close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మో ఎంత ఖరీదో!

రోజువారీ తినే పండ్లూ కూరగాయలూ కిలో మామూలుగా పదీ ఇరవై రూపాయల నుంచీ వందా రెండు వందల దాకా ఉండటం చూస్తుంటాం. అయితే మనకు తెలిసిన కొన్ని పండ్లూ కూరగాయలే ఒక్క కిలో వేలూ లక్షల రూపాయల ఖరీదు చేసేవీ ఉన్నాయి. ధర చెబితే అమ్మో అనుకుంటాం కానీ వాటిని పండించడం కూడా అంతే కష్టం. అవేంటో ఓసారి అలా చూసేద్దామా... అయితే, ఇక్కడ బేరాల్లేవమ్మా..!

జత రూ. 35 లక్షలు!

బాబోయ్‌... ఈ పండ్లు కొనుక్కునే బదులు... ఓ చక్కటి ఇల్లు కట్టుకోవచ్చు అని అనిపిస్తుంది జపాన్‌లో పండే యుబారీ కింగ్‌ మెలన్‌ అనే ఒక ప్రత్యేక రకం ఖర్బూజాల ధర గురించి వింటే. గతేడాది పంటల కాలంలో ఇవి జత ముప్పై అయిదు లక్షల రూపాయలు పలికాయంటే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది మరి. వీటికి ఇంత ధర ఎందుకంటే, వాటిని పండించడంలో ఉన్న కష్టానికే. ఇవి అక్కడి హొక్కాయిడో దీవిలోని యుబారీ గ్రామంలో మాత్రమే పండుతాయి. వీటిని గ్రీన్‌హౌసుల్లో పెంచుతారు. ఒక్కో పాదునుంచి ఒక పండును మాత్రమే ఉంచి మిగిలిన వాటిని పిందె దశలోనే తెంపేస్తారు. దీనివల్ల పోషకాలన్నీ ఒకే పండులో చేరడంతోపాటు దాని రుచీ పెరుగుతుందట. కాయ కచ్చితంగా గుండ్రంగా, చెక్కు మీద ఎలాంటి గీతలూ లేకుండా ఉండేలా పిందెలకు కాగితాలు చుడుతూ, పాలిష్‌ పెడుతూ పెంచుతారు. అలా ఏ వంకా లేకుండా పండిన అతి కొద్ది పండ్లు లక్షల ధర పలుకుతుంటాయి.


పుచ్చకాయల జత 10 లక్షలు!

ఎండాకాలంలో వేడిని తరిమి ఒంట్లో నీటి శాతాన్ని నిల్వ ఉంచే తియ్యతియ్యటి పుచ్చకాయంటే అందరికీ ఇష్టమే. అయితే, అది మన దగ్గర కిలో పది, పదిహేను రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ జపాన్‌లోని హొక్కాయిడో దీవిలో పండే డెన్సుక్‌ వాటర్‌ మెలన్‌ మాత్రం ఏకంగా జత రూ.10 లక్షల దాకా ధన పలుకుతాయి. అక్కడ పండే ఈ రకం పుచ్చకాయలు నల్లగా గుండ్రంగా ఉండి లోపలి గుజ్జు నిండు గులాబీ రంగులో, ఒక ప్రత్యేకమైన తీపి రుచితో ఉంటాయట. అందులోనూ ఇక్కడ
పండే తొలి పంట మరింత రుచిగా ఉంటుందట. అందుకే ఏటా వీటిని వేలంవేసి మరీ అమ్ముతారు అక్కడి వాళ్లు.


రెండు మామిడి పండ్లు రూ.4 లక్షలు!

మనకెంతో ఇష్టమైన మామిడి పండ్లను రేటు కాస్త అటూ ఇటూ అయినా కొనేస్తుంటాం. అయితే జపాన్‌లోని మియజకి ప్రాంతంలో కాసే ‘ఎగ్‌ ఆఫ్‌ ద సన్‌’గా పిలిచే ఎరుపు రంగు మామిడి పండ్లను కొనాలంటే మాత్రం లక్షల రూపాయలు ఉండాల్సిందే. గతేడాది ఇవి జత దాదాపు నాలుగు లక్షల రూపాయలకు పైగా ధర పలికాయి. ఇవి మామూలు మామిడి పండ్ల కన్నా 15 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయట. వీటిని పాలీహౌసుల్లో పెంచుతారు. మామిడి పూత పూసినప్పుడు తేనెటీగల సాయంతో పరాగసంపర్కం జరిపించడం మొదలు, పెద్దకాయ అయ్యే పిందెల్నే ఉంచి మిగతావి తెంచడం, చివరికి పండు పండాక ఒక్కో పండూ రాలేందుకు నెట్‌ కట్టడం దాకా ఎంతో శ్రమ ఇందులో ఉంటుంది. అలా చెట్టు మీద పండి రాలిన పండ్లే ఇలా వేలూ లక్షల రూపాయల విలువ చేస్తాయన్నమాట!


కిలో ఆలూ రూ.50 వేలు!

ఏడాది పొడుగునా దొరికే ఆలుగడ్డ జనానికి చేరువ అవడానికి కారణం వాటి తక్కువ ధరే. కానీ, లా బొనాట్‌ పొటాటోస్‌గా పిలిచే ఒక రకం ఆలూ మాత్రం ఏకంగా కిలో రూ.యాభైవేల రూపాయల దాకా పలుకుతున్నాయి. ఫ్రాన్స్‌ దేశంలోని నార్‌మోటియర్‌ దీవిలో మాత్రమే పండుతాయివి. పూర్తి పక్వానికి రాకముందే అంటే, పంట వేసిన మూడు నెలలకే వీటిని కోస్తారు. అప్పుడు బాగా మృదువుగా ఉంటాయి కాబట్టి యంత్రాలతో కాకుండా, ఒక్కోగడ్డనూ చేత్తో తీస్తారు. ఇసుక నేలల్లో పెరగడం, సముద్ర నాచును ఎరువుగా వాడటంలాంటి వాటి వల్ల ఈ దుంపలకు మట్టివాసనతో కూడిన ఒక ప్రత్యేకమైన రుచి వస్తుందట. ఏడాదికి కేవలం 100 టన్నులే పండే వీటిని ఫ్రాన్స్‌ దేశంలోని పెద్ద రెస్టారెంట్లలో వడ్డిస్తారు.


ఈ పాలకూర కట్ట రూ.200!

సాధారణంగా పాలకూర కట్ట మూడు నాలుగు రూపాయలు ఉంటుంది. కానీ పారిస్‌ దగ్గర పండే ఒక పాలకూర మాత్రం కట్ట కనీసం 200 నుంచి 250 రూపాయల దాకా పలుకుతుంది. దీన్నే ‘యమషిత స్పినాచ్‌’గా పిలుస్తున్నారు. అసఫుమి యమషిత అనే అతను జపాన్‌లో పేరు మోసిన రైతు. ఆయన తన తోటలో అన్నీ ప్రత్యేకమైన కూరగాయల్నే పండిస్తాడు. ఒక్కో కూరగాయా పర్‌ఫెక్ట్‌ రుచికి రావడానికి ఆరేడు సంవత్సరాల పాటు దాన్ని పండించే విధానంలో మార్పులు చేస్తూ వస్తాడు. అలాగే ఇతను తన తోటలోని గ్రీన్‌హౌస్‌లో ఒక రకమైన సువాసనను వెదజల్లే పాలకూరనూ పండించి, అమ్ముతున్నాడు. అది అక్కడి లెక్కల ప్రకారం కిలో రెండు వేల రూపాయలకు పైగానే పలుకుతోంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.