close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాలానికి బ్రేకులుంటే...

- కొత్తపల్లి రవికుమార్‌

అసలే చలికాలం. రాత్రి 11 గంటలయ్యింది. చిమ్మచీకటి. ఎముకలు కొరికే చలి. అర్జెంటుగా ఫోన్‌ రావడంతో ఉన్నపళాన ఈ నిశిరాత్రిలో బయలుదేరాను. జర్కిన్‌ వేసుకున్నా చలి ఆగట్లేదు. వయసు మీద పడిందేమో చలిలో అడుగు సాఫీగా పడటంలేదు. దీపూ ఫోన్‌ చేసి విషయం చెప్పిన దగ్గరనుండి కాళ్లూ చేతులు ఆడట్లేదు. ఎంత త్వరగా అక్కడికి వెళ్దామా అని ఈ ముసలి హృదయం కొట్టుకొంటోంది. బస్టాండుకి వెళ్లాను, రాజమండ్రి వెళ్లే బస్సు మరో 15 నిమిషాల్లో ఉందన్నారు. రాజమండ్రి బస్సులు ఆగే చోటికి వెళ్లి కూర్చున్నాను. ప్రతిక్షణం ఒక యుగంలా గడుస్తోంది. 20 నిమిషాలు దాటిన తర్వాత బస్సు వచ్చింది. నాకు రిజర్వ్‌ చేసిన సీట్లో కూర్చున్నాను. 10 నిమిషాల్లో బస్సు కదిలింది. ‘పాపం పసిపిల్ల దీపూ ఒక్కత్తే అక్కడ ఎంత తల్లడిల్లుతోందో? ఎవరైనా సాయానికి వచ్చారో లేదో?’ అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. గతం కళ్ల ముందు 70ఎంఎం సినిమాలా కనిపించింది.

*      *     *

ఆరోజు ఇల్లంతా సందడిగా ఉంది. అందరం కలిసి మా అబ్బాయి నందూ పెళ్లి చూపులకు అమ్మాయి వాళ్లింటికి బయల్దేరుతున్నాం. అక్కడికి చేరుకోగానే సాదరంగా అందరినీ ఆహ్వానించాడు ఆ పిల్ల తండ్రి. ఇంద్రభవనంలా లేకపోయినా బాగుందనిపించింది ఆ ఇల్లు. రెండు బెడ్‌రూమ్‌లు, కిచెన్‌, ఒక పెద్దహాలు, విశాలమైన పూజగది... అన్ని సదుపాయాలతో ఉన్న ఇండిపెండెంట్‌ ఇల్లు అది. ఇంటికి ముందు గార్డెన్‌. గార్డెన్‌లో రకరకాల మొక్కలు. మొక్కల మధ్య సేదతీరడానికి చక్కటి ఉయ్యాల. ఇల్లంతా చూసి వచ్చాక హాల్లో ఉన్న సోఫాల్లో కూర్చున్నాం. తినడానికి అవీ ఇవీ ఇచ్చినా పెద్దగా ముట్టుకోలేదు, కతికితే అతకదని. కొద్ది సేపటికి అమ్మాయిని తీసుకొచ్చారు. మరీ అందగత్తె కాకపోయినా చూడగానే బాగుందనిపించింది. మా వాడికి ఈడూ జోడు బాగా కుదిరిందనిపించింది. ‘‘తలెత్తి అమ్మాయిని చూడరా’’ అన్నాను ఆర్డర్‌ వేసినట్టుగా. వాడు ముభావంగా తలెత్తి ఒకసారి చూసి వెంటనే తల దించుకున్నాడు. పెళ్లి చూపులంటే సిగ్గు పడ్తున్నాడనుకున్నాను. పెళ్లిచూపుల తంతు అయిపోగానే త్వరలో కబురు చేస్తామని చెప్పి ఇంటికి బయలుదేరాం.

మర్నాడు నా భార్య ఇందిరనీ, నందూనీ కూర్చోబెట్టి ఆ అమ్మాయి గురించీ, ఆ సంబంధం గురించీ వివరంగా అడిగాను. ‘‘పెళ్లంటే ఏదో టికెట్‌ కొనుక్కుని సినిమా చూసి టాక్‌ చెప్పినంత ఈజీకాదు. పెళ్లనే రైలెక్కితే లైఫ్‌లాంగ్‌ ట్రావెల్‌ చేయాలి. నిన్నునమ్మి అన్నీ వదిలేసి వచ్చిన ఆ అమ్మాయిని కష్టమొచ్చినా, నష్టమొచ్చినా కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ ఫంక్షన్లైనా, పార్టీలైనా నీ భార్యని తీసుకెళ్లాలి. ఎవరికయినా ‘నా భార్య’ అని పరిచయం చేయాలి. రేపొద్దున్న ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాం రా అని నీకు ఏరోజూ అనిపించకూడదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. మాకైతే ఆ అమ్మాయి నచ్చింది. ఫైనల్‌ డెసిషన్‌ నీదే.’’ అని వివరంగా స్పష్టంగా చెప్పాను. వాడు నేను చెప్పినదంతా విని ముక్తసరిగా ‘‘మీకు ఎలా నచ్చితే అలా చేయండి’’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా పెళ్లంటే సిగ్గు పడుతున్నాడనుకున్నాను. అబ్బాయి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే పిల్ల తండ్రికి ఫోన్‌చేసి ‘‘బావగారూ! వచ్చే గురువారం మంచిరోజు. మిగతా సంగతులు మాట్లాడు కోవడానికి రండి’’ అని చెప్పాను.

గురువారం వచ్చాడు మాట్లాడుకోవడానికి. నా గురించి నేను చెప్పుకొచ్చాను... ‘‘నేను రైల్వేలో రీజనల్‌ మేనేజర్‌ స్థాయిలో రీసెంటుగా వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుంటే నా కొడుక్కి ఆ జాబు ఇచ్చారు. నేను సర్వీసులో ఉండగానే నాలుగిళ్ళు కట్టాను. కొంత డబ్బు బ్యాంకులో వేసుకున్నాను. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. నా ఆస్తి అంతా వాడిదే. ఇక మీ అమ్మాయికి ఏం ఇచ్చుకుంటారో మీ ఇష్టం’’ అన్నాను. దానికి బదులుగా ఆయన ‘‘బావగారూ! మీకు తెలియనిదేమీ కాదు. నేను గవర్నమెంట్‌ స్కూల్లº హిందీ పండిట్‌గా చేసి రిటైర్‌ అయ్యాను. మీరు మొన్న చూసిన ఇల్లుకాక ఇంకొక ఫ్లాట్‌ ఉంది. నాకూ ఒక్కత్తే కూతురు. పెళ్లయ్యాక ఆ ఫ్లాట్‌ అమ్మాయి పేరుమీద రాసేస్తాను. ఐదు లక్షలు క్యాష్‌ ఇస్తాను. పెళ్లి బాగాచేస్తాను’’ అని చెప్పాడు. పిల్ల నచ్చింది, ఒక్కత్తే అమ్మాయి. వాళ్ళకున్నది ఏదైనా ఆ పిల్లకే. ఇక కట్నకానుకల బేరాలెందుకని సరే అన్నాను.

మధ్యాహ్నం మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేశాను. ఆయన వచ్చిన దగ్గర నుండీ నేను గమనించిన విషయం ఏమిటంటే వచ్చిన వారికి అడిగిన వెంటనే అన్ని అవసరాలూ తీరుస్తున్న మా లక్ష్మిని ఆయన గమనించడం. భోజనం చేస్తున్నప్పుడు ‘‘ఎవరండీ ఆ అమ్మాయి. అంత చలాకీగా పనులు చేస్తోంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు’’ అని అడిగాడు. ‘‘తను నా ఫ్రెండ్‌ కూతురు లక్ష్మి. ఈమధ్యే తన తల్లిదండ్రులను ఒక యాక్సిడెంట్‌లో పొగొట్టుకుంది. ఇంటి పనులకు ఆసరాగా ఉంటుందని నేనే తీసుకుని వచ్చాను’’ అని చెప్పాను. నా మాటలను అనుమానంగానే ఒప్పుకున్నాడనిపించింది. తన పిల్లని కోడలిగా పంపించే ఇంట్లో పెళ్లికాని ఈడొచ్చిన అమ్మాయి ఉంటే ఎవరికి మాత్రం అనుమానం రాకుండా ఉంటుంది!
పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం, శుభలేఖలు వేయించడం, ఆ శుభలేఖలు పంచడం చకచకా జరిగిపోయాయి. పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు మా వియ్యంకుడు. పెళ్లికి వచ్చినవారందరూ మంచి ఇంటికే అల్లుడయ్యావన్నారు మా నందూని. అందరి ప్రశంసల్నీ ముక్తసరి నవ్వుతో సరిపెట్టుకున్నాడు నందూ. పెళ్లయి పెళ్లి పనులన్నీ సద్దుమణిగిన తర్వాత రోజు భోజనం చేసి పెరట్లో మంచం వేసుకు పడుకుని లక్ష్మి గురించే ఆలోచించసాగాను.

 *      *     *

సరిగ్గా ఆరు నెలల క్రితం, నేను ఆఫీసు ముగించుకుని రాత్రి పదిన్నరకు ఇంటికి బయల్దేరాను. రైలు పట్టాల పక్క నుంచి వెళ్తే  ఇంటికి త్వరగా చేరుకోగలను. రాత్రివేళ లేటు అయిన ప్రతిసారీ ఆ దారమ్మటే వెళ్తాను. ఆరోజు కూడా అలాగే వెళ్తున్నాను. దూరంగా ఎవరో రైలు పట్టాల మధ్యలో రైలుకు ఎదురుగా పరుగెడుతున్నట్లు కనిపించింది. సాటి మనిషిని కాపాడదామనే సానుభూతితో బండి ఆపి ఆ మనిషి పరుగెట్టినవైపు  తనకన్నా వేగంగా పరిగెట్టి వెళ్ళి పట్టుకుని షాక్‌ తిన్నాను... నేను పట్టుకున్నది ఆడమనిషి మరి. ఆమెకి పాతికేళ్లుంటాయి. పాలరాతి శిల్పంలా ఎంతో అందంగా ఉంది. గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతున్నా నన్ను విదిలించుకుని పారిపోవాలని ప్రయత్నిస్తోంది. కోపం వచ్చి చెంపమీద గట్టిగా ఒకటి కొట్టాను. ఆ దెబ్బకు విదిలించుకోవడం ఆపి నాకేసి చూసి ఏడవసాగింది. జాలేసింది. పక్కకు తీసుకొచ్చి ఏం జరిగిందని అడిగాను. ఆ అమ్మాయి చేసే సైగలను బట్టి మూగదని అర్థమైంది. దేవుడు అన్నీ ఇచ్చి ఏదో ఒక లోపం పెడతాడంటారు. అది కచ్చితంగా నిజమేననిపించింది ఆ అమ్మాయిని చూశాక. జేబులో ఉన్న పేపరూ, పెన్నూ ఇచ్చి తన బాధేంటో రాసిమ్మన్నా.

‘‘సార్‌! మీరెవరో నాకు తెలియదు. కానీ ఆప్తబంధువులా అనిపించి నా గురించి చెబుతున్నా. నాపేరు లక్ష్మి. మాది రాజమండ్రి. రీసెంటుగా ఒకరోడ్డు ప్రమాదంలో నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. రాజమండ్రి దానవాయిపేటలో ఉన్న ఒక ఇల్లే నా ఆస్తి. తల్లిదండ్రులను పోగొట్టుకున్నా ధైర్యంగా బతుకుదామనుకున్నాను కానీ సర్వస్వం అర్పించి నావాడు అని నమ్మిన వ్యక్తి పెళ్లి అనేటప్పటికి ముఖం చాటేశాడు. నా మూగతనాన్ని ఎత్తిచూపుతూ ఆలోపం పెళ్లికి అడ్డం అన్నాడు. ఇప్పుడు చెప్పండి సార్‌! నేనెందుకు బతకాలి?’’ తను రాసింది చదివిన తర్వాత నాకళ్లు తడిబారాయి.

‘‘చూడమ్మా! జీవితం అనేది దేవుడు మనకిచ్చిన గొప్పవరం. ఊపిరి ఉన్నంతకాలం బతికి ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలిగానీ పిరికితనంతో అర్ధాంతరంగా ముగించకూడదు. ఈలోకంలో ఏ మనిషికి సమస్యల్లేవు? డబ్బులేనివాడికి పేదరికం సమస్య. కోటీశ్వరుడికి ఆ ఆస్తిని కాపాడుకోవాలనే సమస్య. చదువుకునే పిల్లాడికి ర్యాంక్‌ వస్తుందా లేదా అనే సమస్య. పాలుతాగే పాపాయికి అమ్మ తనను ఎక్కడ వదిలి వెళ్లిపోతుందోనని సమస్య. అసలు ప్రపంచంలో సమస్యలేని మనిషే లేడు. ఇంకా చెప్పాలంటే సమస్యలేని ప్రాణేలేదు. ఈ సమస్యలకు చావు ఒక్కటే సమాధానమయితే ప్రపంచంలో ఎవరూ మిగలరు. కాబట్టి నామాట విను. ఉండి సాధించు’’ అని ఆమెలో ధైర్యాన్ని నింపి ఇంకెప్పుడూ ఇలాంటి పిరికితనంతో ఆత్మహత్య చేసుకోనని నా చేతిలో ఒట్టు వేయించుకుని ఇంటికి తీసుకువెళ్లాను.

ఇంట్లోకి రాగానే బెడ్‌రూమ్‌లో బెడ్‌పైన జీవచ్ఛవంలా పడి ఉన్న నా భార్యని చూసి ‘‘ఏంటి అంకుల్‌! ఆంటీకి ఏమయ్యింది?’’ అని పేపర్‌పైన రాసి అడిగింది. దానికి నేను ‘‘తను నాలుగేళ్లనుంచీ ఈ దీనావస్థలోనే ఉంది. తనకి బోన్‌ మారో డ్రై అయ్యింది. రక్తంలో ప్లేట్‌ లెట్స్‌, హిమోగ్లోబిన్‌ పర్సంటేజ్‌ బాగా డౌన్‌ అయ్యాయి. ప్రతిరోజూ రక్తం ఎక్కించాలి. దానికి పర్మినెంట్‌ క్యూర్‌ లేదన్నారు డాక్టర్లు. రోజురోజుకూ వీక్‌ అయిపోతోంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూసి చనిపోవాలనే ఒకే ఒక్క కోరికతో బతుకుతోంది. నీకు చెప్పనేలేదుకదూ! మాకూ ఒక్క కొడుకు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండడంలో మా అక్క దగ్గర ఉంచి చదివిస్తున్నాము. ఒక్కడే కొడుకవడంతో బాగా గారాబం చేసింది. అందుకే చిన్నప్పటి నుండీ అల్లరిచిల్లరగా తిరగడంతో చదువు సరిగ్గా అబ్బలేదు. ఏదో నేను కొంచెం కఠినంగా ఉండడంతో డిగ్రీవరకూ లాక్కొచ్చాడు. ఎలాగూ వాడికి గవర్నమెంట్‌ జాబ్‌రాదు. అందుకే డిగ్రీ అయిందనిపిస్తే నేను వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని నా జాబ్‌ వాడికి ఇద్దామని చూస్తున్నాను. అయినా ఇంట్లోకి రాగానే మా సమస్యలు చెప్పి నిన్ను విసిగిస్తున్నాను’’ అంటూ పైన గెస్ట్‌రూమ్‌ చూపించి ఫ్రెషప్‌ అయి పడుకోమని చెప్పి మా బెడ్‌రూమ్‌లోకి వచ్చాను. ‘‘ఎవరా అమ్మాయి?’’ అని అడిగింది ఇందిర. జరిగిన కథంతా క్లుప్తంగా చెప్పాను. ‘‘మంచి పనిచేశారు. ఆ అమ్మాయి సమస్య తీరేదాకా మనకు కూడా ఆసరాగా ఉంటుంది’’ అంది. ఇందిర అన్నట్టుగానే బాగా ఆసరాగా ఉంటోంది లక్ష్మి. వద్దన్నా అన్ని పనుల్లో సాయం చేస్తోంది.

*      *     *

పెళ్లయిన నాలుగు రోజులకు అబ్బాయినీ, అమ్మాయినీ మా ఇంట్లో విడిచిపెట్టి వెళ్లారు అమ్మాయి తరపువాళ్లు. వాళ్లు వచ్చి వెళ్లేటప్పటికి సాయంత్రం అయ్యింది. ఈ హడావిడిలో లక్ష్మి గురించే మర్చిపోయాను. ‘‘లక్ష్మీ, లక్ష్మీ’’ అని గట్టిగా అరిచాను. రాలేదు. ఎందుకు రాలేదని తన రూముకు వెళ్లిచూశాను. తను ఆ రూమ్‌లో లేదు. టీపాయిపైన పేపర్‌ వెయిట్‌ కింద ఒక పేపర్‌ గాలికి రెపరెపలాడుతూ నాకంట పడింది. తీసి చదివా.
‘‘అంకుల్‌! మీకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి కారణం మీకు చెప్పకూడదనుకున్నాను. కానీ నాకు  పునర్జన్మనిచ్చిన విధాత మీరు. అందుకే నా అంతరాత్మ ఊరుకోక ఈ లెటర్‌ రాస్తున్నాను. నేను వచ్చి ఇన్నిరోజులయినా మీ అబ్బాయి గురించి అడగలేదు, చూడలేదు. పెళ్లిచూపుల ముందురోజు వచ్చిన మీ అబ్బాయిని చూసి షాకయ్యా. నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది మరెవరోకాదు మీ అబ్బాయే. నేను ఆరోజే మీకు చెబుదామనుకున్నాను. కానీ కొడుకు పెళ్లిచూసి తనువు చాలించాలనే ఆంటీ కోరిక నా కళ్లముందు కదలాడింది. ఆంటీకున్న సమస్యే పెద్ద సమస్యగా ఉన్న మీకు ఈ విషయం చెప్పి మరిన్ని కొత్త సమస్యలు తీసుకురావడానికి నా మనసు అంగీకరించలేదు. కొడుకు పెళ్లి జరుగుతోందన్న ఆనందం మీలోనూ, ఆంటీలోనూ కనబడింది. ఆ ఆనందాన్ని శాశ్వతంగా మీకుంచాలనే ఆరోజు మీకు చెప్పలేదు. పెళ్లి అయ్యేవరకూ నేను ఇల్లువదిలి వెళ్లకూడదనుకున్నాను... ఎందుకంటే పెళ్లిపనులు మానేసి నా గురించి ఆలోచిస్తారని. అందుకే పెళ్లి పనుల్లో చలాకీగా పాల్గొన్నాను ఎవరికీ అనుమానం రాకుండా. ఈరోజు నేను ఇల్లు వదిలే టైమ్‌ వచ్చింది. అందుకే వెళ్తున్నాను. భయపడకండి. నేనేమీ ఆత్మహత్య చేసుకోను. మీరు నింపిన ధైర్యంతో మా ఊరికి వెళ్తున్నాను. ఏరోజూ మీకుగానీ, మీ అబ్బాయికిగానీ అడ్డురాను. ఎందుకంటే ఈ తక్కువ కాలంలోనే నన్ను ఒక కూతురుకన్నా ఎక్కువగా చూశారు. తల్లీ, తండ్రీ లేని నాకు మీరు ఆ దేవుడిచ్చిన తల్లిదండ్రులనుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ పిచ్చిలక్ష్మిని చూడాలనిపిస్తే ఒక్కసారి వచ్చి చూడండి. బై అంకుల్‌!’’

ఆ లెటర్‌ చదివి అలానే కూలబడిపోయాను. నోటమాట రాలేదు. తేరుకున్నాక నందూ చెంపలు వాయించి ఎందుకిలా చేశావు అని నిలదీయాలను కున్నాను. కానీ కొత్తగా ఇంటికి వచ్చిన కోడలి ముందు ఇంటి పరువు ఎలా దిగజార్చగలను!
ఉన్నపళాన రాజమండ్రి బయలుదేరి వెళ్లాను. ఇంటికి వెళ్లిన వెంటనే లక్ష్మి కళ్లలోకి చూసి మాట్లాడలేకపోయాను. అయినా సరే ఎలాగైనా తనతో మాట్లాడి ఒప్పించి ఇంటికి తీసుకెళ్దామని నిశ్చయించుకుని ‘‘తల్లీ! నన్ను క్షమించమ్మా! నిన్నీ స్థితికి తీసుకొచ్చింది నా కొడుకని తెలిసి కూడా వాడిని ఖండఖండాలుగా నరకలేకపోయానమ్మా. మేము కని పెంచి పెద్దవాడిని చేసింది ఒక రాక్షసుడినని తెలుసుకోలేక పోయానమ్మా. అసలు నువ్వు ఆరోజే ఆ తప్పు చేసింది మావాడేనని చెప్పి ఉంటే వాడి మెడలు వంచైనా మీ పెళ్లి చేసేవాడిని. ఎందుకింత పని చేశావమ్మా? నాపరువు పోకూడదని ఈవిషయం దాచావమ్మా? ఆడదానికి భూదేవంత ఓర్పు ఉంటుందంటారు. కానీ మనుషుల భారం పెరగడంతో ఆ భూదేవి కూడా ఓర్పు నశించి భూకంపాల రూపంలో తన అసహనాన్ని వెళ్లగక్కుతోంది. నువ్వు భూదేవికన్నా గొప్పదానివి తల్లీ! కాలానికి బ్రేకులు గనుక ఉంటే ఎంత బాగుండేది తల్లీ! ఇప్పటికయినా మించిపోయిందిలేదు. నాతోరామ్మా! అందరికీ నచ్చజెప్పి నా ఇంటికి తీసుకెళ్తాను, రామ్మా!’’ అన్నాను.

కానీ లక్ష్మి నన్ను వారించి ఒక పేపర్‌పైన... ‘‘అంకుల్‌! నేను గొప్ప త్యాగం చేశాననుకోవట్లేదు. అయినా ఇప్పుడు నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్దామనుకుంటున్నారు? అక్కడున్న మనుషులకు నన్ను ఏమని పరిచయం చేద్దామనుకుంటున్నారు? ఇదిగో నీ సవతిని తీసుకొచ్చానని మీ కోడలికి పరిచయం చేస్తారా? తన కడుపులో పెరుగుతున్నది కన్నూమిన్నూ కానక నువ్వు చేసిన పాపమేనని మీ కొడుకుతో చెప్తారా? నీ కొడుకు రాక్షసుడికంటే క్రూరంగా అనుభవించి వాడి వదిలేసిన వస్తువు ఈ అమ్మాయేనని ఆంటీకి నన్ను చూపించగలరా? చెప్పేదాన్నయితే ఆరోజే చెప్పి మీ అబ్బాయి పెళ్లికాకుండా ఆపేదాన్ని కానీ మీ పరువు కాపాడదామని ఆరోజు ఆగాను, ఇప్పుడూ ఆగుతున్నాను, ఎప్పటికీ ఆగుతాను. ఈ మూగదాని జీవితం ఇలా అంతమవ్వాల్సిందే. నామీద ఏమాత్రం ప్రేమున్నా ఇంక నన్ను బలవంతపెట్టకండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి’’ అని రాసింది. వయసులో చిన్నదయినా కొండంత సంస్కారాన్ని నింపుకుందని మనసులోనే లక్ష్మికి పాదాభివందనం చేశాను. ఇది జరిగి పన్నెండేళ్లయ్యింది.

ఆరోజు నుండీ లక్ష్మి బాగోగులు ఒక తండ్రిగా నేనే చూసుకుంటున్నాను. నందూతో మాట్లాడడం మానేశాను. అదే నేను వాడికి విధించే శిక్ష అనుకున్నాను. మాట్లాడటం లేదని నందూ, కోడలూ ఎన్నిసార్లు అడిగినా వేరే కారణం చెప్పి దాటవేసుకుంటూ వస్తున్నాను. కొడుకూ, కోడలి దగ్గర ఉంటూనే లక్ష్మి దగ్గరకు వెళ్లి వస్తున్నాను. ఎవరేమి అడిగినా, ఎక్కడకు వెళ్తున్నారని అడిగినా లక్ష్మిగురించి చెప్పలేదు. కాలగమనంలో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. పెళ్లయిన ఏడాదికి ఇందిర నన్నూ, ఈ భూమినీ విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుండీ నేను ఎక్కువగా నా గదికే పరిమితమయ్యాను. నాకోడలు నన్ను బాగా చూసుకుంటోంది. కాఫీ, టిఫిన్‌ ఆఖరికి భోజనం కూడా నా రూమ్‌కే తీసుకునివచ్చి పెడుతోంది. ఇన్నేళ్లయినా పిల్లలులేని తను నన్ను ఒక చిన్నపిల్లాడిలా చూసుకుంటోంది. నా పెంపకంలో రాక్షసుడిలా మారిన మనిషికి తోడుగా వచ్చిన కోడలు మాత్రం దేవతే.

*      *     *

‘‘సార్‌! రాజమండ్రి వచ్చింది సార్‌! మీరు దిగవల్సిన స్టేషన్‌ ఇదే’’ అని తట్టిలేపాడు కండక్టర్‌. ఆలోచనలలో అసలు టైం తెలియలేదు. వాచీకేసి చూశాను. తెల్లవారుజాము నాలుగున్నరయ్యింది.  కాళ్లు సహకరించకపోయినా పరుగులాంటి నడకతో లక్ష్మి ఇంటికి చేరాను. లక్ష్మి శవం పక్కనే కూర్చుని ఏడుస్తున్న నా మనవరాలు దీపూ నన్నుచూసి పరిగెత్తుకుని వచ్చి నన్ను వాటేసుకుని భోరుమంది. ‘‘అమ్మ చనిపోయిందంటున్నారు. అమ్మ ఇకరాదా? చెప్పు తాతా?’’ అని ఆర్ద్రంగా అడుగుతున్న ఆ చిట్టితల్లికి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు. బాధతో ఈ ముసలిగుండె బరువెక్కినా మిగిలిన కార్యక్రమం చూడాలి కదా! పాపం చుట్టుపక్కలవాళ్లు అప్పటికే కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు.

‘‘ఈమె బంధువులెవరు? ఈవిడ పేరేమిటి? ఎప్పుడు చనిపోయింది?’’ అని పోలీసులు వరసపెట్టి ప్రశ్నలడుగుతుంటే  బాధలో నానోరు పెగలలేదు. అయినా ధైర్యం తెచ్చుకుని సమాధానం చెప్పేలోపల ‘‘సార్‌! ఆవిడ మా అక్క. ఆయన మా మామగారు, మాఅక్క పేరు లక్ష్మి, కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతోంది. నిన్నరాత్రే చనిపోయింది. ఇవిగోండి రిపోర్ట్స్‌’’ అని వెనకాలే వచ్చిన నా కోడలు పోలీసులకి అన్నీ వివరించింది. నేను ఆశ్చర్యపోయా, నా కోడలికి లక్ష్మిగానీ, ఈ ఇల్లుగానీ ఎలా తెలుసా అనీ. ఫార్మాలిటీస్‌ అన్నీ అయిన తర్వాత లక్ష్మిని దహనానికి  తీసుకెళ్తుంటే బాధ ఆపుకోలేకపోయాను. వెక్కి వెక్కి ఏడ్చాను. సర్వం కోల్పోయినట్లనిపించింది. దీనినే శ్మశాన వైరాగ్యం అంటారేమో. నా చేతులతోనే దహనం చేశాను. పగవాడికి కూడా ఈ దుస్థితి రాకూడదనుకున్నాను.

అన్ని పనులూ పూర్తయిన తర్వాత నా కోడలిని ‘‘నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా?’’ అని అడిగాను. నాకోడలు చెప్పడం ఆరంభించింది... ‘‘అర్ధరాత్రి మెలకువ వచ్చి మంచినీళ్లు తాగి మీ రూమ్‌కేసి చూశాను. లైట్‌ వెలుగుతోంది. లైట్‌ ఆపలేదేమోనని మీరూమ్‌లోకి వచ్చాను. మీరులేరు. బాత్‌రూమ్‌ తలుపు తెరిచే ఉంది. ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేరు. భయమేసింది. మళ్ళా మీ రూమ్‌లోకి వచ్చి కూర్చున్నాను. తప్పని తెలిసినా మీ డైరీ తీసి చదివాను. అక్క గురించి మొత్తం తెలుసుకున్నాను. ఇక్కడికే వస్తారనుకొని రాత్రికి రాత్రే కారులో బయలుదేరి వచ్చాను.

నామీద నాకే అసహ్యం వేస్తోంది మావయ్యా, ఇన్నాళ్లూ ఒక పశువుతో కాపురం చేశానని. నేను మిమ్మల్ని కూడా అనుమానించాను, ఊరెళ్లి ఫ్రెండ్‌ని కలిసి వస్తానని చెప్పినప్పుడల్లా. నన్ను క్షమించండి మావయ్యా! ఇంతటి బాధను ఒక్కరే ఎలా భరించారు. ఇక ఈ బాధను నాక్కూడా పంచండి మావయ్యా! ఆయన చేసిన పాపానికి దేవుడు మాకు ఈ జన్మలోనే శిక్షవేశాడు, పిల్లల్నివ్వకుండా. కానీ నేను గొడ్రాలిని కాదు మావయ్యా! దీపూని నాకు కూతురిగా ఇచ్చాడు ఆ దేవుడు. దీపూని ఇంటికి తీసుకెళ్లి ఆయన కళ్లముందే అక్క రూపాన్ని పెంచుతాను’’ అంది. కోడలిని ఆడిపోసుకునే అత్తగార్లూ, నిప్పంటించి చంపే ఆడపడుచులూ ఉన్న ఈరోజుల్లో, ఆడదానికి ఆడదే శత్రువు అంటూ సీరియల్స్‌లో,  కథలలో క్యారెక్టర్‌లు సృష్టిస్తున్న ఈరోజుల్లో... నా కోడలిని చూసి గర్వంగా అనిపించింది. సెటిల్‌మెంట్‌లన్నీ అయిన తర్వాత ఇంటికి తాళం వేసి ముగ్గురం బయలుదేరాం కారులో... నాకొడుక్కి గుణపాఠం నేర్పుతామన్న ఆత్మ సంతృప్తితో!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.