close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాగితపు సొగసు చూడతరమా!

గులాబీల సౌందర్యంతో అదరహో అనిపిస్తున్న ఈ డ్రెస్సును చూస్తే ఎవరైనా చూపు తిప్పుకోలేరు. ఇంత అందంగా కనిపిస్తున్న ఈ గౌను కేవలం కాగితాలతో చేసిందంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఇది అచ్చమైన పేపర్‌ గౌన్‌. లండన్‌కు చెందిన జోయీ బ్రాడ్లీ అనే డిజైనర్‌ ఆలోచన నుంచి రూపుదిద్దుకుంది ఇది. ఈ డ్రెస్‌లో మొత్తం 400కు పైగా కాగితపు గులాబీలు ఉన్నాయి తెలుసా! దీన్ని తయారుచేయడానికి వారు ముందుగా పేపర్‌ను కావాల్సినట్టు కత్తిరించుకుని... తర్వాత ఆ ముక్కలతో రకరకాలైన సైజుల్లో గులాబీలను తయారు చేసుకున్నారట. గ్లూ అంటిస్తూ ఆ గులాబీలను ఒక ఆర్డర్‌లో పేర్చుకుంటూ వచ్చి చివరిగా ఈ రూపు తీసుకొచ్చారన్నమాట. ఈ డ్రెస్సును చేయడానికి జోయీతోపాటూ తన ఇద్దరు సహాయకులకూ వారం రోజులకుపైగా పట్టిందట. కానీ ఈ గౌనును చూస్తే ఆమాత్రం కష్టపడటంలో ఎంతమాత్రం తప్పు లేదు అనిపిస్తోంది కదూ!


రోబోలే స్టూడెంట్లు!

కరోనా దేశాలన్నింటినీ వణికిస్తోంది. జపాన్‌లో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పుడు అక్కడున్న బిజినెస్‌ బ్రేక్‌త్రూ అనే యూనివర్శిటీ లో స్నాతకోత్సవం జరగాల్సిన సమయం. కానీ సామాజిక దూరం అవసరం కదా! అందుకే విద్యార్థులు ఎవరూ యూనివర్శిటీకి రాకుండానే కార్యక్రమాన్ని నిర్వహించేలా యాజమాన్యం చిత్రమైన ఏర్పాట్లు చేసింది. ఏఎన్‌ఏ హోల్డింగ్స్‌ అనే సంస్థ అభివృద్ధి చేసిన అవతార్‌ రోబోట్లను విద్యార్థులకు బదులుగా అనుమతించింది. వీటిని యువతీయువకులు తమ ఇళ్లలోనే ఉంటూ ల్యాప్‌టాప్‌ల ద్వారా ఆపరేట్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు... మనిషంత ఎత్తు ఉన్న ఆ రోబోలకు నల్లటి డ్రెస్సు, నెత్తిమీద టోపీ కూడా పెట్టారు. రోబో తల భాగంలో టాబ్లెట్లను ఉంచడంతో వాటిలో పట్టా పుచ్చుకునేవారి ముఖం కనిపిస్తుందన్నమాట. అలా రోబోలతో పట్టాల ప్రదానోత్సవం జరిగిపోయింది. మిగిలిన దేశాలు కూడా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తమలాగే సామాజిక దూరం పాటించాలని కోరుతోందీ హైటెక్‌ యూనివర్శిటీ! 


అప్పుడు బిచ్చగత్తె... ఇప్పుడు మోడల్‌!

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు అనడానికి ఈ కథే ఉదాహరణ. ఫిలిప్పీన్స్‌కు చెందిన రీటా గావిలోనియా అనే అమ్మాయిది చాలా బీద కుటుంబం. వీధుల్లో భిక్షమెత్తుకునేది. అలా ఒకరోజు రోడ్డుపైన భిక్షాటన చేస్తూ టోఫర్‌ క్వింటో బర్గోస్‌ అనే ఫొటోగ్రాఫర్‌ కంట్లో పడింది. పదమూడేళ్ల వయసులో సహజమైన ఆకర్షణతో కనిపించిన ఆమెను తన కెమెరాతో క్లిక్‌మనిపించాడు టోఫర్‌. ఆ ఫొటోను నెట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఆ అమ్మాయి అందాన్ని అందరూ మెచ్చుకోవడంతో అది విపరీతంగా వైరల్‌ అయ్యింది. ఆమె ఫేమస్‌ అయిపోవడంతో కొన్ని కంపెనీలు తమ బ్రాండ్లకు మోడలింగ్‌ చేయాల్సిందిగా కోరాయి. టీవీ సిరీస్‌లలో నటించడంతోపాటూ బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొంది. సొంతంగా ఇల్లూ, కారూ వంటివి కొనుక్కుని స్థిరపడింది. కొన్నాళ్లు సంపాదనకు విరామం ఇచ్చి, ఇప్పుడిక పూర్తిగా చదువు మీదే ధ్యాస పెట్టిందట. ఒక ఐడియానే కాదు... ఫొటో కూడా జీవితాన్ని మార్చేస్తుందన్న మాట! 


డ్రమ్ము రైలులో బడికి!

ఆలోచన ఉండాలే కానీ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దీన్నే ఆచరణలో చూపించారా ప్రజలు. ఆస్ట్రేలియాలో బాగా వెనుకబడిన పెన్మ్యూ జాతి కుటుంబాల వారికి చదువు ఎప్పుడూ అందని ద్రాక్షే. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తే కానీ బడికి చేరుకోలేని చోట బతకాల్సిన పరిస్థితి. అయితే ఆ వెనకబాటుతనం తమ తరంతోనే అంతమైపోవాలి అనుకున్నారు వారు. దీంతో ఓ ఉపాయం కనిపెట్టారు. ఖాళీ డ్రమ్ములను తొలిచి, పిల్లలు కూర్చునేలా వాటి లోపల బల్లలు వేశారు. ఆ డ్రమ్ములకు కింద చక్రాలు ఏర్పాటు చేసి... ఒకదాని వెంట ఒకటి ఓ ట్రాక్టర్‌కు తగిలించి డ్రమ్ముల రైలును సృష్టించారు! ఈ ట్రైన్‌ రోజూ పొద్దున్నే పిల్లలందరినీ బడికి తీసుకెళ్లి, తిరిగి సాయంత్రం వారి వారి ఇళ్లలో దింపుతుందట. ఇందులో పిల్లలంతా సంతోషంగా బడికి వెళ్తుండటంతో అక్కడ అక్షరాస్యత శాతం మెరుగవుతోంది. ఒక పెద్ద సమస్యకు ఒక చిన్న ఆలోచనతో చెక్‌ పెట్టిన ఈ ప్రజల ఆవిష్కరణ అభినందనీయం కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.