close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తేనె మంచి యాంటీబయోటిక్‌!

తేనె మంచిదని ఆయుర్వేదం ఎప్పటినుంచో చెబుతుంది. తరచూ దగ్గూ జలుబూ వచ్చే పిల్లలకు కాస్త తేనె నాకించమనేవారు వెనకటి తరం బామ్మలు. క్రమంగా ఆ అలవాటు తగ్గిపోయింది. అయితే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఉపరితల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చే కొద్దిపాటి దగ్గూ జలుబులకి యాంటీబయోటిక్స్‌ అవసరం లేదనీ, వాడినా పెద్దగా ఉపయోగం కూడా ఉండదనీ వాటికన్నా తేనె వల్లే ఎక్కువ ఉపశమనం ఉంటుందనీ అంటున్నారు. తేనెలో యాంటీ మైక్రోబియల్‌ గుణాలు ఉంటాయని ఇప్పటికే అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. దాంతో పిల్లలకు దగ్గూ జలుబూ వస్తే ముందు యాంటీబయోటిక్స్‌ ఇవ్వకుండా తేనె తాగించమని బ్రిటన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ కేర్‌ ఎక్సలెన్స్‌ చెబుతోంది. అంతేకాదు, ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకునేందుకు అనేక రకాలుగా పరిశీలించారట. అందులో దగ్గూ జలుబులకి సాధారణంగా ఇచ్చే మందులతో పోల్చి చూస్తే వాటికన్నా తేనె వల్లే బాగా తగ్గినట్లు గుర్తించారు. అయితే అన్ని రకాల తేనె ఒకే విధంగా పనిచేయదట. సంక్లిష్ట చక్కెరలతో అంటే- భిన్న రకాల పుప్పొడులతో కూడిన తేనె మరింత ప్రభావంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.


సాయం చేస్తే ఆరోగ్యానికీ మంచిదే!

కొందరిలో దయ, సానుభూతి, సాయం చేసే గుణాలు సహజంగానే కాస్త ఎక్కువుంటాయి. ఈ స్వభావం శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలే చేస్తుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌కు చెందిన పరిశోధకులు. ఈ రకమైన మనస్తత్వం ఉన్నవాళ్లు ఎవరికీ సహాయపడని వాళ్లతో పోలిస్తే ఆనందంగానూ ఉంటారని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే సాయం చేయడంలోనూ తేడాలుంటాయి. తమకుండే సహజ ప్రవృత్తితో చేసేవాళ్లు కొందరయితే, సమాజసేవ చేయాలనుకుని చేసేవాళ్లు మరికొందరు. ఉదాహరణకు ఇరుగుపొరుగు వృద్ధులకి సరకులు తెచ్చివ్వడం, దారిలో ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించడం... ఇలా అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు సాయం చేసేవాళ్లు మొదటి రకమైతే; ఛారిటీలకి విరాళాలు ఇవ్వడం, లేదా సంస్థలు నెలకొల్పడం... వంటివి రెండో కోవకు  వస్తాయి. అయితే పనిగట్టుకుని సమాజ సేవ చేసేవాళ్లకన్నా సందర్భానికి స్పందించి సహాయం చేసేవాళ్లు మరింత ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నట్లు అధ్యయనంలో తేలిందట. అంతేకాదు, దీనివల్ల చిన్నవయసువాళ్లలో మానసిక ఆరోగ్యం బాగుంటే, పెద్దవయసు వాళ్లకి శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రకమైన సహాయగుణం వల్ల మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువ ఆనందంగా ఉంటున్నారట.


కునుకు తీశాక కప్పు కాఫీ..!

రాత్రివేళల్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చాలామంది నిద్ర రాకుండా గంటకోసారి లేదా రెండుమూడు గంటలకోసారి కప్పు కాఫీ తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. దాని ప్రభావం ఆ తరవాతి నిద్రమీదా ఉంటుందనీ అందుకే బాగా నిద్ర వస్తుందీ అనుకున్నప్పుడు ఓ పదీ ఇరవై నిమిషాలు కునుకు తీసి ఆ తరవాత కాఫీ తాగితే బుర్ర చురుగ్గా పనిచేస్తుందట. ఎందుకంటే ఓ కునుకు తీసి మళ్లీ లేస్తే మత్తు వదలనట్లే ఉంటుంది. అప్పుడో కప్పు కాఫీ తాగితే అదంతా పోయి, అందులోని కెఫీన్‌ కిక్కుతో బుర్ర పాదరసంలా పని చేస్తుందని సౌత్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వీళ్లు తెల్లవారుజామున మూడుగంటల సమయంలో ఓ అరగంట పడుకుని లేచాక 200 మి.గ్రా కెఫీన్‌ డోసు ఇచ్చి, 45 నిమిషాల తరవాత వాళ్ల పనితీరుని పరిశీలించగా కెఫీన్‌ డోసు ఇవ్వని వాళ్లకన్నా ఇచ్చిన వాళ్లు అలర్ట్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సో, కునుకు తరవాత కాఫీ మంచిదేనన్నమాట.


ఐరన్‌ ఎక్కువైతే...

శరీరంలో ఐరన్‌ లోపిస్తే రక్తహీనతతోబాటు అనేక సమస్యలు ఎదురవుతాయన్నది తెలిసిందే. అయితే అది ఎక్కువైనా కూడా సమస్యేనట. రక్తంలో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండేవాళ్లలో ఆయుఃప్రమాణం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన జన్యు పరిశోధకులు. ముఖ్యంగా హీమోగ్లోబిన్‌ శాతం తగ్గగానే చాలామంది ఐరన్‌ సప్లిమెంట్లను వాడుతుంటారు. అయితే కొంతకాలం అయ్యాక వాటిని ఆపకుండా నిరంత రాయంగా వాడితే లేనిపోని ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నట్లే. ముఖ్యంగా ఎలాంటి లోపం లేకున్నా వీటిని వాడితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.