close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విచిత్రబంధం

ప్రియ, ప్రీతమ్‌ భార్యాభర్తలు. భార్యని అపురూపంగా చూసుకుంటూ మెడిసిన్‌ చదివిస్తాడు ప్రీతమ్‌. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలోకి చిన్నారి పాపాయి రాబోతున్న వేళ భర్త గురించి ప్రియకు తెలిసిన ఒక విషయం కల్లోల కారణమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకోవడం తన బలహీనత అనీ జీవితం ఉన్నదే కొత్త అనుభవాలను శోధించ డానికనీ చెబుతాడు ప్రీతమ్‌. ప్రియకి అది నచ్చదు. దాంతో విడాకుల కోసం కోర్టుకెళ్లారు. భార్యాబిడ్డల్ని బాధ్యతగా చూసుకుంటాను కానీ భర్త అనే బంధం నుంచి తనకు స్వేచ్ఛ కావాలని కోరతాడు ప్రీతమ్‌. వారి కథ ఏ కంచికి చేరిందో తెలియాలంటే నవల చదవాలి. కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ‘కోర్టు న్యాయస్థానమే కానీ న్యాయ కార్ఖానా కాదు. అన్యాయాన్ని కరిగించి న్యాయాన్ని పోత పోయదు’- లాంటి వాక్యాలు ఆకట్టుకుంటాయి.

- సుశీల

విరోధాభాస (నవల)
రచన: ఝాన్సీ కొప్పిశెట్టి
పేజీలు: 164; వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఉపాధ్యాయుడి జీవితం

తడో నిజాయతీగా పనిచేసే బడిపంతులు. దిగువ మధ్యతరగతికి చెందిన ఆయన ఉద్యోగ జీవితం ఎక్కువ కాలం పల్లెల్లో తనకు చిరపరిచితమైన సామాజిక వాతావరణంలోనే గడిచింది. హఠాత్తుగా ఆయన్ని ఓ పట్టణంలోని పెద్ద బడికి బదిలీ చేశారు. కలవరపెడుతున్న ఆలోచనలతో ఆ బడిలో ప్రవేశించిన ఉపాధ్యాయుడికి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఎప్పటిలా తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలిగాడా... ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన వివిధ కోణాలను వివరంగా చర్చిస్తుంది ‘స్వర్ణధార’ నవల. కేవలం తొమ్మిది నెలలే ఆ పట్టణంలో పనిచేసినా ఎన్నో అనుభూతులను పదిలపర్చుకుని పదోన్నతితో తిరిగి తాను కోరుకున్న పల్లె జీవితానికి వెళ్లిపోయిన ఆ ఉపాధ్యాయుడు తన కథతో పరోక్షంగా పల్లెల పరిస్థితుల్నీ ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతల్నీ చర్చకు పెడతాడు.  కథ ఆసాంతం చదివిస్తుంది. ఆలోచన రేకెత్తిస్తుంది.

- పద్మ

స్వర్ణధార (నవల)
రచన: ద్వారకా
పేజీలు: 240; వెల: రూ. 200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు 


మరో కోణం

మస్య ఏదైనా దాన్ని మరో కోణంలో నుంచి చూస్తే పరిష్కారాలు సులువని చెబుతారు రచయిత్రి ఈ కథల్లో. కోడలు తనతో మాట్లాడదని కళ్లనీళ్లు పెట్టుకున్న అక్క, మంచంలో ఉన్న తల్లికి సేవలు చేసి ఆఫీసుకు ఆలస్యంగా వచ్చి అవమానాలు భరించే రాజారావు- ఇద్దరి సమస్యల్ని మూర్తి ఎలా పరిష్కరించాడో చెబుతుంది ‘మనసుకు చికిత్స’. కన్నకొడుకూ మనవడూ కలిసి ముసలి తల్లిని బస్టాండులో వదిలేసి పోయారు. ఆమేమో ఆశ్రమంలో బట్టలు కుట్టి సంపాదించిన డబ్బుని కొడుక్కి అందజేయాలనుకుంటుంది ‘ఎంతైనా అమ్మ’ కథలో. ఎవరికి వాళ్లు మనకెందుకులే అనుకుంటే సమాజం మారదనీ ఆ మార్పుకి తానే శ్రీకారం చుడతాననీ చెప్పి తల్లిదండ్రుల్ని ఒప్పించి పెద్ద కంపెనీల్లో ఉద్యోగం కాదని కాలేజీ లెక్చరరుగా చేరి పిల్లల్లో తాను కోరుకున్న ‘మార్పు’ తెస్తానంటుంది రమ్య. కథలన్నీ ఆలోచన రేకెత్తిస్తాయి.

- పూర్ణ

మనసుకు చికిత్స (కథలు)
రచన: డా.లక్ష్మీ రాఘవ
పేజీలు: 164; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9440124700


అలనాటి రచనలు

హజ హాస్య చతురతకు పెట్టింది పేరు పానుగంటి. ఆయన జీవిత చరిత్రతో పాటు ఇప్పటివరకు ప్రచురణ కాని రచనలను క్రోడీకరించిన పుస్తకమిది. సప్తతి ఉత్సవం జరిగేనాటికే ఆయన మానసిక పరిస్థితి అదుపు తప్పిందట. అటువంటి పరిస్థితిలోనూ ఉత్సవ సందర్భంగా ఏవో బహు మతులిస్తుంటే ‘ఉన్న ఒక్క మతి పోయి నేనేడ్చుచున్న ఈ సందర్భములో బహు‘మతు’లేల’ అని చమత్కరించారట పానుగంటి. శ్రీరామా, రామరాజు, శివరామా... ఇలా పాత్రల పేర్లే కథల శీర్షికలుగా పెట్టి ఆయన రాసిన పది కథలతో పాటు చివరన ఉన్న హాస్యకథ హాయిగా నవ్విస్తుంది. ఓ స్నేహితుడికి చిత్రమైన కల వచ్చింది. ఏకంగా నన్నయ, తిక్కనలే వచ్చి చర్చలు జరిపిన కల. ఆ కథంతా చెప్పి కావ్యంగా రాయమని అడిగాడట స్నేహితుడు. అదే ‘స్వప్నకావ్యం’. ఆనాటి భాషాసౌందర్యానికీ పానుగంటి హాస్య చతురతకీ అద్దం పట్టే రచనలివి.

- శ్రీ

పానుగంటి లక్ష్మీనరసింహారావు కథలు
స్వప్నకావ్యము, వ్యాసములు
పేజీలు: 239; వెల: రూ. 200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.