close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ-చెత్త సమస్య... ఇంతింత కాదు!

ఒకప్పుడు రేడియోనో టీవీనో కొంటే పాతిక ముప్ఫై ఏళ్లయినా అలా పనిచేస్తూ పడివుండేవి. ఇప్పుడో... రెండేళ్లకోసారి సెల్‌ఫోన్‌ మార్చాలి. ఐదారేళ్లకోసారైనా టీవీ మార్చాలి. కంప్యూటరూ లాప్‌టాపూ సరేసరి... కొత్త సాఫ్ట్‌వేర్‌కి తగిన మోడల్‌ కొనాల్సిందే. ఆఖరికి ఇళ్లల్లో వాడే మిక్సీలూ వాషింగ్‌మెషీన్లూ ఫ్రిజ్‌లూ ఏసీలూ కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ఫీచర్‌... కొత్త మోడల్‌తో వస్తాయి. పాతవాటిని తీసేసి కొత్తవి కొనుక్కోవాలనిపిస్తాయి. ఫలితమే... పెరుగుతున్న ఈ- చెత్త... ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌. చెత్త ఏదీ మంచిది కాదు, ఈ- చెత్త అసలే మంచిది కాదు. డబ్బూ పోయే శనీ పట్టే- అన్నట్లు అది ప్రజల ఆరోగ్యాలనూ కబళిస్తోంది మరి.
స్మార్ట్‌ఫోను మన చేతుల్లోకి వచ్చి పుష్కరం దాటిందేమో... ఏడాదికో మోడల్‌ మార్చే కుర్రాళ్ల సంగతి పక్కన పెడితే, మామూలు మధ్యతరగతి మనిషి చేతుల్లోనూ కనీసం నాలుగు మోడల్స్‌ మారి ఉంటుంది. దేశంలో యాభై
కోట్ల మంది స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారని గత ఏడాది లెక్కలు చెబుతున్నాయి. అంతకు ముందు ఏడాదికన్నా అది 15 శాతం ఎక్కువ. ఆన్‌లైన్‌ చదువుల పుణ్యమా అని ఈ సంవత్సరం అది ఇంకా ఎక్కువ శాతమే పెరిగివుంటుంది.
స్మార్ట్‌ఫోన్‌ అవసరమే... కాదనడం లేదు. కానీ వాడేసిన పాత ఫోనును ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు సమస్య.
గతేడాది మన దేశంలోకి 15 కోట్ల ఫోన్లు దిగుమతి అయ్యాయి. దాదాపు వాటికి సమానంగా పాత ఫోన్లు చెత్త బుట్టలోకి చేరుతున్నాయనే కదా అర్థం. ఒక్క అమెరికాలోనే రోజుకు నాలుగు లక్షల సెల్‌ఫోన్లు చెత్తబుట్టలో పారేస్తున్నారు. మన దగ్గర ఇంకా ఆ లెక్కలు తేలలేదు.

ఫోన్లే ఇన్ని ఉంటే ఇక పరిశ్రమల్లోనూ, కార్యాలయాల్లోనూ, ఇళ్లల్లోనూ వాడి పారేసే ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నీ కలిపితే ఎంత చెత్త అవుతుందీ... అందుకేనేమో ‘ఈ-వ్యర్థాల సునామీ ప్రపంచాన్ని
ముంచేస్తోంది’ అని హెచ్చరిస్తోంది ఐక్యరాజ్యసమితి.
అసలేమిటీ ఈ- చెత్త అంటే... మనిషి జీవితం ఇప్పుడు సాంకేతికత చుట్టూ తిరుగుతోంది. తెల్లారి లేచిందగ్గర్నుంచీ మనం సౌకర్యానికీ, సమాచారానికీ, విజ్ఞానానికీ, వినోదానికీ... వాడే ప్రతి వస్తువూ సాంకేతిక అభివృద్ధి మీద
ఆధారపడిందే. ఆ సాంకేతికత ఏరోజు కారోజు కొత్త కొత్త కోణాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ అభివృద్ధిని అందిపుచ్చుకోవాలంటే పాతవాటి స్థానంలో కొత్త ఉపకరణాలను కొనుక్కుంటూనే ఉండాలి. మన చేతిలోని స్మార్ట్‌ఫోనుతో మొదలుపెట్టి టీవీలూ, కంప్యూటర్లూ లాప్‌టాపులూ, వాషింగ్‌మెషీన్లూ, ఫ్రిజ్‌లూ, ఎయిర్‌కండిషనర్లూ, హీటర్లూ, కరెంటు స్టౌలూ, మైక్రోవేవ్‌ ఒవెన్లూ, లైట్లూ, బ్యాటరీలూ... ఒక్కమాటలో చెప్పాలంటే కరెంటు, బ్యాటరీలతో పనిచేసే ఉపకరణాలన్నిటినీ వాటి జీవితకాలం ముగిసో, పనిచేయడం లేదనో లేక పాత మోడల్‌ అయిపోయాయనో... పారేస్తే అవి ఈ-చెత్త కిందికే వస్తాయి.
నాలుగు లక్షల కోట్లు!
పాడైపోయినవాటినీ, పనికిరానివాటినీ పారెయ్యక చేసేదేముందీ అని భావించి ప్రపంచమంతా గత ఏడాది దాదాపు అయిదున్నర కోట్ల మెట్రిక్‌ టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను పారేసిందని గ్లోబల్‌ ఈ-వేస్ట్‌ మానిటర్‌ ప్రకటించింది. ఈ చెత్త పరిమాణం అంతకు ముందుతో పోలిస్తే ఐదేళ్లలో 21 శాతం పెరిగిందట. మరో పదేళ్లలో ఏకంగా రెట్టింపు అవుతుందని అంచనా. ఇళ్లల్లో తయారయ్యే తడి, పొడి చెత్తలనే రీసైకిల్‌ చేసి మరోలా వినియోగిస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్‌ పరికరాల్ని మాత్రం అలా చేయడం లేదా అంటే- చేస్తున్నాం... కాకపోతే అది చాలా చాలా తక్కువ. ఎనభై శాతానికి పైగా ఈ- వేస్ట్‌ని వృథాగా వదిలేయడం వల్ల నాలుగు లక్షల కోట్ల విలువ చేసే బంగారం, ప్లాటినం, రాగి, వెండి లాంటి లోహాల్ని చెత్తకుప్పలో పారేసినట్లవుతోంది. నాలుగు లక్షల కోట్లంటే- కొన్ని దేశాల స్థూల జాతీయోత్పత్తి కన్నా ఎక్కువ. ఈ చెత్తలో సగానికన్నా ఎక్కువ ఆసియా దేశాల్లోనే తయారవుతోందట. ఆఫ్రికాలో తయారయ్యేది అతి తక్కువ. గత ఏడాది పారేసిన చెత్తనంతా పెద్ద పెద్ద ఓడల్లో నింపితే ఆ ఓడల వరుస 125 కిలోమీటర్ల పొడవుంటుందట! చూస్తూ చూస్తూ ఇంత విలువైన వస్తువుల్ని చెత్తగా పడేస్తున్నామంటే సాంకేతికతని మనం సరిగ్గా ఉపయోగించుకోనట్లేగా అంటున్నారు నిపుణులు.

కొంత అవసరం...కొంత మోజు
ఇళ్లలో తయారయ్యే వ్యర్థాల్లో వేగంగా పెరుగుతున్న వాటా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలదేనని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
అవసరం: ఉద్యోగాలకీ వ్యాపారాలకీ చదువులకీ అవసరమయ్యే స్మార్ట్‌ఫోనూ కంప్యూటరూ లాప్‌టాప్‌ లాంటి వాటిని అవసరాలకు తగిన సరికొత్త సాఫ్ట్‌వేర్‌ పనిచేసేలా లేటెస్ట్‌ మోడల్స్‌ కొనుక్కోక తప్పదు. అలాగే ఇళ్లల్లో వాడే మిక్సీ, వాషింగ్‌మెషీన్‌ లాంటి పరికరాలు కూడా పాడైపోతే వెంటనే కొనుక్కోవాల్సిందే.
ఆకర్షణ: కొన్ని వస్తువులను అవి సరిగ్గా పనిచేస్తూనే ఉన్నా కేవలం మరిన్ని కొత్త ఫీచర్లతో కొత్త మోడల్‌ వచ్చింది కాబట్టి కొనుక్కుని పాతది పక్కనపడేస్తారు. ఫోన్లూ టీవీలూ ఎక్కువగా ఇలా పనిచేసే దశలోనే చెత్తలోకి చేరుతున్నాయట.
సాంకేతిక అభివృద్ధి: ఒకప్పుడు ఒక వస్తువు ఒకే పని చేసేది. దాని నిర్మాణం చాలా సింపుల్‌గా ఉండి ఎక్కువ కాలం మన్నేది. ఇప్పుడు ఒకో వస్తువూ ఎన్నో పనులు చేస్తుంది. క్లిష్టమైన సాంకేతికతతో తయారవుతుంది. దాంతో దాని జీవిత కాలమూ తక్కువగానే ఉంటోంది. కొన్ని చెడిపోతే మరమ్మతు చేసే వీలుండదు. పనిచేసినంత కాలం వాడి పారేయడమే. కొన్నిటికి మరమ్మతు చేసే వీలున్నా చేసేవాళ్లు అందుబాటులో లేకో ఖర్చు ఎక్కువనో దాన్ని పారేసి కొత్తది కొనేస్తున్నారు.
వాతావరణ మార్పులకు కారణమవుతున్న పెట్రో ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి ప్రభుత్వాలన్నీ. 2030 నాటికి పన్నెండు కోట్ల ఈ- వాహనాలు రోడ్లపై ఉంటాయనీ వాటివల్ల పదకొండు లక్షల టన్నుల లిథియం అయాన్‌ బ్యాటరీలు చెత్తలోకి చేరతాయనీ అంచనా. 5జీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తుంటే పర్యావరణ ఉద్యమకారులు మాత్రం దానికి మరో కోణాన్ని చూస్తున్నారు. 5జీ వాడుకలోకి వస్తే కోట్లాది స్మార్ట్‌ఫోన్లూ, మోడెమ్‌లూ, ఇతర పరికరాలూ ఆ స్పీడును అందుకోలేవు కాబట్టి వాటిని పారేసి కొత్తవి తీసుకోక తప్పదు. ఇది సాంకేతికంగా ఎంత పెద్ద మార్పంటే- నలుపూ తెలుపూ నుంచి రంగుల్లోకి మారినదానికన్నా, అనలాగ్‌ నుంచి డిజిటల్‌లోకి మారినప్పటికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. కాబట్టి నష్టమూ అదే స్థాయిలో ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.


వాళ్ల చెత్త... మన ఇంట
మన దేశంలో ఏటా దాదాపు నలభై లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ తయారవుతోందని అంచనా. చెత్త సృష్టికర్తల్లో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీల తర్వాత ఐదోస్థానంలో మనదేశం ఉంది. ఇది చాలదన్నట్లు ఇతర దేశాల చెత్త కూడా ఇక్కడికే వస్తోంది. మనింట్లో చెత్త తీసి పక్కింట్లో వేయం. కానీ ఈ- వ్యర్థాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం దేశాలు అదే పని చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ దగ్గర పనికిరాని వస్తువులన్నిటినీ అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఒక్క యూరోపియన్‌ యూనియన్‌ నుంచే 13లక్షల మెట్రిక్‌ టన్నుల వాడి పడేసిన విద్యుత్‌ ఉపకరణాలు ఎలాంటి పత్రాలూ లేకుండా విదేశాలకు తరలి వెళ్తున్నాయని అంచనా. చైనా, భారత్‌, కొన్ని ఆఫ్రికా దేశాలూ ఆ చెత్తని తీసుకుంటున్నాయి. అలాగని వాటికి ఆ చెత్తని సరైన రీతిలో రీసైకిల్‌ చేసే సామర్థ్యం ఉందా అంటే అదీ లేదు. దాంతో యంత్రాలు చేయాల్సిన పనిని అశాస్త్రీయంగా మనుషుల చేత చేయిస్తున్నాయి. వాటిల్లోని లోహాలను సేకరించడానికి ఏ పార్టుకాపార్టు చేత్తోనే విడదీయడం, కుప్పగా పడేసి తగలబెట్టడం, యాసిడ్‌ పోసి కరగబెట్టడం... లాంటివి చేస్తారు. పేద దేశాల్లోని ప్రజలకు ఇదో జీవనోపాధిగా మారింది. విదేశాలనుంచి తెచ్చి పడేసిన ఈ-వ్యర్థాల డంప్‌లు మనదేశంలో చాలాచోట్లే ఉన్నాయి. వాటిల్లో అన్నిటికన్నా పెద్దది దిల్లీ దగ్గర సీలంపూర్‌లో ఉంది. అక్కడ రోడ్ల మీదా, వాకిళ్లలో, చీకటి కొట్లలా ఉన్న ఇళ్లలో... ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు పడివుంటాయి. పిల్లలనుంచి ముసలి వాళ్లవరకూ అందరూ స్క్రూడ్రైవరో సుత్తో పట్టుకుని వాటి అంతు చూస్తూ ఉంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలనుంచీ లారీల్లో చెత్త ఇక్కడికి చేరుతుంది. ముంబయి ఓడరేవు నుంచి ఎక్కువ లారీలు వస్తాయని స్థానికులు చెబుతారు. ఒక్కో లారీలో పది టన్నుల ఈ- వ్యర్థాలు ఉంటాయట. వాటి నుంచి పనికొచ్చే భాగాలను తీసుకుని మళ్లీ కొత్త పరికరాన్ని అసెంబుల్‌ చేసి, తిరిగి అమ్ముతారు. లోహాలను సేకరిస్తారు. పనికొచ్చే భాగాలను తీసుకున్నాక పనికిరాదనుకున్న చెత్తనంతటినీ లారీల్లోకి ఎక్కించి అడవుల్లోకి తీసుకెళ్లి తగలబెడతారట. కొన్ని కాలిపోతాయి. కాలనివి అలాగే పడివుంటాయి. నిజానికి మామూలు చెత్తతో పోలిస్తే ఎలక్ట్రానిక్‌ చెత్త పరిమాణం తక్కువే. కానీ దాని వల్ల ప్రమాదం మాత్రం డెబ్భై శాతం ఎక్కువ.


ఆరోగ్యానికి హాని
ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల డబ్బు నష్టమూ భూమికి భారమూ మాత్రమే కాదు, మన ఆరోగ్యానికీ, పర్యావరణానికీ చెప్పలేనంత చెడు జరుగుతోంది. ఆ పరికరాల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆర్సెనిక్‌, నికెల్‌, జింక్‌, సెలెనియం... ఇలాంటి మూలకాలతో కలిసి మొత్తం అరవై రకాల హానికర రసాయనాలు ఉంటాయి. సీసం, పాదరసం లాంటివి మనిషి మెదడు మీద తీవ్రంగా ప్రభావం చూపుతాయి. అవి చెత్తకుప్పలో పడివుంటే చుట్టూ ఉన్న నేలనీ భూగర్భ జలాలనీ కలుషితం చేస్తాయి. కాల్చితే గాలిని కలుషితం చేస్తాయి. ఆయా మూలకాలూ ప్లాస్టిక్కులూ కలిసి క్యాన్సర్‌ కారకాలను గాలిలోకీ భూమిలోకీ వదులుతాయి. ఈ కాలుష్యాలు మనిషి ఆరోగ్యం మీద చూపే ప్రభావం గురించి బాసెల్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ అనే సంస్థ ఘనాలో పరిశోధన చేసింది.
యూరప్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ చెత్తని తెచ్చి ఘనాలోని అగ్బోబ్లోషి అనే ప్రాంతంలో వేస్తున్నారు. అక్కడ ఉన్న ఎనభైవేల జనాభా ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోని విడిభాగాలనుంచి రాగినీ ఇతర లోహాల్నీ వేరుచేయడం ద్వారా ఉపాధి పొందుతోంది. అందుకోసం వాళ్లు ఆయా పరికరాల్ని తగలబెడుతుంటారు. అలా తయారైన బూడిద అంతా అక్కడి భూమిలో కలిసిపోతోంది. ఆ మురికివాడలో పెరిగే కోళ్లు పెట్టిన గుడ్లను పరిశోధకులు విశ్లేషించారు. ఆ గుడ్డు ఒక్కటి తింటేనే- క్లోరినేటెడ్‌ డయాక్సిన్స్‌ అనే రసాయనాలు మనిషి శరీరంలో ఉండాల్సినదానికన్నా 220 రెట్లు ఎక్కువయ్యాయట. ఇవే కాక మరెన్నో ఇతర హానికారక రసాయనాలూ ఆ గుడ్లలో ఉన్నాయని అధ్యయనం చేసిన పరిశోధకులు పేర్కొన్నారు. అవే రసాయనాలను ఎవరన్నా మరొకరిపై బలవంతంగా ప్రయోగిస్తే అది హత్యాయత్నం కేసు అవుతుంది. కానీ అదే పనిని మరో రూపంలో చేస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సంస్థ ప్రతినిధి జిమ్‌ పుకెట్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సీలంపూర్‌లో కూడా ఈ పనిచేస్తున్న వాళ్ల ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంటోందని నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా వాళ్ల రక్తంలోనే పలు లోహాల ఆనవాళ్లు కన్పిస్తున్నాయట. చిన్నవయసులోనే మూత్రపిండాలూ, కాలేయమూ పాడవుతున్నాయట.

 

బాధ్యత అందరిదీ...
ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల జరుగుతున్న హానిని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. మొదట... వ్యక్తిగతంగా ఆయా వస్తువుల జీవితకాలం పూర్తయ్యేవరకూ వినియోగించాలి. ఒక వస్తువు పనిచేస్తుండగానే మరొకటి కొన్నప్పుడు పాతదాన్ని అవసరం ఉన్న వారికి ఇచ్చేయాలి. ఇలా పనిచేసే వస్తువులను ఉచితంగా ఇస్తే కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇస్తున్నాయి. రెండోది... పాడైపోయిన వస్తువుల్ని ఇంట్లో ఓ మూల పడేసి ఉంచడమూ చెత్తబుట్టలో పడేయడమూ ఏదీ మంచిది కాదు. వాటిని రీసైక్లింగ్‌ చేసే సంస్థలకు అందజేయాలి. కొన్ని కంపెనీలు కొత్తది అమ్మేటప్పుడు పాతదాన్ని తీసుకుంటాయి. పాతది ఇస్తే కొత్తదాని ధర తగ్గించినప్పుడు అలా ఇస్తున్నారు కానీ తగ్గించకపోతే ఇవ్వడం లేదని కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. ధరతో సంబంధం లేకుండా ఇచ్చేయడం మన బాధ్యత అయితే వాటిని సరైన పద్ధతుల్లో రీసైక్లింగ్‌ చేయించడం కంపెనీల బాధ్యత.
ఇక, చట్టాల దగ్గరికి వస్తే- ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ(ఈపీఆర్‌) అంటే- ఈ పరికరాల రీసైక్లింగ్‌ ఖర్చుని కూడా ఉత్పత్తిదారులు భరించేలా చట్టాలు తేవాలని యూరప్‌, కెనడా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు సొంతంగా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆపిల్‌ కంపెనీ 2018లో డైజీ అనే రోబోని తయారుచేసింది. అది గంటకు 200 ఐఫోన్లను ఏ పార్టుకాపార్టు చొప్పున విడదీస్తుంది. అయితే ఆపిల్‌ ఉత్పత్తులతో పోలిస్తే ఇది చాలా చిన్న ప్రయత్నం. ఈ విషయంలో నోకియా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రశంసలందుకుంది. 2008 నుంచే తమ పాత ఫోన్లను వెనక్కి తీసుకోవడం మొదలెట్టింది. వార్తాపత్రికల్లో ప్రకటనలు వేసి మరీ ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేసింది. తమ కేర్‌ సెంటర్లలోనే కాక పలుచోట్ల ప్రత్యేకంగా డ్రాప్‌బాక్స్‌లను పెట్టి పాత ఫోన్లను సేకరించింది. వాడేసిన ఆ ఫోన్ల నుంచి విడదీసిన వేర్వేరు లోహాలను నూటికి నూరుశాతం తిరిగి ఉపయోగిస్తున్నారు.
భారత ప్రభుత్వం కూడా ఈ-వ్యర్థాలను తగ్గించడానికీ, రీసైక్లింగ్‌ని పెంచడానికీ పదేళ్లక్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2016లో ఈ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ని విడుదల చేసింది. వాటి ప్రకారం ఉత్పత్తిదారులు తమ మార్కెట్‌ భాగస్వామ్యానికి తగినట్లుగా ఈవేస్ట్‌ని కూడా రీసైక్లింగ్‌ చేయించాలి. తమ అమ్మకాల్లో కనీసం 20 శాతానికి సమానంగానైనా జీవితకాలం ముగిసిన వస్తువుల్ని తిరిగి తీసుకోవాలి. దాన్ని ఏటా పది శాతం పెంచుకుంటూ పోవాలి. దీన్ని సరిగ్గా అమలుచేస్తే ఈ -వేస్ట్‌ ఎవరికీ ఏ విధమైన హానీ చేయకుండా సరైన పద్ధతిలో రీసైక్లింగ్‌కి వెళ్తుంది.


కొన్ని నిజాలు!

ఏ వస్తువునైనా జీవితకాలం తీరాక పారేయక తప్పదు. అలా పారేయడాన్నే కాస్త బాధ్యతగా చేయాలి. ఎందుకంటే...
* లోహాలను గనుల్లోంచి తవ్వితీసుకోవటానికి అయ్యే ఖర్చుకన్నా విద్యుత్‌ పరికరాల్లో ఒకసారి ఉపయోగించిన వాటిని తిరిగి వాడుకోవడం చౌక. పైగా నాణ్యమైనది కూడానని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేరుగా ముడి లోహం నుంచి తీసిన దానికన్నా ఇలా ఒకసారి వాడిన లోహాలు రెండు నుంచి 10 రెట్ల వరకు ఎక్కువ సామర్థ్యాన్ని
కలిగివుంటాయట.
* ఒక్క బెంగళూరులోనే ఏటా 30వేల కంప్యూటర్లను పారేస్తారట. వాటి నుంచి వెయ్యిటన్నుల ప్లాస్టిక్‌, 300 టన్నుల సీసం, 350 టన్నుల రాగి, 43 టన్నుల నికెల్‌- తీయవచ్చట.
* ఒక మిలియన్‌ సెల్‌ఫోన్లని రీసైకిల్‌ చేస్తే 16000 కిలోల రాగి, 350కిలోల వెండి, 34 కిలోల బంగారం 15 కిలోల పలాడియం వస్తాయి.
* జపాన్‌ రీసైక్లింగ్‌ విషయంలో ప్రపంచానికి గొప్ప పాఠం చెబుతోంది. అక్కడ ఈ ఏడాది జరగాల్సి ఉండి వాయిదా పడిన ఒలింపిక్స్‌కి పతకాలను పూర్తిగా ఈ-వ్యర్థాలతోనే తయారుచేయించింది. 50వేల టన్నుల వ్యర్థాల నుంచీ పతకాలకు అవసరమైన లోహాలను తీసుకున్నారట.


ప్రపంచంలోనే పెద్దది!

చైనాలోని చావొయాంగ్‌ జిల్లాలో లక్షన్నర జనాభా ఉన్న చిన్న పట్టణం గ్వియు. ప్రపంచంలోని అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ చెత్త కుప్పగా దీనికి పేరు. అక్కడ దాదాపు 5500 కేంద్రాల్లో రోజుకు ఇరవై టన్నుల పరికరాలను పూర్తిగా అశాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్‌ చేస్తుంటారు. ఆ ఊళ్లో ఏ స్థాయిలో ఈ-వ్యర్థాల రీసైక్లింగ్‌ జరుగుతోందో అదే స్థాయిలో ప్రజారోగ్యానికి ప్రమాదమూ పొంచి ఉందని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న లియాన్‌జియాంగ్‌ నది నీటిలో రకరకాల లోహాలు ఉండాల్సిన వాటికన్నా మూడు రెట్లు ఎక్కువున్నట్లు తేలింది. ఇక, ఆ ప్రాంతంలోని భూగర్బ జలాలైతే శుద్ధి చేయడానికి వీలు కాని రీతిలో కలుషితమైపోయాయట. నలభై ఏళ్ల క్రితం అదంతా మంచి సారవంతమైన వ్యవసాయక్షేత్రం. త్వరగా డబ్బులొస్తాయన్న ఆశతో పొలాలను పాడుబెట్టి స్థానికులంతా ఈ వ్యర్థాల వైపు ఆకర్షితులయ్యారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.