close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సగం పానకమే స్వీకరించే స్వామి!

కొండ గుహలో స్వయంభువుగా వెలసి భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్నాడు ఖమ్మం జిల్లాలో కొలువైన పానకాల లక్ష్మీ నరసింహస్వామి. పేరుకు తగినట్లుగానే ఈ స్వామి పానకాన్ని స్వీకరిస్తాడు కానీ... ఎంత పాత్రతో పోసినా, సగం మాత్రమే తీసుకుని మిగిలింది వదిలేస్తాడని అంటారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఈ క్షేత్రం తెలంగాణ మంగళగిరిగా గుర్తింపు పొందడం విశేషం.
పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం... ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట సమీపంలో ఉంది. ఇక్కడ స్వామి వెలసిన గుట్ట ఏనుగు ఆకారంలో ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని గజగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అనీ... ఈ స్వామి నిత్యం పానకం సేవించటం వల్ల పానకాల స్వామి ఆలయమనీ భక్తులు పిలుస్తారు. నోరు చక్కగా కనిపిస్తూ తూర్పు ముఖంగా నామాల రూపంలో దర్శనమిస్తాడు లక్ష్మీనరసింహుడు. ఈ స్వామి నోట్లో పానకాన్ని పెద్ద బిందెతో పోసినా చిన్న చెంబుతో పోసినా సగం మాత్రమే స్వీకరిస్తాడనీ... మిగిలింది భక్తులకు వదిలేస్తాడనీ అంటారు.

స్థలపురాణం...
సుమారు 500 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని భూపతిరెడ్డి అనే జమిందారు పాలించేవాడు. అతడికి సంతానం లేకపోవడంతో తన ఇష్టదైవమైన నరసింహస్వామిని పూజించాడట. ఓసారి అతడికి స్వామి కలలో కనిపించి తాను ఆకాశంలో నక్షత్ర రూపంలో ఉన్నాననీ... అది అదృశ్యమయ్యే ప్రాంతంలో తనకు గుడి కట్టిస్తే సంతానం కలుగుతుందనీ చెబుతాడట. ఆ తరువాత జమిందారు అంతఃపురం నుంచి బయటకు వచ్చి పండితుల సాయంతో ఆకాశంలో చూస్తే ఓ వెలుగు కనిపించిందట. కాగడాల వెలుతురులో అనుసరిస్తే ఆ వెలుగు అందరూ చూస్తుండగానే సీతంపేట గుట్టల వరకూ వెళ్లి అదృశ్యమైందట. ఆ గుట్టప్రాంతాన్ని పరిశీలిస్తే అక్కడ స్వామి విగ్రహం కనిపించిందట. దాంతో అక్కడే జమిందారు ఆలయాన్ని కట్టించాడట. తరువాత ఆ భక్తుడికి సంతానం కూడా కలిగిందట. అది జరిగిన కొన్నాళ్లకు ఓ భక్తుడిని ఆవహించిన స్వామి తనకు దాహంగా ఉందనీ.. పానకం చేసి పోయమనీ ఆజ్ఞాపించాడట. జమిందారు అప్పటికప్పుడే కొన్ని బిందెల పానకాన్ని తయారు చేయించి అతడి నోట్లో పోశాడట. సగం పానకాన్నే తాగిన ఆ భక్తుడు మిగిలిన దాన్ని వదిలేశాడట. ఆ తరువాత స్వామికి కూడా అదేవిధంగా పానకాన్ని నివేదిస్తే సగం మాత్రమే స్వీకరించాడట. అప్పటినుంచీ స్వామికి పానకాన్నే నివేదించడం మొదలుపెట్టారట. ఓసారి శిస్తు వసూళ్లకు వచ్చిన ఓ అధికారి స్వామి పానకం తాగే విషయాన్ని నమ్మకపోగా పరిహసిస్తూ విగ్రహం నోట్లో వేలు పెట్టాడట. అందరూ చూస్తుండగానే స్వామి అతడి వేలును నోటితో గట్టిగా పట్టుకున్నాడట. అర్చక స్వాముల సూచనల మేరకు ఆ అధికారి స్వామిని వేడుకోగా వేలు బయటకు వచ్చిందనీ... దాంతో సదరు అధికారి జమిందారు అనుమతితో గుట్ట చుట్టుపక్కల కనుచూపు మేర ఉన్న భూమిని స్వామికి కానుకగా సమర్పించాడనీ మరో కథా ప్రాచుర్యంలో ఉంది.


స్వామి కల్యాణం...
ఇక్కడ ఆలయంలో స్వామికి అభిముఖంగా బండరాయిపైన పడమర పైపు చూస్తూ రంగనాథస్వామి కనిపిస్తాడు. అలాగే ఉత్తరముఖాన వరాహస్వామి ఒంటికాలిపైన ఉండి... లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొన్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. సాధారణంగా గర్భగుడి సింహద్వారం ముందు భాగంలో ఉండే ద్వారపాలకుల విగ్రహాలు భక్తుల పైపు చూస్తూ ఉంటే... ఇక్కడ మాత్రం వేర్వేరు దిక్కులు చూస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఆలయ ముందుభాగంలో ఉన్న ఆంజనేయ విగ్రహం ఎదుట రామపాదాలు కనిపిస్తాయి. ఇదే గుట్టపైన కొంచెం పైకి వెళ్తే మరో చిన్న గుహలో సీతమ్మ పాదాలనూ చూడొచ్చు. ఈ ఆలయంలో కొన్ని శతాబ్దాలుగా పూజా కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి నిర్వహించడం విశేషం. ప్రతి ఏటా హోళీ పౌర్ణమి రోజు రాత్రి స్వామి కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.

-చావా అరుణ్‌కుమార్‌, న్యూస్‌టుడే చింతకాని ఖమ్మం


వేడినీటి బుగ్గల్లో అన్నం వండేస్తారు!

రమశివుడూ, గురునానక్‌ ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం మణికరన్‌. అది హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పార్వతీ లోయ అని పిలిచే ఆ ప్రాంతం బియాస్‌, పార్వతీ నదుల మధ్యలో ఉంటుంది. ఇక, మణికరన్‌లోని వేర్వేరు ఆలయాల్లో శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి పూజలందుకుంటారు. మరోపక్క గురునానక్‌ కొలువుదీరిన గురుద్వార్‌ ఉంటుంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు సందర్శించే మణికరన్‌లో వేడినీటి బుగ్గలు ఓ అద్భుత సృష్టి. ఎముకలు కొరికే చలిలో సైతం ఆ బుగ్గల్లోని నీళ్లు పొగలు కక్కుతాయి. బిందెల్లో బియ్యం వేసి ఎసరు పోసి ఆ నీళ్లలో ఉంచితే కాసేపట్లో అన్నం ఉడుకుతుంది. పప్పు కూడా ఉడికిపోతుంది. అలా వండిన అన్నం, పప్పులనే గురుద్వార్‌లో నిత్యం గురు నానక్‌కు నైవేద్యంగా పెడతారు. లంగరులో అన్నదానానికీ అలా వండిన అన్నమే ఉపయోగిస్తారు. మరో బుగ్గలో భక్తులు స్నానమాచరిస్తారు. ఎందుకంటే ఆ వేణ్నీళ్లలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఆ వేడి నీటి మర్మం వెనక శివపార్వతుల మహత్యం ఉందని హిందువులు నమ్మితే... అదంతా గురునానక్‌ మాయ అని సిక్కులు విశ్వసిస్తారు.

అయితే ఆ లోయలో జియోథర్మల్‌ ఎనర్జీ (భూఉష్ణ శక్తి) కారణంగా భూమి కింద రాళ్లు వేడెక్కడంతో బుగ్గల్లో నీళ్లు కూడా వేడిగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చేశారు. మరి ఈసారి కులూ మనాలీ వెళ్లి నప్పుడు ఈ ప్రకృతి అద్భుతాన్ని అస్సలు మిస్‌ అవ్వకండి.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.