close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బాల్యపు మధురిమలు

పసి మొగ్గల అపురూప బాల్యం, కుటుంబంలో ఆలుమగల అనురాగ సమన్వయం, పరాధీనతను సహించలేని స్త్రీ వ్యక్తిత్వం ప్రధాన ఇతివృత్తాలుగా అల్లిన 19 కథల సంకలనమిది. పెద్దలను పిల్లలు ఎంత నిశితంగా గమనించి, ఎంతగా అనుకరిస్తారో ‘నేనూ నాన్ననవుతా!’ కథ ప్రతిబింబిస్తుంది. భర్తకు అనుక్షణం అన్నీ సమకూర్చిపెట్టాలనే తపనతో స్వీయ అభిరుచులనూ, అస్తిత్వాన్నీ బలిపెట్టిన ఇల్లాలు ‘రిమోట్‌ కంట్రోల్‌’లో కనిపిస్తుంది. పిల్లలంతా ఒక్కసారిగా అదృశ్యమై, వారు ఆరాధించే కాల్పనిక పాత్రల చెంతకు వెళ్లిపోతే ఎలా ఉంటుంది? ఆధునికత బాల్యాన్ని కర్కశంగా చిదిమివేస్తున్న వాస్తవాన్ని ‘పిల్లలు మాయమైనవేళ’ కథ ప్రతిభావంతంగా చిత్రిస్తుంది. ఆహ్లాదకరమైన శైలితో కథలన్నీ పఠనీయంగా ఉన్నాయి.
వార్తాపత్రికలోని పెళ్ళిరోజు ప్రకటనలో అన్యోన్యంగా కనిపిస్తున్న ఓ జంట ఎవరికి వారు తమ అంతరంగాలను వెల్లడిస్తే..? అదే ‘అంతరంగాలు’ నవలిక. విషయమూ, కథన సంవిధానమూ విభిన్నంగా ఉండి ఆకట్టుకుంటుంది.

- సీహెచ్‌. వేణు

పిల్లలు మాయమైన వేళ(కథలు)
పేజీలు: 202; వెల: రూ.195/-
అంతరంగాలు(నవలిక)
పేజీలు: 84; వెల: రూ.125/-
రచన: చంద్రలత
ప్రతులకు: ఫోన్‌: 0861-2337573


శారద కథలు

తమిళనాట పుట్టి తెలుగు కథకుడిగా పేరొంది పిన్న వయసులోనే ఒరిగిపోయిన ప్రజారచయితను స్మరిస్తూ ప్రచురించిన సాహితీ సంకలనం ఇది. రచనల్లో నాటి సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులు ప్రతిఫలిస్తాయి. బానిస రోగానికి రెవల్యూషన్‌ మందు ఘాటుగా తగలాలనీ, ఆ తర్వాత సోషలిజం సూదిమందును నరాల్లోకి ఎక్కించాలనీ చెప్పే కథ ‘ప్రపంచానికి జబ్బు చేసింది’. సామాన్యుడు బతికే ఉపాయం, అతడి దరిద్రం వదిలే మార్గం- సంస్కరణ ప్రణాళికలో ఉండవా- అనిపిస్తారు ఓ పాత్రతో. ధర్మం ఖాతా, శవం విలువ లాంటి కథలు చదువుతుంటే  గుండె గొంతుకలో కొట్లాడుతుంది!

- అన్నపూర్ణ

శారద సాహిత్యం
పేజీలు: 400; వెల: రూ.225/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


నవ్వుల ఉత్సవం..!

ప్రహసనం... నాటకంలాంటి ఓ ప్రక్రియ. హాస్యం, వ్యంగ్యమే ఇందులో ప్రధానం! ‘కావ్యదహనోత్సవం’ అలాంటి ఓ ప్రహసనం. 1957లో ఏలూరులో ప్రదర్శించిన ఈ ప్రహసనాన్ని తొలిసారి అచ్చురూపంలోకి తెచ్చారు. పుస్తకాన్ని తెరవగానే ఈ కావ్య అంతిమ సంస్కరణోత్సవానికి సంబంధించిన ‘అశుభ’ లేఖతోనే మనం నవ్వుకోవడం మొదలుపెడతాం. ఓ యువరచయిత తాను రాసిన పద్యకావ్యానికి అంత్యక్రియలాంటి సభని నిర్వహించడమే దీని ఇతివృత్తం. ఎందుకలా చేయాలనుకున్నాడో వివరించే అతని వాదన, ప్రేక్షకుల స్పందన... మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. సాహితీలోకంలోని భిన్నవాదనలని వ్యంగ్యంగా వినిపిస్తాయి.

- అంకిత

కావ్యదహనోత్సవం
రచన: వేలూరు వేంకటేశ్వరరావు
పేజీలు: 79; వెల: రూ. 50/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


పెద్దలకోసం పిల్లల కథ

ఈరోజుల్లో కూడా పిల్లలకేమీ తెలియదనుకునే తల్లిదండ్రులకూ ఉపాధ్యాయులకూ ఇప్పటి పిల్లలు ఎన్ని కోణాల్లో ఆలోచించగలరో తెలియజేస్తుంది బహుమతి పొందిన ఈ బాలల నవల. మౌనిక, కృత్తిక, మీనాక్షి ఒకే బడిలో చదువుకుంటూ స్నేహితులవుతారు. ముగ్గురి అభిరుచులూ స్వభావాలూ వేరైనా ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతారు. తల్లిదండ్రులకు నచ్చజెప్పుకుని తమ ఆసక్తులను నెరవేర్చుకుంటారు. పట్టుదలగా కృషిచేసి పాఠశాలకు పేరుతెస్తారు. ఈ పెద్దవాళ్లెప్పుడూ ఇంతే, పిల్లల్ని అర్థం చేసుకోరు- అనుకున్న పిల్లలూ, ఈ పిల్లలకి ఎంత చేసినా ఏదో అసంతృప్తి- అనుకున్న పెద్దలూ చివరికి ఎలా ఒకరి నొకరు అర్థం చేసుకున్నారో చెబుతుందీ నవల.

- శ్రీ

మా మాట వినరూ...(నవల)
రచన: అనురాధ(సుజల గంటి)
పేజీలు: 80; వెల: రూ. 40/-
ప్రతులకు: ఫోన్‌- 9490746614


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.