close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోక్షి పీఠా... ఎంత అందమైన మిఠాయి!

కొన్ని స్వీట్లు చూడ్డానికి బాగుంటాయి.  మరికొన్ని తింటే బాగుంటాయి. కానీ కళ్లని కట్టిపడేస్తూ చవులూరించే స్వీట్లు కొన్నే ఉంటాయి. ఓ అందమైన అమ్మాయి పొందిగ్గా వాకిట్లో ముగ్గు వేసినట్లో ఏ కళాకారుడో తదేకంగా శిల్పాన్ని చెక్కినట్లో  కనిపించే ఈ బెంగాలీ నోక్షి పీఠా ఆ కోవకు చెందినదే.
బెంగాల్‌ పేరు చెప్పగానే రసగుల్లా, సందేశ్‌, చమ్‌ చమ్‌... ఇలా చాలా రకాల స్వీట్లు గుర్తుకొస్తాయి. కానీ వీటన్నింటినీ మించిన మరో పసందైన మిఠాయి తయారీలోనూ బెంగాలీలది అందెవేసిన చేయి. ఆ అందమైన స్వీటు పేరే నోక్షి పీఠా. ఒకప్పుడు మనదగ్గర బామ్మలు ఎంతో ఓపిగ్గా గోరుమీటీలు చేయడం గుర్తుండే ఉంటుంది. మెత్తగా కలిపిన మైదా లేదా గోధుమపిండిని నెయ్యి రాసుకుంటూ మునివేళ్లతో నొక్కుతూ పొడవాటి గవ్వల్లా చేసి నూనెలో వేయించి పాకం పట్టేవారు. ఆ తరవాత రకరకాల ఆకారాల్లో చేసుకోగలిగే గవ్వల బల్లలు రావడంతో క్రమంగా అవి కనుమరుగైపోయాయి. అలాగే బెంగాలీ మహిళలు ఎంతో ఓపికగా ఈ నోక్షి పీఠా వంటకాన్ని చేత్తోనే చిన్న పుల్ల సాయంతో రకరకాల డిజైన్లలో చేసేవారు. ఇప్పటికీ అక్కడి గ్రామీణ మహిళలూ ఇంట్లోని పెద్దవాళ్లూ ఈ వంటకాన్ని చేస్తుంటారు. కానీ వీటికి ఓపికా సమయం కావాలన్న కారణంతో చాలామంది దీన్ని మర్చిపోయారు. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోనూ యూట్యూబుల్లోనూ ఆసక్తిపరులు వీటి ఫొటోలూ తయారీ గురించి పోస్టులూ పెట్టడంతో ఇది మళ్లీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఎలా చేస్తారు?
నోక్షి పీఠా... తూర్పు బెంగాల్‌ అంటే నేటి బంగ్లాదేశ్‌ గ్రామాల్లో పుట్టిన మిఠాయి. మరిగించిన నీళ్లలో బియ్యప్పిండి వేసి ఉడికించి చల్లారిన తరవాత బాగా కలిపి పిండిని చిన్న ముద్దలుగా చేసి వాటికి నెయ్యి లేదా నూనె రాస్తూ నున్నని రాయి లేదా అరిటాకుమీద వేసి కావలసిన సైజులో మందపాటి పూరీలా వత్తి, దానిమీద సన్నని టూత్‌పిక్‌ లేదా అందుబాటులో ఉన్న ఈతముల్లు, తల పిన్ను, చీపురుపుల్ల, సూదులతో ఆకులూ పువ్వులూ లతలూ చేపలూ గవ్వలూ... ఇలా రకరకాల డిజైన్లలో చేస్తారు.


ఇవి చేయడానికి ఓపికతోబాటు సృజనా ఉండాలి. తీసుకున్న పిండిముద్ద పరిమాణాన్ని బట్టి అప్పటికప్పుడు కొత్త డిజైన్లు సృష్టించేస్తుంటారు. చేశాక వచ్చిన రూపాన్ని బట్టి ఒక్కోదానికీ ఒక్కో రకమైన సార్పస్‌, కన్యాముఖి, జామై ముఖి, తామరపువ్వు, కాజల్‌లత, హిజలపట అంటూ పూలూ పక్షులూ చేపల పేర్లను పెడతారు. ఆ తరవాత వీటిని జాగ్రత్తగా కాగిన నూనెలో వేసి వేగాక పంచదార లేదా బెల్లం పాకం పట్టి అందులో ముంచి తీస్తారు. తమదైన పద్ధతిలో చేసే ఈ నోక్షి పీఠాను పండగలూ వేడుకల సమయంలోనే కాదు, అన్నప్రాశన సమయంలో- బియ్యంతో చేసిన మిఠాయి మంచిదన్న కారణంతో పసిపిల్లల నోటిని తీపి చేసేందుకూ చేస్తారట. వీటినే పాకం పట్టకుండా కారం గవ్వలూ జంతికల్లా కూడా చేస్తుంటారట. బాగుంది కదూ... ఓపిక ఉంటే చేసి చూడండి మరి!


మీ ఇంటికే వస్తారు... ఏ పనైనా చేసిపెడతారు!

ఇంట్లో ఏవైనా రిపేర్‌కి వచ్చినపుడు ఎలక్ట్రీషియన్‌నో ప్లంబర్‌నో వెతికి పట్టుకుని మనకు కుదిరిన సమయంలో పనులు చేయించుకోవడం చాలా ప్రయాసతో కూడుకున్నది. ‘అందుకే మేమున్నాం... మీక్కావల్సిన పనులు నిశ్చింతగా చేసి పెడతాం’ అంటున్నారు అర్బన్‌ కంపెనీ వ్యవస్థాపకులు. ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, సెలూన్‌, బ్యూటీ, యోగా, పెయింట్లు, హౌస్‌కీపింగ్‌ వంటి దాదాపు 110కిపైనే పనులను ఇంటి వద్దే చేయించుకోవడానికి నిపుణులను అందుబాటులోకి తెచ్చిందీ సంస్థ.

గర జీవితమంటేనే కాళ్లకు చక్రాలు కట్టుకుని పరుగులు పెట్టేది. దాదాపు చాలా ఇళ్లలో ఆడామగా ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిందే. ఈ క్రమంలో ఇంటిపట్టున సెలవు రోజుల్లో తప్ప మిగతా సమయాల్లో ఉండటానికి కుదరదు. ఆ సమయంలోనే ఇంట్లో పనులు చూసుకోవడానికి కుదురుతుంది. మరి మనకి కుదిరినప్పుడే మన ఇంట్లో కావల్సిన పనులు చేసేవాళ్లకి కూడా కుదరాలిగా. అదే అర్బన్‌ కంపెనీ ఆప్‌ ఫోన్‌లో ఉంటే అవన్నీ సాధ్యమే. ఆప్‌లోకి వెళ్లి ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, సెలూన్‌, యోగా నిపుణులు, పెయింట్లు వేసేవారు, పెస్ట్‌ కంట్రోల్‌, హౌస్‌కీపింగ్‌ పనులు చేసేవారు, కార్పెంటర్లు, ఇంటీరియర్‌ డిజైనర్లు... ఇలా ఇంటి పనులు చేసిపెట్టేవారిని సంప్రదించి పనులన్నీ చేయించుకోవచ్చు. ఈ ఆప్‌ దాదాపు 110కి పైగా సేవలు అందించే 25000 మంది నిపుణుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ దిల్లీ, హైదరాబాద్‌, వైజాగ్‌, ముంబయి, బెంగళూరు, చెన్నై...  వంటి 20 నగరాల్లోనూ... అమెరికా, సిడ్నీ, దుబాయ్‌, అబుదాబీ, సింగపూర్‌ వంటి చోట్లా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2014లో దిల్లీకి చెందిన అభిరాజ్ భల్‌, వరుణ్‌ ఖైతాన్‌, రాఘవ చంద్రలు అర్బన్‌ క్లాప్‌ పేరుతో ఈ సంస్థను ప్రారంభించారు. తాజాగా ఈ సంస్థ పేరు అర్బన్‌ కంపెనీగా రూపాంతరం చెందింది.

ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేసిన ముగ్గురు స్నేహితులూ కొన్నాళ్లు విదేశాల్లో పని చేసి మనదేశానికి వచ్చారు. ఇక్కడ ఏదైనా వినూత్నంగా చేయాలని ఆలోచించినపుడు... వాళ్ల ఇళ్లలో ఎదుర్కొన్న ఓ కామన్‌ సమస్యే వాళ్లకి పరిష్కారం చూపింది. చాలాసార్లు వాళ్ల ఇళ్లలో ఎలక్ట్రీషియనో, ప్లంబరో అవసరమొచ్చినప్పుడు ఆ టెక్నీషియన్లను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి పని చేయించు కోవడం... ఈ క్రమంలో పడిన ఇబ్బందులన్నీ గుర్తు చేసుకున్నారు. దాంతో అలాంటి పనులతోపాటు ఇళ్ల వద్ద సర్వీస్‌ ఇవ్వగల మరికొన్నింటి జాబితానూ తయారుచేసుకున్నారు. అలానే దిల్లీలోని గేటెడ్‌ కమ్యూనిటీలూ, అపార్ట్‌మెంట్లలో సర్వే నిర్వహిస్తే ట్యూటర్లు, యోగా ట్రైనర్లు, మసాజ్‌ థెరపీ వంటి సేవలు అందించేవారి వివరాలు కూడా ఇవ్వమని అడిగారు. అలా పలువురి సూచనలూ సలహాలతో రూ.30 లక్షల పెట్టుబడి పెట్టి అర్బన్‌ కంపెనీకి శ్రీకారం చుట్టారు. మొదట వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసి పలువురు టెక్నీషియన్లను భాగస్వాముల్ని చేసుకున్నారు. రోజురోజుకీ టెక్నీషియన్ల సంఖ్యా, సేవలు అందించే రంగాలూ పెరుగుతూ ఉండేవి. అప్పుడే కొన్ని కార్పొరేట్‌ సంస్థల దృష్టి అర్బన్‌ కంపెనీపై పడటంతో కోట్లలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అలా అందిన రూ.7.18 కోట్లతో మరిన్ని నగరాల్లోని ప్రజలకు అర్బన్‌ కంపెనీని పరిచయం చేశారు. అలానే ఆప్‌ను కూడా రూపొందించి మరింత మంది వినియోగదారుల్ని ఆకట్టుకోగలిగారు. ప్రస్తుతం 50 లక్షల మందికి చేరువైన ఈ సంస్థ వార్షికాదాయం రూ.216కోట్లపైమాటే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.