close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బడిలో సమస్యా... వీరు తీర్చుతారు!

చిన్నతనంలో వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే. వాటిలో సౌకర్యాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. ప్రస్తుతం జీవితంలో స్థిరపడిన వారు... ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో భాగమవుతున్నారు.


పేద విద్యార్థులకు ‘బిగ్‌హెల్ప్‌’

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌కు చెందిన షేక్‌ చాంద్‌పాషాది మధ్య తరగతి కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతడు ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రభుత్వ పాఠశాలలకు తనవంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతో కొందరు మిత్రులతో కలిసి 2005లో ‘బిగ్‌హెల్ప్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌’ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు చాంద్‌పాషా. అప్పటి నుంచీ అతడూ, ఫౌండేషన్‌ సభ్యులూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని 46 ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు తరగతి గదులూ, మరుగుదొడ్లూ, మూత్రశాలలూ, గ్రంథాలయాలూ, వేదికలూ నిర్మించి ఇచ్చారు. మరికొన్ని గ్రామాల్లో క్రీడామైదానాలను అభివృద్ధి చేశారు. దత్తత తీసుకున్న పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఆర్థికసాయం చేస్తున్నారు. ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించిన పేద విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఏటా రూ.6 వేల చొప్పున ఆరేళ్లపాటు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ సుమారు 15 వేల మంది విద్యార్థులకు రూ.4 కోట్లకుపైగానే ఆర్థిక సాయం అందజేశారు. కొన్ని ప్రత్యేక పాఠశాలలకు వ్యాన్లూ, కంప్యూటర్లూ అందించారు. వీటన్నింటికీ కలిపి రూ.15 కోట్ల దాకా ఖర్చు చేశారు ఫౌండేషన్‌ సభ్యులు. విద్యాబుద్ధులు నేర్పిన ప్రభుత్వ పాఠశాలల రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే షేక్‌ చాంద్‌పాషా ‘బిగ్‌హెల్ప్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌’ను స్థాపించారనీ, అందుకు అనుగుణంగానే పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలను సమకూర్చుతున్నామనీ అంటారు ఆ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సరోజినీ మాటూరి.


లక్షకుపైగా బల్లల పంపిణీ

గుంటూరుకు చెందిన రవి వడ్లమాని ఛార్టెడ్‌ అకౌంటెంట్‌. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే సమయంలో రాత బల్లలు లేక పడిన ఇబ్బందులు అతడికి అనుభవమే. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు రాసుకోవడానికి వీలుగా బల్లలు అందజేయాలని అనుకున్నారు. మొదట గుంటూరు చుట్టుపక్కల ఉన్న కొన్ని పాఠశాలలకు బల్లలు అందజేశారు. వీటి కారణంగా విద్యార్థులు సులువుగా రాసుకుంటున్నారని ఉపాధ్యాయులు ఆనందంగా చెప్పారు. దీంతో అప్పటి నుంచీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వీటిని అందిస్తున్నారు. గత పదేళ్ల నుంచీ ఇప్పటి వరకూ గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌, రంగారెడ్డి తదితర జిల్లాల్లోని సుమారు వెయ్యి ప్రభుత్వ పాఠశాలలకు 1.20 లక్షల రాత బల్లలను అందజేశారు. ఒక్కో బల్ల ధర రూ.2,500 ఉంటుంది. వీటికి రూ.30 కోట్ల దాకా ఖర్చు అవగా... అందులో కొంత రవి, మరికొంత అతడి స్నేహితులూ భరించారు. రోటరీ క్లబ్‌ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అతడు...విద్యార్థులు రాసుకోవడానికి ఇబ్బందులు పడకూడదని స్నేహితుల సహకారంతో బల్లలు అందిస్తున్నానని అంటారు.


పాఠశాలలకు ‘కీట్స్‌’ సేవ

కాకినాడ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదివిన వారంతా ఇంజినీర్లుగా వివిధ ప్రాంతాల్లో పనులు చేసి పదవీ విరమణ పొందారు. ఉద్యోగం అనంతరం ఖాళీగా ఉండటానికి ఇష్టపడని ఆ విశ్రాంత ఇంజినీర్లు... ఆ సమయాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి వెచ్చించాలని అనుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన మూడు వందల యాభై మంది ఆ కళాశాల పూర్వ విద్యార్థులు ఓ రోజు సమావేశమై సేవా కార్యక్రమాల నిర్వహణకు 2014లో కీట్స్‌(కాకినాడ ఇంజినీరింగ్‌ అలుమ్ని ట్రస్ట్‌ ఫర్‌ సర్వీస్‌) సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను కల్పిస్తున్నారు కీట్స్‌ సభ్యులు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా చెరువు మాధారం ప్రభుత్వ పాఠశాలలో రూ.15 లక్షలతో కంప్యూటర్‌ గది, గ్రంథాలయం, ప్లేగ్రౌండ్‌, బయోటాయిలెట్స్‌ నిర్మించారు. మెదక్‌ జిల్లా ధర్మసాగర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలో రూ.14 లక్షలతో సైన్స్‌గది, మధ్యాహ్న భోజనం తయారీకి షెడ్డు, వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొంబాయితండాలో విద్యార్థులూ, ప్రజలూ ఇబ్బందులు పడకుండా రూ.30 లక్షలతో 250 మరుగుదొడ్లు నిర్మించారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఏటా సుమారు అయిదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు రూ.కోటికిపైగా వెచ్చించామనీ, విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడకూడదన్నదే తమ లక్ష్యమనీ అంటారు ‘కీట్స్‌’ మేనేజింగ్‌ ట్రస్టీ వై.ఎస్‌.సుబ్రహ్మణ్యం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.