close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బామ్మమాట బంగారుబాట

-అప్పరాజు నాగజ్యోతి

ఫోన్లో కాలేజీ ప్రిన్సిపాల్‌గారు చెప్పింది విని స్థాణువయ్యాను.
అప్పుడే బెడ్రూమ్‌ నుండి హాల్లోకి వచ్చిన మావారు ‘‘లతా, అలా ఉన్నావేమిటి? ఎనీ థింగ్‌ రాంగ్‌?’’ అని అడుగుతుంటే బలవంతాన మొహంలోకి నవ్వు తెచ్చుకుని ‘‘అదేం లేదండీ. ఇప్పుడే వంట ముగించుకుని వచ్చానుగా, కాసింత అలసటగా ఉందంతే. అన్నట్టు మరో కప్పు టీ తాగుతారా’’ అంటూ మాట మార్చేశాను.
కాలేజీవాళ్లు చెప్పిన విషయం వింటే ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతారు. అందుకే, టీ చేసే వంకతో వంటింట్లోకి నడిచి, గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌ ఆన్‌ చేశాను.
చేతులు యాంత్రికంగా పని చేస్తున్నా, మనసంతా మా ఒక్కగానొక్క కూతురైన జాన్వి గురించిన ఆలోచనలే కమ్మేసుకున్నాయి.
చిన్నప్పటినుండీ అన్ని క్లాసులూ ఫస్ట్‌ర్యాంక్‌లో పాసవుతూ వచ్చిన జాన్వికి, కోచింగ్‌ సెంటర్‌ వాళ్లు పెట్టిన టెస్టులో అత్తెసరు మార్కులు రావడమన్నది నాకసలు నమ్మశక్యంగా లేదు. పైగా ‘నెల రోజులనుండి మీ అమ్మాయి ఆన్‌లైన్‌ క్లాసులకి సరిగా అటెండవడం లేదండీ. ఇంట్లో ఎవరికీ కరోనాగానీ రాలేదుగా’ అంటూ ఫోన్లో కాలేజీ ప్రిన్సిపాల్‌గారు అడుగుతుంటే ఏమని జవాబివ్వాలో అర్థంకాలేదు.
టెన్త్‌ ప్రీబోర్డు పరీక్షల్లో నూటికి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న జాన్వికి, కాలేజీ వాళ్లు పిలిచి మరీ సీట్‌ ఇచ్చారు. వాళ్లు మెడికల్‌ ఎంట్రన్స్‌కి కోచింగ్‌ కూడా ఇస్తారు. ఇంటికీ, కాలేజీకీ మధ్యన రెండే కిలోమీటర్ల దూరం కాబట్టి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని జాన్విని అక్కడ చేర్పించాము.
ఈలోగా, అనుకోని అతిథిలా అందరి జీవితాల్లోకీ కరోనా ప్రవేశించడంతో, ఏప్రిల్‌ మొదటివారంలో మొదలవ్వాల్సిన కోచింగ్‌ క్లాసులు నెలరోజులు ఆలస్యంగా, అదీ ఆన్‌లైన్‌లో మొదలయ్యాయి. ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌కి వీలుగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో జాన్వి కోసం ప్రత్యేకంగా నాలుగుమాసాల క్రితమే కొన్న ల్యాప్‌టాప్‌ ఈ కరోనా కాలంలో బాగా పనికొచ్చింది. ఇరవై నాలుగ్గంటలూ ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటుంటే, ఎప్పట్లా శ్రద్ధగా చదువుకుంటోందనే అనుకున్నానుగానీ, ఇలా క్లాసులని ఎగ్గొట్టి అరాకొరా మార్కులు తెచ్చుకుంటుందని కలలో కూడా ఊహించలేదు.
‘‘మరి క్లాసులు అటెండవకుండా, రోజంతా అది ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నట్టో?’’
ఆ ఆలోచన రాగానే మనసు గుభేలుమంది.
మేమిద్దరమూ సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీలోనే పని చేస్తున్నా, జాన్విని మాత్రం ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లకీ, ఇంటర్నెట్‌కీ, సోషల్‌ మీడియాకీ ఇన్నాళ్లూ దూరంగానే ఉంచుతూ వచ్చాము.
‘మా ఫ్రెండ్స్‌ అందరి దగ్గరా సెల్‌ఫోన్స్‌ ఉన్నాయి. వాళ్లంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా వీడియో గేమ్స్‌ ఆడుకుంటారు. నాకూ ఈ సంవత్సరం మీరు సెల్‌ఫోన్‌ కొనివ్వాల్సిందే’ అంటూ సెవెంత్‌ క్లాసుకి వచ్చాక జాన్వి మారాం చేస్తే, దానిని దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘రోజూ అరగంటపాటు నీకూ మేము సెల్‌ఫోన్‌ ఇస్తున్నాముగా జానూ. మొబైల్‌ స్క్రీన్‌ని గంటలకొద్దీ చూడడం వలన కళ్లు పాడవుతాయి. అందులోనూ ఆ వీడియో గేమ్స్‌ ఆడడం మొదట్లో సరదాగానే ఉన్నా, పోనుపోనూ అది వ్యసనంగా మారి చదువుపట్ల ధ్యాస తగ్గిపోయిందంటే ఎప్పట్లా, నీకు క్లాసులో ఫస్ట్‌ర్యాంక్‌ రాదు. ఏదైనా లిమిట్స్‌లో ఉంటేనే ఆరోగ్యానికి మంచిది తల్లీ’’ అంటూ మితిమీరిన సెల్‌ఫోన్‌ వాడకం వలన కలిగే దుష్పరిణామాలన్నింటినీ విడమరచి చెప్పిన మీదట, మరెన్నడూ ఫోన్‌ కోసం జాన్వి పేచీలు పెట్టలేదు.
‘ఈ కాలం పిల్లలకిమల్లే టెక్నాలజీ మిధ్యాప్రపంచంలో కొట్టుకుపోకుండా నా కూతురిని ఇన్నేళ్లుగా కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరేనా, ఇన్ని జాగ్రత్తలూ హుష్‌కాకి అయినట్లేనా!’ అనిపించగానే మనసు ఉసూరుమంది.

*  *  *

సలసలమంటూ నీళ్లు మసలుతున్న శబ్దానికి ఆలోచనల నుండి బయటపడి, గబగబా టీ తయారు చేసి కప్పులో పోసి ఆయన చేతికందిస్తూంటే ‘‘అదోలా ఉన్నావేమిటి లతా, ఒంట్లో నలతగా ఉందా?’’ అంటూ ఆయన మళ్లీ రెట్టించినా అప్పటికి ఏదో చెప్పేసి తప్పించుకున్నాను.
అసలు విషయం తెలిస్తే, ఆయన రియాక్షన్‌ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ముందుగా జాన్వి గదిలోకి వెళ్లి దాన్ని నిలదీస్తారు. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ని లాక్కుని, దాని మొహంముందే ఇంటర్నెట్‌ బ్రౌజరు తెరిచి హిస్టరీ అంతా చెక్‌ చేస్తారు. ఎదిగిన పిల్ల, అందులోనూ టీనేజీ పిల్ల విషయంలో అలా చేస్తే మొదటికే మోసం వస్తుందన్న సూక్ష్మాన్ని తెలుసుకునే మానసిక పరిపక్వత ఆయనకి లేదు.
ముళ్లకంపపై పడిన పట్టుచీరని జాగ్రత్తగా ముళ్లని పక్కకి తొలగించి నేర్పుగా వెనక్కి లాక్కోవాలే తప్ప, తొందరపడి గభాల్న గుంజేస్తే చీరకి పడేది చిరుగులేగా! అందుకే, సహనాన్ని కోల్పోకుండా, ఈ విషయాన్ని ఎలా డీల్‌ చేస్తే బావుంటుందోనని ఆలోచిస్తూనే ఆన్‌లైన్‌లో క్లైంట్‌ మీటింగుని పూర్తి చేసుకున్నాను.
సాయంత్రం ఏడుగంటలకి నా స్నేహితురాలు పావనినుండి ఫోన్‌ రావడంతో ‘‘హలో, ఎలా ఉన్నావు పావనీ? అక్కడ హైదరాబాద్‌లోనూ కరోనా ఎక్కువగా ఉన్నట్టుందిగా’’ అని అడుగుతూ బాల్కనీలోకి నడిచాను.
వెంటనే ‘‘ఆ కరోనా ఏదో సోకి నేను పోయినా బావుండేదిలే లతా’’ అన్న పావని మాటలకి నివ్వెరపోయాను.
‘‘ఏమయింది పావనీ, నీకంత కష్టమేమొచ్చింది ఇప్పుడు? కరోనా మూలంగా కొంపదీసి మీ ఉద్యోగాలుకానీ పోయాయా ఏమిటి?’’ అనేసి వెంటనే నాలుక కరుచుకున్నాను. ఎందుకంటే పావనిదీ, వాళ్ల ఆయనదీ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగాలు. మాలాగా సడెన్‌గా ఉద్యోగానికి ఉద్వాసన చెప్పడాలు వాళ్ల విషయంలో జరగవు.
‘‘ఉద్యోగాలు పోతే వేరేవి వెతుక్కోవచ్చు. కొత్తవి దొరికేదాకా, వెనకేసుకున్న డబ్బులతో ఎలాగోలా బతికేయొచ్చులే లతా. అంతకంటే పెద్ద సమస్యే వచ్చిపడింది’’ అంటూ చెప్పుకొచ్చింది పావని.

*  *  * 

పావనీ, సుధీర్‌ల ఒక్కగానొక్క కొడుకు సాత్విక్‌. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ఉన్నాడు. వాడు చదువులో చురుగ్గానే ఉంటాడు. కాకపోతే, ప్రస్తుతం కరోనా మూలంగా ఇంట్లోనే బలవంతపు ఖైదీ అవడంతో, మూడు గంటలపాటు ఆన్‌లైన్‌ క్లాసులు అయిపోయిన తర్వాత ఇంక రోజంతా ఏం చేయాలో తోచక, ఫేస్‌బుక్‌ చూస్తూనో లేదా ఫ్రెండ్స్‌తో వాట్సాప్‌ ఛాటింగ్‌ చేస్తూనో టైం పాస్‌ చేస్తున్నాడు.
మితిమీరిన ఖాళీ సమయం, అదుపులేని సోషల్‌మీడియా, రెండూ కలిస్తే జరిగేది విధ్వంసమేగా!
ఒకరోజు వాట్సాప్‌లో ఒక ఫ్రెండ్‌ పంపిన లింక్‌ని నొక్కగానే, అది కాస్తా సాత్విక్‌ని పోర్న్‌సైట్‌కి తీసుకెళ్లింది. మనసులో వద్దనిపించినా, ఆ వయసుకుండే సహజ కుతూహలంతో ‘ఈ ఒక్కటే’ అనుకుంటూ చూశాడు ఆ కుర్రాడు. ఇంకేముంది, అలా ‘ఒక్కటే’ అనుకున్నదల్లా విడిచిపెట్టలేని వ్యసనంగా మారింది. అతని కాలేజీ ఫ్రెండ్స్‌ అంతా కూడా అలాంటి వీడియోలనే చూసుకుంటూ, గ్రూప్‌ ఛాటింగులోనూ వీటి గురించిన చర్చలే చేసుకోవడం మొదలెట్టారు.
పిల్లవాడిలో ముదురుతున్న ఈ పాడు అలవాటు గురించి తల్లిదండ్రులకి తెలియలేదు. అసలు ఆ అనుమానమే రాలేదు వాళ్లకి. కాలేజీ పిల్లల మధ్యన గుట్టుగా జరుగుతున్న ఈ చాటుమాటు వ్యవహారం ఎలా లీక్‌ అయిందో తెలియదుగానీ, అదే కాలేజీలో వేరే బ్రాంచ్‌లో చదువుతున్న రిషి అనే కుర్రాడికి తెలిసింది.

*  *  * 

‘‘రిషి తండ్రి ప్రకాష్‌ ద్వారా ఈ విషయం తెలియగానే, మా ఆయన బెల్ట్‌ తీసుకుని వాతలు తేలేట్టుగా సాత్విక్‌ని కొట్టారు లతా. చిత్రమేమిటంటే, ఆయనంతలా కొడుతుంటే, వాడు ఉలుకూపలుకూ లేకుండా వాళ్ల నాన్న దెబ్బలకి మొండిగా ఒళ్లప్పగించేశాడే తప్ప, వాడి కళ్లల్లో తప్పు చేసిన నదురూ, బెదురూ కనిపించలేదు. ఆ తర్వాత మావైపు నిరసనగా చూస్తూ తన గదిలోకి వెళ్లిపోయి ధడేల్మంటూ తలుపులు వేసేసుకున్నాడు. వాడి వ్యవహారం చూస్తే మా చేయి దాటిపోయాడేమోననిపిస్తోంది. రేపు ఈ సంగతి కాలేజి మేనేజ్మెంట్‌దాకా వెళ్తే ఏం జరుగుతుందో, వాడి కెరీర్‌ ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది లతా’’ అంటూ ఫోన్లోనే పెద్దగా ఏడ్చేసింది పావని.
‘‘అలాంటిది ఏమీ జరగదులే పావనీ, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటూ మనసు పాడు చేసుకోకు. అన్నీ అవే సర్దుకుంటాయి’’ అంటూ పావనికి ధైర్యం చెప్పి ఫోన్‌ పెట్టేశాను.
పావనితో మాట్లాడాక నా మనసులో బెంగ అధికమైంది.
సాత్విక్‌లాగే జాన్వి కూడా చూడకూడని వెబ్‌సైట్‌లు చూస్తూ, బుర్ర పాడు చేసుకోవడం లేదుకదా!
అయినా, ప్రతీదీ నాతో పంచుకునే జాన్వి, మార్కులు తక్కువొచ్చిన విషయాన్ని మొట్టమొదటిసారిగా నానుండి దాచిపెట్టిందంటే ఏమిటీ దానర్థం? అది తప్పు చేస్తోందనేగా!
పాకుడుమెట్లపై కాళ్లని మోపుతున్న ఈ పిల్లని ఎలాగోలా చాకచక్యంగా వెనక్కిలాగి సరైన దారిలో పెట్టాల్సిందేనని గట్టిగా నిశ్చయించుకున్నాకగానీ నా మనసుకి స్థిమితం చిక్కలేదు.

*  *  *

రాత్రి అందరం డిన్నర్‌ చేశాక వంటింట్లో అన్నీ సర్దేసి, ఆ తర్వాత తీరిగ్గా జాన్వి గదిలోకి వెళ్లాను.
‘‘ఏమ్మా జానూ, కాలేజీవాళ్లు బాగా చెబుతున్నారా? నీకు క్లాసులు అర్థమవుతున్నాయా’’ అంటూ కేజువల్‌గా అడిగాను.
‘‘అమ్మా, నాకు మెడిసిన్‌ చేయాలని లేదమ్మా. నేను ఫిలిమ్‌స్టార్‌ అవ్వాలనుకుంటున్నాను. మోడలింగ్‌తో నా కెరీర్‌ని మొదలుపెడతాను’’
ఉపోద్ఘాతమేమీ లేకుండా సూటిగా చెప్పిన జాన్వి మాటలకి నేను నిర్ఘాంతపోయాను.
‘‘అదేంటి జానూ, ఉన్నట్టుండి సినీఫీల్డ్‌ మీద ఇంట్రెస్ట్‌ ఎలా కలిగింది? నువ్వు చిన్నప్పటినుండీ డాక్టరవాలనే అనుకునేదానివిగా’’ అన్న నా మాటలకి ‘‘ఇప్పుడు నా అభిప్రాయం మారిందమ్మా’’ అంటూ గబగబా ల్యాప్‌టాప్‌ తెరిచి, యూట్యూబ్‌ నుండి తను డౌన్లోడ్‌ చేసిన ఫ్యాషన్‌ షోలూ, అందాల పోటీల వీడియోలూ చూపించింది.
‘‘ఈ మిస్‌ ఇండియా ట్విట్టర్‌ అకౌంటు చూడమ్మా, ఎంత మంది ఫాలోయర్స్‌ ఉన్నారో తనకి! ఫేస్‌బుక్‌ అకౌంటులోనూ ఈమె పోస్టులన్నింటికీ లక్షల్లో లైక్‌లున్నాయి. ఇప్పటికే ఈమెకి బాలీవుడ్‌ నుండి చాలా ఆఫర్స్‌ వచ్చాయి. నాకూ, ఆమెలా పెద్ద సెలబ్రిటీని కావాలనుందమ్మా. నేనెక్కడికి వెళ్లినా ఫ్యాన్స్‌ నన్ను చుట్టుముట్టేసి నా ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటుంటే ఎంత బావుంటుందో! వావ్‌, లైఫ్‌ అంటే అదే కదమ్మా’’
ఎన్నడూ లేనిది, ఊహల్లో తేలిపోతున్నట్టుగా మాట్లాడుతున్న జానూ చాలా కొత్తగా కనిపిస్తోంది.
దాన్ని బుజ్జగించి, మెల్లగా మాటల్లో పెట్టి నేను రాబట్టాలనుకున్న వివరాలు తేలిగ్గానే తెలిసిపోయాయి. ఈ పిల్లకి పరీక్షల్లో మార్కులు తక్కువ ఎందుకొచ్చాయో తేటతెల్లమయింది. ఈ విధమైన వీడియోలు చూస్తూ, వాటి మాయలో పడ్డ పిల్లకి మెడికల్‌ కోచింగ్‌ క్లాసులెలా వంటబడతాయి!
‘‘ఈ పిల్లని ఈ సినీవ్యామోహం నుండి బయటకి లాగడం సాధ్యమేనా’’ అని నా మనసు ఒక్కక్షణం డీలాపడినా, వెంటనే ‘టీనేజ్‌లో డ్రగ్స్‌, సినిమాలూ, పోర్న్‌... ఇలా ఒకటా రెండా ఎన్నో ఆకర్షణలు. వాటి బారిన పడకుండా పిల్లలని తప్పించడం కష్టమేగానీ అసాధ్యం మాత్రంకాదు’ అంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.
‘‘సినీఫీల్డ్‌లో చాలా రిస్కులుంటాయి. మనకి అదంతా కొత్తే కాకుండా, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడాను. వెనక ఏ గాడ్‌ఫాదర్‌ సాయమూ లేకుండా సినీరంగంలో నెగ్గుకురావడమన్నది కష్టం. పైగా నీకు మోడలింగులోనూ, నటనలోనూ ఏ విధమైన అనుభవమూ లేదు జానూ...’’ అని నచ్చజెప్పబోతున్న నన్ను మధ్యలోనే ఆపేసి ‘‘అవన్నీ పెద్ద విషయాలేం కాదమ్మా. నెలరోజుల నుండీ మోడలింగ్‌కి సంబంధించిన వీడియోలు చూస్తూ నేను చాలా నేర్చేసుకున్నాను తెలుసా’’ అంటూ చకచకా కొన్ని ఆన్‌లైన్‌ కోర్సులని ల్యాప్‌టాప్‌లో చూపించింది జాన్వి.
‘‘అమ్మా, డబ్బుల గురించి నువ్వేం వర్రీ అవకు. నేను కొన్ని బెస్ట్‌ మోడలింగ్‌ ఏజెన్సీల అడ్రసులని ఇంటర్నెట్‌లో సంపాదించాను. మనం ఒక్క పైసా ఖర్చు పెట్టనవసరంలేదు. నాలాంటి అందమైన అమ్మాయిలకి, అన్నీ దగ్గరుండి నేర్పించడమే కాకుండా, పెద్ద పెద్ద మోడలింగ్‌ షోలకి వాళ్లే స్పాన్సర్‌ కూడా చేస్తారు. ఒక్కసారి మోడల్‌గా పేరొచ్చాక, బాలీవుడ్‌లో ప్రొడ్యూసర్స్‌ అంతా నాకోసం క్యూ కడతారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదమ్మా’’ మైకంలో ఉన్నదానిలా మాట్లాడుతున్న జాన్విని చూశాక ఇంక ఆ సమయంలో నేనేం చెప్పినా తను వినే స్థితిలో లేదని నాకర్థమైపోయింది. టీనేజ్‌ పిల్లలు ఆ వయసులో తమ ఆలోచనే కరెక్ట్‌ అనుకుంటారు.
అందుకే ‘‘సరేలే, నాకు నిద్రొస్తోంది. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం’’ అని చెప్పేసి బెడ్రూమ్‌కి వచ్చేశాను.
అటూ ఇటూ కాని వయసులో ఉన్న ఈ పిల్లని ఎలా దారిలో పెట్టాలో, ఏమో! అది చూస్తున్న వెబ్‌సైట్‌లన్నింటినీ బ్లాక్‌ చేసేందుకు నాకు ఒక్క నిమిషం చాలు. కానీ అలా చేయడం వలన పిల్ల మొండికేసే ప్రమాదముంది.
ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదు. ఎవరో ఒకరితో పంచుకోకపోతే... ఈ టెన్షన్‌ భరించలేననిపించి... ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాను.

*  *  * 

ఉదయం ముగ్గురమూ కలిసి టిఫిన్‌ తింటుండగా ‘‘ఏమండీ, మరో రెండు ఇడ్లీలు వేయనా’’ అని అడుగుతుండగానే సెల్‌ఫోన్‌ మోగడంతో, స్క్రీన్‌పై పేరు చూసి వెంటనే స్పీకర్‌ ఆన్‌చేస్తూ ‘‘నాన్నా, నువ్వూ అమ్మా ఎలా ఉన్నారు? మీరిద్దరే ఒంటరిగా ఊళ్లో ఉండొద్దనీ, మా వద్దకి వచ్చేసేయమనీ ఎన్నిసార్లు చెప్పినా వినలేదు మీరు. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వల్ల మేము మీ దగ్గరకీ, మీరు మా దగ్గరకీ వచ్చేందుకు వీల్లేకుండాపోయింది. అంతా ఒక్కచోటే ఉంటే అందరికీ ధైర్యంగా ఉండేదికదా’’ అన్నారాయన.
‘‘నిజమేరా మేమూ అదే అనుకుంటున్నాము. నిన్న రాత్రి, మీ అమ్మకి గుండెల్లో ఆయాసంగా ఉందంటేనూ, మన పక్కింటి భరద్వాజ అంకుల్‌ కొడుకు డాక్టర్‌ అర్జున్‌ తెలుసుగా, వాడి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లాము. గుండెనాళాలు మూసుకుపోయాయట. త్వరలో స్టెంట్‌ వేయవలసి ఉంటుందని చెప్పి, ప్రస్తుతానికి వాడమంటూ మందులిచ్చారు’’ అన్న మావయ్యగారి మాటలకి అంతా కంగారుపడ్డారు.
బామ్మకి ఒంట్లో బాలేదన్న మాట వింటూనే ‘‘తాతయ్యా, నేను అర్జెంటుగా బామ్మని చూడాలి’’ అంటూ జాన్వి ఏడ్చేసింది. దానికి వాళ్ల బామ్మ అంటే ప్రాణం. పసితనంలో అయిదేళ్లపాటూ అది వాళ్ల దగ్గరే పెరిగింది. ఇప్పటికీ ఏ రెండురోజులో సెలవులు కలిసొస్తే వెంటనే బామ్మదగ్గరకి వెళ్దామంటుందది.
మనవరాలి ఏడుపు వింటూనే ‘‘నేనిప్పుడు బాగానే ఉన్నానే అమ్మడూ, నువ్వు ఏడవకు. అయినా ఈ కరోనా గోల సద్దుమణిగాక మేమే అక్కడికొచ్చేస్తామమ్మా’’ అంటూ అటునుండి అత్తయ్యగారు జాన్విని ఓదార్చింది.
‘‘అవునత్తయ్యా, మీరిద్దరూ ఎంత త్వరగా ఇక్కడికి వచ్చేస్తే అంత మంచిది. ఇక్కడైతే పెద్ద డాక్టర్లు ఉంటారు. మంచి ట్రీట్మెంట్‌ దొరుకుతుంది’’ అన్నాను నేను.
‘‘నేనూ, మీ మావయ్యకి అదే చెబుతున్నానమ్మా. సమయానికి అర్జున్‌ అందుబాటులో ఉన్నాడు కాబట్టి సరిపోయిందిగానీ, లేకుంటే ఈ కరోనా కాలంలో నన్ను ఆస్పత్రిలో చేర్చడం మీ మావయ్య ఒక్కరివల్లా ఎంత కష్టమయ్యేదో ఊహించుకుంటేనే నా గుండెలు అదురుతున్నాయనుకో. నిన్న రాత్రి ఆస్పత్రిలో కిక్కిరిసి ఉన్న పేషెంట్లకి ఓపిగ్గా వైద్యం చేస్తున్న డాక్టర్లనందరినీ చూశాక ‘దైవం మానుష రూపేణా’ అన్న మాటకి నిజమైన అర్థం తెలిసొచ్చింది. ప్రతీ ఇంట్లోనూ ఒక డాక్టర్‌ తప్పక ఉండాలనిపించింది. అమ్మడూ, వింటున్నావా? నువ్వు బాగా చదివి డాక్టర్‌వి కావాలి. నీ వైద్యంతో రోగుల జబ్బులని నయం చేసి వాళ్ల గుండెల్లో నిలిచిపోవాలి. నీ చేతి వైద్యంతో నేను నిండు నూరేళ్లు హాయిగా బతకాలి, సరేనా’’
ఆవిడ మాటలకి బాగా కదిలిపోయిన జాన్వి ‘‘తప్పకుండా బామ్మా. నేను బాగా చదివి డాక్టరునై, మిమ్మల్నందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను’’ అంటూ ఆవిడకి వెంటనే మాట ఇచ్చేసింది.
మరో పదినిమిషాలు మాట్లాడి ఫోన్‌ పెట్టేశాక ‘‘కారులో వెళ్లి బామ్మనీ, తాతయ్యనీ త్వరగా తెచ్చేసుకుందాం నాన్నా’’ అన్న జాన్వితో ‘‘అలాగే తల్లీ’’ అన్నారాయన.
ఆ తర్వాత జాన్వి గదిలోకి వెళ్లిన నాకు, పుస్తకాలతో కుస్తీ పడుతూ కనిపించింది.
నన్ను చూస్తూనే గబగబా లేచొచ్చి నా రెండు చేతులూ పట్టుకుంది.
‘‘సారీ అమ్మా, నెలరోజుల నుండీ నేను ఆన్‌లైన్‌ క్లాసులని సరిగ్గా అటెండవలేదు. అందుకే, మొన్నటి పరీక్షల్లో నాకు తక్కువ మార్కులు వచ్చాయి. అంతా ఆ పిచ్చి వీడియోల మూలంగానే అమ్మా! మా స్కూల్‌మేట్‌ ఐశ్వర్య ఉందే, తనే ఆ వీడియోల లింకులన్నీ నాకు పంపించింది. ‘జానూ, నీ అందానికి నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, బాలీవుడ్‌లో’ అంటూ రోజూ ఫోనులో నన్ను బాగా ఎంకరేజ్‌ చేసిందది. దాంతో నేనూ టెంప్ట్‌ అయ్యాను. బామ్మమాటలు విన్నాకగానీ నా తప్పు నాకర్థం కాలేదు. ఇకనుండీ బాగా చదువుకుంటానమ్మా.’’
ఆ మాటలకి నా మనసులోని వేదనంతా మాయమైపోగా ‘‘శంఖంలో పోస్తేనే తీర్థమన్నట్టుగా, బామ్మ చెబితేనేగానీ ఏ విషయమూ అమ్మాయిగారి మనసుకెక్కదన్నమాట’’ అన్నాను దాని బుగ్గలని సాగదీస్తూ.
‘‘మరే, బామ్మమాట బంగారుబాట కదా’’ చిలిపిగా అంటున్న జాన్విని మురిపెంగా దగ్గరికి తీసుకుంటూ, క్లిష్టమైన సమస్యని చిటికెలో పరిష్కరించిన మా అత్తయ్యగారికి మనసులోనే ప్రణామాలర్పించుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.