close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కూరగాయల్నీ ఉతికేస్తున్నారు!

ఇది కరోనా కాలం... పచ్చని పైరగాలిని సైతం మనసారా పీల్చనివ్వని కోవిడ్‌ కాలం... పెరట్లోని చెట్టు నుంచి కోసిన పండుని సైతం ఒకటికి పదిసార్లు కడుక్కునే పాడు కాలం... అలాంటి ఈ సమయంలో... మార్కెట్లోంచి తెచ్చిన పండ్లూ కూరగాయల్ని నేరుగా తినడం సంగతి దేవుడెరుగు... వాటిని పట్టుకోవాలంటేనే వణికిపోయే పరిస్థితి. ఎంత కడిగినా వాటిమీద ఇంకేముందో అన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే వాటిని సైతం దుస్తుల్ని ఉతికి ఆరేసినట్లుగా శుభ్రంచేసే మెషీన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వాటిమీద ఓ లుక్కేద్దామా..!
ఒ కప్పుడు చెట్టు నుంచి రాలిన జాంపండుని కనీసం కడగనైనా కడగకుండా దానికి అంటిన మట్టి దులుపుకుని పిల్లలు తినేవారు. ఇప్పుడు కిందపడినవి తినడం వరకూ ఎందుకు... తొడుగులు తొడిగి అద్దాల అరల్లో అందంగా అమర్చిన పండ్లను సైతం కడగకుండా నోట్లో పెట్టుకునే ధైర్యం ఎవరూ చేయరు. వాటి మీద రకరకాల హానికర బ్యాక్టీరియా, ఇతరత్రా సూక్ష్మజీవులు అప్పటికే చేరి ఉండొచ్చు. వాటిని పండించే క్రమంలో వాడే క్రిమిసంహారకాల ముప్పు ఎటూ ఉండనే ఉంది. అందుకే వాటిని ఒకటికి రెండుసార్లు ఉప్పు నీళ్లతో కడుగుతుంటాం. కొత్తగా వాటిమీద వైరస్‌ ఏ మూల దాగి ఉందో అన్న భయమూ తోడయింది. నిజానికి సూక్ష్మజీవులకన్నా పెస్టిసైడ్స్‌ స్ప్రేలే ఎక్కువ ప్రమాదకరం. మహమ్మారి కరోనా కూడా కూరగాయలమీద మూడునాలుగు గంటలకన్నా ఎక్కువ ఉండదట. కానీ వాటికి పట్టి ఉన్న రసాయనాలు నీటితో శుభ్రం చేసినంత మాత్రాన ఓ పట్టానా పోవనీ, వాటి అవశేషాలు ఉండిపోవడం వల్లే క్యాన్సర్లూ అల్సర్లూ కీళ్లనొప్పులూ కాళ్లనొప్పులూ... వంటి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనీ అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వాటిని సమూలంగా తొలగించేందుకు నీటిఫిల్టర్ల మాదిరిగానే ప్రూట్‌ అండ్‌ వెజిటబుల్‌ ప్యూరిఫయర్‌ మెషీన్లూ వస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా ఓజోన్‌ టెక్నాలజీతోనే పనిచేస్తాయి. వాటిల్లో అమర్చిన ఎయిర్‌స్టోన్‌ మెషీన్‌, నీటిలోని ఆక్సిజన్‌ అణువులతో చర్యపొందడం ద్వారా ఓజోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఓజోన్‌ శక్తిమంతమైన ఆక్సిడైజర్‌గా పనిచేస్తుంది. అంటే- ఇది వైరస్‌ కణాల్లోకి ప్రవేశించడం ద్వారా వాటిని నాశనం చేయడంతోబాటు పురుగుమందుల అవశేషాలతో చర్యపొంది వాటినీ తొలగిస్తుంది. అలాగే తాజా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని చేతుల్ని శుభ్రపరచుకున్నట్లే పండ్లనీ కూరగాయల్నీ డిజిన్ఫెక్ట్‌ చేసే శానిటైజర్లూ వస్తున్నాయి.


టార్చ్‌లైట్‌లా..!

ఏ వస్తువైనా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది అనుకుంటారు కొందరు. అలా ఆలోచించేవాళ్లకోసం వస్తున్నవే ఈ పోర్టబుల్‌ క్లీనర్లు. కిర్క్‌షేర్‌ కంపెనీ రూపొందిస్తున్నక్లీన్‌బార్‌ చూడ్డానికి టార్చ్‌లైట్‌లా ఉంటుంది. దీన్ని పండ్లూ లేదా కూరగాయల బౌల్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు. ఓజోన్‌ టెక్నాలజీతోబాటు అల్ట్రాసోనిక్‌ పరిజ్ఞానాన్నీ జోడించి తయారుచేసిన దీన్నుంచి వెలువడే తరంగాలు హానికర క్రిముల్ని శక్తిమంతంగా నిర్మూలిస్తాయట. పైగా ఇది బ్యాటరీతో పనిచేయడం వల్ల ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్లి పోవచ్చు. నీటిలో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేస్తే కూరగాయలమీద ఉన్నవి అన్నీ తొలగిపోగానే దానంతటదే ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అయిపోతుంది. అయాన్‌ ప్యూరిఫికేషన్‌ టెక్నాలజీతో షియామీ కంపెనీ రూపొందించిన పోర్టబుల్‌ క్లీనర్‌ కూడా ఈ కోవకే చెందుతుంది.


గిన్నెలో గొట్టం వేస్తే చాలు!

స్టీలు గిన్నెలో కూరగాయల్ని వేసి కడిగేస్తుంటాం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రెస్టీజ్‌, కెంట్‌ వంటి కంపెనీలు ఓజోనైజర్లను తీసుకొచ్చాయి. చిన్న జార్‌లా ఉండే ఈ మెషీన్‌ను ఆన్‌ చేసి దానికున్న గొట్టంలాంటి పైపును నీళ్లు నింపిన బౌల్‌లో పెట్టి అందులో కూరగాయలు లేదా పండ్లు వేసి, పదీ పదిహేను నిమిషాలపాటు టైమ్‌ సెట్‌ చేస్తే సరి. నీళ్లలో పండ్ల మీద ఉండే బ్యాక్టీరియా, క్రిమి సంహారకాలన్నీ కిందకి తెట్టులా చేరుకుంటాయి. ఇప్పుడు గిన్నెలోనుంచి కూరగాయల్ని తీసి విడిగా మంచినీటితో మరోసారి కడిగాలి. వీటితో కేవలం పండ్లూ కూరగాయలే కాదు, మాంసం, సీ ఫుడ్‌ వంటివన్నీ శుభ్రం చేసుకోవచ్చు. వీటిల్లో టచ్‌ డిస్‌ప్లేవీ ఉన్నాయి.


నీటిబుడగలతో ఆరోగ్యంగా...

ఎయిర్‌ బబుల్‌ వెజిటబుల్‌ క్లీనర్‌ పేరుతో వస్తోన్న ఈ రకం మెషీన్‌ కూడా ఓజోన్‌ను విడుదల చేయడం ద్వారానే పనిచేసినప్పటికీ ఇందులో అమర్చిన ప్రత్యేక టెక్నాలజీ కారణంగా ఇది సూక్ష్మజీవుల్నే కాదు, పురుగు మందుల అవశేషాల్నీ  సమర్థంగా శుభ్రపరుస్తుందట. అత్యంత చిన్న సైజులో వేలకొద్దీ బుడగల్ని వెలువరించడం వల్ల కూరగాయలూ పండ్ల ముడుతల్లో చేరిన అవశేషాల్ని సైతం తొలగిస్తుంది. ఇంకా బుడగలతో శుద్ధి చేయడం వల్ల చెర్రీ, టొమాటోలాంటి మృదువైన పండ్లు సైతం నీటి వేడికి దెబ్బతినకుండా ఎప్పటిలా తాజాగానే ఉంటాయట.


అల్ట్రాసోనిక్‌ తరంగాలతో...

ఓజోన్‌ టెక్నాలజీలానే మరికొన్ని కంపెనీలు అల్ట్రాసోనిక్‌ వెజిటబుల్‌ క్లీనర్లనీ రూపొందిస్తున్నాయి. జర్మనీకి చెందిన హమాషెర్‌ ఈ కోవకే చెందుతుంది. ఈ రకం మెషీన్లలో మనం పండ్లూ లేదా మాంసం ఏదయినా గానీ వేసి నీళ్లు పోసి బటన్‌ ఆన్‌ చేస్తే అల్ట్రాసోనిక్‌ తరంగాలు నీటిలోకి ప్రవహింపచేయడం ద్వారా పండ్లమీద ఉండే మైక్రోఆర్గానిజమ్స్‌, పెస్టిసైడ్స్‌, మట్టీ, ఇతరత్రా రసాయనాలన్నింటినీ పదినిమిషాల్లో తొలగిస్తుంది. తరవాత వాటిని బయటకు తీసుకుని మరోసారి తాజా నీళ్లతో కడిగితే సరిపోతుంది. అందులోని మురికి నీరంతా డ్రెయిన్‌ పంపుద్వారా బయటకు వెళ్లిపోతుంది. వీటిని వంటింట్లోని కిచెన్‌ సింకు లేదా గట్టు ఎక్కడైనా అమర్చుకోవచ్చు.


మూడు రకాలుగా..!

ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ని తలపించేలా ఉండే ఈ రకం ఆటోమేటిక్‌ మెషీన్లలో కడగాల్సిన పండ్లూ లేదా కూరల్ని వేసి స్విచ్‌ ఆన్‌ చేస్తే ఇది ఓజోన్‌ను విడుదల చేయడం ద్వారా బ్యాక్టీరియానీ క్రిమిసంహారకాల్ని వేగంగా నాశనం చేస్తుంది. వీటిల్లో మూడు రకాల మోడ్స్‌ ఉంటాయి. వాషింగ్‌మోడ్‌లో కూరగాయలు, పండ్లు, మాంసం, సీఫుడ్‌, పప్పులు, గింజలు వేటినైనా సరే ఇందులో వేసి శుభ్రంగా కడుక్కోవచ్చు. అప్పటికీ వాటిమీద ఇంకేమైనా మిగిలున్నాయనే అనుమానం ఉంటే డికంపోజిషన్‌ మోడ్‌లో పెడితే వాటికి బలంగా పట్టి ఉన్న పెస్టిసైడ్సూ లోహాలూ అన్నీ పోతాయట. వాటర్‌బాటిళ్లూ, పసిపిల్లల బొమ్మల్లాంటి వాటిని స్టీమ్‌ మోడ్‌లో శుభ్రం చేసుకోవచ్చట.


ఓజోన్‌ జనరేటర్‌!

ఓజోన్‌ స్టెరిలైజర్‌ పేరుతో వస్తోన్న ఈ రకాన్ని ఓజోన్‌ జనరేటర్‌ అనీ అంటున్నారు. దీన్ని కూరగాయలు కడగడానికే కాదు, ఇంటిని శుభ్రం చేసుకోవడానికీ వాడొచ్చు. చిన్న పాత్రలో నీళ్లు పట్టుకుని దీనికి ఉన్న ట్యూబ్‌ని దాంట్లో వేస్తే నీళ్లన్నీ శుభ్రమైపోతాయి. ఆన్‌చేసి పెడితే గదిలోని కలుషితగాలినీ హరించివేస్తుంది. టేబుల్‌మీద పెట్టి దానికి దగ్గరలో పాత్రలు పెడితే, వాటికి అంటిన సూక్ష్మజీవుల్నీ నాశనం చేస్తుంది. దుస్తులు, పిల్లల బాటిళ్లూ ఇలా వేటినైనా శుభ్రపరుస్తుంది. ఇంట్లో ఎక్కడైనా చెడు వాసన వస్తున్నా కిచెన్‌లో చేపలు, రొయ్యలు వంటివి వండినప్పుడు వచ్చే వాసనల్నీ పోగొడుతుందట. వీటిలో కొన్నింటికి రిమోట్‌ కంట్రోల్‌ కూడా ఉంటుంది. దాంతో ఆన్‌ ఆఫ్‌తో బాటు టైమ్‌నీ సెట్‌ చేసుకోవచ్చు.


కూరలకీ వాషింగ్‌ మెషీన్‌!

మినీ వాషింగ్‌ మెషీన్‌ లేదా వాటర్‌ ఫిల్టర్లను తలపించే వెజిటబుల్‌ క్లీనర్లను మరికొన్ని కంపెనీలు తయారుచేస్తున్నాయి. హైడ్రాక్సీ వాటర్‌ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ మెషీన్లలో నీటి అణువులన్నీ అయాన్లుగా మారతాయి. ఆపై ఈ అయాన్లు పెస్టిసైడ్స్‌ బ్యాక్టీరియా కణాల చుట్టూ చేరి వాటితో చర్యపొందడం ద్వారా వాటిని నాశనం చేస్తాయట. టెక్నాలజీ ఏదయినాగానీ ఈ రకం మెషీన్లు కూడా పది నిమిషాల్లోనే ఆహారపదార్థాల్ని శుభ్రంగా ఉతికి ఆరేస్తాయన్నమాట!


పండ్లకి శానిటైజర్‌!

ఇప్పటికే ఇంటినిండా అన్నీ మెషీన్లే అనుకునేవాళ్లకి వాటితో పనిలేకుండా నేరుగా నీళ్లలోకి సుమారు నాలుగైదు చుక్కలు వేసి కడగడం ద్వారా సూక్ష్మజీవుల్నీ పురుగుమందుల్నీ తొలగించగల శానిటైజర్లూ మార్కెట్లో ఉన్నాయి. ఆరోగ్యానికీ పర్యావరణానికీ హాని కలిగించని రీతిలో వీటిని ఎక్కువగా సహజ ఉత్పత్తులతోనే తయారుచేస్తున్నారు. వీటిల్లోనే బ్యాగులో పెట్టుకుని వెళ్లగలిగే చిన్న సైజు మొబైల్‌ బాటిళ్లూ ఉంటున్నాయి. ఎందుకంటే- బయటకు వెళ్లినప్పుడు ఏ పండో తినాలనిపిస్తే అప్పటికే దానిమీద ఏ క్రిములు చేరాయో అన్న భయం వెంటాడుతుంటుంది. అలాంటప్పుడు బ్యాగులోని స్ప్రే తీసి వాటిమీద కొద్దిగా చల్లుకుని చేత్తో ఓసారి రుద్ది కడుక్కుని నిశ్చింతగా తినొచ్చన్నమాట.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.