నాడు మిల్టన్‌. ఆరేళ్లు తిరిగేసరికి అపర కుబేరుడై... ఉద్యోగుల పాలిట దానకర్ణుడయ్యాడు.

కలియుగ కర్ణుడు
మిల్టన్‌ తండ్రి రైల్వేలో ఉద్యోగి. అతనికి ఓ అన్నయ్యా ముగ్గురు అక్కలూ. తన ఆరో ఏటనే తల్లి క్యాన్సర్‌ బారిన పడటంతో ఆమెకి దాదాపు నాలుగైదేళ్లు ఖరీదైన వైద్యం చేయించారు. అంత కష్టపడ్డా ఆమె ప్రాణం దక్కకపోగా మిల్టన్‌ కుటుంబం అప్పులపాలైంది. దాంతో ఉథా స్టేట్‌లోని సొంత ఇంటిని అమ్ముకుని మిల్టన్‌ కుటుంబం లాస్‌వెగాస్‌ వెళ్లి స్థిరపడింది. అతని తండ్రి మరో సంస్థలో ఉద్యోగం చేస్తూ పిల్లలందర్నీ పోషించేవాడు. అయినా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడంతో మిల్టన్‌ చదువుకోలేకపోయాడు. పైగా అతని తండ్రి ‘నువ్వు పది మందికీ ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప... ఎవరి ముందూ ఉద్యోగం కోసం చేయి చాచొద్దు’ అని పదే పదే చెబుతుండేవాడు. దాంతో ఎదగాలనే కసి చిన్నతనంలోనే మిల్టన్‌ మనసులో పడిపోయింది. క్రిస్టియన్‌ మిషనరీ సాయంతో బ్రెజిల్‌లో హైస్కూల్‌ విద్యను అభ్యసించాడు. అక్కడే పోర్చుగీస్‌, స్పానిష్‌ భాషల్ని సైతం నేర్చుకున్నాడు. కాలేజీలో చేరినా ఆ చదువును మధ్యలోనే వదిలేసి 2003లో అంటే- 18 ఏళ్ల వయసులో స్వస్థలమైన ఉథాకి తిరిగొచ్చి సీసీ కెమెరాల తయారీకి సంబంధించి ఓ స్టార్టప్‌ పెట్టాడు. అది విఫలం కావడంతో ఆ తరవాత ఆన్‌లైన్‌ రిటైల్‌ వ్యాపారం ప్రారంభించాడు. కొన్నిరోజులకే అదీ బెడిసి కొట్టడంతో మరో వ్యాపారం... అలా పదేళ్లలో ఐదు స్టార్టప్‌లు పెట్టి ఎందులోనూ నిలదొక్కుకోలేక అప్పులపాలయ్యాడు. దాంతో బంధువులూ, స్నేహితుల దృష్టిలో మిల్టన్‌ ఏమీ సాధించలేనివాడిగా మిగిలిపోయాడు.

అయితే ఎవరెంత విమర్శించినా పట్టించుకోకుండా 29ఏళ్ల వయసులో ఆరో స్టార్టప్‌ నికోలా మోటార్స్‌ను ప్రారంభించి హైడ్రోజన్‌తో నడిచే ఇంజిన్లను తయారు చేయడం మొదలు పెట్టాడు. అందుకోసం అందినకాడికి అప్పులు చేసీ బ్యాంకుల్లో రుణాలు తీసుకునీ సంస్థలో పెట్టుబడి పెట్టాడు. అలానే అత్యుత్తమ ఉద్యోగుల్ని ఎంచుకుని... సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకున్నవారికి తన షేర్లలో కొంత భాగమిస్తానని మాటిచ్చాడు. అలా తను నియమించుకున్న ఉద్యోగులు కూడా మిల్టన్‌ కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నడిచే ఇంజిన్లను డిజైన్‌ చేయడం, వాటిని మార్కెటింగ్‌ చేయడం, సంస్థ ఎదుగుదల వంటివాటిల్లో ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరించారు. దాదాపు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు ఉద్యోగులు కూడా తమ సమయానికి మించి అదనపు గంటలు పనిచేసేవారు. ఈ క్రమంలో వారితో మిల్టన్‌కి మంచి అనుబంధం ఏర్పడింది. తానూ ఉద్యోగులతో కలిసి భోజనం చేయడం, ఆఫీసులోనే పడుకోవడం అతని దినచర్యలో భాగమయ్యాయి. అలా కష్టపడిన మిల్టన్‌ వేల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాడు. మోటార్స్‌ రంగంలో టాప్‌ సంస్థల సరసన నికోలానూ నిలబెట్టాడు. ఆరేళ్లు తిరిగేసరికి 33వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచిన మిల్టన్‌ తన ఉద్యోగుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. అందుకే మాటిచ్చినట్టే... తొలి యాభై మంది ఉద్యోగులు ఒక్కొక్కరికీ తన షేర్లలోంచి రూ.34కోట్లు చెల్లించి మరోసారి హీరో అనిపించుకున్నాడు.గూడ్స్‌ బండీ... కొత్తగా మారెనండీ!

మనకెప్పుడూ గూడ్సు రైలంటే చిన్నచూపే! కానీ కరోనా వేళ ఆ గూడ్సు రైలే దేశవ్యాప్తంగా ఆహారం కొరత రాకుండా చూసుకుంది. ఇందుకోసం తన రూపాన్నీ మార్చుకుని, వేగాన్నీ పెంచుకుంది. ఫలితంగా కరోనా వేళ దేశంలో మరే సరకు రవాణా సంస్థా అందుకోనన్ని లాభాల్ని సొంతం చేసుకుంది. దీని వెనక ఆయా రైల్వే డివిజన్‌లు చేపట్టిన వినూత్న ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఆసక్తికరమైన ఆ విశేషాలేమిటో చూద్దామా...


రోరో... రైలెక్కిన లారీ!

గూడ్సు రైళ్లలో ఒకటోరెండో లారీలు వెళుతుండటం అడపాదడపా చూసే ఉంటాం! కానీ-కేవలం లారీల కోసమే గూడ్సు రైళ్లని నడపడానికి తాజాగా శ్రీకారం చుట్టింది నైరుతి(సౌత్‌ వెస్టర్న్‌) రైల్వే జోన్‌. బెంగళూరు శివారులోని నీలమంగళ నుంచి మహారాష్ట్ర షోలాపూర్‌దాకా మొత్తం 682 కిలోమీటర్లు ఇది నడుస్తుంది. రోల్‌-ఆన్‌ రోల్‌-ఆఫ్‌ అనే ఈ రైళ్లలో మొత్తం 42 లారీలు వెళ్లొచ్చు. వాటితోపాటూ డ్రైవరూ, టికెట్‌ క్లీనరూ ప్రయాణించవచ్చు(వాళ్లు సెకెండ్‌ క్లాసు టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది!). రైల్లో వెళ్లడానికి బదులు లారీలు రోడ్డుమార్గంలోనే వెళ్లొచ్చు కదా అనుకుంటున్నారా! సాధారణంగా బెంగళూరు-షోలాపూర్‌ మార్గంలో ఓ సరకు రవాణా లారీ వెళ్లాలంటే దాదాపు 38 గంటలు పడుతుంది. అదే రైలు అయితే 17 గంటలు చాలు. మనదేశంలో 1999 నుంచే కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ తన పరిధిలో ఈ తరహా సేవల్ని అందిస్తున్నా... భారత రైల్వేకి చెందిన ఓ ప్రధాన జోన్‌ దీన్ని ప్రారంభించడం ఇదే మొదలు!


రైతన్నలకి ‘జై’!

మస్యని సమస్యలా కాకుండా అవకాశంగా చూడాలంటుంది నేటి కార్పొరేట్‌ సంస్కృతి. ప్రభుత్వ సంస్థ అయినా కూడా ఆ మాటల్ని అక్షరాలా నిరూపించింది దక్షిణ మధ్య రైల్వే! దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మొదలై రోడ్డు రవాణా స్తంభించడంతో... రాష్ట్రాల మధ్య ఆహారధాన్యాలు, ఇతర అత్యవసర వస్తువుల రవాణా నిలిచిపోయింది. ఆ కొరతని తీర్చడానికి ‘జై కిసాన్‌’ గూడ్సు రైలుని ప్రవేశపెట్టింది దక్షిణ మధ్య రైల్వే. రెండు గూడ్సు రైళ్లని కలిపితే ఏర్పడ్డ రైలు ఇది. ఒకే రాష్ట్రంలో... దగ్గరదగ్గరగా ఉండే రెండు ప్రాంతాలకి రెండు గూడ్సు రైళ్లు వెళ్లాలనుకోండీ. ఆ రెండింటినీ ఒకే రైలుగా చేసి రెండు ప్రాంతాలకీ మధ్యలో ఉన్న రైల్వే జంక్షన్‌కి వీటిని పంపిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ పె..ద్ద రైలు ద్వారా ఒకేసారి 5,200 టన్నుల ఆహార ధాన్యాన్ని సరఫరా చేయగలుగుతున్నారు. దీని ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రైతులు ఉత్పత్తి చేసిన ఆహారధాన్యానికి నష్టం రాకుండా చూడగలుగుతున్నారు. అందుకే దీనికి ‘జై కిసాన్‌’ అనీ పేరుపెట్టారు. సాధారణంగా గూడ్సు రైళ్లకి ఓ సమయమంటూ ఉండదు.  అలాకాకుండా- వాటికి కచ్చితమైన టైంటేబుల్‌ని పెట్టి ‘కార్గో ఎక్స్‌ప్రెస్‌’ అనే మరో కొత్త తరహా రైళ్లని తెచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి దిల్లీ దాకా నడుస్తున్నాయి. మామూలు సరకు రైళ్ళు గంటకు ఇరవైమూడు కిలోమీటర్లు నడిస్తే ఇవి 46 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు-తెలుగు రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్‌కి నడుపుతున్న ‘పంట రైళ్లు’ ఇంకో ఎత్తు! ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి మిరప, నిజామాబాద్‌ నుంచి పసుపు పంటల ఎగుమతి కోసం వీటిని కొత్తగా మొదలుపెట్టారు. రోడ్డుమార్గంలో వీటి రవాణాకి ప్రతి టన్నుకీ ఏడువేల రూపాయలు ఖర్చయ్యేవట. లాక్‌డౌన్‌తో ఇరుదేశాల మధ్య రవాణా ఆగిపోవడంతో 4,200 రూపాయలకే తాము ఎగుమతి చేస్తామని ముందుకొచ్చింది రైల్వే. అన్నట్టు... ఓ పొరుగుదేశానికి గూడ్సు రైలు నడపడం కూడా ఇదే తొలిసారి!


మనం ఆవిష్కరించాం!

వసరం ఆవిష్కరణలకి అమ్మలాంటిదని అంటారు కదా! విజయవాడ రైల్వే డివిజన్‌ విషయంలో అదే నిజమైంది. లాక్‌డౌన్‌ కారణంగా, స్పెషల్‌ రైళ్లు తప్ప ప్రయాణికుల రైళ్లేవీ నడవడం లేదు. దాంతో ప్యాసింజర్‌ రైళ్లకి ఉపయోగించే ఇంజిన్‌లన్నీ షెడ్డుల్లోనే నిద్రపోతున్నాయి. మరోవైపు-గూడ్సు రైళ్ల అవసరమేమో పెరుగుతోంది. వాటికి కావాల్సిన ఇంజిన్‌లు మనదగ్గర తక్కువగా ఉంటున్నాయి. ఖాళీగా ఉన్న ప్యాసింజర్‌ రైళ్ల ఇంజిన్‌ల సామర్థ్యం గూడ్సు రైళ్లని లాగడానికి సరిపోదు. ఈ సమస్యను నివారించడానికి కొత్త పద్ధతిని కనిపెట్టారు విజయవాడ డివిజన్‌కి చెందిన రైల్వే నిపుణులు. రెండు ప్రయాణికుల ఇంజిన్‌లని(డబ్ల్యూపీ4) కలపడం ద్వారా పార్సిల్‌ రైళ్లకి అనువుగా వాటిని మార్చగలిగారు! ఇందుకోసం 25 రోజులపాటు శ్రమించారు విజయవాడ రైల్వే డివిజన్‌ సిబ్బంది. సాధారణంగా ఓ ప్యాసింజర్‌ రైలు ఇంజిన్‌ ఖాళీగా ఉండటం ద్వారా గంటకి 5.4 లక్షల రూపాయల నష్టం వస్తుందట! అదే ఇప్పుడు వీటిని గూడ్సు రైళ్లకి వాడటం ద్వారా 4.2 లక్షల రూపాయల లాభం సాధించారు. అందుకే వీరి విజయాన్ని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా అభినందించారు!చిన్న పండు... లాభం మెండు!

ప్రపంచాన్ని కరోనా చాలానే మార్చేసింది. ఆహారపుటలవాట్ల మీదా ఆ ప్రభావం బాగానే పడింది. రోగనిరోధకశక్తిని పెంచే తాజా పండ్లూకూరగాయలతోపాటు ఎండుపండ్ల వాడకం కూడా బాగా పెరిగింది. అందులోనూ సి-విటమిన్‌ ఎక్కువగా ఉండే పండు ఏదైనా ఎక్కడిదైనా తినేస్తున్నారు. గోజి పండూ అలా తెరమీదికొచ్చిందే..!

చిట్టి మిర్చిలానో బుల్లి టొమాటోల్లానో ఉన్న ఈ పండ్లు మనకు కొత్తేగానీ ఉత్తర భారతీయులకి సుపరిచితమే. హిమాలయ సానువుల్లో పెరిగే ఈ పండ్లని వోల్ఫ్‌బెర్రీ అనీ పిలుస్తారు. దీన్ని దేవతలు తినే పండు అనీ చెబుతారు. అయితే కొంచెం తీపీ కొంచెం పులుపుతో ఉండే ఈ గోజి బెర్రీల ఆరోగ్య రహస్యాలు చైనావాళ్లకి బాగా తెలుసు. అందుకే అక్కడ ప్రాచీన కాలం నుంచీ వీటిని ప్రత్యేకంగా సాగుచేస్తూ ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. తాజాపండ్లు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి ఎండుపండ్ల రూపంలోనే వీటి వాడకం ఎక్కువ. ఆగ్నేయాసియా దేశాలతోపాటు ఐరోపా దేశాల్లోనూ ఇతరత్రా అనేకచోట్లా ఇవి పండుతున్నాయి. బి, సి విటమిన్లతోబాటు ఖనిజాలూ పీచూ యాంటీఆక్సిడెంట్లూ కీలకమైన అమైనో ఆమ్లాలూ ప్రొటీన్లూ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధకశక్తిని పెంచడంతోబాటు ఫ్లూ వైరస్‌ల్ని తట్టుకునే శక్తిని ఇస్తాయి. వీటిని సప్లిమెంట్ల రూపంలో నెలరోజులపాటు తీసుకున్నవాళ్ల ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, తెల్లరక్తకణాల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. రోగనిరోధకశక్తిని పెంచడం ద్వారా ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధులకీ మందులా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు.

ఎలా పనిచేస్తుంది?
చిన్నగా ఉండే ఈ పండు గొప్ప శక్తిని ఇవ్వడంతోబాటు అధిక పీచుని కలిగి ఉంటుంది. దాంతో బరువు తగ్గడానికి తోడ్పడటం ద్వారా ఊబకాయ బాధితులకి గొప్ప ఊరటనిస్తుంది. ఇంకా ఇందులో అధికంగా ఉండే జియాజాంథిన్లు కళ్లూ చర్మ ఆరోగ్యానికి సాయం చేస్తాయి. వయసుతోబాటు వచ్చే కంటివ్యాధుల్నీ తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. 90 రోజులపాటు ఈ పండ్ల రసాన్ని తాగిన వృద్ధుల్లో యాంటీ ఆక్సిడెంట్ల శాతం బాగా పెరిగినట్లు గుర్తించారు. మరో పరిశోధనలో గ్లకోమా రాకుండా రెటీనాను కాపాడుతున్నట్లూ తేలింది. ఇన్సులిన్‌ను నియంత్రించడం ద్వారా చక్కెరవ్యాధిగ్రస్తులకీ ఎంతో మేలు చేస్తుందట. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా హృద్రోగాలు రాకుండానూ నియంత్రిస్తుంది. విటమిన్‌ -సి సమృద్ధిగా ఉండటం వల్ల ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, అన్నవాహిక, పొట్ట క్యాన్సర్లు రాకుండా రక్షిస్తుందనీ, ముఖ్యంగా ఇందులోని ఫైసాలిన్‌ క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడానికి తోడ్పడుతుందనీ కొన్ని పరిశీలనలు తెలియజేస్తున్నాయి. ఇంకా, ఇందులోని సి-విటమిన్‌ పుండుని త్వరగా తగ్గించే కొల్లాజెన్‌ పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుందట.

చైనా సంప్రదాయ వైద్యంలో డిప్రెషన్‌, ఆందోళన... వంటి మానసిక సమస్యల నివారణకి ఈ పండ్లను మందుగా ఇస్తారట. గోజి బెర్రీలు కాలేయం, కిడ్నీల్లోని టాక్సిన్లూ రాళ్లూ పోయేలా కూడా చేస్తాయట. మగవాళ్లలో టెస్టోస్టెరాన్‌ శాతాన్ని పెంచడం ద్వారా సంతానోత్పత్తికి దోహదపడతాయనీ, వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బీపీ,ˆ కీళ్లనొప్పులు తగ్గుతాయనీ, ఆయుఃప్రమాణం పెరుగుతుందనీ కూడా చెబుతారు. అన్ని రకాల పోషకాలూ పుష్కలంగా ఉండే ఈ పండు చర్మకాంతికీ శిరోజాల పెరుగుదలకీ కూడా సాయపడుతుంది. అందుకే దీన్ని సూపర్‌ఫుడ్స్‌ జాబితాలోకి చేర్చారు పోషక నిపుణులు. వీటిని కిస్‌మిస్‌ల మాదిరిగానే నేరుగా తినొచ్చు. లేదా కాసిని వేడినీళ్లలో రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే ఆ నీళ్లను చల్లగా లేదా వేడిచేసుకుని తాగి ఆ పండ్లను తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. లేదంటే సలాడ్స్‌, పెరుగులో కూడా వేసుకోవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.