close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫ్రిజ్‌... వంటింటి గట్టు కిందనే!

రోజుల్లో ఎవరికి వారివి హడావుడి జీవితాలే. దాంతో కూరగాయలూ పండ్లూ... ఇలా అన్నిటినీ ఒకేసారి ఎక్కువెక్కువ తెచ్చుకుని పెట్టేసుకుంటాం. మామూలుగానూ ఫ్రిజ్‌లో పెట్టే సామగ్రి ఎక్కువగానే ఉంటుంది. అలా అని పెద్ద ఫ్రిజ్‌ని కొంటే కిచెన్‌లో పట్టకపోవచ్చు. దూరంగా పెడితే వంట చేసేటపుడు మాటిమాటికీ అటూ ఇటూ తిరగాలి. అందుకే, మామూలు ఫ్రిజ్‌కి తోడుగా ఇపుడు కిచెన్‌ గట్టు కింద మిగిలిన అరలతో కలిసిపోయేలా చిన్నసైజు ‘అండర్‌ కౌంటర్‌ రిఫ్రిజిరేటర్‌ డ్రాయర్స్‌’ వస్తున్నాయి. 24 అంగుళాలూ అంతకన్నా ఎక్కువ సైజుల్లోనూ రెండు మూడు సొరుగులతోనూ వస్తున్న ఈ ఫ్రిజ్‌ని కిచెన్‌ గట్టుకింద అమర్చుకుని కూరగాయలూ పండ్లూ ఇంకా వంటకు అవసరమైన వాటి వరకూ దీన్లో పెట్టేసుకుంటే దగ్గర్లో అందుబాటులో ఉంటాయి. పైగా సొరుగుల్లా ఉండడంతో ఇందులో ఉన్నవాటిని తీసుకోవడం పెట్టుకోవడం కూడా సులభం. ఈ ఫ్రిజ్‌ సొరుగులకు వేరు వేరు ఉష్ణోగ్రతలూ అమర్చుకోవచ్చు. కాబట్టి, బాగా చల్లదనం కావల్సినవాటినీ కొంచెం కూలింగ్‌ సరిపోయే వాటినీ విడివిడిగా సర్దుకోవచ్చు. బాగుంది కదూ..!


ఫ్యానుని మడిచేయొచ్చు!

టేబుల్‌ ఫ్యానుతో గాలి చల్లగా వస్తుంది. పైగా ఆరుబయటకైనా తీసుకెళ్లి పెట్టుకోవచ్చు. కాకపోతే, వాడనప్పుడు అది గదిలో అడ్డంగా కనిపిస్తుంది. చిన్న పిల్లలుంటే మీద పడేసుకుంటారేమోనన్న భయం కూడా. ఈ సమస్య లేకుండా వచ్చిందే ‘పోర్టబుల్‌ ఫోల్డింగ్‌ రిట్రాక్టబుల్‌ ఫ్యాన్‌’. దీన్ని అవసరమైనపుడు మామూలు టేబుల్‌ ఫ్యానులా కావల్సిన ఎత్తులోకి అమర్చుకోవచ్చు. పనైపోయాక, చిన్న బాక్సు సైజులోకి మడతపెట్టేసి అరలో దాచేయొచ్చు. అంతేకాదు, రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసే దీన్ని వైర్లతో పనిలేకుండా ఎటైనా తీసుకెళ్లొచ్చు, కరెంటు లేనపుడూ పనికొస్తుంది. ఇక, వేసవిలో మరింత చల్లగా ఉంచేందుకు ఈ ఫ్యానులో నీళ్లు పోస్తే గాలి కూలర్‌ నుంచి వచ్చినట్లే ఉంటుంది. ఈ ఫ్యాను ముందుభాగంలో మూసి తెరిచే ల్యాంపూ, కింది భాగంలో ఎల్‌ఈడీ లైట్లూ ఉంటాయి. కాబట్టి, రాత్రిపూట రీడింగ్‌ ల్యాంపులానూ వాడుకోవచ్చు. ఇందులో ఫోనుకి ఛార్జింగ్‌ పెట్టుకునే సౌకర్యం కూడా ఉంది. మరి, మీరూ ఫ్యాన్‌ అయిపోయారా ఈ ఫ్యానుకి.


అందంగా... వేడిగా...

పాలు తాగమంటే చాలు, పిల్లలు తెగ పేచీ పెట్టేస్తుంటారు. అలాంటపుడు వారికి బాగా ఇష్టమైన బొమ్మ గ్లాసులో పోసి ఇస్తే దాన్ని చూసుకుంటూ తాగేస్తారు. ఈ ఆలోచనతో కాస్త వినూత్నంగా వస్తున్నవే ఈ కార్టూన్‌ యానిమల్‌ డబుల్‌ గ్లాస్‌లు. రెండు పొరలుగా ఉండే ఈ గాజు గ్లాసుల్లో లోపలి భాగం రకరకాల కార్టూన్‌ జంతువుల ఆకారంలో ఉంటుంది. దాంతో వీటిలో పాలు, లేదా ఇతర పానీయాల్ని పోసినపుడు పానీయాలు ఆయా జంతువుల ఆకారాల్లో కనిపిస్తూ పిల్లలకి సరదాగా అనిపిస్తుంది. రంగుల్లోనూ వచ్చే ఈ గ్లాసులు విడిగానూ చూడ్డానికి బాగుంటాయి. ఇక, గ్లాసు రెండు పొరలుగా ఉండడంతో దీన్లో  పోసిన పాలు త్వరగా చల్లారకుండానూ ఉంటాయి. లోపలి వేడి బయటి గాజు పొరకు త్వరగా తాకదు కాబట్టి, చెయ్యి కూడా కాలదు. 


క్యాండీ మన ఫొటోతో..!

పిల్లలనే కాదు, క్యాండీలు ఎదురుగా కనిపిస్తే పెద్దలు కూడా ఓ రెండు నోట్లో వేసుకోకుండా ఉండలేరు. అందుకే, వాటిని మరింత ప్రత్యేకంగా మనసైనవారి మనసును దోచుకునేలా పర్సనలైజ్డ్‌ చేసి ఇస్తోంది ‘ఎమ్‌ అండ్‌ ఎమ్స్‌’ కంపెనీ. అంటే, ఈ ఎమ్‌ అండ్‌ ఎమ్స్‌ మీద మనకిష్టమైనవారి ఫొటోతో పాటు, ఐ లవ్‌ యూ, విల్‌ యూ మ్యారీ మీ, హ్యాపీ బర్త్‌డే... ఇలా రకరకాల మెసేజ్‌లు వేటినైనా కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రింట్‌ చేయించుకోవచ్చు. ప్రియమైన వారికి ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన వేరు వేరు ఫొటోలను ఒక్కో క్యాండీ మీదా ప్రింట్‌ చేయించి ఇస్తే చూసిన వారి కళ్లల్లో కనిపించే వెలుగే వేరు. ప్రేమను తెలిపేలా బోలెడన్ని మెసేజ్‌లను కూడా క్యాండీల పైన ముద్రించి ఇవ్వొచ్చు. పిల్లలకైనా పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఇలా ప్రింట్‌ చేయిస్తే ఎంత సంబరపడిపోతారో వేరే చెప్పాలా!


ఆటలకోసం రంగుల ఇసుక!

సాయంత్రాలు సముద్రం ఒడ్డున కూర్చుని ఇసుకగూళ్లు కట్టుకుంటుంటే చిన్నారులకు సమయమే తెలీదు! ఆ ఆనందంలో వారితో ఉన్న పెద్దలూ పిల్లలైపోతుంటారు. కానీ ప్రస్తుతం పిల్లల్ని బీచ్‌కి కాదు కదా... బాల్కనీ దాటి పంపించే పరిస్థితి కూడా లేదు. అలా అని వాళ్లు ఆటపాటలకు దూరం కావాలంటే ఎలా చెప్పండి? అందుకే రంగురంగుల ఈ ‘కైనెటిక్‌ శాండ్‌’ను తెచ్చేసుకుంటే ఎంచక్కా ఇంట్లోనే బీచ్‌లోలాగ ఆడేసుకోవచ్చు!

పిల్లలకు ఇసుకలో ఆడుకోవడం ఎంతిష్టమో! అందుకే చిన్నారుల కోసం రంగురంగుల ఇసుక మార్కెట్లో దొరుకుతోంది. అయితే అందులోనూ ‘కైనెటిక్‌ శాండ్‌’ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇది చూడటానికి ఇసుకలాగానే ఉంటూ బంకమట్టి మాదిరిగా బొమ్మలు చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. మొట్టమొదటిసారిగా ‘స్పిన్‌ మాస్టర్‌’ అనే బొమ్మల కంపెనీ ఈ వెరైటీ ఇసుకను తయారుచేసింది. 98 శాతం మామూలు ఇసుకలో 2 శాతం సిలికాన్‌ ఆయిల్‌ను కలిపి ప్రాసెస్‌ చేయడం ద్వారా దీన్ని రూపొందిస్తారు. ఈ సిలికాన్‌ ఆయిల్‌ ఇసుక రేణువులు అన్నింటినీ దగ్గరగా కలిపి ఉంచుతుంది కానీ... ఆ తడిని చేతులకు, ఇతర ఉపరితలాలకు అంటనివ్వదు. ఈ ద్రవాన్ని సౌందర్య ఉత్పత్తుల తయారీలో కూడా వాడుతుంటారు. ఇందులో టాక్సిన్లు ఏవీ లేకపోవడం వల్ల చిన్నపిల్లలు ఆడుకున్నా ఎలాంటి హానీ కలగదు. ఎన్నిరోజులు ఉన్నా ఈ ఇసుక తడిని కోల్పోకుండా ఆడుకునేందుకు అనువుగా ఉంటుంది.

ఎరుపూ, పచ్చా, పసుపూ, గులాబీ, నారింజ, ఊదా వంటి రంగుల్లో దొరికే ఈ శాండ్‌తోపాటూ దీన్ని కొన్నప్పుడు కొన్ని ప్లాస్టిక్‌ మౌల్డ్స్‌ కూడా ఇస్తారు. అవి కోట గోడలూ, జంతువులూ, పండ్లూ, కూరగాయల వంటి ఆకారాల్లో ఉంటాయి. అందులో ఈ ఇసుకను నింపి ఒత్తితే అచ్చం ఆ ఆకారం వచ్చేస్తుంది. అలా ఆ నమూనాల సాయంతో రకరకాలైన ఆకారాలూ, నిర్మాణాలూ చేస్తూ పిల్లలు సరదాగా ఆడుకోవచ్చు. మూడేళ్లుపైబడిన వారికి దీంతో ఆట ఎంతో నచ్చుతుంది. ఈ ఇసుకతో ఆడుకోవడం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మెదడును రిఫ్రెష్‌ చేస్తుందట. అందుకే కొన్నిదేశాల్లో ‘కైనటిక్‌ శాండ్‌ థెరపీ’ కూడా చేస్తున్నారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో వెనుకబడిన పిల్లలకు దీని ద్వారా చిన్నచిన్న అంశాలను సులభంగా అర్థమయ్యేలా చెబుతున్నారట. దాంతో వారి ఆలోచనాశక్తి కూడా మెరుగుపడుతోందట. కరోనా కమ్మేసిన వేళ... పిల్లలకు ఇంట్లోనే కాలక్షేపం అయ్యేలా ఈ ఇసుక భలే ఉంది కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.