close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిరు సినిమా కథ

కృషి, పట్టుదల ఉంటే ఎవరు ఏ రంగంలోనైనా లెజెండ్‌ కావచ్చు- అని నమ్మే చిరంజీవి లెజెండ్‌ ఎలా అయ్యారో చెప్పే పుస్తకమిది. చిన్న ఊళ్లో పుట్టిపెరిగిన యువకుడు హీరో అవ్వాలన్న కల కనడమే కాదు, దాన్ని నిజం చేసుకోగలిగాడు. చిరంజీవి తొలి సినిమాతో  మొదలుపెట్టి రాజకీయ జీవితం వరకూ దేన్నీ వదలకుండా రాసిన ఈ పుస్తకంలో ప్రతి సినిమాకి సంబంధించిన కథ, నటీనటవర్గంతో పాటు ఆసక్తి కలిగించే తెరవెనుక సంగతులెన్నో ఉన్నాయి. తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’లో ‘కాంచనమాల పందిరిమంచం’ కథేమిటో, ‘మనవూరి పాండవులు’ సినిమాకి ఆయనకు అందిన పారితోషికం ఎంతో, చట్నీస్‌ హోటల్‌లో ‘చిరు దోశ’ విశేషాలేమిటో... తెలుసుకోవచ్చు. క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌ సంగతులతో పాటు 151 చిత్రాల ఒరిజినల్‌ స్టిల్స్‌... ఇలా చిరంజీవి అభిమానులను అలరించే ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

- సుశీల

 

మెగాస్టార్‌ ది లెజెండ్‌
రచన: యు.వినాయకరావు
పేజీలు: 470; వెల: రూ.750/-
ప్రతులకు: ఫోన్‌- 9885179428


పల్లె బతుకుచిత్రం

వర్తమాన, గ్రామీణ జీవితానికి అద్దంపట్టే కథలివి. అమెరికా వెళ్లినా స్థిర పడలేని, ఊరిమీద మమకారం వదులుకోలేని పాత్రలు కళ్లముందు కదలాడుతాయి. నగర వ్యాపారుల స్వార్థానికి ఊరికి వూరే సెజ్‌గా, వెంచర్‌గా మారిన విపరీతమే ‘పుంజీతం’. శిల్పంతో ప్రయాగాలు చేసిన కథలూ ఇందులో ఉన్నాయి. ‘నాలుగు కోట్ల పిడికిళ్లు’ కథలో పది దృశ్యాలుంటాయి. అడవి మీద అధికారం నుంచి ఫ్లోరోసిస్‌ వరకూ ఒక్కో సమస్యనీ ఒక్కో దృశ్యంలో ప్రస్తావించారు రచయిత. పాఠకుడిని చేయిపట్టి తీసుకెళ్లి మరీ ఆ దృశ్యాన్ని చూపిస్తుంది సన్నివేశ కల్పన. ఊరు నిలబడితేనే మనిషి నిలబడగలడన్న రచయిత ఆశ పలు కథల్లో కనిపిస్తుంది.

- పద్మ

 

పుంజీతం (కథలు)
రచన: డా।।వెల్దండి శ్రీధర్‌
పేజీలు: 112; వెల: రూ.100/-
ప్రతులకు: ఫోన్‌- 9866977741


భావచిత్రాలు

రక్తం స్వేదం కంటే/లాలాజలం విలువైనదని/మిట్టమధ్యాహ్నానికి తెలిసి వస్తుంది(వేసవి), నిదురిస్తున్నప్పుడు మన శ్వాసకి/తన గాలి ఊసులని కలిపి/కలలను పండిస్తుంది(గాలి పంఖా)... ఇలా మన చుట్టూ ఉన్నవాటిపైన సకవితాత్మక వ్యక్తీకరణే ఈ పుస్తకం. కవితాలోకంలో ఇప్పటిదాకా ప్రస్తావనలుగా తప్ప పూర్తి కవితావస్తువులుగా మారని సాఫ్ట్‌వేర్‌, ఎస్కలేటరూ, థియేటర్‌లూ... వంటి ఎన్నో వస్తువులు ఇందులో ప్రధాన భూమికని పోషిస్తాయి. ఇవి ‘వస్తు’కవితలే అయినా ఆర్ద్రత లేనివేమీ కాదని అడుగడుగునా గుర్తుచేస్తుంటాడు కవి. ‘రోజూ ఉదయించేది ఒకే సూర్యుడా/కొత్త సూర్యుడా?/సిరా జల్లి గుర్తు పెట్టేందుకు/ఎంతగా ప్రయత్నించానో!’ వంటివి భావచిత్రాలుగా గుండెను హత్తుకుంటాయి.

- అంకిత

 

జీవితం గీసిన చిత్రాలు(కవిత్వం)
రచన: సతీష్‌ గొల్లపూడి
పేజీలు: 92; వెల: రూ.100/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


సమాజానికి అద్దం

నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల మనుషులూ సంఘటనలకు ఈ కథలు  అద్దం పడతాయి. ఏడు పదుల వయసులో రచనలు చేయాలన్న తాపత్రయం అరుంధతిని నవల రాసి బహుమతి గెలుచుకునేలా చేస్తుంది. బాధ్యతల్లో కూరుకుపోయి ఎన్నో ఏళ్లపాటు మనసులో దాచుకున్న ఆ సృజన ఆమెను గెలిపిస్తుంది. వ్యసనాల పాలై భార్యలను బాధపెట్టే ఇద్దరు మగవాళ్లు ఎలా మారారో ‘మానసరాగాలు’ కథలో చెబితే, భార్య అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకున్న మగవాడి స్వార్థపరత్వం ‘విశాలి’లో కన్పిస్తుంది. ప్రేమను త్యాగం చేసి కుటుంబ బాధ్యతల్ని నెత్తికెత్తుకున్న శ్యామల అంతులేని కథే ‘మనసా తుళ్లిపడకే’. పాఠకులలో ఆశావహదృక్పథాన్ని ప్రేరేపిస్తూ కథలన్నీ చదివిస్తాయి.

- శ్రీ

 

అరుంధతిజీ70(కథలు)
రచన: లలితావర్మ
పేజీలు: 316; వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.