close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖర్చుకీ ఉండాలి లెక్క!

రోడ్డు మీద రయ్యిన దూసుకుపోతున్నారు. ఎదురుగా గ్రీన్‌ లైట్‌ వెలుగుతోంది. అది మారేలోపు సిగ్నల్‌ దాటాలనుకున్నారు. ఇంతలో పసుపు లైటు వెలగనే వెలిగింది. తప్పదు, బ్రేక్‌ నొక్కాల్సిందే. ఆ వెంటనే ఎర్ర లైటు పడుతుంది మరి. ఎంత అర్జంటు పని ఉన్నా, ఎంత అసహనంగా ఉన్నా పచ్చలైటుని గౌరవించి ఆగితేనే ట్రాఫిక్‌ మధ్యలో చిక్కుకుపోయే ప్రమాదం తప్పుతుంది. మన జీవితాల్లోనూ ప్రస్తుతం పసుపు లైటు పడింది. ఇంటి బడ్జెట్‌ ఎరుపులోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ పసుపు లైటుని గౌరవించి ఖర్చులకు కళ్లెం వేయక తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు.

దాదాపు వందేళ్ల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చింది. దానివల్ల తలెత్తిన సంక్షోభం నుంచి మనదేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి నాలుగేళ్లు పట్టిందట. ఇప్పుడు ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దేశం సంగతి అలా ఉంచి మన కుటుంబాల సంగతి చూద్దాం. ఇక్కడ పరిస్థితి తలకిందులు కావటానికి కొన్ని నెలలు చాలు. బిల్లులూ ఈఎంఐల మధ్య మామూలుగానే నెల జీతం ఎటుపోతుందో తెలియని ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు మరింత అయోమయంగా మారింది. ఒక బిల్లు కడితే మరో బిల్లుకి వెతుక్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా అన్నిరంగాల్లోనూ ఆదాయాలు తగ్గాయి. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. చిన్నాచితకా వ్యాపారాలు మూతపడుతున్నాయి. ఒక పక్క వైరస్‌ భయం మెడమీద కత్తిలా వేలాడుతుంటే మరో పక్క ఉపాధి భయం చాలామందిని వణికిస్తోంది. ఈ గండం గట్టెక్కాలంటే అందరికీ కావలసింది ఇప్పుడు ఖర్చుల దగ్గర సంయమనమే!

దుప్పటి ఉన్నంతవరకే కాళ్లు చాపుకోవాలనీ, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనీ సామెతల రూపంలో పెద్దలు ఎన్నో నీతులు చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణకు బాటలు వేశారు. కానీ మారుతున్న సమాజంతో పాటు మనమూ మారాలన్న తాపత్రయం, కొత్త కొత్త పద్ధతులను అందిపుచ్చుకోవాలన్న ఆశ- ఆ క్రమశిక్షణ బీటలు వారేలా చేస్తున్నాయి. నిన్న సంపాదించుకున్న డబ్బును నేడు ఖర్చు చేసే పద్ధతి నుంచి రేపు సంపాదించుకోబోయే డబ్బును ఇవాళే ఖర్చు చేసుకునే పద్ధతికి వచ్చాం. ఈ పరిస్థితి వల్ల ఆదాయం ఏ కాస్త అటూ ఇటూ అయినా సంసారనావ తలకిందులవుతోంది. ఇక కరోనా లాంటి ఊహించని ఉపద్రవాలు వస్తే నిలదొక్కుకోవడం ఎలా సాధ్యమవుతుంది. అలాగని ఆందోళన చెందనవసరం లేదనీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త సంయమనంతో వ్యవహరిస్తే ఆర్థిక ఇబ్బందుల్లోనుంచి బయటపడవచ్చనీ అంటున్నారు నిపుణులు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఆర్థిక క్రమశిక్షణే మనిషిని ఆత్మవిశ్వాసంతో ధీమాగా నిలబెడుతుందనీ దాన్ని అలవరచుకోడానికీ ఇదే సరైన సమయమనీ అంటున్న వారు- ఏం చెబుతున్నారంటే...

వ్యామోహం... వదులుకోవాలి!
ఖర్చులు తగ్గించుకోవాలనుకోగానే మొట్టమొదట ఇల్లాళ్లు చేసే పని కూరగాయలూ పండ్లూ కొనడం తగ్గించడం. పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అంతకు ఎన్నో రెట్ల ఖర్చు ఆస్పత్రికి పెట్టాల్సి వస్తుంది. పైగా ఈ రోజుల్లో అన్నిటికన్నా ముఖ్యం వ్యాధి నిరోధకత్వాన్ని పెంచుకోవటం. కాబట్టి ఆ దిశగా పొదుపు ఆలోచన అసలు మంచిది కాదు. మరేం చేయాలీ అంటే- ఆ మధ్య ఇండియన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ బ్యూరో ఓఎల్‌ఎక్స్‌తో ఓ సర్వే చేయించింది. అది ఏం చెప్పిందో తెలుసా... పదహారు నగరాల్లో సర్వేలో పాల్గొన్న వారి ఇళ్లలో ఉన్న పనికిరాని వస్తువుల విలువ కడితే అది 78 వేల కోట్ల రూపాయలు ఉందట. దుస్తులు, ఎలక్ట్రికల్‌ సామగ్రి, వంట పాత్రలు, ఫోన్లు, ఫర్నిచరు, పుస్తకాలు, గడియారాలు, పిల్లల బొమ్మలు, పాదరక్షలు... ఒక రకం కాదు, ఒక చోట కాదు, ఇళ్లలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ పనికిరాని వస్తువులు ఎన్నో పడివుంటున్నాయనీ అవన్నీ అనవసరంగా కొన్నవేననీ ఆ సర్వే విడమరచి చెప్పింది. అప్పటికప్పుడు తీసి పడేయమంటే సగటున ఒక్కో ఇంట్లోనూ తక్కువలో తక్కువ పన్నెండు జతల బట్టలు, 14 వంటపాత్రలు, 11 పుస్తకాలు, రెండు మొబైల్‌ఫోన్లు, మూడు గడియారాలూ ఉంటాయని లెక్కచెప్పింది. ఇలాంటి సర్వేనే అమెరికాలోనూ చేశారు. అక్కడ ఇళ్లలో ఉన్న నిరుపయోగ వస్తువుల్ని అమ్మితే ప్రతి ఇంటికీ కనీసం పది లక్షల రూపాయలవరకూ డబ్బు వస్తుందని ఆ సర్వేలో తేలింది. మనమే కాదు, ప్రపంచమంతా ఇదే తీరున ఉందన్నమాట. వస్తువ్యామోహం ఎంతలా పెరిగిందంటే- ఒక వస్తువుని ఉపయోగించడంలో పొందే ఆనందం కన్నా దాన్ని కొనిపడేయడంలోనే ఎక్కువ ఆనందం పొందడం అలవాటుగా మారిందనీ అదే ఈ పరిస్థితికి మూలమనీ అంటున్నారు ఈ అధ్యయనాలను విశ్లేషించిన పరిశోధకులు. ఎడా పెడా వస్తువుల్ని కొని ఇంటిని నింపడంలో దక్షిణాది వారే ఓ మెట్టు పైన ఉన్నారట. దుస్తులూ, వాడని వంటసామగ్రీ అనవసర వస్తువుల కొనుగోళ్లలో మొదటి రెండు స్థానాల్నీ ఆక్రమిస్తున్నాయట. కాబట్టి ఒకసారి ఇంటిని పరికించి చూసి అలాంటి వ్యామోహం మీకూ ఉందనిపిస్తే- వదిలించుకోవడం మొదట చేయాల్సిన పని. అసలు ఇలా కొనిపడేసే అలవాటుకి ప్రధాన కారణం కార్డుల వాడకం.

ఖర్చు పెంచాయి!
ఏదైనా వస్తువు కొన్నాక పర్సులోంచి డబ్బు తీసి లెక్కబెట్టి ఇచ్చేటప్పుడు ఆ వస్తువు విలువనీ కష్టపడి సంపాదించిన తన డబ్బు విలువనీ బేరీజు వేసి చూస్తుంది మనసు. అలా చూసినప్పుడు ఏమాత్రం అసంతృప్తి అనిపించినా ఆ కొనుగోలును రద్దు చేసుకుని ఇంటి దారి పట్టడమూ కద్దు. కానీ క్రెడిట్‌ కార్డుతో చెల్లిస్తే ఆ అవకాశం ఉండదు. వస్తువు కొన్న తర్వాత నెలరోజులకు డబ్బు చెల్లించడమూ అదీ ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతానుంచి చెల్లించడం వల్లా- వినియోగదారు మనసు సహజమైన లెక్క తప్పుతోంది. చెల్లించిన సొమ్ముకి కొన్న వస్తువు గిట్టుబాటవుతోందో లేదో పోల్చుకునే అవకాశాన్ని కోల్పోతోంది. ఫలితంగా వృథా ఖర్చు పెరుగుతోంది. వస్తువుల మోజులో వినియోగదారులు కొట్టుకుపోతున్నారు. కార్డుల వాడకంపై బోలెడన్ని అధ్యయనాలు జరిగాయి. నగదు రూపంలో ఖర్చు చేసేవారికన్నా క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు వాడేవారు ఏకంగా వంద శాతం ఎక్కువ ఖర్చుపెడతారనీ ఈ విషయంలో ఆదాయంతో నిమిత్తం లేదనీ ఎంఐటీ పరిశోధకులు ప్రచురించిన ఓ నివేదిక పేర్కొంది. క్రెడిట్‌ కార్డుని జాగ్రత్తగా వాడితే లాభాలుంటాయి. బాధ్యతారహితంగా వాడితే అదే మోయలేని భారంగా మారుతుంది. ఆ బిల్లులు సమయానికి కట్టకపోతే పెనాల్టీలూ ట్యాక్సులూ, వడ్డీలూ అన్నీ కలిసి దాదాపు 36నుంచి 48శాతం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అది చాలా చాలా ఎక్కువ. కాబట్టి షాపింగ్‌కి నగదు వాడటమూ కావలసిన వస్తువులేమిటో లిస్టు రాసుకుని వెళ్లి అవి మాత్రమే కొనుక్కుని రావటమూ ఇప్పుడు అనుసరించాల్సిన పద్ధతి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ విషయంలోనూ కాస్త క్రమశిక్షణ పాటించక తప్పదు. అనవసర ఖర్చు తగ్గించుకుంటాం సరే... ఇప్పుడు అవసరాలకు డబ్బు ఎలా..?


మార్గాలున్నాయి!
నెల జీతానికి తగినట్లుగా రకరకాల కమిట్‌మెంట్లు పెట్టుకోవడం సహజం. ఖర్చులు పోను ఇంటి లోను, కారు లోను, బీమా పాలసీలు, చిట్‌లు... తదితరాలన్నీ ఉంటాయి. ఒక చిట్టీ పాడి పిల్లవాడిని కాలేజీలో చేర్పించాలనీ, ఏ ఎరియర్సో వస్తే పెద్ద టీవీ కొనుక్కుందామనీ... ప్రణాళికలూ వేసుకునే ఉంటారు. వస్తాయనుకున్నవి రాకపోగా ఉన్న జీతమే తగ్గిపోయింది. కట్టాల్సినవాటికే డబ్బు సరిపోదనుకుంటే మరో పక్క మూడు నెలల కరెంటు బిల్లు ఒకేసారి వచ్చిపడింది. కరోనా వల్ల కొందరికి ఆస్పత్రి ఖర్చులు అదనం అయ్యాయి. ఈ పరిస్థితి చాలామందికి ఆందోళన కలిగిస్తోంది. అయితే ధైర్యంగా ఉండాల్సిన సమయమూ ఇదే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థిమితంగా ఆలోచిస్తే బయటపడే మార్గాలూ కన్పిస్తాయి. అర్జెంటుగా డబ్బు కావాలని ఎక్కువ మొత్తం వడ్డీకి అప్పులు చేయడం సరికాదు. ప్రభుత్వ పథకాలేమైనా తోడ్పడతాయేమో చూడాలి. కొన్ని బ్యాంకులు శాలరీ ఎకౌంటు ఉన్నవారికి మూడు నెలల వేతనం ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పిస్తున్నాయి. అర్జంటుగా చెల్లించాల్సిన బిల్లులేవో, కొద్ది రోజులు ఆగవచ్చనుకున్నవి ఏవో చూసుకుని తదనుగుణంగా డబ్బు సర్దుబాటు చేసుకోవాలి. కొన్ని నెలలు లోన్లు కట్టనక్కరలేదని ప్రభుత్వం మారటోరియం సౌకర్యాన్ని తెచ్చింది. అయితే అసలే మాత్రం కట్టలేని పరిస్థితి ఉంటే తప్ప చేతిలో డబ్బు ఉండి, కట్టగల సామర్థ్యం ఉన్నవాళ్లు దాన్ని వాడుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇప్పుడు వాయిదా వేసుకుంటే తర్వాత చెల్లించేటప్పుడు చాలా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అదే మన పొదుపు ఖాతాలో డబ్బు ఉంటే నామమాత్రపు వడ్డీనే వస్తుంది. అలాగే క్రెడిట్‌ కార్డు బిల్లు పెద్ద మొత్తం ఉంటే కట్టకుండా వదిలేయవద్దు. దాన్ని ఈఎంఐలుగా మార్చుకుని కడుతుంటే భారం తగ్గుతుంది. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచీ తేవాలీ అన్నదానికి నిపుణులు చెబుతున్న సలహా ఏంటంటే...
* అవసరం తాత్కాలికమే అయితే స్నేహితులూ బంధువుల వద్ద చేబదులు తీసుకునే అవకాశం ఉందేమో చూడాలి. అప్పుడు వడ్డీ భారం తగ్గుతుంది.
* బంగారం మీద బ్యాంకులు రుణాలిస్తాయి కాబట్టి ఇంట్లో ఉన్న బంగారాన్ని అందుకు వాడుకోవచ్చు.
* ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా పాలసీల మీద కూడా తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవచ్చు.
* చివరి అవకాశంగా మాత్రమే పీఎఫ్‌ ఖాతాలో డబ్బుని తీసుకోవాలి.
లాక్‌డౌన్‌ మొదలైన నెలకే ఆరున్నర లక్షల మంది పీఎఫ్‌ ఖాతాలనుంచి డబ్బు తీసుకున్నారట. మే మొదటివారానికల్లా మరో పది లక్షల మంది తీసుకున్నట్లు అంచనా. అందులో చిన్న జీతాలవారే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేసేవారూ ఉన్నారు. విశ్రాంత జీవితానికి ఉన్న ఏకైక ఆధారం పీఎఫ్‌. దాన్ని తీసుకుంటే తిరిగి కట్టడం ఉండదు కాబట్టి సాధ్యమైనంతవరకూ దాన్ని కదపకుండా ఉండటానికి ప్రయత్నించమంటున్నారు నిపుణులు.

పొరపాటు చేయొద్దు!
పరిస్థితుల్ని చూసి కంగారుపడిపోయి కొందరు చేయకూడని తప్పిదాలు చేస్తుంటారు. ఎదుటివారి బలహీనతలను ఉపయోగించుకునే నేరస్తులు ఎప్పుడూ ఉంటారు. తక్కువ సమయంలో మీ సొమ్ము రెట్టింపు అవుతుందనీ, వడ్డీ లేని రుణాలిస్తామనీ... ప్రకటనలతో ఆశపెడతారు. అలాంటి వారికి దొరికిపోకూడదు. ఎవరిని పడితే వారిని నమ్మి చిట్లు కట్టడమూ మంచిది కాదు. దానికి బదులు తక్కువ పెట్టుబడితో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏమున్నాయో వెతుక్కోవాలి. తగ్గించుకోగల ఖర్చులేమున్నాయో చూడాలి. నామోషీ అనుకోకుండా ఇంటి అద్దె ఎక్కువగా ఉంటే కాస్త దూరంగా ఉన్న చిన్న ఇంటిలోకి మారడమూ మంచిదే. ఇంటి నుంచీ పనిచేసే సౌలభ్యం ఉన్న కంపెనీల ఉద్యోగులు చాలామంది అద్దెలు తగ్గుతాయని చిన్న పట్టణాలకు మారిపోతున్నట్లు ఇటీవల వెలువడిన ఓ అధ్యయనం పేర్కొంది. ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లతో కొంతమేర సమస్య తీవ్రతని తగ్గించుకోవచ్చు.
అందుకే...బడ్జెట్‌ కావాలి!
జీతం తగ్గితేనో, రెండు మూడు నెలలు ఉద్యోగం లేకపోతేనో పరిస్థితి ఇంతగా అస్తవ్యస్తమవుతోందంటే దానికి కారణం కుటుంబ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ సక్రమంగా లేకపోవటమేనంటారు నిపుణులు. బడ్జెట్‌ వేసుకునే అలవాటు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొనడం తేలికవుతుందనీ ఇప్పటివరకూ ఆ అలవాటు లేనివారు ఇకనుంచైనా మొదలుపెట్టాలనీ వారు చెబుతున్నారు. కుటుంబ ఆదాయ, వ్యయాల మీద దంపతులిద్దరికీ అవగాహన ఉండాలి. ఏది అవసరమో ఏది అనవసరమో మనకు తెలియదా... ఆ మాత్రానికి లెక్కలు రాసుకోవాలా అనుకుంటారు కొంతమంది. ఆ అభిప్రాయం తప్పు. ప్రతి నెలా తప్పనిసరిగా ఉండే ఖర్చులు, కొన్ని నెలల్లో అదనంగా అయ్యే ఖర్చులు రాసిపెట్టుకుంటే ప్లానింగ్‌ సులభమవుతుంది. పుట్టినరోజులు, ఆస్పత్రి ఖర్చులు, ప్రయాణాలు, శుభకార్యాలు... ఇలాంటివన్నీ అప్పుడప్పుడు వచ్చే అదనపు ఖర్చులు. బడ్జెట్‌ అంటే ఖర్చుపెట్టింది రాసుకోవడమే కాదు, రాబోయే ఖర్చుల్ని ఊహించి అందుకు తగ్గట్టుగా ఆదాయాన్ని ప్లాన్‌ చేసుకోవటం. ఆదాయమూ ఖర్చులూ రెండూ తెలిసినప్పుడు మిగులు బడ్జెట్‌లో ఉంటామా, లోటు బడ్జెట్‌లో ఉంటామా అన్నది తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకోవటమో, ఖర్చుల్ని కుదించుకోవటమో చేయొచ్చు. ఆర్థిక పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండడానికి మొదటి మెట్టు ఈ బడ్జెట్‌. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి బడ్జెట్‌లను పునఃసమీక్షించుకోవాలి. ఖర్చుల్ని తగ్గించుకుని చేతిలో కొంతైనా నగదు ఉంచుకోవడం చాలా అవసరం. అంతేకాదు, ఇక ముందైనా అత్యవసర నిధి ఒకటి ఏర్పాటు చేసుకోవాలి.

అత్యవసర నిధి అంటే...
ఈ సమయంలోనూ కొందరు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ధీమాగా ఉండడాన్ని గమనించే ఉంటారు. అందుకు కారణం వారి ప్లానింగే. ఆర్థిక నిపుణులు చెప్పే అత్యవసర నిధి ఉన్నవారు మూడు నెలలు కాదు, ఆరు నెలలు జీతం లేకపోయినా ఇబ్బంది పడరు. ఆదాయం సక్రమంగా ఉన్నప్పుడే ప్రతి వారూ తప్పనిసరిగా కొంత మొత్తాన్ని పొదుపు చేసి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నుంచి తొమ్మిది నెలల జీతానికి సమానంగా ఉన్న డబ్బును ఈ నిధిలో జమచేసుకుని ఉంచుకుంటే ఇలాంటి కష్ట సమయాలను తేలిగ్గా దాటేయొచ్చు. అలాగే పొదుపు కూడా. పొదుపుకి సంబంధించి ఆర్థిక నిపుణులు 50, 20, 30 అని ఒక లెక్క చెబుతారు. అంటే ఆదాయంలో 50 శాతాన్ని మాత్రమే నిత్యావసరాలకు ఖర్చుచేసుకుని, 20 శాతాన్ని తాత్కాలిక అవసరాల కోసం, మిగిలిన 30 శాతాన్ని దీర్ఘకాలిక అవసరాలైన పిల్లల చదువులూ శుభకార్యాలూ తదితరాలకోసం దాచుకోవాలని అంటారు. నిజంగా ఈ లెక్కను పాటించగలిగితే అసలు ఏ సమస్యా ఉండదు. ఎంతమందికి ఆ క్రమశిక్షణ ఉంటుందన్నదే సమస్య.

ఆలోచన కావాలి!
ఉద్యోగం పోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదని దిగులుపడుతూ కూర్చునే సమయం కాదిది. పెరిగి పెద్దయ్యే క్రమంలో, జీవితంలో స్థిరపడే క్రమంలో... ఎన్నో కష్టాలు దాటి ఈ స్థితికి వచ్చాం, ఇదీ దాటగలమన్న ధీమా కావాలి. ఆందోళన చెందితే చుట్టూ ఉన్న అవకాశాలను కూడా కనిపెట్టలేం. అందుకని ప్రశాంతంగా ఉండి సమస్య లోంచి బయటపడే మార్గం ఆలోచించాలి. ఉద్యోగం పోయినవారు చిన్నదో పెద్దదో ముందుగా ఒక ఉపాధిని వెతుక్కోవాలి. ఉన్న వ్యాపారం నడవదనుకుంటే కొత్త వ్యాపారం చూసుకోవాలి. దుస్తులు కుట్టేవారు ఎందరో ఇప్పుడు మాస్కులు కుట్టి అమ్ముతున్నారు. ఎల్‌ఈడీ బల్బులు తయారుచేసే ఓ కంపెనీ యజమాని వ్యాపారంలో నష్టపోయామని దిగులుపడుతూ కూర్చోలేదు. అవే లైట్లను ఉపయోగించి క్రిమిసంహారక లైట్లను రూపొందించారు. అవసరానికి తగినట్లుగా ఆలోచనా తీరును మార్చుకోవాలి. ఆదాయ మార్గం దొరకగానే చేయాల్సిన పని ఇక ముందైనా ఆర్థిక క్రమశిక్షణను అమలుచేయడం, ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకుని తదనుగుణంగా ప్లానింగ్‌ చేసుకోవడం, అత్యవసరనిధికీ, ఆరోగ్య, జీవిత బీమాలకూ ప్రాధాన్యం ఇవ్వడం. అప్పుడిక లోటు బడ్జెట్‌ అన్న సమస్యే రాదు.

*  *  *   *

ఒక రాజు దగ్గర మంచి సైన్యాధికారి ఉండేవాడు. అతడికి మిగిలినవన్నీ మంచి గుణాలే ఉన్నా దుడుకుతనం ఎక్కువ. దానికి కళ్లెం వేయడానికి రాజు ఓ పని అప్పజెప్పాడు. ‘ప్రత్యేక శక్తులు ఉన్న ఒక ఉంగరం గురించి విన్నాను. మనసు బాగోనప్పుడు దాన్ని చూస్తే ధైర్యంగా ఉంటుందట. అది ఎక్కడ దొరుకుతుందో వెతికి తెచ్చిపెట్టు’ అని కోరాడు. అలాంటిది ఎక్కడా లేదని రాజుకు తెలుసు. ఆ సైన్యాధికారి వెతికి వెతికి అలసిపోయాడు. గడువు ముగిసే సమయానికి ఓ నగల కొట్టుకి చేరాడు. ఏమైందని అడిగిన కంసాలికి రాజు కోరిన ఉంగరం సంగతి చెప్పాడు. ఆ కంసాలి చిరునవ్వుతో ‘మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. లేచేసరికి ఉంగరం మీ చేతిలో ఉంటుంది’ అన్నాడు.
అన్నట్టుగానే కాసేపటికి ఓ అందమైన వెండి ఉంగరాన్ని అతడి చేతిలో పెట్టాడు. ఆ ఉంగరం మీద వాళ్ల భాషలో చెక్కిన నాలుగు పదాలున్నాయి. ‘ఈ గండం తప్పక గట్టెక్కుతుంది’(దిస్‌ టూ షల్‌ పాస్‌) అన్న ఆ పదాలను చూడగానే సైన్యాధికారి ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. ఆనందంతో తన దగ్గరున్న డబ్బంతా ఆ కంసాలికి ఇచ్చేసి ఉంగరాన్ని తీసుకెళ్లి రాజుకి ఇచ్చాడు. అది చూసి రాజు కూడా ఆశ్చర్యపోయాడు. నిజంగానే దాన్ని చూసినప్పుడల్లా - ఎంత పెద్ద సమస్య ఎదురైనా ‘పర్వాలేదు, బయటపడతాం...’ అన్న ధైర్యం వచ్చేదట ఆ రాజుకి.
ఆ ఉంగరం మనకి అక్కర్లేదు, గండం గట్టెక్కుతామన్న ఆ మాటొక్కటీ చాలుగా..!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు