close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిలకమ్మా... చూడచక్కనమ్మా

చిలుకలు వాలిన చెట్టు ఎంత అందంగా కనిపిస్తుందో కదూ. మిల్క్‌వీడ్‌ అనే మొక్క కూడా అంతే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరి అలాగని చిలుకలు వచ్చి వాలే అంత పెద్ద చెట్టేమీ కాదు అది. ఓ చిన్న మొక్క మాత్రమే. మరి దాని ప్రత్యేకత ఏంటంటే... ఆ మొక్కకు కాసే కాయలు రంగూ, రూపంలో అచ్చం చిలుకనే పోలి ఉంటాయి. వాటి తొడిమ చిలుక ముక్కులా అనిపిస్తుంది. ఆ కాయ మొక్కకి ఉన్నప్పుడు దూరం నుంచి చూస్తే చిలుకమ్మే చెట్టుపైన వాలిందేమోనన్న భ్రమ కలుగుతుంది. టెక్సాస్‌లో ఎక్కువగా ఉండే ఈ మొక్కల్ని ఔషధాల తయారీలో వినియోగిస్తారు. కొందరు దాని కాండంలో తెల్లగా మెత్తగా ఉండే భాగాన్ని వంటకాల్లో వాడతారు. మరికొందరు మిల్క్‌వీడ్‌ కాయల్ని గృహాలంకరణలో ఉపయోగిస్తారు.


కూలీ కోటీశ్వరుడయ్యాడు

లాటరీల్లోనో బంపర్‌ డ్రాల్లోనో ఊహించని డబ్బు వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయిన సుడిగాళ్లను ఎందర్నో చూశాం. టాంజానియాకు చెందిన లైజర్‌ అనే గని కార్మికుడు కూడా అదే కోవకు చెందుతాడు. కాకపోతే అతనికి ఏ లాటరీ తగల్లేదూ, ఏ డ్రాలోనూ జాక్‌పాట్‌ కొట్టలేదు. రోజువారీ గనుల తవ్వకానికి వెళితేనే అతని కుటుంబం నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేది. అలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య గనుల తవ్వకానికి వెళ్లినప్పుడు రెండు పెద్ద పెద్ద రాళ్లు దొరికాయి. వాటిని పరీక్షించి చూస్తే అవి రత్నాలని తేలాయి. ఒకటి 9.27 కిలోలూ, మరోటి 5.103 కేజీల బరువున్నాయి. వెంటనే వాటిని ప్రభుత్వానికి అమ్మేయడంతో దాదాపు పాతిక కోట్ల దాకా వచ్చాయి. ఉదయం కూలీగా తట్టా బుట్టాతో వెళ్లిన లైజర్‌ సాయంత్రం కోటీశ్వరుడిగా ఇంటికి వెళ్లడంతో ఆ గ్రామంలో ఓ సెలెబ్రిటీ హోదా వచ్చేసింది.


గుడ్డు మీద గుడ్డు...

గుడ్లతో వీలైతే ఆమ్లెట్‌... కుదిరితే కూర చేసుకుంటాం. అదే యమెన్‌కు చెందిన మహ్మద్‌ మక్బూల్‌కు గుడ్లు దొరికితే చాలు వాటిని ఒకదానిపైన ఒకటి నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ మధ్య మూడు గుడ్లను ఒకదానిపై ఒకటి పేర్చి... అత్యధిక కోడి గుడ్లను పడకుండా నిలబెట్టిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆరేళ్ల వయసు నుంచే మక్బూల్‌ ఇలా వస్తువులను బ్యాలెన్స్‌ చేస్తూ ఒకదానిపై ఒకటి పేర్చేవాడట. 15 ఏళ్ల వయసు వచ్చాక రాళ్లూ, నాణేలూ, సెల్‌ఫోన్లూ... వంటి కొన్ని వస్తువులని నిలబెట్టడం మొదలుపెట్టాడు. తన ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాలన్న ఉద్దేశంతో గిన్నిస్‌ రికార్డుకు దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్‌ పొందాడు.


పేరు లేకుండా చాక్లెట్‌

ఏదైనా ఉత్పత్తి అమ్ముడవ్వాలంటే ప్రాథమిక సూత్రం... ఆకర్షణీయమైన ప్యాకింగ్‌. అయితే క్యాడ్బరీ సంస్థ మాత్రం తమ డైరీ మిల్క్‌ చాక్లెట్‌ కవరుపైన అక్షరాలను తీసేసింది. నీలం రంగు సాదా పేపరుపైన ఆ సంస్థ లోగో అయిన పాల గ్లాసుల నుంచి పాలు కిందకి జారుతున్నట్లుగా ఉండే బొమ్మను మాత్రమే ఉంచి చాక్లెట్లను లండన్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తమ బ్రాండ్‌ అక్షరాల ముద్రణకయ్యే ఖర్చును అక్కడ నివసిస్తున్న దాదాపు రెండు లక్షల మందికిపైనే నిరాశ్రయ వృద్ధుల్ని ఆదుకోవడానికి విరాళంగా ఇవ్వడానికే ఆ నిర్ణయం తీసుకుందా సంస్థ. అందుకోసం ‘ఏజ్‌ యూకే’ అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం చేసుకుని ఈ ప్రాజెక్టును చేపడుతోంది. అంతేకాదు, ఆ చాక్లెట్లు కొనుగోలు చేసే వారికి ఆసక్తి ఉంటే నేరుగా వృద్ధులను కలిసి వారికి సేవ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. అయితే కేవలం చాక్లెట్‌పైన పేరును మాత్రమే తొలగించింది. దాని వెనక ఉండే ధర, బార్‌కోడ్‌ ఇతర వివరాలను యధాతథంగానే ప్రచురిస్తోంది.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.