close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చినుకు జాడ చెప్పేస్తారు!

వాన రాకడ ప్రాణం పోకడ గురించి ఎవరూ చెప్పలేరంటారు. కానీ కాలం మారింది. సాంకేతికత పెరిగింది. చినుకు జాడ గురించి చెప్పే సంస్థలు వచ్చాయి. మన దగ్గర వాతావరణ సమాచారం ఇవ్వాలంటే ఇప్పటివరకూ భారత వాతావరణ శాఖ మాత్రమే ఆ పనిచేసేది. ఆ సంస్థతోపాటు అనేక అంకుర సంస్థలూ వచ్చాయిప్పుడు.


సామాన్యులకు... స్కైమెట్‌

భారత్‌లో వ్యవసాయానికి ప్రధాన ఆధారం వర్షాలే. అందుకే నోయిడా కేంద్రంగా పనిచేసే స్కైమెట్‌... దేశవ్యాప్తంగా ఏడువేలకు పైగా ‘ఆటోమేటెడ్‌ వెదర్‌ స్టేషన్‌’లను ఏర్పాటుచేసింది. వాటిద్వారా ఎప్పటికప్పుడు స్థానిక వాతావరణ పరిస్థితుల్ని తెలుసుకుని ఆ సమాచారాన్ని రైతులకు అందిస్తోంది. దీనివల్ల రైతులు పంటకు నీరు కట్టడం, ఎరువులు వేయడం, పురుగు మందులు కొట్టడం... మొదలైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు. 2003లో ప్రారంభమైన ఈ సంస్థ 22 రాష్ట్రాల్లో పనిచేస్తోంది. వాతావరణ సమాచారానికి తోడు శాటిలైట్‌ డేటాను సేకరించి బ్యాంకింగ్‌, సాగు బీమా, పంట సంరక్షణ, మీడియా సంస్థలకు అందిస్తోంది స్కైమెట్‌. వీరి వెబ్‌ పోర్టల్‌, ఆప్‌ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. 55 నగరాల్లో 300కు పైగా గాలి నాణ్యతను తెలిపే యంత్రాలనీ వీరు అమర్చారు. వీరి దగ్గర పదేళ్లనాటి ఉపగ్రహ ఛాయాచిత్రాలూ, సమాచారం ఉన్నాయి. వాటిని తాజా ఉపగ్రహ ఛాయా చిత్రాలతో పోల్చి విశ్లేషించి సమాచారాన్ని ఇస్తారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలూ ఈ సంస్థతో సమాచారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘కేరళ రెయిన్‌’, ‘ది ముంబయి రెయిన్‌’ పేర్లతో ప్రత్యేకమైన ఆప్‌లనీ తెచ్చింది. ‘వాతావరణంలో మార్పులు చాలా రంగాలమీద ప్రభావం చూపుతున్నాయి. డేటా, అనలిటిక్స్‌తో మేం దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం’ అని చెబుతారు స్కైమెట్‌ వ్యవస్థాపకుడు జతిన్‌ సింగ్‌.


ప్రాంతం చెబితే చాలు...

ఐబీఎమ్‌కు చెందిన ‘ది వెదర్‌ ఛానల్‌’ ప్రాంతీయ వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది. ఆప్‌, వెబ్‌సైట్లోకి వెళ్లి మనం ఉండే ప్రాంతం చెబితే అక్కడి అసాధారణ వాతావరణ పరిస్థితులు, ఉరుములతో కూడిన జల్లులు, ఉష్ణోగ్రతతో పాటు గాలిలో తేమ, సూర్యోదయ, సూర్యాస్తమయ వేళలు... తదితర సమాచారం తెలుసుకోవచ్చు. రాబోయే గంట, రోజు,  వారం, పది రోజులు, నెలవారీగానూ ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మనదేశంలో రుతుపవనాల కదలిక, ప్రభావం, వర్షసూచన మొదలైన అంశాలతో ‘మాన్‌సూన్‌’ వార్తల్నీ అందిస్తోందీ సంస్థ. అలాగే స్థానిక కాలుష్య సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. ఈ సంస్థ ఐబీఎమ్‌ పవర్‌ 9 సూపర్‌ కంప్యూటర్‌ సాయంతో నడిచే ‘గ్లోబల్‌ హై రిజల్యూషన్‌ అట్మాస్ఫియర్‌ ఫోర్‌కాస్టింగ్‌ సిస్టమ్‌(గ్రాఫ్‌)’ సేవల్ని ఉపయోగించుకుంటోంది. ప్రతి గంటకీ తాజా చిత్రాల్ని అందిస్తుందీ సూపర్‌ కంప్యూటర్‌. ఇది 3-4 చ.కి.మీ. విస్తీర్ణంలోనూ నాణ్యమైన ఫొటోల్ని అందించగలదు. విమానయాన సంస్థలూ, మీడియా సంస్థలకూ సమాచారం అందిస్తోంది వెదర్‌ ఛానల్‌. కేరళ ప్రభుత్వం, టాటా కాఫీ ఎస్టేట్‌ విభాగం... ఈ సంస్థ సేవలు పొందుతున్నాయి.


రైతులకో ఆప్‌...

మారుతున్న పరిస్థితుల్లో రైతుకు సాంకేతిక సాయం అందిస్తేనే వ్యవసాయం మెరుగు పడుతుందని భావించారు సోనూ అగర్వాల్‌. అందుకోసమే 2004లో ‘వెదర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌’ను ప్రారంభించారు. వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా 3000కుపైగా ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు ఏర్పాటుచేసిందీ సంస్థ. తాజా సమాచారంతోపాటు స్వల్ప, దీర్ఘ కాలాలకు సంబంధించి వాతావరణాన్ని అంచనా వేస్తారు. కంప్యూటర్‌ సాయంతో ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని విశ్లేషించి బ్యాంకులూ, విద్యుత్‌ తయారీ సంస్థలూ, ప్రభుత్వాలకీ అందిస్తోంది. భారత్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఫిలిప్పైన్స్‌ మొదలైన దేశాల్లోనూ వీరు పనిచేస్తున్నారు. ‘ఒకప్పుడు రైతులు తమ అనుభవంతో వాతావరణాన్ని అంచనా  వేసేవారు. కానీ కొన్నేళ్లుగా వాతావరణంలో మార్పులు అంచనాకు అందట్లేదు. అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి అన్నట్టు ఉంది పరిస్థితి. దాంతో రైతులు నష్టపోతున్నారు. అందుకే రైతులకు వాతావరణ సమచారం, బీమా సేవలూ అందిస్తున్నాం’  అని చెబుతారు సోనూ. ఈ సంస్థ రైతుల కోసం ప్రత్యేకంగా ‘సెక్యూఫామ్‌’ ఆప్‌ని తెచ్చింది. ఈ ఆప్‌ద్వారా భూసార పరీక్షలతోపాటు నేలను సారవంతం చేసుకునే విధానాల్నీ, 150కిపైగా పంటల సాగు విధానాన్నీ, వాతావరణ సమాచారాన్నీ అందిస్తున్నారు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.