
హైవే మీద రయ్రయ్ అని కార్లో దూసుకెళ్తుంటే... ఏసీ నుంచి చల్లగాలులు మెల్లమెల్లగా తాకుతుంటే... అబ్బ, ఏం హాయిలే అనిపిస్తుంది! అదే ఆ గాలులు మనసును మైమరపించే పరిమళాలను మోసుకొస్తే ఇంకా బావుంటుంది. అందుకే చాలామంది కార్లలో పెర్ఫ్యూమ్లు, వాటిని పెట్టేందుకు డిఫ్యూజర్లు వాడతారు. అయితే ఇప్పుడా డిఫ్యూజర్లు సరికొత్త డిజైన్లలో కనువిందు చేస్తున్నాయి!
కార్ డ్యాష్‌బోర్డ్‌ను అందంగా ఉంచుకోవడం చాలామందికి ఇష్టం. అందుకే దానిపైన దేవుని ప్రతిమలూ చక్కని బొమ్మలూ పెడుతూ ఉంటారు. కార్లో గాలి ఎలా వస్తోందన్న విషయానికీ చాలా ప్రాముఖ్యత ఉంది. ఎక్కువసేపు తలుపులూ, అద్దాలూ మూసే ఉంటాయి కాబట్టి తాజా గాలి అవసరం. అందుకే దాదాపు అందరూ బండి ఎక్కిన దగ్గర నుంచీ ఏసీ ఆన్‌లోనే ఉంచుతారు. కానీ కొన్నిసార్లు చెడు వాసనలు లోపలికి వచ్చేస్తుంటాయి. అందుకే కార్లలో సువాసనలు వెదజల్లే పరిమళాలు వాడటం పరిపాటి. ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ కోసం వాడే డిఫ్యూజర్లు గతంలో సాదాసీదాగా ఉండేవి. ఇప్పుడు అవి కూడా మెరుపులతో తళుక్కుమంటున్నాయి.
కార్లో ఏసీ వెంట్‌కు అరోమా డిఫ్యూజర్లు పెట్టడం అందరూ చేసేదే. కానీ అవి కూడా స్టైలిష్‌గా ఉండాలి అనుకుంటోంది నేటితరం. అందుకే వారి ఆలోచనకు తగినట్టు సరికొత్త డిజైన్లలో ఎయిర్ రిఫ్రెషనర్ డిఫ్యూజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. డిజైనర్లు వీటిని అబ్బాయిలకు నచ్చేలా క్రేజీగానూ, అమ్మాయిలు మెచ్చేలా ముద్దుముద్దుగానూ తయారుచేస్తున్నారు. ప్రాణుల ఆకారంలోనూ... పండ్లూ పూల మాదిరిగానూ, పిల్లలనూ ఆకర్షించేలా పిగ్గీ, గొర్రెపిల్ల, టెడ్డీబేర్, బుజ్జి పాపాయిల రూపంలోనూ డిఫ్యూజర్లు అలరిస్తున్నాయి. వీటికి మెరిసే రాళ్లు అదనపు ఆకర్షణ చేకూరుస్తున్నాయి. ముందువైపు ఈ బొమ్మలు ఉండగా... దాని వెనుకవైపున గుండ్రటి కాటన్‌ప్యాడ్స్ పెట్టేందుకు ఖాళీ ఉంటుంది. ఆ కాటన్ప్యాడ్స్పైన మనకు నచ్చిన పరిమళాన్ని చల్లి, దాన్ని ఈ డిఫ్యూజరులో పెట్టాలి. తర్వాత దాని వెనుక ఉండే క్లిప్‌ను ఏసీ వెంట్‌కు తగిలిస్తే సరి. చల్లగాలి ఈ డిఫ్యూజరు మీదుగా వస్తూ పరిమళాన్నీ మోసుకొస్తుంది. అదే సమయంలో ఈ బొమ్మలు డ్యాష్‌బోర్డుకు అందాన్నీ తెచ్చిపెడతాయి. ఆన్లైన్లో వివిధ షాపింగ్ వెబ్సైట్లలో ఈ డిఫ్యూజర్లు దొరుకుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం... మీకేది నచ్చిందో చూసుకుని ఆర్డర్ ఇచ్చేయండి మరి!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్