close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వినోదాన్ని పంచే ఆప్‌లు...

కొన్ని ఆప్‌లు వినోదాన్నీ విజ్ఞానాన్నీ అందిస్తుంటే... మరికొన్ని మరిచిపోలేని జ్ఞాపకాల్ని మనకి ఇస్తున్నాయి. మరి అలాంటివే ఈ ఆప్‌లు కూడా. ఇంతకీ ఇవి ఏంటంటే...


సెలెబ్రిటీల శుభాకాంక్షలు...

అభిమాన నటుల పుట్టిన రోజులూ పెళ్లిరోజులప్పుడు మనం సోషల్‌ మీడియాలో వాళ్లకి శుభాకాంక్షలు చెబుతుంటాం. అదే శుభాకాంక్షల్ని సెలెబ్రిటీలు మనకి చెబితే ఎలా ఉంటుంది... భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది కదూ. అలానే ‘పరీక్షలు వస్తున్నాయి చదువుకో...’ అని అమ్మానాన్నలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అదే ఏ సమంతానో కాజల్‌నో చెబితే ఎంతో కిక్‌ వస్తుంది కదూ. మరి అలాంటి జోష్‌ని కావాలనుకునేవారు విష్‌ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి. హైదరాబాద్‌కి చెందిన మనన్‌, మహేశ్‌, వరుణ్‌ అనే ముగ్గురు అబ్బాయిలు తయారు చేసిన ఈ ఆప్‌ను ఇప్పటి వరకూ లక్ష మందికిపైనే డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ ఆప్‌లోకి వెళ్లి నచ్చిన సెలెబ్రిటీకి రిక్వెస్ట్‌ పెడితే చాలు కొన్నిరోజుల్లో లేదా కొన్ని గంటల్లో వారే స్వయంగా చెప్పిన శుభాకాంక్షల వీడియో విష్‌ ఆప్‌ నుంచి మన ఫోన్‌కి వస్తుంది. అయితే ఇందుకోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ధర మనం ఎంచుకున్న సెలెబ్రిటీలను బట్టి ఉంటుంది. విష్‌ ఆప్‌లో అభిమానులకు శుభాకాంక్షలు చెప్పేందుకు సమంత, నాగచైతన్య, కాజల్‌, అదితీరావ్‌ హైదరీ, చిన్మయి శ్రీపాద, మంచు లక్ష్మితోపాటు బుల్లితెర నటులూ, వ్యాఖ్యాతలూ  సభ్యులుగా ఉన్నారు. శుభాకాంక్షలకు రూ.250- రూ.3500 దాకా ఛార్జ్‌ చేస్తారు. సెలెబ్రిటీని బట్టి ధర ఉంటుంది. సమంత, కాజల్‌, నాగచైతన్య వంటి కొందరు తారలు మాత్రం ఉచితంగానే శుభాకాంక్షలు చెబుతారు. కాకపోతే అందుకు మీరు లక్కీ డ్రా విజేతలు అయి ఉండాలి. అలా కావాలీ అంటే విష్‌ ఆప్‌లోకి లాగిన్‌ అయి వివరాలు నమోదు చేసుకుని ఎవరికి విష్‌ చేయాలనుకుంటున్నాం, సందర్భం వంటివి ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనమే స్వయంగా శుభాకాంక్షలు చెప్పించుకోవచ్చూ, ప్రియమైన వారికీ చెప్పించి ఆ వీడియోని కానుకగా పంపొచ్చు.


వీడియోల్నీ ఎడిటింగ్‌ చేయొచ్చు...

చాలామంది వాట్సాప్‌లో చాటింగ్‌ చేయడానికంటే ప్రతి సందర్భానికీ¨ సంబంధించి స్టేటస్‌ పెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. పండగలూ, ప్రత్యేక సందర్భాలూ, బంధువులూ స్నేహితుల పుట్టినరోజులకి ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి మరీ పెడుతుంటారు. అలాంటి వారికోసమే అందుబాటులోకి వచ్చింది విద్‌స్టేటస్‌. 50 లక్షల మందికిపైనే డౌన్‌లోడ్‌ చేసుకున్న ఈ ఆప్‌ను ఓ కొరియన్‌ సంస్థ రూపొందించింది. మనదేశంలో దీని నిర్వహణను బెంగళూరుకు చెందిన సౌమ్య కేశవ చూస్తోంది. వాట్సాప్‌ స్టేటస్‌లో షేర్‌ చేయడం కోసం 30 సెకన్ల నిడివి ఉన్న పాటలూ, కామెడీ, ఎమోషనల్‌ వీడియోలు ఉంటాయి. సందర్భానుసారంగానూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే ఉంటాయి. అలానే ఫొటోల్నీ, వీడియోల్నీ మనమే ఎడిట్‌ చేసుకునే పలు ఆప్షన్లు విద్‌స్టేటస్‌లో ఉన్నాయి. టిక్‌టాక్‌ మాదిరి సొంత వీడియోలు కూడా చేసుకుని  విద్‌స్టేటస్‌ అకౌంట్‌లో పెట్టుకోవచ్చు. ఇతరుల ఖాతానీ ఫాలో అవుతూ నచ్చిన వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యమూ ఇందులో ఉంది. 2017 నుంచి అందుబాటులో ఉన్న విద్‌స్టేటస్‌ ఆప్‌ తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, తమిళం, పంజాబీ, మలయాళం వంటి దాదాపు 15 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.


పుస్తకాలు వినొచ్చు...

ఈ మధ్య స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరిగాక చాలామంది పుస్తక ప్రియులు వాటిని కూడా డిజిటల్‌ రూపంలోనే చదివేస్తున్నారు. స్మార్ట్‌గా చదవడం కొంత సౌకర్యంగా ఉన్నప్పటికీ కళ్లకి మాత్రం అంత మంచిది కాదు. అందుకే అమెజాన్‌ పుస్తకాల్ని ఆడియో రూపంలోకి మార్చేసింది. ఆ ఆడియో క్లిప్పులను ఆడిబుల్‌ సునో ఆప్‌ రూపంలోకి తీసుకొచ్చి గతేడాది విడుదల చేసింది. ఇప్పటికే 50 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న ఈ ఆప్‌లో దాదాపు ఆరొందల గంటల నిడివి ఉన్న ఆడియో క్లిప్పులు హిందీ, ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌, టబు, తాప్సీ, అనిల్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌, మనోజ్‌బాజ్‌పాయ్‌ వంటి కొందరు సెలెబ్రిటీలు స్వయంగా చెప్పిన ఆడియో క్లిప్పులు కూడా ఆడిబుల్‌ సునోలో ఉన్నాయి. వీటిలో ఆరుగంటల నిడివి ఉన్న మహాభారతం ఆడియోని ఎక్కువ మంది విన్నారు. ఈ ఆప్‌లో కథలకు గొంతుతోపాటు త్రీడీ సౌండ్లు కూడా జోడించి వినిపిస్తున్నారు. అవి వింటుంటే ఎవరో వచ్చి మనకి కథ చెబుతున్నట్టు ఉంటుంది. ఊహించుకుంటే ఓ దృశ్యకావ్యంలా అనిపిస్తుంది. తాతయ్యలూ, అమ్మమ్మల కథలు వినే అవకాశం లేని చిన్నారులకు ఈ కథలు వినిపిస్తే వారికి వినడం, విశ్లేషించడం వంటివి బాగా అలవడతాయి.


ఆకాశపండు అందుతోందిప్పుడు!

టేకు, చందనం, దేవదారు, మహాగని... ఇలా కలపనిచ్చే చెట్ల పేర్లు చాలానే వింటుంటాం. వాటిల్లో ఒకటైన మహాగని పేరుకు తగ్గట్టే మహా వృక్షం. దృఢమైన కలపతోపాటు మధుమేహాన్ని నివారించే అద్భుతమైన పండ్లనీ అందిస్తోంది. అవే ఆకాశపండ్లు లేదా షుగర్‌ బాదం. ఇంతకీ ఆ పండ్లేమిటో... అవెలా మంచివో... తెలుసుకోవాలని మీకూ అనిపిస్తోందా...

ఏ పండయినా కొమ్మకి కాశాక కిందకి వేలాడుతుంటుంది. కానీ ఆకాశమే హద్దుగా పెరిగే మహాగని చెట్లకి కాసే పండ్లు నీలాకాశాన్ని అందుకోవాలనో లేదా ఎవరికీ అందకుండా ఉండాలనో తెలీదుకానీ మొత్తమ్మీద ఆకాశాన్ని చూస్తున్నట్లుగా కొమ్మ నుంచి పైకి కాస్తాయి. అందుకే వాటిని ఆకాశపండ్లు అంటారు. ఒక్కో పండులో 71 గింజలు ఉంటాయి. బాదంలానే ఈ గింజల్ని ఒలిచి అందులోని పప్పుల్ని తింటుంటారు. ఎందుకంటే ఇవి శక్తిమంతమైన ఔషధ భాండాగారాలు. ఎన్నో రకాల వ్యాధులకు మందులా పనిచేస్తాయట. ముఖ్యంగా మధుమేహాన్ని అద్భుతంగా నివారిస్తాయని ఆధునిక పరిశోధనలూ స్పష్టం చేయడంతో దాని వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ పప్పులకి యాంటీహైపర్‌ గ్లైసెమిక్‌ గుణం ఉండటంతో వీటిని డయాబెటిస్‌ను నివారించే సహజ ఔషధంగా మలేషియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే వీటిని తగు మోతాదులోనే తీసుకోవాలట.

ఎలా తింటారు?
ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ చెట్టు పెరిగినప్పటికీ ఆకాశ పండ్ల వాడకం మాత్రం మలేషియా, దక్షిణ పసిఫిక్‌ సొలొమన్‌ దీవుల్లో ఎక్కువ. మహాగనిని ‘క్వీన్‌ ఆఫ్‌ ది ప్లాంట్స్‌’గా పిలుస్తూ గింజల్ని వేల సంవత్సరాల నుంచీ మధుమేహం, బీపీ, అలర్జీలు, హార్మోన్ల అసమతౌల్యానికి మందుగా వాడుతున్నారక్కడ. మనదేశంలోనూ ఎక్కువగా పెరిగినా కలపగానే దీన్ని వాడతారు. ఈ చెట్టు కలప దృఢంగా ఉండటంతో ఫర్నిచర్‌తోబాటు ఓడలకీ వాడతారు. గింజల్నీ బెరడునీ ఆయుర్వేదంలో గాయాలూ పుండ్లూ; మలేరియా, అనీమియా, డయేరియా, జ్వరం, అమీబిక్‌ డిసెంట్రీ నివారణలోనూ వాడుతుంటారు. ఈ పండ్ల గింజల్లోని ఔషధ విలువల గురించి ఆధునిక పరిశోధనల్లోనూ తేలడంతో అల్లోపతీ వైద్యులూ దీన్ని తినమని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు గింజలు, పప్పులు, పొడి, ట్యాబ్లెట్లు, డ్రింకు... ఇలా రకరకాల రూపాల్లో ఆకాశపండుని అమ్ముతున్నారు. పొడిని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు. లేదా రోజుకి ఒకటి రెండు పప్పుల్ని నేరుగానూ తినవచ్చు.

స్వచ్ఛమైనది!
చెట్టు వేళ్లు నేలలో 150 అడుగుల లోపలకంటా వెళ్లి నీటిని పీల్చుకోవడంతో ఈ పండుని ఎంతో స్వచ్ఛమైనదిగానూ చెబుతారు. ఆకాశపండులో ప్రొటీన్లూ ఖనిజాలూ విటమిన్లూ ఎంజైమ్‌లూ ఫ్యాటీ ఆమ్లాలూ ఇతర్రతా పోషకాలు చాలానే ఉంటాయి. వీటితోబాటు అనేకానేక రోగాల్ని నిరోధించే 33 రకాల ఫ్లేవొనాయిడ్లూ 27 రకాల శాపోనిన్‌లూ ఉంటాయట.


ఫ్లేవొనాయిడ్‌లు రక్త ప్రసరణను పెంచి, రక్తనాళాల్లో పేరుకున్న పాచిని తగ్గించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌, హైబీపీ, గుండె సమస్యల్ని నిరోధిస్తాయట. కణజాలాల్లో మంటనీ గాయాల్నీ తగ్గిస్తాయి. ఈ పండ్లలోని శాపోనిన్‌, మధుమేహానికి మంచి మందు. డయాబెటిస్‌కి వాడే అల్లోపతీ మందుల్లోకన్నా ఈ శాపోనిన్‌కే హైపో గ్లైసెమిక్‌ గుణం ఎక్కువట. అందుకే మధుమేహానికి దీన్ని సహజ మందుగా చెబుతారు. ఈ శాపొనిన్‌ పురుషుల్లో వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. ఇక, ఆకాశ పండులోని ఆల్కలాయిడ్లు శరీరంలోని టాక్సిన్లను తొలగించి కణాలను దెబ్బ తినకుండా చూస్తాయి. గుండె సమస్యలూ తగ్గుతాయట. నెలసరి నొప్పులతో బాధపడేవాళ్లు చిటికెడు పొడిని మొదటిరోజు తింటే సరి. నోటి దుర్వాసన పోవాలంటే పరగడుపున రెండు పప్పుల్నీ, కాలేయ సమస్యలకి అర టీస్పూను పొడిని పాలల్లో కలిపి పేస్టులా చేసి తినాలనీ, కాస్త పొడిని కప్పు పాలల్లో లేదా నీళ్లలో మరిగించి తాగితే ఆల్జీమర్సూ ఆస్థమా ట్యూమర్లూ జీర్ణసమస్యలూ అన్నీ తగ్గుతాయట. దీన్నుంచి తీసిన నూనె చర్మాన్నీ మెరిపిస్తుందట. అందుకే స్వచ్ఛమైన ఆకాశపండుని అందరూ అందుకోవాలనుకోవడంలో తప్పేముందీ..!


కంటి చూపు తగ్గకుండా...

వయసు పెరిగేకొద్దీ శరీర భాగాలు కూడా మొరాయిస్తుంటాయి. అందులో రెటీనా ఒకటి. మిగిలిన వాటికన్నా ఇది త్వరగా వృద్ధాప్య దశకు చేరుకుంటుంది. అందుకే చూపు మసకబారుతుంటుంది. అయితే ఎర్రని కాంతిని తీక్షణంగా చూడటంవల్ల కంటిలోని రెటీనా కణాలకి వయసు మీరకుండా ఉంటుంది. అదెలా అంటే- నలభై దాటాక ఎరుపు రంగు కాంతి తరంగదైర్ఘ్యానికి కనుపాపను గురిచేయడం వల్ల చూపు మెరుగైందని లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. రెటీనా కణాల్లోని శక్తిభాండాగారాలైన మైటోకాండ్రియా కాంతిని గ్రహించి అధిక శక్తిని అందించడం ద్వారా ఆయా కణాలు బలహీనం కాకుండా చేసినట్లు గుర్తించారు. సాధారణంగా రెటీనా కణాలు నలభై తరవాత బలహీనంగా మారుతుంటాయి. అందుకే నడివయస్కులను రెండువారాలపాటు రోజుకి మూడు నిమిషాలపాటు ఎల్‌ఈడీ టార్చ్‌ ద్వారా ఎర్రని కాంతికి గురిచేయడం వల్ల మైటోకాండ్రియా కణాల్లో శక్తి ఉత్పత్తి పెరిగి కంటి చూపు మెరుగైందట. సో, మున్ముందు కేవలం లైట్‌ థెరపీ ద్వారానే కంటి చూపు తగ్గకుండా చేస్తారన్నమాట.


బీపీ తక్కువగా ఉంటుందా..!

ఆడవాళ్లలో అదీ మెనోపాజ్‌కి ముందు బీపీ తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వాళ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ టి- కణాలు ఎక్కువగా ఉత్పత్తి కావడమేననీ ఇవి ఒక రకంగా ఆరోగ్యానికి మంచిదేననీ జార్జియా మెడికల్‌ కాలేజ్‌కు చెందిన వైద్య బృందం పేర్కొంటోంది. అదెలా అంటే- ఇవి రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించకుండానూ బీపీ తక్కువగా ఉండేలానూ చేస్తాయి. దీనివల్ల అవయవాలు దెబ్బతినకుండా ఉంటాయట. నిజానికి ఈ టి-కణాలు ఆడ, మగ ఇద్దరిలోనూ ఒకే సంఖ్యలో ఉంటాయి. కానీ వాటి స్పందనలోనే తేడా ఉంటుంది అంటున్నారు. ఈ విషయాన్ని ఎలుకల్లో పరిశీలించినప్పుడు స్పష్టమైందట. ఆడామగా ఎలుకల్ని తీసుకుని వాటికి కావాలని బీపీ పెంచే ఆహారపదార్థాలను ఇచ్చి, ఆ తరవాత టి-కణాల సంఖ్య పెరిగేలా చేశారట. మూడు వారాల తరవాత పరిశీలించగా- మగవాటిల్లో బీపీ అలాగే ఉండగా, ఆడ ఎలుకల్లో తగ్గిందట. దీని ఆధారంగా స్త్రీలలో బీపీ తక్కువగా ఉండటానికి కారణం ఈ కణాలే అని వివరిస్తున్నారు పరిశీలకులు.


రంగుల్లో అది ఉంటే హానికరమే!

తినే ఆహారం ఆకర్షణీయంగా కనిపించేందుకు అందులో ఎడిబుల్‌ కలర్స్‌ వేస్తుంటారు. అయితే ఆ రంగుల్లో టైటానియం డై ఆక్సైడ్‌(ఇ-171)గానీ కలిస్తే మాత్రం అది పొట్ట బ్యాక్టీరియాకి హానికరంగా పరిణమిస్తుందనీ తద్వారా మంటకు కారణమవుతుందనీ మాసాచుసెట్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. చాలాకాలం నుంచీ ఆహార రంగుల్లో ఇ-171ని కలుపుతున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో రంగుల్లో ఈ పదార్థాన్ని కలపడంమీద తొలిసారి ఫ్రాన్స్‌ నిషేధం విధించింది. పైగా టైటానియం డై ఆక్సైడ్‌ రేణువుల పరిమాణం పెద్దగా ఉన్నవాటికన్నా చిన్నగా ఉన్నవి మరింత హానికరంగా పరిణమిస్తున్నాయట. ఈ విషయమై ఎలుకల్లో చేసిన పరిశోధనలో-
టైటానియం డై ఆక్సైడ్‌ రేణువులకి కొవ్వు పదార్థాలు కూడా తోడయితే పొట్టలోని మంచి బ్యాక్టీరియాకి మరింత హాని కలిగిస్తున్నట్లు గుర్తించారు. దాంతో రకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తేలింది.

 


పచ్చిపాలు తాగుతున్నారా?

పచ్చిపాలు మంచివన్న కారణంతో కొందరు వాటిని నేరుగా తాగడం లేదా వాడటం చేస్తుంటారు. అయితే వాటిలో యాంటీబయోటిక్స్‌ను నిరోధించే మొండి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు. ఒకవేళ వీటిని వాడాలనుకున్నా వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలనీ లేదంటే వాటిని గది ఉష్ణోగ్రత దగ్గర కాసేపు ఉంచితే అందులో ఈ రకం బ్యాక్టీరియా శాతం మరింత పెరిగే అవకాశం ఉందనీ పేర్కొంటున్నారు. అలాగని ఈ పాలను అలాగే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఆ బ్యాక్టీరియా శాతం తగ్గదు కానీ పెరగకుండా ఉంటుంది. అదేే పాశ్చరైజేషన్‌ చేసిన పాలల్లో అయితే ఈ రకమైన యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ ఉన్న బ్యాక్టీరియా శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని నేరుగా తాగితే ఆ బ్యాక్టీరియా పొట్టలోకి చేరి, అక్కడ మిగిలి ఉన్న బ్యాక్టీరియాని కూడా యాంటీబయోటిక్స్‌ను తట్టుకోగలిగేలా మారుస్తుందట. కాబట్టి పచ్చిపాలతో పోలిస్తే పాశ్చరైజేషన్‌ చేసినవే బెటర్‌ అంటున్నారు పరిశోధకులు.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.