close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చూస్తే కేకు... తింటే సలాడ్‌!

ఒకప్పుడు సలాడ్‌ అంటే చక్రాల్లానో, మరేదైనా ఆకారంలోనో అందంగా కోసిన పచ్చికూరగాయ ముక్కలే. క్రమంగా వాటికీ రకరకాల పదార్థాలు కలిపి... సలాడ్‌ని నోరూరించేలా తయారుచేయడం మొదలైంది. ఇప్పుడు ఆ సలాడే ఇంకాస్త కొత్తగా మారి... కేకు రూపంలో నోరూరిస్తోంది. ఇప్పుడు అదే ట్రెండు మరి.

సలాడ్‌ అంటే... కీరా, క్యారెట్‌, ఉల్లిపాయముక్కలూ, క్యాబేజీ తరుగూ, లెట్యూస్‌ ఆకులూ... తదితరాల్ని అందంగా కోసి ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం చల్లుకుని తినడమే తెలుసు కానీ అలాంటివాటితో కేక్‌ చేస్తారా... ఎలా అబ్బా అని ఆశ్చర్యపోకండి. ఈ కేకులన్నీ అవే మరి. నిజానికి వీటిని మొదట తయారుచేసింది జపాన్‌లో అయినా ఇప్పుడు రకరకాల రుచులతో మన దగ్గరా ప్రయోగాలు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కీరా, క్యారెట్‌, ఉల్లిపాయలు వంటి కూరగాయలు మాత్రమే కాదు ఉడికించిన గుడ్లూ, చికెన్‌తోనూ తయారు చేస్తున్నారు. ఇలా మనకు నచ్చిన రుచిలోరకరకాల పదార్థాలు వేసుకుని, కొన్ని మెలకువలు పాటిస్తే రోజుకో కేకును ఓవెన్‌ లేకుండానే తయారు చేసుకుని లాగించేయొచ్చు.

ఫ్రిజ్‌లో పెట్టడమే...
కేకు అంటే గుండ్రంగానో లేదా నలుచదరంగానో ఉండి, ముక్కల్లా కోసుకోవడానికి వీలుగా కాస్త గట్టిగానూ ఉంటుంది. కానీ కూరగాయముక్కల్ని ఎంత సన్నగా తరిగినా కూడా అలా కేకు ఆకృతిలో చేయడం కష్టమే. అందుకే వీటి తయారీలో పూర్తిగా నీళ్లు తీసేసిన గట్టిపెరుగు లేదా క్రీం కలపాల్సి ఉంటుంది. అప్పుడే ముక్కల్లా కోసుకోవడానికి వీలుగా గట్టిగా వస్తాయివి. రుచీ అదిరిపోతుంది. ఉదాహరణకు క్యారెట్‌ కేకునే తీసుకుంటే.. కేకు టిన్నులో ఒక వరుస క్యారెట్‌ తురుము వేసి, పైన గడ్డ పెరుగు, కాస్త ఉప్పు, మిరియాలపొడి చల్లుకోవాలి. దానిపైన క్యాబేజీ తరుగూ లేదా కీరా తురుము వేసుకుని మళ్లీ పెరుగుతోపాటూ మిగిలిన పదార్థాలూ వేసుకోవాలి. ఇలా నాలుగైదు వరసలు చేసుకున్నాక ఆ పాత్రను కనీసం రెండు నుంచి మూడు గంటలు ఫ్రిజ్‌లో పెట్టి ఇవతలకు తీస్తే... కేకు తయారైనట్లే. కేకు ఇంకా వర్ణరంజితంగా ఉండాలనుకుంటే... ఒక్కో వరుసలో ఒక్కోరంగు కూరగాయను వేసుకోవచ్చు. ఇందుకోసం బీట్‌రూట్‌, ఉల్లిపాయ, సన్నగా తరిగిన లెట్యూస్‌ ఆకులు, పాలకూర... ఇలా ఏవైనా వాడుకోవచ్చు.

కావాలనుకుంటే ఒక వరసలో పెరుగు లేదా క్రీం పూతను కాస్త మందంగానూ వేసుకోవచ్చు. మాంసాహారులైతే ఉడికించి, సన్నని చక్రాల్లా తరిగిన గుడ్డు ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. కేకు ఇంకాస్త గట్టిగా రావాలనుకుంటే అడుగున ఉడికించిన బంగాళాదుంప ముద్ద, ఒక వరుసలో చిక్కని క్రీం లాంటివి వాడాలి. వీటి తయారీకి వీలైనంతవరకూ పూర్తిగా నీళ్లు పిండిన కూరగాయముక్కలు లేదా రెండు నిమిషాలు ఉడికించి, నీళ్లు పిండిన కూరగాయలు వాడితేనే కేకు అనుకున్నట్లుగా గట్టిగా వస్తుంది. ఆ తరువాత నచ్చినట్లుగా కీరా, క్యారెట్‌, ఆలివ్‌, బీట్‌రూట్‌, టొమాటో, ఉల్లిపాయ ముక్కల్ని కేకుపైన అలంకరించుకుని ముక్కల్లా కోసుకోవచ్చు. ఈ కేకుల్ని తినడానికి కాస్త ముందు మాత్రమే ఫ్రిజ్‌లోంచి తీసుకోవడం మేలు. పేరుకు ఇవి కేకులే అయినా... వీటిల్లో ఉండేవన్నీ కూరగాయముక్కలే కాబట్టి.. పోషకాలూ సమృద్ధిగా అందుతాయి. వీటి తయారీలో కేవలం, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం, వెనిగర్‌ మాత్రమే కాకుండా ఆలివ్‌నూనె, సలాడ్‌ మసాలా... వంటివీ వేసుకుంటే రుచి ఇంకా పెరుగుతుంది. సృజన, సలాడ్‌ తయారీలపైన కాస్త అవగాహన ఉండాలే కానీ... వీటిని ఎన్ని రుచుల్లోనయినా నోరూరించేలా రోజుకోరకం చేసుకోవచ్చు.



పెంపుడు రాళ్లు కోట్లు కురిపించాయి!

పెంపుడు జంతువులు తెలుసు కానీ ఈ పెంపుడు రాళ్లేంటి వింతగా... అనుకుంటున్నారా? నిజమే, కొన్ని విషయాలు వినడానికి వింతగానూ విడ్డూరంగానూ ఉంటాయి. అలాంటి ఓ సంఘటనకు సంబంధించినవే ఈ పెంపుడు రాళ్లు. 1975ల నాటి సంగతి. అమెరికాలో పెంపుడు జంతువులు ఉన్న వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. అయితే, వాటి ఆలనాపాలనా చూడ్డం కష్టతరమైన పనే. ఇదే విషయం ఓ పార్టీలో గేరీ దాల్‌ స్నేహితుల మధ్య చర్చకు వచ్చింది. అప్పుడు గేరీ తన దగ్గర ఒక మంచి పెంపుడు జంతువు ఉందనీ, దాని వల్ల ఈ ఇబ్బందులేవీ ఉండవనీ చెప్పాడు. ‘ఏంటదీ...’ అని అడిగారు స్నేహితులంతా. ‘అదొక రాయి’ అన్నాడు గేరీ నవ్వుతూ. ఆ ఆలోచన అందరికీ నచ్చడంతో ఆచరణలోకి తీసుకొచ్చాడు. అందుకోసం, మెక్సికోలోని ఒక బీచ్‌ నుంచి కోడిగుడ్డు ఆకృతిలో ఉండే రాళ్లను తెచ్చాడు. గడ్డితో గూడులా చేసి అందులో రాయిని ఉంచి, దాన్ని ఒక అట్టపెట్టెలో పెట్టి దానికి గాలి ఆడేందుకంటూ రంధ్రాలు చేసి ప్యాక్‌ చేశాడు. అంతేకాదు, ఈ పెంపుడు రాయిని ఎలా పెంచుకోవాలో, ఎలాంటి శిక్షణ ఇవ్వాలో కూడా చెప్పే 32 పేజీల మాన్యువల్‌ను జతచేశాడు. పెంపుడు జంతువులతో విసిగిపోయిన జనం అప్పట్లో వీటిని వేలం వెర్రిగా కొన్నారు. ఎన్నీ అంటే, కొన్ని నెలల సమయంలోనే అతను 15 లక్షలకు పైగా పెట్‌రాక్స్‌ని అమ్మాడు, అది కూడా ఒక్కొక్కటీ 4 డాలర్ల చొప్పున. దాదాపు నలభై అయిదేళ్ల క్రితం ఒక్కొక్కటీ మన డబ్బులో సుమారు 300 రూపాయలన్న మాట. అప్పటి దాకా ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌ సంస్థలో కాపీ రైటర్‌గా పనిచేసిన గేరీ ఆ దెబ్బతో కోటీశ్వరుడైపోయాడు. ఇప్పటికీ కొన్ని సంస్థలు అమెజాన్‌లాంటి వెబ్‌సైట్లలో దాదాపు 20 డాలర్లకు వీటిని అమ్ముతున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.