close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆట మారింది బాసూ..!

క్రికెట్‌ అంటే... బ్యాట్లూ షాట్లూ
క్రికెట్‌ అంటే... పరుగులూ వికెట్లూ
క్రికెట్‌ అంటే... అభిమానులూ ఆదరణా
క్రికెట్‌ అంటే... రికార్డులూ రివార్డులూ
అంతేనా... క్రికెట్‌ అంటే కొత్తదనం కూడా!
దీంట్లో వచ్చినన్ని మార్పులు ప్రపంచంలో ఏ ఆటలోనూ రాలేదు మరి! ఎప్పటికప్పుడు అవసరాలకూ అభిమానులకూ తగినట్లుగా మారుతూ వచ్చిన ఆట క్రికెట్‌!
ట అదే... అవే వికెట్లూ అవే పరుగులూ. కానీ తీరుతెన్నులే మారిపోయాయి.
ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టి నాలుగున్నర శతాబ్దాలయిందంటారు. అయితే, రోజుల తరబడి ఆడే టెస్టు మ్యాచ్‌ నుంచి ఒక్క రోజుకీ, ఒక్క రోజు నుంచీ ఒక్క పూటకీ మారినా- రోజులో ఆడే సుదీర్ఘమైన ఆట ఇంకా క్రికెట్టే.
హాకీ స్టిక్‌ లాంటి బ్యాటుతో రెండు స్టంపులతో ఆడిన నాటి నుంచి నేటి వరకూ క్రికెట్‌ సుదీర్ఘ ప్రయాణమే చేసింది. ప్రత్యేకించి గత పుష్కర కాలంలో ఐపీఎల్‌ ద్వారా ఆటలో ఒక విప్లవాన్నే తీసుకొచ్చింది.
వినోదాన్నీ వ్యాపారాన్నీ సమపాళ్లుగా చేసుకుని తనని తాను మార్చుకుంటూ అభిమానులను మురిపిస్తూ సాగిన ఆ ప్రయాణంలోని కొన్ని ముఖ్యమైన మార్పులేమిటో చూద్దామా..!

టెస్టూ మారింది
క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఒకప్పుడు రోజుల తరబడి సాగేది. 1939లో ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాల మధ్య పది రోజులపాటు సాగి డ్రాగా ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌ ఆ తరహాలో చివరిది. ఆ తర్వాత క్రమంగా నాలుగు ఇన్నింగ్స్‌ల ఐదురోజుల మ్యాచ్‌గా స్థిరపడిన టెస్ట్‌ క్రికెట్‌.. డెబ్బయ్యవ దశకం వరకూ అలాగే కొనసాగింది. క్రీడాకారుడి మానసిక, శారీరక సామర్థ్యాలకు పరీక్ష పెడుతుందని- వ్యవధిలోనూ, ప్రమాణాల విషయంలోనూ కూడా ఇప్పటికీ దీనికే విలువిస్తారు. అయితే తర్వాత వచ్చిన ఫార్మాట్‌లన్నీ దీని నుంచే పుట్టినా- ఇప్పుడు వాటిలో వచ్చిన మార్పుల్ని టెస్ట్‌ క్రికెట్‌ అందిపుచ్చుకోవాల్సి వస్తోంది. టీ20ల జోరులో ఆదరణ కోల్పోతున్న టెస్ట్‌ మ్యాచులకు అభిమానుల్ని నిలబెట్టుకోవడం కోసం వన్డేలూ, టీ20 ఫార్మాట్‌లలో వాడుతున్న కొన్ని టెక్నిక్‌లను టెస్టుల్లోనూ ఉపయోగిస్తున్నారు. ప్రేక్షకుల్ని మైదానానికి రప్పించడానికి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లను ప్రవేశపెట్టారు. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో గులాబీ బంతి మెరుపుల్ని చూడడానికి అభిమానులు ఆసక్తి ప్రదర్శించడంతో డే అండ్‌ నైట్‌ టెస్టులూ హిట్టయ్యాయి. ఆటగాళ్ల జెర్సీల మీద నంబర్‌ ముద్రించడాన్ని టెస్టుల్లోనూ గత ఏడాదే మొదలెట్టారు.

అనుకోకుండా ఆ ఫార్మాట్‌
1971... మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. వర్షం కారణంగా మొదటి మూడురోజులూ ఆట సాగకపోవటంతో అధికారులు ఒక్క రోజుతో ముగించాలనుకున్నారు.
8 బంతుల ఓవర్లు 40 చొప్పున ఆడించగా ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా గెలిచింది. అలా అనుకోకుండా శ్రీకారం చుట్టుకున్న వన్డే ఫార్మాట్‌ బాగానే ఉందనిపించి అప్పుడప్పుడు పోటీలు పెట్టేవారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొట్టమొదటి ఫార్మాట్‌ ఇది. ఈ ఫార్మాట్‌లో 1975లో ప్రపంచకప్‌ కూడా నిర్వహించారు. ఆస్ట్రేలియాకి చెందిన వ్యాపారవేత్త కెర్రీ ప్యాకర్‌కి ఈ ఫార్మాట్‌ నచ్చింది. తన టెలివిజన్‌ నెట్‌వర్క్‌ కోసం వరల్డ్‌ సిరీస్‌ క్రికెట్‌ పేరుతో వన్డే పోటీలు నిర్వహించాడు. అతని ప్రయత్నం క్రికెట్‌ భవిష్యత్తునే ఊహించని మలుపు తిప్పేసింది. ఎన్నెన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆటగాళ్లకు తెల్లని దుస్తుల స్థానంలో రంగుదుస్తులూ ఎర్రని బంతి స్థానంలో తెల్లబంతీ వచ్చాయి. ఆటను చిత్రీకరించడానికి ఎక్కువ సంఖ్యలో కెమెరాలు వాడడం, ఆన్‌ స్క్రీన్‌ టీవీ గ్రాఫిక్స్‌... లాంటివన్నీ ప్యాకర్‌ పుణ్యమే. డే అండ్‌ నైట్‌ పద్ధతిలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో క్రికెట్‌ ఆడించిందీ అప్పుడే. టీవీ కవరేజీతో ఆటకు ఒక ఊపు వచ్చిందీ అప్పుడే. టీవీ ఛానళ్లకు ప్రసార హక్కులు ఇవ్వడమూ, ఆటగాళ్లకు జీతం ఇచ్చే విధానమూ అప్పుడే మొదలయ్యాయి. ఆదాయం పెరగడంతో ఆటగాళ్లు పూర్తి స్థాయి ప్రొఫెషనల్స్‌గా మారారు. ఈ మార్పులన్నిటినీ అతి తక్కువ సమయంలోనే ప్రపంచదేశాలన్నీ అందిపుచ్చుకున్నాయి. థర్డ్‌ అంపైర్లూ, ఫీల్డింగ్‌ నిబంధనలూ పవర్‌ప్లేలూ వన్డేల్లో వచ్చిన మార్పులే. 1983 వరకూ వన్డే మ్యాచ్‌లో 60 ఓవర్లు ఆడేవారు. ఆ తర్వాత యాభైకి కుదించారు.

ఉత్కంఠను పెంచిన టీ20
టెస్ట్‌ క్రికెట్‌, వన్డే ఇంటర్నేషనల్‌... రెండు ఫార్మాట్‌లలోనూ అన్ని దేశాలూ దూసుకుపోతుంటే క్రికెట్‌ సొంతదారులైన ఇంగ్లాండ్‌లో మాత్రం ఆట భవిష్యత్తు కష్టాల్లో పడింది. విజయాలూ ప్రేక్షకులూ కూడా దూరం కావడంతో ప్రత్యామ్నాయం కోసం ఆలోచించింది ఇంగ్లాండ్‌ క్రికెట్‌ సంఘం. క్రికెట్‌లో వేగం పెంచితే ప్రేక్షకుల్ని రప్పించవచ్చని భావించి ఓవర్లను కుదించి కౌంటీ పోటీలు పెట్టింది. వారి అంచనా నిజమైంది. 2003లో మొదలుపెట్టిన ఇరవై ఓవర్ల పొట్టి క్రికెట్‌ సూపర్‌ హిట్టయింది. ప్రపంచ దేశాలన్నిటికీ పాకిపోయింది. బౌండరీలూ సిక్సర్ల కోసం వేచిచూసే
పనిలేదిక్కడ. బంతి బంతికీ ఉత్కంఠే. క్రికెట్‌ ఒక్కసారిగా చురుగ్గా, చలాకీగా మారిపోయింది. టెక్నిక్‌కన్నా దూకుడుకి ప్రాధాన్యం పెరిగింది. ఐదు రోజుల పోటీలను దాటుకుని, వన్డేలను పక్కకు నెట్టి, మూడున్నర గంటల్లో ముగిసిపోయే ముచ్చటైన పోటీగా రూపుదిద్దుకుని అభిమానుల హృదయాలను గెలుచుకుంది టీ20.
సాధారణ ఆటగాళ్లని సైతం సూపర్‌ స్టార్లని చేసింది. అంతేకాదు, క్రికెట్‌ బోర్డులపై కనకవర్షం కురిపిస్తోంది ఈ పొట్టి క్రికెట్‌.

షాట్లూ హిట్లూ...
టీ20 ఫార్మాట్‌తో క్రికెట్‌ ఆటతీరే మారిపోయింది. ఫ్రీ హిట్‌, సూపర్‌ ఓవర్‌ లాంటి కొత్త నిబంధనలు వచ్చాయి. ఈ ఫార్మాట్‌లో రాణించడానికి- ఎక్కువ బలం, ఎక్కువ వేగం, ఎక్కువ ఫిట్‌నెస్‌, వేగంగా ప్రతిస్పందన... అర్హతలు. దీంతో క్రీడాకారుల సామర్థ్యం మరో స్థాయి పైకి వెళ్లింది. డిఫెన్స్‌ సామర్థ్యం కాస్తా పవర్‌ఫుల్‌ హిట్స్‌కి మళ్లింది. దిల్‌స్కూప్స్‌, హెలికాప్టర్‌ షాట్‌, అప్పర్‌ కట్‌, రివర్స్‌ స్వీప్‌, స్విచ్‌ హిట్‌, ప్యాడిల్‌ స్వీప్‌, ర్యాంప్‌, స్లాగ్‌ షాట్‌ లాంటి కొత్త రకం షాట్లు ఎన్నో పుట్టుకొచ్చాయి. డెత్‌ బౌలింగ్‌ నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరిగింది. వికెట్‌ను రక్షించుకుంటూ ఆడే తరం నుంచి ఫలితం గురించి ఆలోచించకుండా నిర్భయంగా పెద్ద షాట్లు కొట్టడాన్ని ఈతరం అలవాటు చేసుకుంది. మైదానంలో చీర్‌లీడర్స్‌ సందడి మొదలైంది కూడా దీనితోనే. ఒకప్పటి క్రికెట్‌లో బౌలర్ల ఆధిపత్యం ఉండేది. కానీ ఇప్పుడంతా బ్యాట్స్‌మెన్‌దే రాజ్యం అన్నట్లయింది.

ఐపీఎల్‌ మెరుపులు
టీ20 ఫార్మాట్‌తో క్రికెట్‌లో వచ్చిన మరో పెద్ద మార్పు ఐపీఎల్‌. పన్నెండేళ్ల క్రితం వరకూ జాతీయ స్థాయిలో క్రికెట్‌ అంటే వన్డే జట్టు, టెస్టు జట్టు మాత్రమే. అలాంటిది 2008లో ఐపీఎల్‌ ప్రారంభమయ్యాక ఎందరో మెరికల్లాంటి యువ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. ఎనిమిది జట్లు... వందల్లో ఆటగాళ్లు. అప్పటివరకూ ఎవరికీ తెలియని, సాధారణ నేపథ్యం ఉన్న ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌ వేలంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆర్‌.అశ్విన్‌, రవీంద్ర జడేజా, యూసుఫ్‌ పఠాన్‌, హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా, యజువేంద్ర చాహల్‌ లాంటివాళ్లు ఐపీఎల్‌లో ప్రతిభ చూపడం ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడి జాతీయ జట్టులో స్థానం పొందగలిగారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. క్రమం తప్పకుండా ఏటా టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల క్రీడాకారులకు ఆర్థిక భద్రత వచ్చింది. రిటైరైన క్రీడాకారులకూ కోచ్‌లుగా, కామెంటేటర్లుగా అవకాశాలు రావడంతో మరికొంత కాలం కెరీర్‌ కొన సాగించగలుగుతున్నారు. మన దేశంలోనే కాదు, క్రికెట్‌ ఆడే అన్నిదేశాల్లోనూ టీ20 లీగ్‌లు మంచి ఆదాయవనరుగా మారాయి. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరయ్యే టోర్నమెంట్‌గానూ, యూట్యూబ్‌లో లైవ్‌ బ్రాడ్‌కాస్ట్‌ (2010) చేసిన తొలి టోర్నమెంట్‌గానూ కూడా ఐపీఎల్‌ రికార్డు సృష్టించింది.

స్కోరు... వరదే!
ఒకప్పుడు క్రికెట్‌లో పరుగులు ఒకట్లూ రెండ్లూ... మధ్యలో ఎప్పుడో ఓసారి బౌండరీ. అరుదుగా సిక్సర్‌. ఇప్పుడేమో ఫోర్లూ సిక్సర్ల మధ్య అప్పుడప్పుడూ సరదాగా ఒకటీ రెండు పరుగులు తీస్తున్నారు. టీ20తో వచ్చిన జోరిది. స్ట్రైక్‌ రేటూ దాంతో పాటే స్కోరూ పెరుగుతూ వచ్చాయి. 1999లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 జట్ల సగటు స్ట్రైక్‌ రేట్‌ 77.52 అయితే 2018 నాటికి అది 97.38. టాప్‌లో ఉండే గేల్‌, బట్లర్‌ లాంటి వాళ్లే కాదు.. సగటు వన్డే బ్యాట్స్‌మన్‌ స్ట్రైక్‌ రేట్‌ కూడా అలాగే పెరిగి 73.47 నుంచి 92.18కు చేరింది. అదే రీతిలో జట్ల సగటు స్కోరు కూడా పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు 250 పరుగుల లక్ష్యాన్ని సవాలుగా భావించేవారు. 1999 ప్రపంచకప్‌లో మూడుసార్లు మాత్రమే స్కోరు 300 దాటింది. ఇప్పుడది మామూలు విషయం. ఎందుకంటే వన్డేల్లో టాప్‌-10 స్కోర్లలో 481 పరుగులతో ఇంగ్లాండ్‌ (2018) మొదటి స్థానంలో ఉంటే.. 418 పరుగులతో భారత్‌ (2011) తొమ్మిదో స్థానంలో ఉంది. గతేడాది టీ20ల్లోనే వేర్వేరు మ్యాచుల్లో అఫ్గానిస్థాన్‌, చెక్‌ రిపబ్లిక్‌లు ఏకంగా 278 పరుగులు చేశాయి. 264 పరుగులతో వన్డేల్లో రోహిత్‌ శర్మ, 175 పరుగులతో టీ20ల్లో క్రిస్‌ గేల్‌ (2013 ఐపీఎల్‌లో) వ్యక్తిగత రికార్డులను తమ పేర లిఖించుకున్నారు.

సాంకేతికత సాయం
భారత్‌ తొలిసారి ప్రపంచ కప్‌ గెలిచినప్పుడు ఆటని నాలుగైదు కెమెరాలతో మాత్రమే చిత్రీకరించారు. దాంతో టీవీలో చూసినవారికి ఒకవైపు నుంచీ మాత్రమే ఆట కనిపించింది. గత ఏడాది ప్రపంచకప్‌ ఫైనల్‌ని 36 కెమెరాలతో చిత్రీకరించారు. అవే కాదు, అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఎన్నో పరికరాలు క్రికెట్‌ మైదానంలోకి వచ్చాయి. గతంలో టీవీలో క్రికెట్‌ చూసేవారికి ఆట కన్పించేది. కామెంటేటర్‌ చెప్పే మాటలు విన్పించేవి. ఇప్పుడు బంతి దూసుకువెళ్లి బ్యాట్‌కి తగిలిన చప్పుడు కూడా విన్పిస్తూ ఇంట్లో కూర్చున్నా స్టేడియంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయి అక్కడి ఏర్పాట్లు. స్టేడియం పైకప్పుకీ స్తంభాలకీ వేలాడదీసిన స్పైడర్‌క్యామ్‌లు మైదానం పైన తిరుగుతూ ఆటను త్రీడీలో రికార్డు చేస్తుంటే, మైదానం చుట్టూ అల్ట్రా మోషన్‌ కెమెరాలూ, ఫీల్డర్ల సామర్థ్యాన్ని రికార్డుచేసే ప్లేయర్‌ ట్రాకింగ్‌ కెమెరాలూ డ్రోన్‌ కెమెరాలూ కలిసి బంతి, బ్యాట్ల కదలికల్ని అన్ని కోణాల్లోనూ రికార్డు చేస్తున్నాయి. స్నికోమీటర్‌ లాంటి సున్నితమైన మైక్రోఫోన్‌ బంతి దేనికి తగిలిందో చెప్పేస్తుంది. స్టంప్‌ కెమెరాలూ ఎల్‌ఈడీ బెయిల్స్‌ వల్ల రనౌట్‌, స్టంపింగ్‌ నిర్ణయాలు సులువయ్యాయి. ఒకేసారి ఆరు కెమెరాల నుంచి ఫీడ్‌ తీసుకోగల డిజిటల్‌ రీప్లే మెషీన్లు వచ్చాయి. ఆటని సూపర్‌ స్లోమోషన్‌లో చిత్రీకరించడం, బంతి ఎన్ని చుట్లు తిరిగిందో లెక్కపెట్టడం, బ్యాట్స్‌మెన్‌ సాధన చేయడానికి బౌలర్‌ స్థానంలో బంతులు వేయడం... ఇలాంటి ఎన్నో పనులు మెషీన్లు చేసిపెడుతున్నాయిప్పుడు.

ఒకరి బదులు...
యువతరానికి ఆటలోనే కాదు, అన్ని విషయాల్లోనూ దూకుడెక్కువే. తరచూ తోటి క్రీడాకారులతో వాగ్వాదాలకు దిగడం, పోటీ జట్టు క్రీడాకారుల్ని దుర్భాషలాడడంలాంటి సంఘటనలు క్రికెట్‌లోనూ ఎక్కువయ్యాయి. అంపైర్లూ అధికారుల మీదా కొందరికి గౌరవం ఉండటం లేదు. ‘నువ్వెంత’ అంటే ‘నువ్వెంత’ అన్న ధోరణి పెరగడం చూసిన ఐసీసీ- క్రికెట్‌ని మర్యాదస్తుల ఆటగా నిలబెట్టుకోడానికి కఠినమైన నిబంధనలతో రంగంలోకి దిగింది. మైదానంలో నియమాలను ఉల్లంఘించే ఆటగాళ్లకు డీమెరిట్‌ పాయింట్స్‌ ఇస్తామని ప్రకటించింది. ఏ క్రీడాకారుడికైనా రెండేళ్లలో నాలుగు డీమెరిట్‌ పాయింట్స్‌ వచ్చాయంటే వాళ్లను ఆటనుంచి సస్పెండ్‌ చేస్తారు. అలాగే ఐసీసీ రెడ్‌ కార్డ్స్‌ విధానాన్నీ ప్రవేశపెట్టింది. ఆటగాళ్ల ప్రవర్తన హద్దులు మీరి నట్లనిపిస్తే రెడ్‌ కార్డ్‌ చూపించి అంపైర్‌ వారిని మైదానం నుంచి బయటకు పంపేయవచ్చు. అయితే డీమెరిట్‌ పాయింట్ల విధానం అమల్లో ఉంది కానీ.. రెడ్‌ కార్డ్స్‌ ఇప్పటిదాకా ఎవరి మీదా ప్రయోగించలేదు. ఇక ఆటలో తీవ్రంగా గాయపడిన ఆటగాడి స్థానంలో అదే స్థాయిలో ఆడే మరో క్రీడాకారుడిని తీసుకోవచ్చన్న నియమాన్ని (కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌) తెచ్చింది ఐసీసీ. దాన్ని మొదటిసారి ఉపయోగిస్తూ 2019లో యాషెస్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్‌ స్మిత్‌ బదులుగా మార్నస్‌ లబుషేన్‌ని తీసుకున్నారు.

డబ్బే డబ్బు!
పేదాగొప్పా తేడా లేకుండా అందరినీ అలరించే క్రికెట్‌ రాను రాను బాగా డబ్బు తెచ్చే ఆటగా మారింది. క్రికెట్‌ క్రీడాకారుల జీతాలు కోట్లకు చేరాయి. ప్రకటనలూ స్పాన్సర్‌షిప్‌లూ ప్రసార హక్కులూ అన్నీ వందల, వేల కోట్ల వ్యవహారాలే. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన క్రికెట్‌ బోర్డు మన బీసీసీఐ. గత ఏడాది దాని ఆదాయం రూ.3730కోట్లు. 1983లో ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టు సభ్యులకు రోజువారీ అలవెన్సు రూ.200, మ్యాచ్‌ ఫీజు కింద రూ.1500 ఇచ్చారట. అదే గత ఏడాది వరల్డ్‌ కప్‌ ఆడిన భారత జట్టుకు రూ.62 కోట్లు వచ్చాయి. ఇప్పుడు వన్డే మ్యాచ్‌ ఆడితే ఒక్కో ఆటగాడికీ రూ.6 లక్షలు ఇస్తారు. బీసీసీఐ ఆటగాళ్లతో వార్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. నాలుగు కేటగిరీల్లో- కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రా లాంటి ఏ-ప్లస్‌ ఆటగాళ్లకి రూ.7 కోట్ల చొప్పున.. కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, హనుమ విహారి, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి సీ-గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.కోటి చొప్పున ఇస్తారు. ఇది కాకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లూ, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం అదనం.
నిజానికి వాటి ముందు ఈ కోటి రూపాయల జీతం ఎందుకూ పనికిరాదు. గత ఏడాది రూ.252 కోట్ల ఆదాయంతో కోహ్లీ మొదటి స్థానంలో ఉంటే 135 కోట్లతో ధోనీ రెండోస్థానంలో ఉన్నాడు. సచిన్‌, రోహిత్‌, రిషబ్‌ పంత్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


బాబోయ్‌... ఇదేం బ్యాటు!

మధ్య సౌతాఫ్రికాకి చెందిన ఒకప్పటి ప్రముఖ క్రికెటర్‌ బ్యారీ రిచర్డ్స్‌ రెండు చేతుల్లో రెండు బ్యాట్లు పట్టుకుని ఒకదాన్ని విచిత్రంగా చూస్తున్న ఫొటో నెట్‌లో వైరల్‌ అయింది. అందులో ఒకటి బ్యారీ 1970లో ఒకే రోజు 325 పరుగులు చేసినప్పటి బ్యాట్‌ కాగా రెండోది వార్నర్‌ వాడుతున్న బ్యాట్‌. బ్యాట్‌ సైజు అంతగా మారడం పట్ల అతడు అమితాశ్చర్యం ప్రకటించాడు. అది ఆటపరంగా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ లాంటి అన్ని విభాగాలనీ దెబ్బతీస్తుందన్నాడు. దాని వల్ల గాయాలయ్యే ప్రమాదమూ ఉందన్నాడు. అసలైతే క్రికెట్‌ నియమాల ప్రకారం బ్యాట్‌ వెడల్పు 4.25 అంగుళాలు (10.8సెం.మీ), పొడవు 38 అంగుళాలు (96.5సెం.మీ.) ఉండాలి. అయితే బ్యాట్స్‌మన్‌ సగటు పొడవు ఎక్కువవుతూ రావడంతో బ్యాట్‌ హ్యాండిల్‌ పొడవూ బ్లేడ్‌ మందమూ పెరిగాయి. వందేళ్ల క్రితం బ్యాట్‌ కింది భాగం మందం 80 మి.మీ. ఉంటే 2015 నాటికి అది 215 మి.మీ. అయిందట. దాంతో ఇంపీరియల్‌ కాలేజ్‌ పరిశోధకుల చేత అధ్యయనం చేయించి క్రికెట్‌ నియమాల్ని మార్చారు. ఇప్పుడు బ్యాట్‌ కిందిభాగం 40 మి.మీ., మొత్తం మీద 67 మి.మీ.ల కన్నా ఎక్కువ మందం ఉండకూడదు.


టాప్‌-5 పరుగులూ వికెట్లూ...

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.