close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పలికే దైవం... యలగూరు హనుమంతప్ప!

ఏ ఊళ్లో చూసినా చిన్నదో పెద్దదో కనీసం ఒకటి రెండు అయినా ఆంజనేయస్వామి ఆలయాలు ఉంటాయి. కానీ కర్ణాటకలోని యలగూరులో మాత్రం ఏడు ఊళ్లకు కలిపి ఒకే హనుమంతుడి ఆలయం ఉంటుంది. అదే యలగూరు హనుమంతప్ప దేవాలయం. ఇక్కడ స్వామి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
పచ్చని వాతావరణంలో కృష్ణానది ఒడ్డున కొలువైన స్వామి యలగూరు హనుమంతుడు. ఏడు ఊళ్లకు కలిపి ఒకే ఒక్క హనుమంతుడి ఆలయం ఇది. ఏవయినా కోరికలున్నవారు ఇక్కడకు వచ్చి వాటిని స్వామికి విన్నవించుకుంటే అవి నెరవేరతాయో లేదో స్వామి చెప్పేస్తాడని భక్తులు నమ్ముతారు. దానికి సంకేతంగా స్వామి మెడలోంచి పూలు పడతాయట.  పువ్వు కుడివైపున పడితే అది జరుగుతుందనీ, ఒకవేళ ఎడమవైపున పడితే జరగదనీ అర్థం. అందుకే ఈ హనుమంతుడిని పలికే దేవుడని భావిస్తారు. ప్రతిరోజూ కృష్ణానీటితో హనుమంతుడికి చేసే అభిషేకం, పూజలు చూసినా పుణ్యం వస్తుందని అంటారు. హనుమప్ప, హనుమంతప్ప అంటూ రకరకాల పేర్లతో భక్తుల పూజలు అందుకునే స్వామి ఈ ఊళ్లో రామాజ్ఞతోనే వెలిశాడంటారు.

స్థలపురాణం...
యలగూరు సహా ఏడు ఊళ్లకు చెందిన భక్తులను అనుగ్రహించాలని రాముడు చెప్పడం వల్లే హనుమంతుడు ఇక్కడ వెలిశాడని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.  రామాజ్ఞను పాటించిన స్వామి ఓ పూజారికి కలలో కనిపించి తాను ఓ రాయిలో ఉన్నానని, దాన్ని పగలగొట్టమనీ ఆ వివరాలు చెప్పాడట. దాంతో ఆ పూజారి కలలో చెప్పినట్లుగానే ఓ రాయిని పగలగొడితే స్వామి విగ్రహం కూడా ముక్కలు అయిపోయిందట. మళ్లీ స్వామి కలలో కనిపించి... ఆ ముక్కలన్నింటినీ మందిరంలో పెట్టమనీ, ఓ వారం వరకూ మందిరం తలుపులు తెరవకూడదనీ ఆదేశించాడట. పూజారి స్వామి చెప్పినట్లు చేసినా... ఆతృతతో ఏడో రోజు పొద్దున్నే ఆలయం తలుపులు తెరిచాడట. అయితే స్వామి విగ్రహం పైభాగం మాత్రమే అతుక్కుని, అడుగుభాగం అతుక్కోలేదట. తరువాత విగ్రహాన్ని అలాగే ప్రతిష్ఠించడంతో అప్పటినుంచి స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడని అంటారు. స్వామి ఆజ్ఞ మేరకు ఇప్పటికీ ప్రతిరోజూ కృష్ణానది నుంచీ నీటిని తెచ్చి... విగ్రహానికి అభిషేకం చేస్తారు. అంతేకాదు అప్పటి పూజారి వంశస్థులే స్వామికి ఇప్పటికీ పూజలు నిర్వహించడం విశేషం.

స్వామి మహిమకు సంబంధించి మరో కథా ప్రాచుర్యంలో ఉంది. ఆంగ్లేయుల పాలనలో ఆలయాల్లో పూజలూ రకరకాల సేవలు చేసే భక్తుల నుంచి పన్నులు వసూలు చేసేవారట. అవి కట్టలేని భక్తులను కొట్టేవారట. అలా ఆంగ్లేయుల చేతిలో దాసేయ అనే భక్తుడు దెబ్బలు తిని చనిపోయాడట. అయితే స్వామి అతడి సన్నిహితులకు కలలో కనిపించి, దాసేయకు మూడురోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించవద్దని చెప్పాడట. మూడు రోజుల తరువాత అతడు బతికి ఎప్పటిలానే ఆంజనేయస్వామికి పూజలు చేయడంతో ఆంగ్లేయులు అప్పటినుంచి భక్తుల నుంచి పన్నులు వసూలు చేయడం మానేశారట. అదేవిధంగా అప్పటి మరాఠా రాజు... బాజీరావు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 480 ఎకరాలు ఇచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలు నిర్వహించమని కోరినట్లు ఇక్కడ మరో కథా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ నిర్వహించే పూజలతోపాటూ ఏడాదికోసారి ‘కార్తిక ఉత్సవ’ పేరుతో జాతరను నిర్వహిస్తారు. ఆ రోజున స్వామికి ప్రత్యేక పూజలూ పల్లకీ సేవనూ నిర్వహించి, తరువాత మహా మంగళహారతి ఇస్తారు. కేవలం ఈ వేడుకను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు.

ఎలా చేరుకోవచ్చంటే...
ఈ ఆలయం ఉత్తర కర్ణాటకలోని బిజాపూర్‌ జిల్లా, ముద్దెబిహళ్‌ తాలూకాలో ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు బిజాపూర్‌లో దిగి... అక్కడి నుంచి బస్సు లేదా ఆటోల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి గంటంబావు సమయం పడుతుంది. ఆల్మట్టి డ్యామ్‌ నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.