close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బెలూన్లతో గాల్లో ఎగిరాడు

పారాచూట్‌తో పక్షిలా పైకి ఎగరడం మనకు తెలిసిందే. అయితే అమెరికాకు చెందిన ఓ ఇంద్రజాలికుడు అందుకు భిన్నంగా ఓ సాహసకృత్యం చేశాడు. అదేంటంటే... హీలియం బెలూన్లను నడుముకు కట్టుకుని గాల్లోకి ఎగిరాడు. అదీ ఏ పదో పదిహేనో అడుగుల ఎత్తుకాదు, ఏకంగా 24వేల అడుగులపైకి వెళ్లాడు. దాదాపు ఎవరెస్ట్‌(29వేల అడుగులు) అంత ఎత్తు వరకూ వెళ్లి గాల్లో పల్టీలు కొట్టాడు. ఇప్పటికే రకరకాల ట్రిక్కులతో ఆకట్టుకున్న డెవిడ్‌ బ్లయినే బెలూన్ల సాహసంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇందుకోసం 50హీలియం బెలూన్లను ఉపయోగించాడు. ఈ సాహసాన్ని నిపుణుల సమక్షంలో... అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుని చేసి అందరి చేతా ఔరా అనిపించుకున్నాడు.


అతిపెద్ద శాకాహార విందు

కేరళలోని పేరున్న ఆలయాల్లో అరున్మల పార్థసారథి దేవాలయం ఒకటి. ఇక్కడ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుపుతారు. దీన్ని అరున్మల సద్య పేరుతో నిర్వహిస్తారు. సద్య అంటే భోజనం. ముఖ్యంగా కృష్ణాష్టమి, ఇతర ప్రత్యేక దినాల్లో దాదాపు 64 పదార్థాలను సద్యలో వడ్డిస్తారు. మిగతా రోజుల్లో 15 నుంచి 25 రకాల పదార్థాలను పెడతారు. ఇది ఏటా జులై నెలాఖరున ప్రారంభమై సెప్టెంబరు చివరికి ముగుస్తుంది. అరున్మల సద్య మనదేశంలోనే అతి పెద్ద శాకాహార విందుగా పేరుగాంచింది. ఇందులో ఆవకాయ, పప్పు, సాంబారు, పెరుగుపచ్చడి, అప్పడాలు, అరటి చిప్స్‌, పాయసం, ఐదారు రకాల కూరలు, స్వీట్లు, అరటిపండుతో సహా 64 రకాలు వడ్డిస్తారు. వీటితోపాటు పలు ఆయుర్వేద మూలికలతో తయారుచేసిన నీళ్లు (వెల్లం) ఇస్తారు. ఇలా ఆలయ ప్రాంగణంలో అరటిఆకుల్లో వడ్డించే ఈ అరున్మల సద్య గురించి పురాణాల్లో పలు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.


ప్రపంచంలోనే ఖరీదైన గొర్రె

గొర్రె ధర ఎంతుంటుంది... మహా అయితే వేలల్లో ఉంటుంది. అదే మేలుజాతికి చెందినదైతే లక్షల్లో ఉండొచ్చు. అయితే ఈ మధ్య స్కాట్‌లాండ్‌లో జరిగిన ఓ వేలంలో డబుల్‌ డైమండ్‌ అనే గొర్రె ఏకంగా 3.57కోట్లకు అమ్ముడుపోయి ప్రపంచంలోనే ఖరీదైన గొర్రెగా నిలిచింది. నెదర్లాండ్స్‌లోని టెక్సెల్‌ ప్రాంతం మేలు జాతి గొర్రెలకు పెట్టింది పేరు. అక్కడ ఆరునెలల క్రితం ఈ డబుల్‌ డైమండ్‌ గొర్రెను కృత్రిమ పద్ధతుల్లో సృష్టించారు. నెలల వయసులోనే అధిక బరువును సొంతం చేసుకున్న ఈ గొర్రె ఊలు-బంగారు వర్ణంలో ఉండి చూడ్డానికి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. అందుకే ఈ మేలు జాతి గొర్రెను దక్కించుకోవడానికి వేలంలో వందల మంది పాడి రైతులు పోటీపడ్డారు. చివరికి ముగ్గురు రైతులు కలిసి దీన్ని 3.57కోట్లకు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వీరంతా డబుల్‌ డైమండ్‌ వీర్యం సేకరించి కృత్రిమ పద్ధతుల్లో ఈ జాతి గొర్రెలను సృష్టించే పనిలో పడ్డారు.


తమ్ముడంటే ఎంత ప్రేమో

మెరికాకు చెందిన పదిహేడేళ్ల నోహ్‌కు తనకంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడైన తమ్ముడు మ్యాక్స్‌ అంటే ప్రాణం. ఇంట్లో ఉన్నంత సేపూ తమ్ముడితోనే ఉంటాడు. అమ్మలా అపురూపంగా చూసుకుంటాడు. అయితే నోహ్‌ హైస్కూల్‌ విద్యను పూర్తి చేసుకుని త్వరలో కాలేజీకి వెళ్లబోతున్నాడు. ఇంటికీ తమ్ముడికీ దూరంగా మరోచోట హాస్టల్‌లో ఉండాలి. దాంతో తమ్ముడితో గడిపే కొన్నిరోజులైనా ఓ మంచి జ్ఞాపకంగా ఉండాలని ఓ ఆలోచన చేశాడు. రోజూ గంట ముందే ఇంటికొచ్చి... ఓ కొత్తరకం కాస్ట్యూమ్‌ ధరించి తమ్ముడు స్కూల్‌ బస్సు దిగేచోట ఎదురు చూస్తున్నాడు. బస్సు దిగి వచ్చే తమ్ముణ్ని రకరకాల వేషధారణలతో స్వాగతం పలికి సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. అందుకే మ్యాక్స్‌ స్నేహితులు నోహ్‌ని ‘బస్‌ బ్రదర్‌’ అని ముద్దుగా పిలుస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.