close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫోను ఛార్జింగ్‌కు పువ్వుల ఫ్రేము

ఫోను ఛార్జింగ్‌ పెట్టుకోవాలనుకున్నప్పుడు... స్విచ్‌బోర్డుకు దగ్గరగా అర, బల్ల లేదా మంచం ఉండేలా చూసుకుంటాం. కానీ అన్నిసార్లు అలా కుదరక పోవచ్చు. అలాంటప్పుడు ఈ రంగురంగుల ఫ్రేములను స్విచ్‌బోర్డుకు తగిలిస్తే సరి. ఈ ఫ్రేముకు ఉండే అరలో ఫోను పెట్టుకుని, ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఈ ఫ్రేములపైన పువ్వులూ, పక్షుల్లాంటి డిజైన్లూ ఉంటాయి కాబట్టి పని అయిపోయాక కూడా అలాగే వదిలేయొచ్చు. స్విచ్‌బోర్డు కూడా కొత్తగా కనిపిస్తుంది. 


పిల్లలకు బొమ్మల శానిటైజర్‌

కరోనా నుంచి తప్పించుకునేందుకు రోజులో కుదిరినప్పుడల్లా చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్‌ రాసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. పెద్దవాళ్లు సరే... పిల్లలకే చేతులు కడుక్కోండి అంటూ అదేపనిగా చెప్పాల్సి ఉంటుంది. అలా గుర్తుచేయకుండా వాళ్లే ఇష్టంగా ఆ పని చేయాలంటే... చిన్నచిన్న శానిటైజర్‌ సీసాలు తెచ్చి, వాటికి పిల్లలు ఎంతో ఇష్టపడే డోరెమాన్‌, మిక్కీ, మంకీ... వంటి రకరకాల కార్టూన్‌ బొమ్మలున్న తొడుగులను వేసి ఇచ్చేయండి. చూడ్డానికి ముచ్చటగా ఉండటమే కాదు... పదే పదే శానిటైజర్‌ వాడమని గుర్తుచేయాల్సిన పని ఇక పెద్దవాళ్లకు ఉండదు. 


కప్పును మడిచేయొచ్చు

ఆఫీసులో లేదా ఎక్కడికైనా వెళ్లినప్పుడు ప్లాస్టిక్‌ కప్పుల్లో టీ/కాఫీని తాగాలంటే మనసొప్పదు. అలాఅని ఇంట్లో వాడే కప్పుల్ని అన్నిసార్లూ బ్యాగులో వేసుకునీ వెళ్లలేం. అ సమస్యకు పరిష్కారంగానే ఇప్పుడు ఫోల్డబుల్‌ కప్పులు దొరుకుతున్నాయి. వీటిని వాడుకున్నాక నొక్కినట్లు చేస్తే చిన్న డబ్బా లేదా మూతలా మారిపోతాయి. స్టీలు, సిలికాన్‌, ప్లాస్టిక్‌లలో దొరికే ఈ కప్పులకు మూతలు కూడా ఉంటాయి. పైగా బ్యాగులో వేసుకుంటే ఎక్కువ చోటూ ఆక్రమించుకోవు.


కుషనే దుప్పటిలా!

సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడో, ఏ పుస్తకమో చదువుతున్నప్పుడో కునుకు తీయాలని అనిపిస్తే వెంటనే అక్కడున్న కుషన్‌ని తలకింద పెట్టుకుంటాం. మరి దుప్పటి కావాలనిపిస్తే...? పడకగదిలోకి వెళ్లకుండా ఆ కుషన్‌నే కప్పేసుకోగలిగితే భలే ఉంటుంది కదూ. అదెలా సాధ్యం.... కుషన్‌ దుప్పటి ఎలా అవుతుందనే ఆశ్చర్యం వద్దు. ఇప్పుడు అలాంటి టూ ఇన్‌ వన్‌ కుషన్‌ బ్లాంకెట్లు వస్తున్నాయి. చూడ్డానికి అది కుషనే అయినా... అవసరాన్ని బట్టి దుప్పటిగానూ మారిపోతుంది. అదెలా అంటే... దుప్పటినే కుషన్‌గా మార్చి అంచులకు జిప్‌ పెట్టేస్తారు. దాన్ని తెరిస్తే దుప్పటి రెడీ అయిపోతుంది. రకరకాల రంగులూ డిజైన్లలో దొరికే ఈ కుషన్‌లను నాలుగైదు కొని పెట్టుకుంటే... మనకు నచ్చినట్లుగా రెండు రకాలుగానూ వాడుకోవచ్చు.


ప్రపంచయుద్ధం నాటి కెమెరాలూ ఉన్నాయ్‌..!

కొందరికి రకరకాల పెన్నులు సేకరించడం ఇష్టమైతే... మరికొందరికి స్టాంపుల్ని సేకరించడం ఓ అభిరుచి. అరుదైన వస్తువులను ఎంత ఖరీదు పెట్టైనా కొనేవాళ్లూ ఉంటారు. ఇలాంటివారి జాబితాలోకే వచ్చినా కొద్దిగా భిన్నం దిలీష్‌ పరేఖ్‌. ముంబయికి చెందిన ఈ నగల వ్యాపారి ఇప్పటివరకూ 4,600 కెమెరాలు సేకరించి... రెండుసార్లు గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు.

అది 2003. అప్పటికే దిలీష్‌ దగ్గర 2,634 కెమెరాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎవరి దగ్గరా అన్ని కెమెరాలు లేకపోవడంతో గిన్నిస్‌ రికార్డు సాధించాడు. సరిగ్గా నాలుగేళ్ల తరువాత వాటి సంఖ్యను 4,425కి పెంచి రెండోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి దగ్గర 4,600 కెమెరాలు ఉంటే... ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. ఓ వైపు చిన్నస్థాయి నగల వ్యాపారిగా, మరోవైపు ఫొటోజర్నలిస్ట్‌గా పనిచేసే అతడికి తన తాతవల్లే ఇలా కెమెరాలు సేకరించే ఆలోచన వచ్చిందట. కొన్నేళ్లక్రితం నిండా ఇరవైఏళ్లు కూడా లేని దిలీష్‌కు అతడి తాత తాను సేకరించిన 600 కెమెరాలను ఇచ్చి... వాటిని అమ్మొద్దనీ, వీలైతే మరికొన్ని సేకరించమని చెప్పాడట. అలా కెమెరాలపైన ఆసక్తి పెంచుకున్న దిలీష్‌  తరువాత వ్యాపారం చేస్తూనే వీటిని సేకరించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా 1970కి ముందునుంచీ ఉన్న మోడళ్లు ఎక్కడ దొరికినా ధర ఏ మాత్రం ఆలోచించకుండా కొనేసేవాడు.

అలా ఇప్పటివరకూ 4,600 కెమెరాలు సేకరించాడు. దిలీష్‌ దగ్గర సాదా రకాల నుంచీ... లక్షల ఖరీదైన కెమెరాల వరకూ ఉన్నాయి. వాటిల్లో అతడు మొదట సేకరించిన రోల్లీఫ్లెక్స్‌ కెమెరాతోపాటూ లెయికా ఎం3, లెయికా 250 వంటి ఖరీదైనవే కాదు... లైటర్‌, రూపాయి ఆకృతిలో ఉన్నదీ, చొక్కా బటన్‌, వాచీ, బైనాక్యులర్స్‌ కెమెరా, రెండో ప్రపంచ యుద్ధంలో వాడినవీ... ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నింటితో పోలిస్తే టెస్సినా ఎల్‌ కెమెరా అత్యంత చిన్నదనీ అది కేవలం 35 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుందని వివరిస్తూనే... లెయికా ఎం3 ప్రపంచంలోనే అత్యుత్తమమైన కెమెరా అని చెబుతాడు. లెయికా 250ని వేలంపాటలో 80,000 రూపాయలు పెట్టి కొన్నట్లు వివరిస్తాడు.

కానుకగా ఇస్తారట...
బజార్లో దొరికే కెమెరాలు కొనడం వేరు... అరుదైన రకాలు సేకరించడం వేరు కాబట్టి దిలీష్‌ మొదటినుంచీ రకరకాల చోట్ల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నాడు. కొన్నాళ్లు పత్రికలో ప్రకటనలు ఇచ్చినా... క్రమంగా ఫొటో స్టూడియోలూ, చోర్‌బజార్‌తోపాటూ వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు. ఓసారి నాసిక్‌లో నడుచుకుంటూ వెళ్తోంటే చెత్తకుండీలో స్పై కెమెరా కనిపించడంతో వెంటనే దాన్ని తీసుకున్నాడట. అలాగే కొందరు పనికిరావనే ఉద్దేశంతోనూ వాటిని ఇచ్చేస్తుంటారని చెబుతాడు. ‘నేను వీటిని సేకరించడం మొదలుపెట్టినప్పుడు కొందరికి కెమెరాల విలువ తెలియక నాకు అమ్మేసేవారు. ఇప్పుడయితే నా గురించి తెలిసిన ఎంతోమంది కానుకల రూపంలోనూ ఇస్తుంటారు. నా దగ్గర మొదటిసారి జరిగిన పార్లమెంటు సభలో వాడిన కెమెరా కూడా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న కెమెరాల్లో దాదాపు తొంభైరకాలు నా దగ్గరే ఉన్నాయి. అయితే... ఇలాంటి అరుదైన వాటన్నింటినీ సేకరించడమే కాదు వాటిని భద్రపరచడమూ ముఖ్యమే. అందుకే ఖరీదైనవాటిని మా బెడ్‌రూమ్‌లో పెట్టి... మిగిలిన వాటిని కారు గ్యారేజీలో దాస్తుంటా. ఇవి పాడవకుండా అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటా...’ అని చెప్పే దిలీష్‌ మంచి ఫొటోగ్రాఫర్‌ కూడా. ముంబయి దాడుల సమయంలో తన ఆఫీసు నుంచే ఫొటోలనూ తీశాడు. అతడు సేకరించిన కెమెరాలన్నింటినీ అప్పుడప్పుడూ ప్రదర్శనల్లోనూ ఉంచుతుంటాడు. అప్పుడే కాదు, అతడి గురించి తెలిసి కొందరు నేరుగా ఇంటికే వస్తారని చెప్పే దిలీష్‌కి వాటిని అమ్మే ఆలోచన లేదు. ఒకవేళ తాను చనిపోయాక పిల్లలు వాటిని అమ్మాలనుకుంటే.... ఏ ఇబ్బందీ లేకుండా ధరలు నిర్ణయించి పెట్టాడట. కుదిరితే కెమెరాలూ, తాను తీసిన ఫొటోలతో మ్యూజియంని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాననీ ఆ కల ఎంతవరకూ నిజమవుతుందో తెలియదనీ చెబుతాడు దిలీష్‌.

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.