close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
కరోనా తర్వాత...

రెండు నెలల లాక్‌డౌన్‌కి తెరపడింది. అన్నిరంగాల్లోనూ పనులు మెల్లగా మొదలవుతున్నాయి. తప్పదు కాబట్టి లాక్‌డౌన్‌ ఎత్తేసినా... వైరస్‌ ఇంకా మన మధ్యనే ఉందన్నది వాస్తవం. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఊహించని రీతిలో విరుచుకుపడిన కరోనా మన వర్తమానాన్నే కాదు, భవిష్యత్తునీ ప్రభావితం చేయబోతోంది. సామాజికదూరం పాటించడమూ చేతుల్ని శుభ్రం చేసుకోవడమూ లాంటి రోజువారీ పనుల్లో మాత్రమే కాదు- ఇది మన జీవితవిధానంలోనే మరెన్నో మార్పుల్ని తేబోతోంది. కొన్ని ఊహించదగినవీ... మరికొన్ని ఇంకా మన ఊహకందనివీ..!

కరోనాలాంటి మహమ్మారులు చరిత్రలో ఎన్నో వచ్చాయి... పోయాయి. అయితే ఊరకే పోలేదు. లక్షలాది ప్రాణాలను వెంట తీసుకెళ్లాయి. దశాబ్దాల ప్రగతిని కాలరాచి వెళ్లాయి.

భూమ్మీద అసమానతలు పెరిగిపోయినప్పుడు వాటిని సరిచేయడానికి వచ్చే నాలుగు ఉపద్రవాల్లో అంటువ్యాధి ఒకటి- అంటాడు వాల్టర్‌ షెడెల్‌ అనే చరిత్రకారుడు. ఆయన రాసిన ‘ద గ్రేట్‌ లెవెలర్‌’ అనే పుస్తకం ప్రకారం యుద్ధమూ, విప్లవమూ, ప్రభుత్వం కూలిపోవడమూ... మిగతా మూడు ఉపద్రవాలు. ఈ నాలుగూ మానవజీవితాన్ని అన్ని కోణాల్లోనూ ప్రభావితం చేస్తాయనీ అందుకే అవి వచ్చి వెళ్లిన తర్వాత జీవితం అంతకుముందులా ఎప్పటికీ ఉండబోదనీ అంటాడాయన. నిజమే, అయితే అవి ఎంతలా అతలాకుతలం చేసినా ప్రతి సందర్భంలోనూ పడిపోయిన మనిషి శక్తులన్నిటినీ కూడదీసుకుని లేచి నిలబడుతూనే ఉన్నాడు. కూలిన పునాదుల మీద కొత్త భవనాలను కడుతూనే ఉన్నాడు. అందుకు కాస్త సమయం పడితే పట్టవచ్చు. లేవడం మాత్రం ఖాయం. ఇప్పుడు కొవిడ్‌-19 అని పేరు పెట్టుకున్న కరోనా వైరస్‌ కూడా అలాంటి ఉపద్రవమే. దాని నుంచి తప్పించుకోడానికి మరో మార్గం లేకే దేశాలన్నీ తలుపులు మూసుకుని కూర్చున్నాయి. కానీ ఎంతకాలం అలా పనులన్నీ ఆపేసి ఉండగలం. అందుకే మెల్లమెల్లగా ఒక్కో రంగంలోనూ పనులు మొదలవుతున్నాయి.

అయితే, రెండు నెలలపాటు ఉత్పత్తి, వ్యాపార రంగాలన్నీ మూసి ఉంచడం వల్ల ఆర్థిక వ్యవస్థకు తీవ్రనష్టం వాటిల్లింది. చాలా ఉద్యోగాలు పోయాయి. ఓ పక్క వైరస్‌ భయమూ, మరో పక్క ఆర్థిక అభద్రతా కలిసి ఇప్పుడు మన జీవితాల్లో మరెన్నో మార్పులు తేబోతున్నాయంటున్నారు ఆయా రంగాల నిపుణులు. వేర్వేరు రంగాల్లో భవిష్యత్తులో మనం చూడబోతున్న మార్పులు ఎలా ఉండవచ్చంటే...

వైద్యం... ఆధునికం
కొత్త వైరస్‌... మందు లేదు, ఎన్ని రకాలుగా వ్యాపిస్తుందో తెలియదు, అసలు వైరస్‌ సోకిందా లేదా అన్న ప్రాథమిక పరీక్షతో మొదలుపెట్టి చికిత్స చేసి పూర్తిగా నయమైపోయిందనుకునేవరకూ ఏకంగా నెలలు పట్టే పరిస్థితి. పరీక్ష కిట్లూ, వైద్య సిబ్బంది ధరించడానికి అవసరమైన పీపీఈలూ, ప్రజలకు మాస్కులూ, శానిటైజర్లూ... అన్నీ అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితి నుంచి అతి తక్కువ సమయంలోనే శరవేగంగా కరోనాని ఎదుర్కొనడానికి దీటుగా తయారైంది మన వైద్యరంగం. పరిశోధనా సంస్థలే కాక విద్యార్థులు సైతం ఉత్సాహంగా ప్రయోగాలు చేసి వెంటిలేటర్ల లాంటి పరికరాలను చవగ్గా తయారు చేసి అందించారు. ఎన్నో కొత్త ఉత్పత్తులు వాడుకలోకి వచ్చేశాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల సాధారణ వైద్య చికిత్సలకు అంతరాయం కలగకుండా టెలిమెడిసిన్‌ని అందుబాటులోకి తెచ్చింది మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా. దాంతో సాధారణ, లేదా దీర్ఘకాల అనారోగ్యాలకు చికిత్సలు తీసుకుంటున్న పేషెంట్లు ఇంటి నుంచే వైద్యసలహాలు తీసుకోవడానికి వీలయింది. ఈ సౌకర్యం ముందు ముందు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించడానికి దారి తెరుచుకున్నట్లే. ముట్టుకోకుండానే మనిషి శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మల్‌ స్కానర్స్‌ వాడకం ఇప్పుడిక నిత్యకృత్యం కావచ్చు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మెటల్‌ డిటెక్టర్లు వాడినట్లుగా ఇక ముందు ఈ థర్మల్‌ స్కానర్లను వాడవచ్చు. కరోనా వైరస్‌ చికిత్సలో రాజస్థాన్‌ నుంచి కేరళ వరకూ రోబోలు బాగా ఉపయోగపడ్డాయి. అవుట్‌ పేషెంట్‌ విభాగంలో పేషెంట్లను పరీక్షించాయి. ఐసొలేషన్‌ వార్డుల్లోని రోగులకు మందులూ ఆహారపదార్థాలూ సరఫరా చేశాయి. రోబోటిక్‌ సంస్థలు ఎప్పటినుంచో వైద్యరంగంలో ఉపయోగపడే రోబోలను తయారుచేస్తూనే ఉన్నా మన దేశంలో వాటిని అరుదుగానే వాడారు. అలాంటిది ఇప్పుడు అవసరాన్ని గుర్తించి ఎక్కడికక్కడ సొంత రోబోలను తయారు చేసుకుని మరీ వినియోగించారు. ఈ అను భవాన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ప్రతి ఆస్పత్రిలోనూ వైద్యసిబ్బంది బాధ్యతలను పంచుకుంటూ రోబోలు కన్పించవచ్చు.

టెక్నాలజీ... ఆదుకుంది!
కరోనా గండాన్ని మనం ఈ మాత్రమైనా ఎదుర్కొనగలిగామంటే దానికి కారణం సాంకేతికతేనంటున్నారు నిపుణులు. ఈ రంగంలో అతి వేగంగా మార్పులు రావడమే కాదు, అవి అంతే వేగంగా సామాన్యుల వరకూ చేరాయి. చిన్న పిల్లల దగ్గర్నుంచి పరిశోధకుల వరకూ కొత్త కొత్త వస్తువుల్ని కనిపెట్టడానికి ప్రేరణనిచ్చింది ఈ పరిస్థితి. పరీక్ష కిట్లూ, చికిత్సకు అవసరమయ్యే వెంటిలేటర్లూ వాడుకలోకి రావడానికీ, రకరకాల సేవలు అందించగల రోబోలూ డ్రోన్లూ రంగంలో దిగడానికీ అందుబాటులో ఉన్న సాంకేతికతే స్ఫూర్తి అయింది. కరోనా వైరస్‌ బాధితుల కాంటాక్టులను ట్రేస్‌ చేయడానికి ఎన్నో ఆప్‌లను అప్పటికప్పుడు తయారుచేసుకున్నాం. కృత్రిమ మేధ సహాయంతో రూపొందించిన మన ‘ఆరోగ్యసేతు’, సింగపూర్‌ వారి ‘ట్రేస్‌ టుగెదర్‌’ లాంటి ఆప్‌ల వల్ల వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి వీలయింది. ఇళ్లలో నెలల తరబడి లాక్‌డౌన్‌లో ఉన్నవారికి స్మార్ట్‌ఫోనే ప్రపంచానికి కిటికీ అయింది. వార్తలు, వినోదం, విజ్ఞానం... అన్నిటికీ అదే ఆధారమైంది. ఎవరికి వారు ఇళ్లల్లో ఒంటరిగా ఉంటూనే స్నేహితులతో బంధువులతో సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉండి కాలక్షేపం చేశారనడానికి నిదర్శనం- ఈ రెండు నెలల్లో ఒక్క సోషల్‌ మీడియా వాడకమే 87 శాతం పెరగడం. ఇప్పుడీ స్మార్ట్‌ఫోనే భవిష్యత్తులో వైరస్‌ సోకిందీ లేనిదీ తెలుసుకునే కిట్‌గా మారినా ఆశ్చర్యపోనక్కరలేదట. బయోమెట్రిక్‌ స్థానాన్ని పూర్తిగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ భర్తీ చేయనుంది. ఎక్కడికక్కడ మనిషి స్పర్శతో పనిలేకుండా కృత్రిమ మేధతో పనిచేసే పరికరాలదే ఇక భవిష్యత్తంతా.

ఆఫీసు... ఇంట్లోనే..!
లాక్‌డౌన్‌ రెండు నెలలూ చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఆ సౌకర్యం ఎప్పుడూ ఉంది. అయితే అలా ఇంతకు ముందు చేయని రంగాలు కూడా ఈసారి ఇంటినుంచి పనిచేయక తప్పలేదు. విద్యాసంవత్సరం అర్థాంతరంగా ఆగిపోవడంతో పెద్ద తరగతులకూ, కళాశాలల విద్యార్థులకూ టీచర్లు ఇంటి వద్దనుంచే పాఠాలు చెప్పారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. సామాజిక మాధ్యమాల సాయంతో డిజిటల్‌ టీచింగ్‌కి అటు టీచర్లు ఇటు పిల్లలూ కూడా అలవాటు పడ్డారు. ఉద్యోగులంతా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయడానికి కార్యాలయాల్లోనూ చోటు సరిపోదు కాబట్టి ఇంటినుంచి పనిచేసే సంస్కృతి ముందు ముందు మరిన్ని రంగాలకు వ్యాపించవచ్చని పరిశీలకుల అంచనా. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగంలో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కట్టబోయే ఇళ్లూ అపార్ట్‌మెంట్లలో సకల సౌకర్యాలతో ఆఫీసుగది అలరించబోతోందట. ఇప్పటివరకు డబల్‌ బెడ్‌రూమ్‌, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ అని చెప్పేవాళ్లు ఇప్పుడిక మా ఫ్లాట్స్‌లో ‘హోమ్‌ ఆఫీసు గది’ కూడా ఉంది- అని చెబుతారన్నమాట.

ఇల్లే... సినిమాహాలు
రెండు నెలలు సినిమా హాళ్లు మూతపడడంతో సినిమా ప్రియులంతా టీవీలూ డెస్క్‌టాపులూ ట్యాబ్‌లూ ఫోన్లూ... లాంటి చిన్నతెరలకు అతుక్కుపోయారు. ఓటీటీ సదుపాయం థియేటర్‌కెళ్లి సినిమా చూసే లోటుని భర్తీచేసింది. అంతర్జాతీయంగా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, డిస్నీ ప్లస్‌ లాంటివీ దేశీయంగా బిగ్‌ఫ్లిక్స్‌, ఆల్ట్‌ బాలాజీ, జియో సినిమాలాంటివీ, తెలుగులో ఈటీవీ విన్‌, ఆహా లాంటివీ... ఇలా ఎన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సినిమాలూ సీరియల్సూ మాత్రమే కాక ఆప్‌ ప్రేక్షకులకోసమే ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌ సిరీసులూ, కామెడీ కార్యక్రమాలూ ఉంటున్నాయి. కొత్త కొత్త సినిమాలు కూడా కొద్ది రోజుల్లోనే ఓటీటీ వేదికల మీద విడుదల అవుతున్నాయి. అయినా థియేటర్‌లో పెద్ద తెర మీద చూసే అనుభూతి కోసమో, స్నేహితులు పదిమందితో కలిసి చూస్తూ ఆనందించడం కోసమో మొన్నమొన్నటివరకూ థియేటర్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ఇంట్లో చూడడం ఎలాగూ అలవాటైపోయింది కాబట్టి రిస్క్‌ తీసుకుని గుంపులోకి వెళ్లడం అవసరమా అనుకోవచ్చు. పైగా నెట్‌ఫ్లిక్స్‌ పార్టీ లాంటి ఆప్‌లతో ఎక్కడెక్కడో ఉన్న స్నేహితులను కనెక్ట్‌ చేసి ఒకేసారి చూడవచ్చు. సినిమా మీద అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఫేస్‌బుక్‌ వాచ్‌లో పబ్లిక్‌ వీడియోలను ఫ్రెండ్స్‌తో కలిసి చూసే సౌకర్యాన్నీ లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువగా ఉపయోగించుకున్నారట.

వ్యాయామం... చూసి, చేశారు!
ఇల్లు కదలకుండా కూర్చోవడం వల్ల శారీరక వ్యాయామం లేక సమస్యలు వస్తాయన్న భయంతో అందరికన్నా ముందు స్పందించింది ఫిట్‌నెస్‌ ప్రియులే. లాక్‌డౌన్‌ మొదలయ్యీ అవంగానే అంటే మార్చి చివరి వారంలోనే ఫిట్‌నెస్‌ ఆప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా 45శాతం పెరిగింది. ఉచితంగా అందుబాటులో ఉన్నవే కాక డబ్బు ఇచ్చి కొనుక్కోవటమూ అదే స్థాయిలో పెరిగింది. ఒక్క మన దేశంలోనే వినియోగదారులు ఎప్పటికన్నా 60 శాతం ఎక్కువ ఖర్చు పెట్టి ఫిట్‌నెస్‌ ఆప్స్‌, వీడియోలు కొనుక్కున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. హోమ్‌ వర్కవుట్‌- నో ఎక్విప్‌మెంట్‌, నైకీ ట్రెయినింగ్‌ క్లబ్‌, 30డే ఫిట్‌నెస్‌, సిక్స్‌ ప్యాక్‌ ఆబ్స్‌ ఇన్‌ 30 డేస్‌, లూజ్‌ వెయిట్‌ ఇన్‌ థర్టీ డేస్‌ లాంటి ఆప్‌లు విశేష ఆదరణ పొందాయట. యూట్యూబ్‌ వీడియోల వీక్షణలూ అదే స్థాయిలో పెరిగాయి. వీటి సాయంతో ఇంట్లో ఉండే వ్యాయామం చేసుకోవడం అలవాటయ్యాక జిమ్‌కి వెళ్లి పదిమంది వాడే పరికరాలను ఉపయోగించి రిస్క్‌ తీసుకోవడం ఎందుకనుకునేవారు జిమ్‌కి దూరంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత ట్రైనర్ల అవసరం ఉన్నవారు కూడా స్కైప్‌ లాంటి మాధ్యమాల ద్వారా శిక్షణ పొందుతున్నారు కాబట్టి భవిష్యత్తు హోమ్‌ జిమ్‌లదే కావచ్చు.

ఆ వైభవం చరిత్రే!
వందలూ వేలల్లో అతిథులను ఆహ్వానించి వైభవంగా పెళ్లిళ్లు చేయడానికి పెట్టింది పేరు మన దేశం. కరోనా ఆ వైభవానికి తెర దించిందనే భావిస్తున్నారు. వైభవోపేతంగా పెళ్లిళ్లు చేయడమనేది ఇక చరిత్రగానే మిగిలిపోతుందనీ విదేశాలలో లాగా సన్నిహిత బంధువులను పరిమితంగా ఆహ్వానించి నిరాడంబరంగా వివాహాలు చేసుకుంటారనీ పరిశీలకుల అంచనా. ఎక్కడికో వెళ్లి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుని వచ్చి సొంతూళ్లో రిసెప్షన్‌ ఇచ్చుకోవడమూ కష్టమే ఇప్పుడు. కరోనా కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువకావడంతో ప్రయాణాలూ, వేడుకల నిర్వహణా కూడా ఖరీదైపోతాయి. ఒక్క పెళ్లిళ్లే కాదు, పుట్టినరోజుతో సహా ఎక్కువ మంది గుమిగూడే వేడుకలు అరుదే. పండగలూ పబ్బాలూ కూడా సాదా సీదాగా కుటుంబసభ్యుల మధ్యే జరుపుకోక తప్పదు. సభలూ సమావేశాలూ క్రీడోత్సవాలూ అన్నీ పరిమిత అతిథులతోనే ముగుస్తాయి. ఆన్‌లైన్‌ వెబినార్లు, లైవ్‌ స్ట్రీమింగులూ వీడియో కాన్ఫరెన్సులతో సరిపెట్టుకోవాల్సి రావచ్చు.

టెలిస్కూలింగ్‌
సుధ ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదువుతోంది. పొద్దున్నే వాట్సప్‌లో లెక్చరర్‌ పంపించిన పీడీఎఫ్‌ ఫైల్‌ పాఠాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకుంది. తర్వాత ఆయన పంపిన ఆడియో లెక్చర్‌ వింది. ఆ తర్వాత తనకు అర్థం కాని విషయాలన్నీ నోట్‌ చేసుకుని లెక్చరరుతో వీడియో చాట్‌లోకి వెళ్లి సందేహాలన్నీ తెలుసుకుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆరుకోట్ల మంది విద్యార్థులు సుధ లాగా ఇంటినుంచి చదువుకుంటున్నారు. యూట్యూబ్‌, గూగుల్‌ క్లాస్‌రూమ్‌, జూమ్‌, బిగ్‌ బ్లూ బటన్‌ లాంటి వేదికలు అందుకు తోడ్పడుతున్నాయి. మన దేశంలో బైజూస్‌, అడ్డా 24/7, ఖాన్‌ అకాడమీ, డ్యుయోలింగో లాంటి ఆప్స్‌ పోటీ పరీక్షలనుంచి తమ దృష్టిని పాఠశాల, కళాశాల పాఠాలవైపుకి మళ్లించాయి. ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్స్‌ యూనియన్‌ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 165 దేశాల్లో నూట యాభై కోట్ల మంది బడి పిల్లలు ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నారని అంచనా. కరోనా ఒకరకంగా ఆన్‌లైన్‌ విద్యను వేగవంతం చేసింది. నల్లబల్ల స్థానాన్ని ఇప్పుడిక చేతిలో వెలిగే ఫోను తెర ఆక్రమించేసింది. లాక్‌డౌన్‌ డిజిటల్‌ లెర్నింగ్‌ వేదికల పునాదుల్ని మరింత గట్టిపరిచింది.  సెలవుల కోసం ప్రత్యేక కోర్సులు తయారుచేసి మరీ ఈ వేదికలు విద్యార్థులను కట్టిపడేశాయి. ఢిల్లీ, బోంబే లాంటి దేశీయ విశ్వవిద్యాలయాలే కాక హార్వర్డ్‌ లాంటి విదేశీ విశ్వ విద్యాలయాలు కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా సర్టిఫికెట్‌ కోర్సులను ఉచితంగా అందించాయి. ఏఐసీటీఈ దాదాపు 50 ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించింది. మెషీన్‌ లెర్నింగ్‌, డేటా ఎనలిటిక్స్‌, జావా ప్రోగ్రామింగ్‌ లాంటివన్నీ అందులో ఉన్నాయి.
స్కూళ్లు తెరిచినా సామాజికదూరమూ శానిటైజేషన్‌ ఏర్పాట్లకు సమయం పడుతుంది. మౌలిక వసతుల్నీ తగినంత సిబ్బందినీ సిద్ధంచేసుకునేసరికి ఫీజులూ పెరగవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో బడిలో నేర్పే సబ్జెక్టుల్ని కుదించి మిగిలిన వాటిని ఆన్‌లైన్‌లో నేర్పడమే మేలన్న చర్చ జరుగుతోంది.

అందరూ ఆన్‌లైన్‌లోనే!
ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా ఇప్పటివరకూ ఎక్కువగా యువతే ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకునేవారు. ప్రత్యక్షంగా చూసి కానీ కొనడానికి ఇష్టపడనివారూ, షాపింగ్‌ అంటే ఇష్టం ఉన్నవారూ తప్పనిసరిగా బయటకు వెళ్లి కొనుక్కునేవారు. కరోనా వైరస్‌ భయం మొదలయ్యాక ఈ-కామర్స్‌ సైట్‌లకు 52 శాతం కొత్త వినియోగదారులు వచ్చారనీ రద్దీగా ఉండే షాపింగ్‌ ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడకే వాళ్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎంచుకుంటున్నారనీ అమెరికాలో జరిగిన ఒక పరిశోధన పేర్కొంది. మనదేశంలోనూ లాక్‌డౌన్‌ సమయాన్ని షాపింగ్‌ వెబ్‌సైట్లు వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా మార్పులు చేయడంపై దృష్టిపెట్టాయి. మరో పక్క బయటకు వెళ్లడం సాధ్యమైనంతవరకూ తగ్గించే క్రమంలో కూరగాయలూ పండ్లూ నిత్యావసరాలనూ ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడం లాక్‌డౌన్‌ సమయంలో అలవాటైపోయింది. దాంతో భవిష్యత్తులో ఎక్కువ షాపింగ్‌ ఆన్‌లైన్‌లోనే జరుగుతుందనీ, ఒకటీ అరా వస్తువులు కావాల్సివస్తే వీధిలో ఉన్న కిరాణా దుకాణానికే వెళ్తారు తప్ప కేవలం షాపింగ్‌ కోసం దూరంగా రద్దీ ప్రాంతాలకు వెళ్లడం ఉండకపోవచ్చని మార్కెటింగ్‌ సంస్థలుభావిస్తున్నాయి.
ఆభరణాలూ డిజైనర్‌ దుస్తులూ లాంటి ఖరీదైన వస్తువులు అమ్మే దుకాణాలు వినియోగదారులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి అమ్మకాలు జరుపుతున్నాయి. ఫోన్‌ చేసి వాళ్లు చెప్పిన సమయానికి వెళ్తే ఒక్కరే షాపింగ్‌ చేసుకుని రావచ్చు. కాంటాక్ట్‌ లెస్‌ లావాదేవీల్లో భాగంగా క్రెడిట్‌, డెబిట్‌ కార్డులకు ఇప్పుడు పిన్‌ నంబర్లు నొక్కే పని లేదు. కేవలం కార్డును మిషన్‌ ముందు డిస్‌ప్లే చేస్తే సరిపోతుంది.

అత్యవసరమైతేనే... ప్రయాణం!
సామాజికదూరం పాటించాల్సి రావటం విమానాలూ రైళ్లూ బస్సులూ... మొత్తంగా రవాణా సాధనాలన్నిటి సామర్థ్యాన్నీ తగ్గిస్తుంది. దాంతో ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయడమూ తగ్గుతుంది. విదేశీ ప్రయాణాలు చేసేవారికి అదనంగా కొవిడ్‌ సర్టిఫికెట్‌ అవసరమవుతుంది. కరోనావైరస్‌ సోకి తగ్గిందా, అసలు వైరస్‌ సోకలేదా... అన్న విషయాన్ని నిర్ధారిస్తూ వైద్యులు ఇచ్చే సర్టిఫికెట్‌ ఉంటేనే పాస్‌పోర్టును అనుమతించాలని ఇప్పటికే కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులను పరీక్షించాకే విమానం ఎక్కేలా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఏ కాస్త అనారోగ్యంగా ఉన్నా ప్రయాణం సాధ్యం కాదు కాబట్టి దూర, విదేశీ ప్రయాణాలు బాగా తగ్గుతాయి. ఆ స్థానంలో స్థానికంగా, విశాలంగా ఉండే థీమ్‌ బేస్డ్‌ పర్యటక ఆకర్షణలకు డిమాండు పెరుగుతుంది.

హోటళ్లలో లైవ్‌ స్ట్రీమింగ్‌
రకరకాల కారణాల వల్ల హోటళ్ల మీద ఆధారపడడం ఎక్కువైన రోజులివి. హోటళ్లకు వెళ్లలేనివారు స్విగ్గీ జొమాటోలాంటి ఆప్‌లతో తెప్పించుకునేవారు. లాక్‌డౌన్‌ వల్ల వాటన్నిటికీ తెరపడింది. ఇంటి తిండి అలవాటయింది. అయితే హోటల్‌లో భోజనం చేయడమనే అనుభూతిని ఇష్టపడేవారి కోసం హోటళ్లు కొత్తగా మారే అవకాశం ఉంది. మరింత పరిశుభ్రంగానూ  సాంకేతికంగానూ అప్‌డేట్‌ అవ్వచ్చు. డిజిటల్‌ మెను, కిచెన్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ లాంటివి కనిపించవచ్చు. ఎవరికి వారు వడ్డించుకుని తినే బఫేలు బహుశా ఇకముందు ఉండకపోవచ్చు.

* * * * *

మార్పు సహజం. కాకపోతే కొన్ని పరిస్థితులు దాన్ని వేగవంతం చేస్తాయి. కరోనా వల్ల కూడా జరిగింది అదే.
ఈ మార్పు మన జీవితాల్ని ఏ మలుపు తిప్పనుందో వేచి చూద్దాం..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.